కీర్తి సురేష్ నటన గురించి చెప్పుకోవాలంటే మహానటి మూవీ చాలు
ఆమె నిజంగానే మహానటి
ఆ విషయాన్ని తన గత సినిమాల్లో ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది
ముఖ్యంగా పెద్ద డైలాగులు కూడా లేకుండా ముఖంలో హావభావాలు పలికించి సన్నివేశాలను రక్తి కట్టించడంలో కీర్తి దిట్ట
ఈ మధ్య పెళ్లిచేసుకున్నట్టుంది
సినిమాలు తగ్గించింది ( తగ్గించిందో ? తగ్గించబడ్డాయో తెలీదు )
మళ్ళీ చాన్నాళ్లకు ఇదిగో ఇలా రివాల్వర్ రీటా అంటూ అరవ స్టైల్లో తుపాకీ పట్టుకుని కనిపించింది
కీర్తి సురేష్ కు తోడు ఇంకో మహానటి కూడా దిగింది
ఆవిడే రాధికా శరత్ కుమార్
ఈ రాధిక ఇవాళ్టి నటి కాదు
బహుశా కీర్తి పుట్టకముందు నుంచీ హీరోయిన్ గా అటు అరవ , ఇటు తెలుగు కుర్రకారును ఉర్రుతలూగించింది
అప్పట్లో చిరంజీవి , రాధికల కాంబోకు ఇళయరాజా మ్యూజిక్కు కలిస్తే వెండితెర మీద బోలెడు మ్యాజిక్కులు జరిగేవి
అప్పుడు మొదలెట్టిన రాధిక వెండి తెర అరంగ్రేట్రం నటనలో పిహెచ్ది లు , డాక్టరేట్లు పూర్తిచేసుకుని ఇంకా పరుగులు పెడుతూనే ఉంది
అలనాటి రాధిక నటనలో నేటికీ వంక పెట్టడానికి డొంకలు ఏమీ దొరకవు
అంచేత కీర్తి సురేష్ మరియు రాధిక ల మీద మనకు మాంచి అభిప్రాయం ఉందన్నమాట
ఇంకో అంచేత ఏంటంటే ఈ సినిమా అరవంలో రిలీజ్ అయినా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండటం చేత చూడటం జరిగింది
నెట్ ఫ్లిక్స్ లో డిస్క్రిప్షన్ చూస్తే ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కితకితలు కూడా ఉంటాయి చూసుకోండి అన్నాడు
ఓహో అసలుకే ఇది క్రైమ్ సినిమా , పైగా కితకితలు కూడా ఉంటాయి అంటున్నాడు . పైగా మనకి బాగా కావాల్సిన లేత మరియు ముదురు హీరోయిన్లు ఇద్దరూ ఉన్నారు .. చూస్తే పోలా అనుకుని చూడటం జరిగింది
ఇంతకీ రివాల్వర్ రీటా నవ్వులు పేల్చిందా ? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం
రివాల్వర్ కధేంటంటే ?
కథానాయిక రీటా ( కీర్తి సురేష్ ) తన తల్లి చెల్లమ్మ ( రాధికా శరత్ కుమార్ ) మరియు అక్క , చెల్లెలుతో కలిసి పాండిచ్చేరిలో నివాసం ఉంటుంది
తండ్రి చిన్నతనంలోనే అనుకోని పరిస్థితుల్లో రివాల్వర్ తో కాల్చుకుని చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు రీటా మీద పడుతుంది
అందుచేత ఆమె పాండిచ్చేరిలోని ఓ రెస్టారెంటులో పని చేస్తూ బతుకు బండి లాక్కొస్తూ ఉంటుంది
ఈ పరిస్థితుల్లో రీటా అక్క కొడుకు మొదటి బర్త్ డే పార్టీ చేయాలని ఇంట్లో ఏర్పాట్లు చేసుకుంటారు
సరిగ్గా ఇదే సమయంలో డాన్ డ్రాకులా పాండియన్ పొరపాటున వేరే ఇంటికి వెళ్ళబోయి రీటా ఇంట్లో దూరతాడు
అక్కడ చెల్లమ్మతోనూ , రీటాతోనూ గొడవ పడటంతో చెల్లమ్మ ఇడ్లీ కుక్కర్ మూతతో ఈడ్చి ముఖం మీద కొట్టడంతో దెబ్బకు చచ్చురుకుంటాడు
అనుకోకుండా జరిగిన ఈ హత్యతో చెల్లమ్మ , రీటాలు షాక్ అవుతారు
ఎలాగైనా శవాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేసి కేసు నుంచి బయటపడాలని ప్లాన్ వేస్తారు
మరోపక్క నర్సింహా రెడ్డి తన శత్రువు పాండియన్ ను చంపటానికి ఓ ముఠాతో ఐదు కోట్లకు డీల్ కుదుర్చుకుంటాడు
ఈ పరిస్థితుల్లో చెల్లమ్మ ,రీటా లు పాండియన్ శవాన్ని మాయం చేయడానికి ఎటువంటి ప్లాన్ వేస్తారు ?
పాండియన్ ను చంపటానికి రెడ్డి ఎందుకు ప్రయతిస్తూ ఉంటాడు ?
తండ్రి ఆచూకీ వెతకడం కోసం బయలుదేరిన అతడి కొడుకు బాబీ పాండియన్ ( సునీల్ ) ఏం చేస్తాడు ?
అసలు రీటా తండ్రి ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు ? అనేవి మిగిలిన కథలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
మూవీ ప్రారంభమే పాండిచ్చేరిలో మడీ , ఆచారాలు ఉన్న ఓ సాంప్రదాయ కుటుంబంలో జరిగిన హత్యతో మొదలౌతుంది
ఈ హత్య నుంచి తల్లీ , ఆమె ముగ్గురు కూతుళ్లు ఎలా బయటపడతారు అనేది మిగిలిన కథ
ఈ కథ ఎక్కడో విన్నట్టు ఉందా ?
విన్నట్టు కాదు చాలా సినిమాల్లో చూసినట్టు ఉందా ?
ఎస్ .. సినిమా చూసిన చాలామందికి అదే అనుమానం వస్తుంది
పాయింట్ నంబర్ వన్ కథ కొత్తదేం కాదు
పాయింట్ నంబర్ టూ కథనం కొత్తగా ఉందా ?
క్లైమాక్స్ మినహా మిగిలినదంతా పాత వైనే
మరి సినిమాలో ఏముంది ?
అమాయకత్వం ఒలకబోస్తూ రాధిక పండించిన హాస్యం ఉంది
లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్ పాత్రలో కీర్తి చేసే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి
మరి మిగిలినవాటి సంగతో ?
బబుల్ గమ్ అన్నమాట
అంటే సాగతీయడానికి పనికొస్తుందే కానీ ఉపయోగం లేదు
అంత పెద్ద ఇంటర్నేషనల్ డాన్ డ్రాకులా అని ఎలివేషన్లు ఇచ్చిన గ్యాంగ్ స్టర్ పాండియన్ కుక్కర్ మూతతో చెల్లమ్మ ఒక్కటివ్వగానే పుటుక్కుమంటాడు
ఇంతోటి మనిషిని చంపటానికి రెడ్డి అనేటోడు ఓ ముఠాతో ఐదు కోట్లు డీల్ కుదుర్చుకుంటాడు
సింపుల్గా ఓ కుక్కర్ మూత కొనుక్కుంటే సరిపోయేదిగా నర్సింహా రెడ్డీ ?
ఈ నర్సింహా రెడ్డి కూడా తక్కువోడేమీ కాదు
వీడూ పెద్ద డానే
ఒక కన్నుకి క్యాటరాక్టు మూతతో , చేతిలో తుపాకీ పట్టుకుని వెనుక ప్లాట్ ఫార్మ్ టికెట్ కొనడం అలవాటు లేని నలుగురు కేరాఫ్ ప్లాట్ ఫార్మ్ గాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటాడు
సరే ఇతని సంగతి అలా ఉంచండి
డాన్ డ్రాకులా పాండియన్ కొడుకు డాన్ డ్రాకులా బాబీ అనబడే పాత్ర యావత్ శక్తి కొలదీ పోషించిన మన తెలుగు కమెడియన్ సునీల్ పరిస్థితి చూస్తే మరీ జాలేస్తుంది
ఎలాంటివాడు ఎలా అయిపోయాడు ?
మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ పక్కనచేరి తన కామెడీ టైమింగుతో అందరి చూపులను తనవైపుకు తిప్పించుకున్న సునీల్ తరవాతి కాలంలో హీరోగా ప్రయత్నించాడు
అక్కడా వర్కౌట్ కాకపోవడంతో విలనేషాలు వేయడం మొదలెట్టాడు
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు సినిమాల్లో విలనేషాలు సంగతి అటుంచి కామెడీకి కూడా పనికిరాకుండా పోతున్నాడు
పోనీ భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ తో కానీ , బాడీ లాంగ్వేజ్ తో కానీ , పదునైన డైలాగులతో కానీ విలన్ గా మెప్పిస్తున్నాడా ? అంటే అదీ లేదు
ఎప్పుడూ ఒకటే ఎక్స్ప్రెషన్
పైగా ఈ డాన్ డ్రాకులాకి తోడుగా సలహాలిచ్చే ఓ జోకర్ బ్యాచ్
మూవీలో సునీల్ పాత్రకీ , ఆ సెటప్పుకీ సెట్ కాలేదు
చివరిదాకా దాకా సాగతీసిన బబుల్ గమ్ క్లైమాక్స్ సన్నివేశంలోనే బుడగ పెద్దదై కొద్దిగా పేలింది
క్లైమాక్సులో అన్ని క్యారెక్టర్లు ఆ రేకుల షెడ్డు కిందికి చేరడం , ఒకరొకరుగా కాల్చుకుని చావడం , ఫ్లాష్ బ్యాక్ లో రీటా తండ్రి చనిపోవడానికి కారణం తెలియడం , కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు అనే సందేశం ఇవ్వడంతో ముగియడం చకచకా జరిగిపోతాయి
ఎవరెలా చేసారు ?
రీటా రివాల్వరులో బుల్లెట్ అంతోఇంతో వేగంగా దూసుకొచ్చి పేలిందంటే మొదట క్రెడిట్ రాధికకు దక్కుతుంది
అమాయకపు ఇల్లాలిగా సున్నితమైన పంచులతో కామెడీ టైమింగ్ ప్రదర్శించింది
కామెడీ కోసం ఎక్కడా ఓవరాక్షన్ చేయలేదు
కామెడీని ఎంతవరకు పంచాలో , డైలాగులను ఎంతవరకు వాడాలో అంతవరకు పర్ఫెక్ట్ గా వాడింది
ఇక కీర్తి సురేష్ గురించి చెప్పుకోవాలంటే ఆమె గత సినిమాలతో పోలిస్తే ఇందులో అంత స్పార్క్ కనిపించదు
అలా అని బాగాచేయలేదని కాదు
దర్శకుడు కీర్తి సురేష్ నుంచి పూర్తి నటనను రాబట్టుకోలేకపోయాడు
ఇక మన కమెడియన్ కమ్ విలన్ సునీల్ గురించి చెప్పుకోవాలంటే రాజనాలకు ఎక్కువ , రాజబాబుకు తక్కువ టైపులో అయిపోయాడు
ఎక్కడైనా , కనీసం ఏదో ఒక సన్నివేశంలో అయినా అతడు ఎక్స్ప్రెషన్ మారుస్తాడేమో అని ఎదురు చూసినవారికి నిరాశ ఎదురై ఎక్స్ప్రెషన్లు మారతాయి
మూవీలో ఆ క్యారక్టర్ అంతే అని సరిపెట్టుకోవాలి
సాంకేతికత :
నేపధ్య సంగీతంలో పెద్దగా విషయం ఏమీ లేదు
అలాగే సినిమాటోగ్రఫీ కూడా అంతంత మాత్రమే
నిర్మాణ విలువలు కూడా యావరేజే
విశ్లేషణ
ఒక హత్య కేసునుంచి సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఆడవాళ్లు ఎలా బయటపడతారు అనే చిన్న పాయింట్ ఆధారంగా దర్శకుడు కథ అల్లుకున్నట్టున్నాడు . ఈ పాయింటు కోసం కథ కన్నా ఆయన కీర్తి సురేష్ ను , రాధికను ఎక్కువగా నమ్ముకున్నట్టున్నాడు . నిజానికి దర్శకుడి నమ్మకం సరైనదే . అయినాసరే పూర్తిగా వాళ్ళిద్దరి ఎంపికనే నమ్ముకోకుండా కథనం మీద కూడా కొంచం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది .ఫైనల్గా మూవీ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా , లాజిక్కులూ గట్రా ఆశించకుండా సరదాగా అలా టైం పాస్ కోసం చూస్తే ఎవరూ డిజప్పాయింట్ అవరు . అప్పుడప్పుడూ రాధిక కితకితలు పెడుతుంది కాబట్టి కాసేపు నవ్వుకోవచ్చు
నటీనటులు : కీర్తి సురేష్ , రాధికా శరత్ కుమార్ , సునీల్ తదితరులు
దర్శకత్వం : జేకే చంద్రు
విడుదల : నెట్ ఫ్లిక్స్ ఓటిటి
రేటింగ్ : 2 /5
