దిగ్గజ బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నా కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండేది కాదు
ఒక్కోసారి అతను ఫాన్స్ ను తప్పించుకుని షూటింగ్ స్పాట్ కి వచ్చేటప్పటికి ఆ రోజు కూడా ముగిసేది
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సత్యజిత్ పూరీ దివంగత రాజేష్ ఖన్నాతో తన అనుభవాలను పంచుకున్నాడు
ఈయన శక్తి సమంత దర్శకత్వంలో రాజేష్ ఖన్నా హీరోగా నటించిన ఓ సినిమాలో బాల నటుడిగా నటించాడు
శక్తి సమంత రాజేష్ ఖన్నాతో ఆరాధన , కటి పతంగ్ , అమర్ ప్రేమ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు
అప్పట్లో రాజేష్ ఖన్నాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని పూరీ చెప్తూ ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పాడు
శక్తి సమంత దర్శకత్వంలో పుణేలో ఓ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఖరారు అయ్యింది
ఆ సినిమాకి హీరో రాజేష్ ఖన్నా షెడ్యూల్ టైం ప్రకారం షూటింగ్ లొకేషన్ కి మధ్యాహ్నం 2 గంటలకల్లా రావాలి
షూటింగ్ సమయానికి మిగిలిన ఆర్టిస్టులందరూ వచ్చారు కానీ హీరో రాజేష్ ఖన్నా మాత్రం రాలేదు
ఆఖరికి రాత్రి 8 గంటలకు రాజేష్ ఖన్నా సెట్స్ దగ్గరికి వచ్చాడు
అప్పటికే అసహనంతో ఉన్న డైరెక్టర్ శక్తి సమంత ” నువ్వేమన్నా పెద్ద స్టార్ హీరో అనుకుంటున్నావా ? మధ్యాహ్నం రెండు గంటలకు షూటింగుకి రావాల్సినవాడివి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చావ్ ?” అని కోపంగా అరిచాడు
దర్శకుడి మాటలకు రాజేష్ ఖన్నా మాత్రం కోపం తెచ్చుకోకుండా చిరునవ్వుతో ” అసలేం జరిగిందో నా కారు డ్రైవర్ని అడగండి చెబుతాడు ” అన్నాడు
అప్పుడు ఆ డ్రైవర్ అసలు విషయం చెప్పాడు
“మధ్యాహ్నం రెండు గంటలకు షూటింగ్ కు అటెండ్ కావాలి కాబట్టి గంట ముందుగానే సెట్స్ దగ్గరికి తీసుకెళ్లామని సార్ చెప్పారు . ఉదయం 11. 30 గంటలకల్లా పూణేకి చేరుకున్నాం . సార్ షూటింగ్ కి వస్తున్నారని ఎలా తెలిసిందో ఏమో అభిమానులు మా కారుకి అడ్డం పడి ముందుకి కదలనివ్వలేదు . మహిళలు అయితే కారు టైర్లకు అడ్డం పడి టైర్లకు అంటిన దుమ్మును సిందూరం మాదిరి తలపై రాసుకున్నారు . దాంతో పుణేలో ట్రాఫిక్ ఝామ్ అయిపోయి అడుగు ముందుకు పడలేదు . చివరికి లోకల్ పారా మిలిటరీ ఫోర్స్ రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేయడంతో రావడానికి ఈ టైం పట్టింది . నేనైతే ఈరోజు సంగతి దేవుడెరుగు .. రేపు మధ్యాహ్నం 2 గంటలవరకు చేరుకోగలిగితే గొప్ప విషయమే అనుకున్నా ” అని డ్రైవర్ చెప్పడంతో డైరెక్టర్ శక్తి సమంతా రాజేష్ ఖన్నాకు క్షమాపణలు చెప్పాడు అని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నాడు ఒకప్పటి బాల నటుడు సత్యజిత్ పూరి
రాజేష్ ఖన్నా మరణాంతరం 2013 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది!
