ఆదివారం వస్తే చాలు విజయవాడ వాసులు అలంకార్ థియేటర్ సెంటర్లో గుమిగూడుతారు
అలా గుమిగూడిన జనంలో నేను కూడా ఉండేవాడిని
జనం అలా గుమిగుడటానికి ఓ కారణం ఉంది
పొద్దున్నే అలంకార్ థియేటర్ సెంటర్లో ఓ మూల మీద పాముల బుట్టతో ఓ కుటుంబం చేసే చిత్ర విచిత్ర టక్కుటమార గారడీలు మొదలౌతాయి
భార్యా భర్త ఇద్దరు పిల్లలు గారడీ విద్యలను ప్రదర్శిస్తారు
ఈ గారడీ ప్రదర్శనలో భాగంగా మొదట బుట్టలో పాములను బయటికి తీసి నాగ స్వరం ఊది ఆడిస్తారు
తర్వాత పాము ముంగిసల పోరాటాలు చూపిస్తారు
ఇవన్నీ చూసి ఎక్సయిట్ అయిన జనాలకు రిలీఫ్ ఇవ్వడానికి మ్యాజిక్ షో కూడా చేస్తారు
గారడీల మధ్యలోనే బొచ్చె పట్టుకుని తలో రూపాయి వేయమని అభ్యర్థన చేస్తాడు
ఎవరైనా డబ్బులు వేయకపోతే బొచ్చె వారి జేబు దగ్గర పెట్టగానే రూపాయి నాణెం పళ్లెంలో పడేది
జేబులో ఉన్న రూపాయి బిళ్ళ అతడి బొచ్చెలో ఎలా పడిందా ? అని అందరూ ఆశర్యపోయేవారు
కొంతమంది మాత్రం భలే అయ్యిందిలే అని నవ్వుకునేవాళ్ళు
అన్నిటికన్నా ఆఖర్లో చిన్న పిల్లలు గాల్లో తాడు మీద చేసే విన్యాసాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడిచేది
అక్కడే అటూ ఇటూ కర్రలు పాతి మధ్యలో తాడు కట్టేవాళ్ళు
ఆ కుటుంబంలోని చిన్న పిల్ల ఆ తాడు మీద నడవటం మొదలుపెడుతుంది
గాల్లో షుమారు ఇరవై ముప్పై అడుగుల ఎత్తున ఆ చిన్నపిల్ల చేసే విన్యాసాలు చూస్తే అందరికీ రోమాలు నిక్కబొడుచుకునేవి
ఏ మాత్రం కాలు స్లిప్ అయినా కింద పడి ఎముకలు సున్నం అవడం ఖాయం
అయినా కొంచెం కూడా భయం లేకుండా నవ్వుతూ ఫీట్లు చేసేవాళ్ళు
ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం ప్రాణాలకు ప్రమాదం కాదా ? అని అడిగితే
ఈ మాత్రం రిస్క్ తీసుకోకపోతే మా కుటుంబానికి రోజు ఎలా గడుస్తుంది అనే సమాధానం వచ్చేది
పళ్లెంలో పడే ఆ చిల్లర నాణేలే వారికి ఒకరోజు భుక్తి
మరి వారానికి ఒక్కరోజే ఈ గారడీ చేస్తారు కదా మిగిలిన రోజుల్లో సంపాదన ఎలాగ ? అని ప్రశ్నిస్తే ‘ రోజుకో గ్రామం చొప్పున చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు పోయి గారడీ విద్యలు ప్రదర్శించి పొట్ట పోసుకుంటాం అనే సమాధానం వచ్చింది
దీన్నే కూటి కోసం కోటి విద్యలు అంటారేమో ?
ఇది జరిగి షుమారు నాలుగు దశాబ్దాలు అయ్యింది !
ఇప్పుడు ఆ గారడీ విద్యలు లేవు
అవి ప్రదర్శించేవాళ్ళు కూడా లేరు
కనుమరుగైపోతున్న అరుదైన కళలలో గారడీ విద్యలు కూడా చేరిపోయినట్టున్నాయి
ఆఖర్లో జేబులో ఉన్న చిల్లర డబ్బులు పళ్లెంలో వేసి ఇంటిదారి పట్టేవాడిని !
పరేష్ తుర్లపాటి