Home » సర్పంచ్ పదవిలో ఏముందో ఎవరికి తెలుసునా ?

సర్పంచ్ పదవిలో ఏముందో ఎవరికి తెలుసునా ?

Spread the love

“మాష్టారూ ! అదిగో ఆ రోడ్డుమీద ఆయనెందుకలా ఏడుస్తున్నాడు ?”

“ఓహో .. ఆయనా.. సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయాడులే “

” అవునా .. మరి ఆ ఎదురింట్లో ఆయన తలుపులేసుకుని మరీ ఊరందరికీ వినబడేట్టు ఏడుస్తున్నాడెందుకు?”

“అదా ..ఆయన సర్పంచ్ గా గెలిచాడులే “

“అదిసరే మాష్టారూ.. గెలిచినోడు , ఓడినోడు ఇలా కంబైన్డ్ గా ఎందుకేడుస్తున్నారు ?”

“ఆ గెలిచినోడికి కోటి వదిలింది .. ఈ ఓడిపోయినోడికి డెబ్భై వదిలింది “

“ఏంటీ డెబ్భై కోట్లే ?”

“ప్రస్తుతానికి ఆ ‘సర్ పంచ్’ కి అంత రేటు రాలేదులే.. ఏమో ముందుముందు వచ్చినా వస్తుందేమో ?”

“వామ్మో ! అదేంటి మాష్టారూ .. ఆఫ్టరాల్ సర్పంచ్ పదవికి కూడా అంతంత ఖర్చు పెట్టారా?”

“సర్పంచ్ పదవి ఆఫ్టరాల్ అని మీరనుకుంటున్నారు .. పోటీ చేసినవాళ్లు ఆ మాట అనుకోలేదు..కేవలం సర్పంచ్ పదవి కోసం ఒకాయన ఏకంగా బంగారం లాంటి పోలీస్ ఉద్యోగాన్నే వదులుకున్నాడు తెలుసా ?”

“అవునా ! అంత జరిగిందా ?”

“అందుకే మిమ్మల్ని రచ్చబండ కబుర్లు వినమనేది .. ఇటువంటి ‘కబుర్లు’ బోలెడు చెప్పుకోవడానికే కదా ‘రచ్చబండ’ ఏర్పాటు చేసింది.. ఇలా కూర్చోండి .. ఈ సర్ ‘పంచుల’ లీలలు మరిన్ని చెప్పుకుందాం”

“చెప్పండి మాష్టారూ”

“తెలంగాణాలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇలా విడుదలైందో లేదో గ్రామాల్లో అలా సందడి మొదలైంది .. ఒకపక్క అభ్యర్థుల కోసం పార్టీల వెదుకులాట, మరోపక్క టికెట్లకోసం అభ్యర్థుల వెతుకులాట ఏక కాలంలో మొదలయ్యాయి”

“అంత డిమాండ్ ఉందన్నమాట”

“అవును.. అయితే అంతకన్నా ముందు అన్ని పార్టీలు తమ అభ్యర్థిని పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికి రంగంలోకి దిగాయి”

“అలా ఎందుకు? ఏకంగా ఎన్నికల బరిలోకి దిగొచ్చుగా?”

“ఎంత కోటీశ్వరుడైనా రోడ్డు పక్కన బండి దగ్గర కొనుక్కునే డజను అరటి పళ్లకు కూడా బేరం ఆడటం చూడట్లేదూ?”.. ఇదీ అంతే.. రాజకీయ పార్టీల ప్రధమ లక్ష్యం గెలుపోటములతో సంబంధం లేకుండా వీలైనన్ని స్థానాలు దక్కించుకోవడం.. రాజకీయాల్లో పోటీ ఇక్కడ్నుంచే మొదలౌతుంది”

“అది సరే .. అంత తేలిగ్గా పోటీలోనుంచి తప్పుకునేవాళ్ళు ఉంటారా?”

“ఉండరు.. దానికి సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తారు”

“అర్థమైంది.. వీటిలో ఏదో ఒకదానికి లొంగేవాడు ఉంటాడన్నమాట?”

“ఎందుకుండరు?..అందరూ అని కాదు కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఉంటారు .. మొదటి విడతలో షుమారు నాలుగు వేల ఐదు వందల గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగితే వాటిలో 250 పంచాయతీలకు పైనే ఏకగ్రీవం అయ్యాయి”

“ఓహో .. ఎన్నికలు ఇలా కూడా నడుస్తాయన్న మాట”

“ఇలానే కాదు..రకరకాలుగా కూడా నడుస్తాయి.. ఇందాక సర్పంచ్ పదవికి పోటీ చేయడం కోసం ఒకాయన పోలీస్ ఉద్యోగాన్నివదులుకున్నాడని చెప్పాను కదా?”

“అవును .. ఇంతకీ ఆయన గెలిచారా?”

“అదే చెప్తున్నా .. వెంకటేశ్వర్లు అనే ఆయన నల్గొండ జిల్లా కోదాడ పీఎస్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు .. చాలా కష్టపడి కానిస్టేబుల్ స్థాయినుంచి పైకొచ్చాడు . ఈయన పదవీ కాలం ఇంకో ఐదు నెలలు ఉంది .. ఈలోపు పంచాయతీ ఎన్నికలకు విడుదలైన నోటిఫికేషన్ చూసాడు .. కన్న ఊరికి సేవ చేయాలనే సదుద్దేశ్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి కోదాడ మండలంలోనే ఉన్న ఆయన ఊరు గుడిబండ గ్రామ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు”

“మరి గెలిచాడా?”

“గెలవలేదు..ఓడిపోయాడు”

“అయ్యో .. ఎందుకనీ? బంగారంలాంటి పోలీస్ ఉద్యోగాన్ని వదులుకుని ఊరికి సేవ చేయడానికి వస్తే అలా ఓడగొడతారా? ఇంతకీ ఈయనెందుకు ఓడిపోయాడు?”

“అదే ఊరికి చెందిన రేషన్ డీలర్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసాడు.. ఊరందరికీ ఎప్పటినుంచో అందుబాటులో ఉంటున్నవాడు.. పరిచయస్తుడు.. ఇంతకీ ఆయన ఎన్ని ఓట్ల తేడాతో గెలిచాడో తెలుసా?”

“తెలీదు.. చెప్పండి?”

“కేవలం పది ఓట్ల తేడాతో”

“ఏదైతేనేమి ఈయన ఉద్యోగం పోయింది .. ఆయనకి పదవి దక్కింది”

“అవును .. ఎన్నికైనవాళ్లలో కొంతమంది అదృష్టవంతులు కూడా ఉన్నారు.. ఇరువురికీ సమానంగా ఓట్లు వస్తే డ్రా తీస్తారు .. అలా డ్రాలో అదృష్టం తలుపు తట్టి సర్పంచులు అయినవాళ్లు కూడా ఉన్నారు .. ఒకే ఒక్క ఓటు తేడాతో గెలిచినవాళ్లు కూడా ఉన్నారు ..అలా మెదక్ జిల్లాలో ఒకామె గెలిచింది.. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంది”

“ఏమిటది?”

“పోటీ చేసిన అభ్యర్థులు ఇరువురికీ పోటాపోటీగా ఓట్లు పోలయ్యి ఏ రెండుమూడు ఓట్ల తేడాతోనో ఓడిపోయిన అభ్యర్థులు రీకౌంటింగ్ లో గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి”

“ఓహో దీన్నే ఓడి గెలవడం అంటారన్నమాట”

“అవును.. అలా ఓడి గెలిచినవాళ్లు కూడా ఉన్నారు.. డబ్బు పంచక నిజాయితీగా పోటీ చేసి ఓడిపోయినవాళ్లు కూడా ఉన్నారు”

“ఎవరు వాళ్ళు ?”

“కామారెడ్డి జిల్లా భిక్కనూరు సర్పంచిగా పోటీ చేసిన మైత్రేయి”

“ఈవిడ ఓడిపోవడానికి అసలు కారణం ఏంటి ?”

“చెప్తాను..అంతకన్నా ముందు ఆమె ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా?”

“టెంతో , ఇంటరో అయ్యుంటుంది ?”

“కాదు ..ఎంఏ , ఎంఫిల్ చేసింది ..అంతటితో ఆగలేదు .. బీఈడీ కూడా పూర్తి చేసింది”

“మైగాడ్ ..ఉన్నత విద్యావంతురాలు”

“ఈవిడే కాదు ..కుటుంబమంతా ఉన్నత విద్యావంతులే .. భర్త అగ్రికల్చరల్ ఇంజనీర్ .. పిల్లలు ఎంబిబిఎస్ , ఎంఎల్ చదువులు చదువుతున్నారు”

“ఓహ్ .. మరి ఇంత చదువులు చదువుకున్న వీళ్ళు ఆఫ్టరాల్ సర్పంచ్ పదవికి ఎందుకంత ఇంట్రెస్ట్ చూపించారు”

“మమకారం.. ఊరి మీద మమకారం.. శ్రీమంతుడు సినిమా చూసారుగా .. అందులో హీరో మహేష్ బాబు అమెరికా నుంచి వచ్చేసి ఊరి బాగుకోసం సేవ చేస్తుంటాడు .. అలానే ఈ మైత్రేయి భర్త కూడా సొంతూరి బాగు కోసం తొమ్మిదేళ్ల క్రితమే అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి పల్లెకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు”

“గ్రేట్ .. మరి ఆయనే పోటీ చేయొచ్చుగా?”

“నిజమే .. ముందు ఆయనే పోటీ చేద్దామనుకున్నాడు..కానీ ఆ స్థానం మహిళలకు రిజర్వ్ కావడంతో భార్య చేత పోటీ చేయించాడు.. ఇంతకీ ఆవిడ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా ?”

“ఏంటి?”

“పలక”

“వాట్ ? పలకా?”

“ఎస్ ..పలకే.. దాని మీద ఆమె రాసిన అక్షరాలే”

“ఏమని రాసింది?”

“ఓటేస్తే డబ్బులేమన్నా ఇస్తారా ? లిక్కర్ బాటిల్ ఇస్తారా ? బిర్యానీ పొట్లం ఇస్తారా ? అంటూ రోజూ ఊరి జనం ఆ ఇంటి తలుపు తడుతూ ఉండేవారు .. వారి పోరు భరించలేక , నమ్ముకున్న సిద్ధాంతాలను వదులుకోలేక ,నిజాయితీకి తిలోదకాలు ఇవ్వలేక ఒక పలక మీద “మేము మందు తాపియ్యం , పైసలసలే ఇయ్యం .. నిజాయితీగా ఓట్లేయండి ” అని రాసి వీధి గుమ్మానికి తగిలించింది.. ఆ తర్వాతేమ్ జరిగుంటుందో అర్ధమయ్యే ఉంటుంది”

“ఇంకేముంది..మందు , నోట్లకు అలవాటు పడిన ప్రాణాలు ఆమెను ఓడించి ఉంటాయి .. మా ప్రజాస్వామ్యంలో నిజాయితీకి స్థానం లేదని అక్కడి ఓటర్లు నిక్కచ్చిగా తేల్చి చెప్పేసి ఉంటారు “

“అవును .. ఆ ఊరి ఓటర్లు ఏడు వేలమందిలో ఆమెకు ఓటేసిన ఓ మూడు వందల యాభై మందిదాకా నిజాయతీ పరులు కూడా ఉన్నారులే..ప్రస్తుత మన ప్రజాస్వామ్య వ్యవస్థ అలా ఉంది .. ఎంతో ఉన్నత విద్యావంతుల కుటుంబం ఊరికి సేవ చేద్దామని వస్తే తిరస్కరించిన గొప్ప ఓటర్లు ఉన్న గ్రామం అది ..అదే కాదు చాలా పంచాయతీలు అలానే ఉన్నాయి”

“థాంక్యూ మాష్టారూ .. మొదట్లో నేను ఆఫ్టరాల్ సర్పంచ్ అని తేలిగ్గా తీసుకుని మాట్లాడాను ..కానీ మీ రచ్చబండ కబుర్లు విన్న తర్వాత అందరూ దోపిడీదారులే ఉండరు .. ఊరికి మంచి చేద్దామనుకునే మైత్రేయి లాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారని తెలిసింది..మరి మిగిలినవాళ్లు సర్పంచ్ పదవి కోసం అంతంత ఖర్చు ఏమి ఆశించి పెట్టారంటారూ?”

“యధా రాజా తధా ప్రజా అని పైవాళ్ళు ఏం చేస్తున్నారో కిందివాళ్ళు అదే చేస్తున్నారు ..పదవి కోసం కొంతమంది , పరువు కోసం మరికొంతమంది , ఇందులో కూడా నాలుగు రాళ్ళూ వెనకేసుకోవచ్చనే దురాశతో మరికొంతమంది , ఇలా ఎవరికి వాళ్ళు అతిగా ఊహించేసుకుని వేలం వెర్రిగా ఖర్చు పెట్టారు..కొంతమంది ఎన్నికల కోసం భూములు అమ్ముకోగా , మరికొంతమంది అప్పులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి .. అందుకే సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన ఓ మహిళ అక్కడికక్కడే పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలయ్యింది “

“అదిసరే మాష్టారూ ! ఇంత జరుగున్నా ప్రభుత్వము , పోలీసులు ఏం చేస్తున్నట్టు ?”

“ఆ వాదనే తప్పు .. బాధ్యతగా ఓటేయాల్సిన ఓటర్లు లిక్కర్ కో , డబ్బుకో అమ్ముడుపోయి నెపం ప్రభుత్వాల మీద , పోలీసుల మీద నెట్టేయడం సరైన విధానం కాదు .. ముందు మార్పు రావాల్సింది ఓటర్లలో.. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటేస్తే నీతివంతులే మన ప్రతినిధులుగా ఎన్నికవుతారు.. అలాకాదని అమ్ముడుపోయామా ?తలా పాపం తిలా పిడికెడు లెక్క అవుతుంది .. అర్థమైందా?”

“ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత అర్ధం కాకపోవడానికి ఏముంది మాష్టారూ..ఓటరు చాలా తెలివైనవాడని కూడా అర్థమైంది . పోలీసాయన్ని కాదని ఊళ్ళో అందుబాటులో ఉన్నోడిని పదవిలో కూర్చోబెట్టారు . అలాగే ఓటుకు నోటు ఇయ్యకపోతే ఎంత విద్యావంతుల కుటుంబమైనా దూరం పెట్టారు . అంటే వాళ్ళ ఉద్దేశ్యంలో అందుబాటులో ఉండేవాడు కావాలి , పైసలిచ్చేవాడు కావాలి . శభాష్ .. ఓటెయ్యడానికి ఈ మాత్రం తెలివితేటలు ఉంటే సరిపోదూ.. ఇంక వాళ్ళకి చదువులతో , నిజాయితీపరులతో అవసరమేముంటుంది మాస్టారూ? వ్యవస్థలో మార్పు రావాలంటే , విలువలతో కూడిన రాజకీయాలు రావాలంటే ముందు ఓటర్లలో మార్పు రావాలి అని అర్థమైంది ..ధన్యవాదాలు !”


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!