బారాముల్లాలో ఏం జరిగింది ? బారాముల్లా మూవీ రివ్యూ

Spread the love

కాశ్మీర్లో ఉగ్రవాదం ప్రధాన అంశంగా తెరకెక్కించిన సినిమాలు గతంలో చాలా వచ్చాయి.. వాటిలో పండిట్ల ఊచకోత కథలు కూడా ఉన్నాయి . అయితే ఏ సినిమా చూసినా కాశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు , వాటిని ధీటుగా ఎదుర్కున్న మన సైనికులు అనే పాయింటులోనే ఉంటాయి . ఇది కాకుండా ఆ కథల్లో మితిమీరిన వయొలెన్స్ కూడా అదనంగా ఉంటుంది .

అయితే వయోలెన్సుకి ప్రాధాన్యత తగ్గించి ఒక సున్నితమైన అంశాన్ని సినిమాటిక్ లిబర్టీగా మలిచి ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంగా చెప్పటానికి దర్శకుడు చేసిన ప్రయత్నమే బారాముల్లా మూవీ అనిపిస్తుంది . ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న బారాముల్లా తీసింది దురంధర్ మూవీ తీసిన నిర్మాణ సంస్థే కావడంతో ఇది కూడా చూస్తే పోలా అనిపించింది .

ఎందుకంటే దురంధర్ మూవీతో ఆదిత్య ధర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు.. సునామీ అనేది చిన్న పదం కానీ కలెక్షన్లలో సునామీని కూడా మించిపోయింది దురంధర్ . నెట్ ఫ్లిక్స్ లో డిస్క్రిప్షన్ చూస్తే ఇది కూడా కాశ్మీర్ , ఉగ్రవాదానికి సంబంధించిన కధాంశం అని అర్థమైంది . అయినా సరే నిర్మాణ సంస్థ మీద , దర్శకుడి మీద ఉన్న నమ్మకంతో బారాముల్లా చూడటం మొదలుపెట్టా .

బారాముల్లా కధేంటి ?

సినిమా ప్రారంభమే మ్యాజిక్ షోతో మొదలౌతుంది.. మనం గతంలో చాలా మ్యాజిక్ షోలు చూసాం కదా.. అబ్రకదబ్రా అంటూ ఒక మెజీషియన్ చేతిలో కర్ర తిప్పుతూ సంచిలో ఉన్న పావురాన్ని మాయం చేస్తాడు . అలాగే ఈ మ్యాజిక్ షోలో కూడా ఒక మెజీషియన్ తన ముందు ఉన్న చెక్కపెట్టెలో ఎవరైనా పిల్లవాడు కూర్చుంటే క్షణాల్లో మాయం చేస్తా అని ఛాలెంజ్ చేస్తాడు .

జనంలోనుంచి ఓ పిల్లవాడు ముందుకొచ్చి తాను చెక్కపెట్టెలో కూర్చుంటా అని ధైర్యంగా కూర్చుంటాడు..ఆశ్చర్యం..
చెక్కపెట్టెలో కూర్చోగానే ఆ పిల్లవాడు నిజంగానే మాయం అవుతాడు . ఈ సంఘటన ఎవరూ ఊహించరు.. ఆఖరికి మెజీషియన్ కూడా .

ఇంతకీ ఆ మాయమైపోయిన పిల్లవాడు స్థానిక మాజీ ఎమ్మెల్యే కొడుకు కావడంతో పోలీసుల మీద ప్రెషర్ పడుతుంది. ఉన్నతాధికారులు ఈ కేసును దర్యాప్తు చేయటానికి ప్రత్యేకంగా డిఎస్పీ రిధ్వాన్ (మానవ్ కౌల్ ) ను బారాముల్లా పంపిస్తారు . కేసును దర్యాప్తు చేయడానికి బారాముల్లా వచ్చిన రిధ్వాన్ తన భార్య ,కొడుకు , కూతురితో కలిసి ఓ బంగ్లాలో దిగుతాడు . ఆ బంగ్లాలో వీరికి సహాయకుడిగా ఇక్బాల్ అనే సర్వెంట్ ఉంటాడు .

ఎమ్మెల్యే కొడుకు మాయం కేసులో డిఎస్పీ రిధ్వాన్ దర్యాప్తు చేస్తున్న సమయంలోనే బారాముల్లాలో స్కూల్ పిల్లలు ఒకరొకరుగా మాయం అవుతూ ఉంటారు . అదే సమయంలో అతడి ఇంట్లో కూడా రాత్రిళ్ళు శబ్దాలు రావడం , బాడ్ స్మెల్ రావడం వంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి . దీనికి తోడు ఇక్బాల్ రాత్రిళ్ళు ఎవరికో ప్లేటులో ఆహారం పట్టుకెళ్ళడం రిధ్వాన్ కూతురు కూడా గమనిస్తుంది .

అదేంటో తెలుసుకుందామని వెళ్లిన రిధ్వాన్ కూతురు నూరీ కూడా మాయం అవుతుంది .. ఎమ్మెల్యే కొడుకు మాయం కేసులో దర్యాప్తు చేస్తున్న రిధ్వాన్ ఆఖరికి తన కూతురు కూడా కనిపించకుండా పోవడంతో షాక్ అవుతాడు.

ఈ పరిస్థితుల్లో డిఎస్పీ రిధ్వాన్ ఏం చేస్తాడు ? బారాముల్లాలో వరుసగా పిల్లలు ఎందుకు మాయం అవుతున్నారు ? కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న డిఎస్పీ రిధ్వాన్ ఇంట్లో రాత్రిళ్ళు వింత వింత శబ్దాలు రావడానికి కారణం ఏంటి ? గతంలో ఆ ఇంట్లో నివసించిన కాశ్మీరీ పండిట్లకు ఆ శబ్దాలకు ఉన్న సంబంధం ఏంటి ? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

ముందే చెప్పినట్టు కాశ్మీర్లో ఉగ్రవాదం గురించి , కాశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి గతంలో చాలా సినిమాలు వచ్చాయి . బారాముల్లా దర్శకుడు ఆదిత్య జంబాలే అదే విషయాన్ని మూస ధోరణిలో చెప్పకుండా సరికొత్తగా చెప్పటానికి ప్రయత్నం చేసాడు .

సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీకి కొంచం హార్రర్ టచ్ నెక్స్ట్ సన్నివేశంలో ఇవ్వడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకులలో కలిగించారు . సైన్యం , పోలీసులు , ఉగ్రవాదుల నేపథ్యంలో సినిమా తీస్తే రొటీన్ రోడ్డ కొట్టుడు అయిపోతుంది.. అందుచేత ఇందులోకి ఆత్మలను తీసుకొచ్చాడు.. ఎప్పుడైతే మూవీలో ఆత్మలు రంగప్రవేశం చేశాయో అప్పుడే స్టోరీ డిఫరెంట్ టర్న్ తీసుకుంది .

అంతకుముందు మొదటి అర్ధగంట వరకు బాయ్ మిస్సింగ్ , పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనే రొటీన్ ఫార్ములాతోనే కథ సాగుతుంది . బిగినింగ్ చాలా స్లోగా సాగుతుంది.. స్టార్టింగ్ చూస్తే ఒక రకంగా మనకు బోర్ కొడుతోంది కూడా .

ఇలాంటి సీన్లు గతంలో ఎన్ని సినిమాల్లో చూడలేదూ ?
స్కూల్ పిల్లాడ్ని ఏ టెర్రరిస్టో కిడ్నాప్ చేసి ఉంటాడు ,
ఆ కిడ్నాప్ కేసును ఈ డీఎస్పీ రిధ్వాన్ ఇన్వెస్టిగేట్ చేసి బోర్డర్లో ఉగ్రవాదులతో పోరాడి పిల్లవాడ్ని విడిపించుకు వస్తాడు .. అంతేకదా అని ఆవలిస్తాం .

కానీ ఇక్కడే దర్శకుడు కొద్దిగా తెలివిగా వ్యవహరించాడు .. రొటీన్ ఫార్మాట్లో ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలను నడిపిస్తూనే సడెన్గా ఆత్మలను ప్రవేశపెట్టడంతో మూవీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది

సెకండాఫ్ నుంచి కధనంలో డెప్త్ పెరుగుతుంది.. ఒకటొకటిగా పజిల్స్ చిక్కుముడులు వీడుతాయి . స్కూల్ పిల్లల కిడ్నాప్ దందా వెనుక ఉన్న భాయీజాన్ ఎవరనేది క్లైమాక్సులో రివీల్ చేస్తారు .

ఈ మూవీలో విలన్లకన్నా డిఎస్పీ రిధ్వానే ఎక్కువసేపు కనిపిస్తాడు . అసలామాటకొస్తే గతంలో చాలా సినిమాల్లో చూసినట్టు పెద్ద పెద్ద టెర్రరిస్టు స్థావరాలు ,చుట్టూ గన్నులు పట్టుకుని పహారా కాసే వందలాది మంది మిలిటంట్లు లాంటి హడావుడులు ఏమీ లేకుండా సింపుల్గా చూపించేసాడు . ఒక్క క్లైమాక్సులో అటూఇటూ తుపాకులతో కాల్చుకోవడం మినహా మూవీలో ఎక్కడా మితిమీరిన వయొలెన్స్ లేదు .

కాకపొతే ఈ ఆత్మల గోల అంత తొందరగా మనకు అర్ధం కాదు .. రిధ్వాన్ కొడుకు , కూతురు రాత్రిళ్ళు అదే ఇంట్లో అండర్ గ్రౌండ్లోకి వెళ్లడం , పనివాడు ఇక్బాల్ ప్లేటులో ఆహరం పట్టుకుని చీకట్లో నేల మీద పెట్టిరావడం లాంటివి అక్కడేదో జరుగుతుందని అనిపిస్తుంది కానీ ఏంటో అర్ధం కాదు .

పిల్లల మాయం గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డిఎస్పీ తన ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకపోవడం వింతగా అనిపిస్తుంది . ఇంట్లో ఏదో బాడ్ స్మెల్ వస్తుందని కూతురు రెండుమూడు సార్లు చెప్పినా ఆ పోలీసు బుర్రకు ఎక్కకపోవడం ఏంటో అర్ధం కాదు .

కధనంలో కంటికి కనిపించే చిన్న చిన్న లోపాలు కొన్ని ఉన్నాయి . అయినా క్లైమాక్సులో ఆ ఇంట్లో కాశ్మీరీ పండిట్ల ఊచకోత సన్నివేశాలను చూసిన తర్వాత ప్రేక్షకులు ఆ లోపాలను మర్చిపోతారు.. వారి కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని తల్చుకుని మనసు చివుక్కుమంటుంది .

ఎవరెలా చేసారు ?

సినిమా మొత్తం ఆల్మోస్ట్ ప్రతి సన్నివేశంలోనూ డీఎస్పీ రిధ్వాన్ కనిపిస్తాడు . ఈ పాత్రను పోషించిన మానవ్ కౌల్ పెర్ఫార్మన్స్ బాగుంది .

అతడి భార్య , పిల్లల నటన కూడా బాగుంది.
మూవీలో వీరు కాకుండా చెప్పుకోదగ్గ పాత్రలు లేవు.

సాంకేతికత :

ఇలాంటి సినిమాలకు బీజీఎమ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్.. ఆ పరంగా సునీత్ లిమాయే అందించిన నేపధ్య సంగీతం బావుంది .

బీజీఎమ్ తర్వాత చెప్పుకోవాల్సిందో ఫోటోగ్రఫీ గురించి.. సినిమా ప్రారంభమే కాశ్మీర్లోని మంచు కొండల్లో ప్రారంభం అవుతుంది.. కాశ్మీర్ అందాలను చక్కగా చూపించారు.. వెరసి సినిమాటోగ్రఫీ కూడా బావుంది .

విశ్లేషణ :

రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీకే కొంచం హర్రర్ టచ్ ఇచ్చి బారాముల్లాను తెరకెక్కించడంలో హర్రర్ జానర్ ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది . వయొలెన్స్ తక్కువగా ఉండటం , అసభ్య , అశ్లీల దృశ్యాలు లేకపోవడంతో ఇంట్లో ఫ్యామిలీతో కలిసి నిక్షేపంగా చూడొచ్చు . ఆత్మలు ఉన్నాయి కదా అని భయపడక్కర్లేదు . అవేమీ అంతగా భయపెట్టవు . కాబట్టి చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. తెలుగులో కూడా ఉంది కాబట్టి అందరూ చూడొచ్చు

నటీనటులు : మానవ్ కౌల్ , నీలోఫర్ హమీద్ తదితరులు
దర్శకత్వం : ఆదిత్య జంబాలే
విడుదల : నెట్ ఫ్లిక్స్
రేటింగ్ : 3 /5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!