జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది
నేర పరిశోధనలో తన బాస్ అయిన పోలీస్ ఇన్స్పెక్టర్ ను ఎలాగైనా ఇంప్రెస్స్ చేయాలని ఓ కానిస్టేబుల్ వింత వింత ఐడియాలు చెప్తూ ఉంటాడు
తన వెర్షన్ విని బాసు వావ్ అని మెచ్చుకుంటాడని ఆయన తపన పాపం
కానీ ఆ బాసు గారికేమో ఈయన చెప్పే విషయంలో పస ఉండదని ప్రగాఢ నమ్మకం
అన్చేత కానిస్టేబుల్ ఏదైనా చెప్పినప్పుడల్లా ఓ లోయ దగ్గరికి తీసుకెళ్లి ” అక్కడేం కనిపిస్తుందిరా?” అని అడుగుతాడు
వాడు వెంటనే “లోయ సార్”అంటాడు
అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ” మాలోకం ..నువ్వు ఎక్కడికో వెళ్లిపోయావ్ రా ..అక్కడ్నుంచి దూకి చావు” అని విసుక్కుంటాడు
బాసును మెప్పిద్దాం అనుకుని ఏదేదో చెప్పబోతే అది బూమరాంగ్ అయి అతడికే తిప్పికొడుతోంది అన్నమాట
అలాగే చంటబ్బాయి సినిమాలో శ్రీలక్ష్మి కవయిత్రి
తన తవికలను ఓ పత్రిక ఎడిటర్ కి వినిపించి విసిగిస్తూ ఉంటుంది
బాసు తాలూకా కావడంతో పాపం ఆ ఎడిటర్ గారు కూడా కిక్కురుమనకుండా ఆమె వయోలెన్సు ను భరిస్తూ ఉంటాడు
పైగా “నేను రచయిత్రిని కానన్నవానిని రాయిచ్చుకు కొడతా” అని భయపెడుతుంది కూడా
అలా ఆ సినిమాతో ‘ రాయిచ్చు’ కు కొట్టడం పాపులర్ అయ్యింది
సరే ఇప్పుడు జగదేక వీరుడి గురించి చెప్పుకునేముందు ఈ ‘ రాయి ‘ గురించి కొంచెం చెప్పుకుందాం
ఆ సినిమాలో రచయిత ప్రాస కోసం రాయి అనే పదం వాడినా ఈ రాయికి పెద్ద చరిత్రే ఉంది
ఇంగ్లీషులో ఓ కొటేషన్ ఉంటుంది
మీరు నామీద ‘ రాయి’ వేస్తే నేను ఆ రాళ్ళతో ఇళ్ళు కట్టుకుంటా అని
దానర్ధం నాపైన రాళ్ళు విసరాలని చూసినా నేను బెదిరిపోను.. పైగా అదే రాళ్ళను పేర్చుకుని ఇల్లు కట్టుకుంటా అని రాయికి కొత్త అర్ధం చెప్తాడు
శిల్పి ఉలితో రాతిని చెక్కి శిలగా మారుస్తాడు అని మనకు తెలిసిందే కదా
ఇలా చెప్పుకుంటూ పోతే రాయితో బోలెడు ఉపయోగాలు ఉన్నాయి
వాడకం బట్టి ఉంటుంది
అయితే ఇన్ని విధాలుగా పనికొచ్చే రాయి అదే టైములో పిచ్చోడి చేతిలో పడితే మహా డేంజర్
ఎందుకంటే ఆ ‘ రాయిని ‘ వాడు ఎప్పుడు ఎటు విసురుతాడో తెలీదు
అన్నట్టు’ రాయి ‘ అంటే గుర్తొచ్చింది
రాయిటర్స్ అని అందరికీ తెలిసిందే
అసలు విషయం చెప్పబోయే ముందు దాని గురించి కొంచెం చెప్పుకుందాం
అసలు ఈ రాయిటర్స్ ప్రత్యేకత ఏంటి ?
రాయిటర్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వార్తా సంస్థ
దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది
ఎప్పుడో 1848 లో పాల్ రాయిటర్ అనే ఆయన బెర్లిన్ లో ఓ చిన్న పబ్లిషింగ్ ఫర్మ్ లో పనిచేస్తూ అప్పటి తిరుగుబాటు ఉద్యమాల నేపథ్యంలో వీధుల్లో రాడికల్ టైపు పాంప్లెట్లు పంచిపెడుతూ ఉండేవాడు
అలా పబ్లిషింగ్ హౌస్ లో వచ్చిన అనుభవంతో 1851 లో లండన్ వెళ్లి సొంతంగా న్యూస్ ఏజెన్సీ పెట్టుకున్నాడు
మొదట్లో కమర్షియల్ యాడ్స్ ని దృష్టిలో పెట్టుకుని బిజినెస్ కాలమ్స్ రాసుకుంటూ వచ్చాడు
చూస్తుండగానే అతడు రాసిన కాలమ్స్ పాపులర్ అయ్యాయి
కేవలం బిజినెస్ వార్తలకే కాకుండా అంతర్జాతీయ ప్రాముఖ్యలను కూడా ప్రస్తావించడంతో రాయిటర్స్ కి మంచి పేరు , గుర్తింపు వచ్చాయి
సంస్థకు పేరు రాగానే తాను మేనేజింగ్ డైరెక్టర్ గా రాయిటర్స్ దానిని ప్రైవేట్ లిమిటెడ్ చేసి కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాడు
1870 లో ఫ్రెంచ్ అండ్ జర్మన్ నుంచి మరో రెండు కంపెనీలు న్యూస్ ఏజెన్సీని ఇతర దేశాలకు విస్తరించే దిశగా రాయిటర్స్ తో ఒప్పందం చేసుకున్నాయి
దాంతో అతడి దశ తిరిగి రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ప్రపంచ దేశాల్లో నలుమూలలకు విస్తరించింది
1872 నాటికి రాయిటర్స్ సంస్థ పశ్చిమ దేశాల్లో కూడా పాతుకుపోయింది
అలా ఎక్కడో మొదలెట్టిన పాల్ రాయిటర్స్ చిన్న ప్రయాణం అంచెలంచెలుగా సాగుతూ ప్రపంచంలోనే అతి పెద్ద వార్తా సంస్థగా ఎదిగింది
సంస్థను పూర్తిగా అభివృద్ధిపథంలో నడిపించిన పాల్ రాయిటర్ 1878 లో రిటైర్ అయి వారసత్వంగా కొడుక్కి బాధ్యతలు అప్పగించి విశ్రాంతి తీసుకున్నాడు
సంస్థ కొడుకు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ఓ విషాదం జరిగింది
1915 వరకు సంస్థ బాధ్యతలు చూసుకున్న పాల్ రాయిటర్ కొడుకు హఠాతుగా సూసైడ్ చేసుకుని మరణించడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది
దాంతో రోడ్రిక్ జోన్స్ సంస్థ షేర్లు కొనుక్కుని రాయిటర్స్ లిమిటెడ్ పేరిట న్యూస్ ఏజెన్సీని కంటిన్యూ చేసాడు
అలా బాలారిష్టాలు దాటుకుంటూ 2008 వరకు రాయిటర్స్ ఇండిపెండెంట్ కంపెనీగానే ఉండిపోయింది
కానీ 2009 లో కెనడాకు చెందిన థామ్సన్ కార్పొరేషన్ రాయిటర్స్ సంస్థను తీసుకుంది
అప్పట్నుంచి సంస్థ పేరు థామ్సన్ రాయిటర్ గా మార్పు చేసుకుంది
సంస్థ థామ్సన్ చేతిలోకి వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి చెందింది
ప్రస్తుతం రాయిటర్స్ ప్రపంచవ్యాప్తంగా షుమారు 200 దేశాలకు విస్తరించింది
సంస్థలో షుమారు 2,500 మంది జర్నలిస్టులు , 600 మంది ఫోటో జర్నలిస్టులు పనిచేస్తున్నారు
జర్నలిజంలో అత్యుత్తమ విలువలు పాటించే సంస్థగా రాయిటర్స్ కి గుర్తింపు ఉంది
ఈ మధ్యనే 2024 లో అత్యుత్తమ కథనాలకు గానూ ఈ సంస్థకు పులిట్జర్ ప్రైజ్ కూడా వచ్చింది
రాయిటర్స్ లో కథనాలు పబ్లిష్ అయితే ప్రపంచ దేశాధినేతలతో సహా బోలెడుమంది విఐపిలు చదువుతారు.. స్పందిస్తారు
దాని కథనాలకు అంత పాపులారిటీ ఉందన్నమాట
ఎంత పాపులారిటీ ఉన్నా పిచ్చోడి చేతిలో రాయిలా అప్పుడప్పుడు గురి తప్పి ఎవడికో తగులుతుంది
అది జగదేకవీరుడు సన్నివేశం మాదిరి ఏదేదో చెప్పాలన్న ఆతృతలో ఇంకేదో చెప్తే అది బూమరాంగ్ అయి రివర్స్ కొడుతోంది
అలాంటి తొందరపాటు కథనమే రాయిటర్స్ కూడా ప్రసారం చేసింది
తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం నోళ్లు తెరిచేలా , జ్యోతీష్య శాస్త్రం సైతం నివ్వెరపోయేలా ,ఒక కధనం వండి వార్చింది
ప్రస్తుతం సోషల్ మీడియాలో రాయిటర్స్ కధనం పై చర్చ నడుస్తుంది
ఇప్పుడు ది గ్రేట్ ‘ రాయి టియర్స్ ‘ కథనం ఏంటో వారి ప్రకారమే ఓసారి పరికిద్దాం
ఇంతకీ రాయిటర్స్ కధనం ఏంటి ?
2029 లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి కదా
మరి అప్పటికి మన మోడీగారికి 79 ఏళ్ళు వస్తాయి కాబట్టి , ఒకవేళ బీజేపీకి మెజారిటీ రాకపోతే అధికారంలోకి ఆయన స్థానంలో ఎవరొస్తారు ? అనే పాయింట్ ఆధారంగా రాయిటర్స్ విశ్లేషణ చేసింది
నిజానికి ఈ విశ్లేషణను సంస్థకు ఆపాదించడం కూడా సరి కాదేమో ?
అయితే జ్యోష్యం చెప్పింది సంస్థకు చెందిన జర్నలిస్ట్ కాబట్టి ఆమె మాటలకు కొంత ప్రాముఖ్యత ఉంటుంది
సరే ఆ జర్నలిస్ట్ మొదలుపెట్టడమే మోడీ ఏజ్ నుంచి మొదలుపెట్టింది
బీజేపీ లో 75 సంవత్సరాల నిబంధన గురించి గతంలో చర్చ జరిగినా మోడీ విషయంలో సడలింపులు ఇచ్చుకున్నారు
కాబట్టి 79 ఏళ్ళ వయసు వచ్చినా మోడీ కోరుకుని నాలుగోసారి కూడా నిలబడితే , ప్రజలు ఆయనకే తిరిగి పట్టం కడితే మరోసారి ప్రధాని అవుతారు
ఇందులో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు
ఇంకో విషయం ఏంటంటే హెల్త్ పరంగా కూడా మోడీ ఫిట్నెస్ గానే ఉన్నారు
అందుకే మూడుసార్లు ప్రధాని పదవి నిర్వహిస్తున్నా ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకోలేదు
కాబట్టి 2029 లో మోడీ నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది పాయింటు కానీ ఆయన వయసు కాదు
ఇక వారి కధనంలో రెండో పాయింటు మోడీ వారసుడిగా అమిత్ షా కు ఛాన్సెస్ ఉంటాయి అనేది
ఎస్ .. ఉండొచ్చు ..ఇప్పటిదాకా అమిత్ షాకు పోషించిన పాత్ర గురించి తెలిసినవాళ్ళు ఎవరైనా అది ఒప్పుకుంటారు
ఎందుకంటే మోడీ తర్వాత ఆయనే నంబర్ టూ కదా
కాకపోతే ఈసారి ఎన్నికలనాటికి రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకుంటానని ఆమధ్య మీడియా సమావేశంలో ఆయనే స్వయంగా చెప్పారు
కాబట్టి డౌటే
లేదూ ఆయన కాకపోతే ఫడ్నవీస్ పీఎం అయ్యే ఛాన్సులు ఉంటాయి అని మూడో పాయింట్ చెప్పారు
ఇదీ రీజనబుల్ గానే ఉంది
ఎందుకంటే ఫడ్నవీస్ కు బలమైన ఆరెస్సెస్ నేపధ్యం ఉంది
బీజేపీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆరెస్సెస్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే
ఆ పరంగా ఆయనకు కూడా పీఎం రేసులో ఛాన్సెస్ ఉంటాయి
ఇంతవరకు రాయిటర్స్ కధనం పక్కా ప్రొఫెషనల్ గానే ఉంది
ఇక అసలు రాయిచ్చుకు కొట్టిన డైలాగ్ ఒకటుంది
అదేంటంటే తమ కథనానికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ పీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పింది
ఆ అవకాశాలు కూడా ఎందుకున్నాయంటే చంద్రబాబు గూగుల్ నుంచి ఏపీకి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెచ్చాడు కాబట్టి ఆయన పీఎం కి అర్హత సాధించినట్టే అని తేల్చేసింది
సరే గూగుల్ డాలర్ల సంగతి పక్కనబెడితే పీఎం రేసులో బాబు పేరు గతంలో కూటములు కట్టినప్పుడే బయటకు వచ్చింది
ఒకానొక దశలో బాబు ఢిల్లీలో చక్రం తిప్పిన సంగతి ఎవరూ మర్చిపోలేరు
అప్పట్లోనే పీఎం రేసులో ఆయన పేరును కొంతమంది కూటమి పార్టీల నేతలు తెరమీదకు తీసుకువచ్చారు
కాబట్టి ఇందులో కూడా పెద్దగా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదు
అయితే ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తుంటే చంద్రబాబు ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు
ఎక్కువ సమయాన్ని ఏపీకే కేటాయిస్తున్నారు
నిజంగా ఆయనకు ఆ ఆలోచన ఉంటే మూడేళ్ళ వ్యవధానం ఆయనకు సరిపోతుందా ? లేదా ? అనేది ప్రశ్నార్థకమే
ఢిల్లీ కోటలో పాగా వేయాలంటే అందుకు ఇప్పట్నుంచే పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేయాలి
తరచూ ఇతర పార్టీ నేతలతో సమావేశాలు అవుతూ ఉండాలి
జాతీయ అంశాల మీద మీడియా ద్వారా స్పందిస్తూ ప్రకటనలు ఇవ్వాలి
గతంలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని రాష్ట్రాలు పట్టుకుని తిరిగారు
ఫైనల్ గా ఆయన తెలంగాణాలో కూడా అధికారాన్ని కోల్పోయి ఫార్మ్ హౌస్ కే పరిమితం అయ్యారు
ఇంత చరిత్ర తెలిసిన బాబు ఎంతమాత్రం తొందరపడరు
అయినా సరే రాజకీయాల్లో ఏ మలుపు ఎవరు ఉహించగలరు అనేసుకుని రాయిటర్స్ చెప్పినట్టు పీఎం రేసులో బాబు గారిని కూడా ఊహించేసుకుందాం
పోనీ వారి ప్రేమను ఎందుకు కాదనాలి.. ఇది కూడా ఒప్పుకుందాం
కానీ నారా లోకేష్ కూడా ప్రధాని అయ్యే అర్హత సాధించాడని అదే ‘ రాయితో’ ముఖం మీద కొట్టి మరీ చెప్పారు చూడండీ.. అసలుకు నెవరు బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
జర్నలిజం రంగంలోనే మునుపెన్నడూ కనీవినీ ఎరుగని ఓ సంచలనం
రాయి గుండెలు మాత్రమే తట్టుకోగలిగే బుల్లెట్టిన్
అసలు కథనం ఎక్కడ మొదలైంది?
ఎక్కడికి వెళ్ళింది?
అలా 2029 ఎన్నికల్లో మోడీ వారసులు అంటూ మొదలైన రాయిటర్స్ కథనం నారా లోకేష్ ను పీఎం చేసేదాకా వెళ్ళిపోయింది
మామూలు పాంప్లేట్ పేపర్లు కూడా ‘ రాయ’ టానికి ఆలోచించే ఊహను రాయిటర్స్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థ రాసేసిందంటే మాములు విషయం కాదు
జగదేకవీరుడులో ఇన్స్పెక్టర్ చెప్పినట్టు ఎక్కడికో వెళ్లిపోయారు
అంత పెద్ద సంస్థలో పనిచేసే జర్నలిస్ట్ భారత రాజకీయాల మీద విశ్లేషణ చేసేటప్పుడు కనీస స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసి ఉండాల్సింది
ఇక్కడున్న రాజకీయ పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతనే కధనాన్ని చెప్పాల్సింది
విశ్లేషణలో హేతుబద్దతను తరచి చూసుకుని ఉండాల్సింది
ఇదేమీ లేకుండా గూగుల్ నుంచి బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెచ్చారు కాబట్టి బాబును పీఎం రేస్ క్యాండిడేట్ గా ప్రిడిక్షన్ చెప్పటం అసంబద్ధంగా ఉంది
దీనికన్నా నారా లోకేష్ పేరును పీఎం రేసులో చెప్పడం మరింత విస్మయకరంగా ఉంది
లోకేష్ ప్రధాని అవ్వడానికి ఉన్న ఒక్క అర్హత కూడా చెప్పకుండా బ్లైండ్ గా ఆయన పేరును చెప్పడం సీనియర్ జర్నలిస్టులను సైతం ఆశ్చర్య పరిచింది
ఇప్పటికిప్పుడు ఈ కథనం మీద లోకేష్ ను ప్రశ్నించినా భలే జోక్ వేసారు అని నవ్వుకుంటారే కానీ సీరియస్ గా తీసుకోరు
అంతిమంగా ఈ ‘ రాయి’ ఎవరి చేతిలో పడిందో జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి !
