వెండి తెర మీద సూపర్ స్టార్ రజనీ అనే టైటిల్ పడగానే థియేటర్లో అభిమానులకు పూనకాలు వస్తాయి
రజనీ ఎంట్రీ అయితే భారీ ఎలివేషన్లతో ఉంటుంది
రజనీ నట విశ్వ రూపాన్ని చూపించిన సినిమాల్లో బాషా కూడా ఒకటి
రజనీ సిగార్ వెలిగించినా , కూలింగ్ గ్లాస్ గాల్లో ఎగరేసి పెట్టుకున్నా , కోటును రెండు చేతులతో ముందుకి , వెనక్కి తిప్పినా , పంచ్ డైలాగ్ వేసినా ,ఫైటింగులు చేసినా అన్నిట్లోనూ తనదైన స్టైలు ఉంటుంది
ఆ స్టైలు ను అనుకరించేవాళ్ళు వచ్చారు కానీ ఒరిజినాలిటీని చూపించలేకపోయారు
చాలా సినిమాల్లో రజనీ కథానాయకుడు , గ్యాంగ్ స్టర్ , డాన్ లాంటి పాత్రల్లో కనిపించారు
కానీ నిజ జీవితంలో రజనీ స్టైలు వీటన్నిటికీ భిన్నం
ఆధ్యాత్మిక భావం ఎక్కువ .. దేవుడ్ని నమ్ముతాడు
ఆడంబరాలకు వ్యతిరేకంగా సాధారణ జీవితం గడపటం .. వీలున్నప్పుడల్లా హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకోవడం .. సాత్విక ఆహరం తీసుకోవడం .. ఆధ్యాత్మిక గురువులను కలుసుకోవడం .. ఇవీ రజనీ జీవన శైలి
రజనీ మళ్ళీ హిమాలయాలకు వెళ్ళాడు
నిజానికి రజనీ హిమాలయాలకు వెళ్లడం ఇదే మొదటిసారి కాదు
గతంలో కూడా వెళ్ళాడు
తన ఆధ్యాత్మిక గురువును కలుసుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి కొండలు , గుట్టలు నడిచి వెళ్లిన సందర్బాలు ఉన్నాయి
ఈ ప్రయాణంలో రోడ్ సైడ్ కాకా హోటళ్లలోనే దొరికిన ఆహరం తీసుకుని యాత్రను కొనసాగించేవాడు
ఈ మధ్య విడుదలైన కూలీ సినిమా తర్వాత రజనీ మళ్ళీ హిమాలయాలకు వెళ్లారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో రజనీ హిమాలయాల పర్యటన ఫోటోలు వైరల్ అవుతున్నాయి
రిషికేశ్‌లోని ప్రశాంతమైన ఘాట్ లలోనూ , గంగా నది ఒడ్డున ధ్యానం చేస్తూ, స్థానికులతో కలిసి ఆకు పలకలపై సాధారణ భోజనం చేస్తున్న తలైవా ఫోటోలు వైరల్ అయ్యాయి .
రజనీ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సంచలనమే . రజనీని గుర్తుపడుతున్న టూరిస్టులు అతడితో ఫోటోలు దిగడానికి ఎగబడటంతో సోషల్ మీడియాలో రజనీ ట్రేండింగ్ అవుతున్నారు
స్థానిక మీడియా కధనాల ప్రకారం ప్రస్తుతం రజనీ రిషికేశ్‌లోని స్వామి దయానంద ఆశ్రమాన్ని సందర్శించాడు, అక్కడ అతను స్వామి దయానందకు నివాళులు అర్పించాడు.
ఆయన సాధారణ యాత్రీకులతో పాటు పవిత్ర గంగా హారతిలో పాల్గొనడం మరియు నది ఒడ్డున ధ్యానం చేసుకోవడం సోషల్ మీడియా కంటపడింది . రజనీ ఇంత సామాన్యంగా కనిపించడం ఆయన అభిమానులను ఆశర్యపరిచింది . రిషికేశ్‌లో తన బస తర్వాత, సూపర్‌స్టార్ తన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా ద్వారహత్‌కు వెళ్లినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా రజనీ ఆధ్యాత్మిక యాత్రకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి . ఒకచోట రజనీకాంత్ రోడ్డు పక్కన ఉన్న రాయిపై కూర్చుని, తెల్లటి దుస్తులు ధరించి, సాంప్రదాయ పట్టల్ ప్లేట్‌లపై వడ్డించిన భోజనం తింటున్నట్లు కనిపిస్తుండగా . . మరొక ఫోటోలో ఆశ్రమంలో కొంతమంది పురుషులతో ఆయన సంభాషణ జరుపుతున్నట్లు , ఇంకో ఫోటోలో ఒక పూజారి పక్కన నిలబడి ప్రార్థనలు చేస్తున్నట్లు కనిపిస్తుంది
.
రజనీకాంత్ దగ్గర ఎప్పుడూ ఆయన గురువైన ఒక యోగి ఆత్మకథ పుస్తకం ఉంటుందనీ , ఇది ఆయన తాను కలిసే వ్యక్తులకు బహుమతిగా ఇస్తాడని మరియు ఈమధ్య ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‌కు కూడా ఒక కాపీని ఇచ్చాడని అయన అభిమానులు చెప్తున్నారు
ఏది ఏమైనా హిమాలయ పర్యటనలో తలైవా మరోసారి వార్తల్లో నిలిచి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సంచలనం సృష్టిస్తున్నారు !
