గద్దర్ అవార్డ్స్ లో తెలంగాణా స్ఫూర్తి ప్రధాత ‘ప్రజాకవి కాళోజీ’ సినిమాకు అవమానం .. గద్దర్ స్పెషల్ జ్యురీ అవార్డు కింద మూడు లక్షలకు చెక్ ఇచ్చి వాపసు అడిగారు .. చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ సంచలన ఆరోపణ !
గద్దర్ అవార్డ్స్ లో ప్రజాకవి కాళోజీ సినిమాకు అన్యాయం జరిగిందని చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ విమర్శించారు
ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ జ్యురీ సభ్యుల అవకతవక నిర్ణయాలపై గళమెత్తారు
ullozhukku మళయాళ సినిమాలో నటించినందుకు నటి ఊర్వశి కి ఈ మధ్య జాతీయ ఫిల్మ్ అవార్డులలో జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు ప్రకటించారు
ఈ అవార్డు వచ్చిన తర్వాత ఊర్వశి జాతీయ సినిమా అవార్డుల జ్యూరీలను అనేక వేదికల మీద చీల్చి చెండాడింది.
కేరళ మీడియా, పత్రికలు ఆమె వాదనను, వేదనను బాగా పాపులర్ చేసాయి.
సహాయనటి కి నిర్వచనం చెప్పమని ఆమె జ్యురీ సభ్యులను బహిరంగంగా నిలదీసింది.
జవాన్ సినిమాలో నటించినందుకు షారూఖ్ ఖాన్ కు ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చినందుకు నిలదీసింది.
ఆడు జీవితంలో సుకుమార్ కు జాతీయ అవార్డు ఇవ్వనందుకు ఉగ్ర రూపం దాల్చింది.
ఆడుజీవితం లో సుకుమార్ నటన, సబ్జెక్ట్ కృత్రిమంగా ఉందన్న జ్యూరీ ఛైర్మన్ ఆశిష్ విద్యార్థి పైన నిప్పులు చెరిగింది.
ఆమె పోరాటం అభినందనీయం
మన తెలుగు మీడియా, పత్రికలకు విమర్శించే, విశ్లేషించే ధైర్యం లేనందుకు సిగ్గుపడుతున్నాను.
బూతు సినిమాలకు జాతీయ అవార్డులా? సీజీతో సినిమాలకు అవార్డులా? మూఢ నమ్మకాల సినిమాలకు అవార్డులా? వందలాది మందిని నరికి రక్త ప్రవాహాలు పారించే సినిమాలకు అవార్డులా? అని ప్రశ్నించే దమ్మూ, ధైర్యం లేని చేవచచ్చిన మీడియా ఉన్నంత కాలం, ‘ప్రజాకవి_కాళోజీ’
కి గానీ, మరే మంచి సినిమాకి గానీ, చిన్న సినిమాకి గానీ అవార్డులు రావా? అని ప్రశ్నించ వలసిన పత్రికా, మీడియా రంగం, స్వకుచ మర్దనకు అలవాటు పడిపోయి వికృతానందం పొందుతుంది.
జాతీయ అవార్డులు ప్రకటించే నెల రోజుల ముందు నుండి జరిగిన చీకటి వ్యవహారాలపై, జ్యూరీలందరి ఫోను సంభాషణలపై, వీళ్ళు రాత్రిళ్ళు గడిపిన హోటళ్ళ వ్యవహారం పై, ఏయే ఫామ్ హౌజు పార్టీలకు అటెండయ్యారో లేదో తెలుసుకోవడానికి, సీబీఐ తో, ఒక ఎంక్వైరీ జరిపించాలి. అప్పుడు అవార్డుల బండారం బయటపడుతుంది.
డబ్బున్న వాడికే అవార్డులైతే ఈ ప్రహసనమంతా ఎందుకు?
పోయిన సారి ఉత్తమ నటుడిగా ఎంపికయిన సినిమా దర్శకుడి కూతురికే ఈ సారి ఉత్తమ బాలనటి అవార్డు రావడంలోని మర్మమేమిటి?
గద్దర్ అవార్డుల్లో మొత్తం అవార్డులు కొట్టేసిన మూడు సినిమాలకే మళ్ళీ జాతీయ అవార్డులు రావడం లోని మర్మమేమిటి? గద్దర్ అవార్డులు ప్రకటించేంత వరకు ఆగి నేషనల్ అవార్డులు ఎందుకు ప్రకటించారు?
నా సినిమాకు ‘గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు’ ప్రకటించి మూడు లక్షల చెక్ ఇచ్చారు. బ్యాంకులో వేసిన తర్వాత, ‘లేదు, లేదు. మీకు లక్ష రూపాయలే వస్తాయి’ అని చెప్పి చెక్ వాపస్ తెప్పించారు. ఇంత అవమానమా? మొత్తం గద్దర్ అవార్డులలో ‘బలగం’ కు తప్ప, ఒక్క తెలంగాణా సినిమాకు అవార్డు రాలేదు. సిగ్గుచేటు కాదా? దానికి తోడు ఇచ్చిన చెక్కును వాపస్ తీసుకుంటారా?
బ్యాంకు నుండి నేను చెక్ వాపస్ తీసుకుని, ”నాకు గనుక మిగిలిన స్పెషల్ జ్యూరీ అవార్డులకు ఇచ్చినట్టుగా మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇవ్వనట్టైతే, నేను సీయం ఛాంబర్ ముందు నిరాహారదీక్ష చేస్తాను’ అని చెప్పాను. చివరకు మూడు లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
కాళోజీ గారి మీద ఉన్న గౌరవం ఇదేనా? ముష్టి మూడు లక్షలు ఇవ్వడానికి ఏడుపా? అదే తెలంగాణా జ్యూరీ మెంబర్లు ఉంటే కనీసం ఐదారు అవార్డులు నా సినిమాకు వచ్చి ఉండేవి.
అవమానాలు ఇంతటితో ఆగిపోలేదు.
ఒకచోట, ఈ అవార్డు కాళోజీ నారాయణరావు గారికి posthumus, అంటే మరణానంతరం ఇచ్చారని రాసారు. వారు పబ్లిష్ చేసిన సావనీర్ లో, ‘ప్రజాకవి కలోజి’అని రాసారు.
మాకు ఇచ్చిన సర్టిఫికేట్ లో ‘ప్రజాకవి కాళోజు’ అని రాసారు.
అంటే, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి స్ఫూర్తి ప్రదాత అయిన, గద్దర్ గారి గురువు అయిన, కాళోజీ గారి పట్ల ఎంత విద్వేషం చూపించారో అర్థం చేసుకోండి.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ‘గద్దర్’ పేరు మీద తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన అవార్డులలో, ఒక్క తెలంగాణా సినిమాకు సరైన సరైన గౌరవం దక్కలేదు. ప్రజలంతా ఛీ కొడతారని, మనసులో లేకపోయినా ప్రజాకవి కాళోజీ సినిమాకు, ఒక అవార్డు అది కూడా ఉత్తమ చిత్రంగా కాదు, స్పెషల్ జ్యూరీ అవార్డు అని ఒకటి మా మొహాన పడేసి, ఎన్ని అవమానాలు చేయాలో అన్నీ చేసారు.
మాకు, 2023 సంవత్సరపు అవార్డు సినిమాలతో పాటు కాకుండా, సినిమాలను ఎంపిక చేసిన జ్యూరీలతో పాటు, 37 వ సీరియల్ నెంబర్ వేసి, అవార్డు ఇచ్చారు. మాకు ముఖ్యమంత్రి, తన చేతుల మీదుగా అవార్డు ఇవ్వకుండా కుట్ర చేసారు. అంటే మా సినిమాకు అవార్డు వచ్చిందన్న విషయం ఎవరికీ తెలియకూడదని కుట్ర చేసారు. అందుకే, ఏ పత్రికా ప్రకటనలో మా సినిమా పేరు లేదు. ఇంత కుట్ర ఎవరు చేసారు?
జాతీయ అవార్డులకు జ్యూరీ గా ప్రతీ సారి ఒక్కడే వెళ్ళడమేమిటి? ఆ జ్యూరీ మెంబరే గద్దర్ అవార్డుల కమిటీలో కూడా ఉండడం కాకతాళీయమా? కాలుక్యులేటెడా? ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి అతన్నే అన్ని కమిటీల్లో జ్యూరీ మెంబరుగా వేస్తున్నారు. అతనికి ఉన్న అర్హతేమిటి?
ఈ ప్రశ్నలన్నీ పత్రికలు, మీడియా ఎందుకు అడగడం లేదు? మతలబు ఏమిటి?
ఈ పోస్టు రాసినందుకు జీవితంలో నాకు మళ్ళీ ఏ అవార్డు రాకపోవచ్చు. ఇట్లాంటి పైరవీల, కుల కంపులో తడిచిన అవార్డులు రాకున్నా ఫర్వాలేదు.
గద్దర్ అవార్డులంటే లోకల్ నిర్మాతల ప్రభావం ఉంటుందనుకోవచ్చు. కానీ, జాతీయ అవార్డుల్లో కూడానా?
ఘనత వహించిన, నిజాయితీకి మారు పేరు అయిన బీజేపీ ప్రభుత్వంలో ఇంత అన్యాయమా? లేక కూటమి ప్రభుత్వ ధర్మాన్ని పాటిస్తున్నారా? లేకపోతే మిగిలిన విషయాల్లో పడి ఈ అవార్డుల విషయం పట్టించుకోవడం లేదా?
రాష్ట్రంలో , దేశంలో సినిమా సాంస్కృతిక శాఖల ప్రక్షాళన అవసరమనిపించడం లేదూ ?
అని ప్రభాకర్ జైనీ జ్యురీ తీరుతెన్నులను నిశితంగా విమర్శించారు