ఆశయాలు చాలామందికి ఉంటాయి ..కానీ కొంతమందే వాటిని ఆచరణలో పెట్టి చూపిస్తారు
సమాజం నాకేమిచ్చింది ? అని కాకుండా సమాజానికి నేనేమి ఇచ్చాను? అని ఆత్మపరిశీలన చేసుకుని పదిమంది శ్రేయస్సుకు శ్రమించేవాళ్ళు అరుదుగా ఉంటారు
అలా ఆలోచించాలంటే నిస్వార్థ గుణం , ఉన్నత వ్యక్తిత్వం , లక్ష్యాలు ఉండాలి
అలాంటి ఆశయాలతో ఓ వ్యక్తి లాభాపేక్ష లేని సంస్థను స్థాపించి సమాజానికి సేవ చేస్తూ ఇతరులకు మార్గదర్శంగా నిలుస్తున్నారు !
ఇలాంటి ఒక మంచి సంస్థను పదిమందికీ పరిచయం చెయ్యాల్సిన అవసరం ఉంది
మలేషియాలో ఓ ఆడిటోరియంలో భారతీయ చిన్నారులతో కూడిన బృందంచే కూచిపూడి , భరత నాట్యం ప్రదర్శనలు జరుగుతున్నాయి
అప్పటికే స్థానికులతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది
ఈ నృత్య ప్రదర్శనలను చూడటానికి మలేషియా మంత్రితో పాటు యువ ఎంపీ కూడా వచ్చారు
ఒకరొకరుగా కళాకారులు వేదిక మీదకు వచ్చి నాట్య ప్రదర్శనలు ఇస్తున్నారు
ఆఖర్లో దశావతారాలను నృత్య రూపంలో ప్రదర్శించారు
అంతే , ప్రదర్శనలు తిలకించడానికి వచ్చిన ఆడియన్స్ కరతాళ ధ్వనులతో ఆడిటోరియం మారుమోగిపోయింది
ముందువరుసలో కూర్చున్న మలేషియా మంత్రి మరియు ఎంపీలు లేచి చప్పట్లతో భారతీయ కళల ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ వేదిక మీదకు వెళ్లి చిన్నారులను ఆటోగ్రాఫ్ అడిగి ఫోటోలు దిగారు
భారతీయ కళలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను మలేషియా సంఘటన రుజువు చేస్తుంది
వాస్తవం ఏంటంటే మలేషియాలో పాశ్చ్యాత్త సంగీతానికి రాని ఆదరణ భారతీయ కళలైన కూచిపూడి , భరత నాట్యాలకు వచ్చింది
ఆ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల్లో ప్రదర్శనలు ఇస్తే ఇదే ఆదరణ వచ్చింది
భారతీయ కళలకు , సంస్కృతికి , సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవం మరోసారి బయటపడింది
దీనివెనుక మన కళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని సొంత డబ్బులు ఖర్చుపెడుతూ అహర్నిశం తపన పడుతున్న ఒక వ్యక్తి ఉన్నారు
ఆయన పేరే తుర్లపాటి పట్టాభిరామ్
మలేషియాలో జరిగిన నృత్య ప్రదర్శనలకు ఏ ఒక్కరినుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా షుమారు 18 లక్షలు సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని ఆ దేశ మంత్రి సైతం మన చిన్నారులను ఆటోగ్రాఫ్ అడిగి తీసుకునేంత చక్కగా నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రశంసలు పొందారు
అసలు ఎవరీ పట్టాభిరామ్ .. ఈయన లక్ష్యాలు ఏంటి ?
పట్టాభిరామ్ తండ్రి తుర్లపాటి వెంకట సీతారామ ప్రసాద్ స్వస్థలం కృష్ణాజిల్లాలోని తోట్లవల్లూరు కాగా , తల్లి శకుంతలది గుడ్లవల్లేరు
ఆ దంపతులకు సెప్టెంబర్ 13 న పట్టాభిరామ్ జన్మించారు
ఈయనకు ఇద్దరు అక్కలు , ఒక చెల్లెలు ఉన్నారు
అయితే తండ్రి ఉద్యోగ రీత్యా విజయవాడ ఆర్ఎమ్ఎస్ లో పనిచేసేవారు
ఈ క్రమంలో పట్టాభిరామ్ ప్రాధమిక విద్యను విజయవాడ సత్యనారాయణ పురంలో ఉన్న ఎకెటిపివివి ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసారు
ఉన్నత విద్యను శాతవాహన కాలేజిలోను , నాగార్జున యూనివర్సిటీలోనూ పూర్తి చేసారు
డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఆయన ఆంగ్ల భాషలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు
అంతటితో ఆయన చదువులు ఆపెయ్యలేదు
వరుసగా సోషియాలజీ , సైకాలజీ , జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్లలో పిజి చేసారు
ఒక పక్క చదువులను కొనసాగిస్తూనే ఆంగ్ల సాహిత్యంలో పరిశోధనలు చేసి డాక్టరేట్ కూడా అందుకున్నారు
ఒకే వ్యక్తి ఇన్ని పట్టాలు పొందాలంటే దానికి చదువు మీద ఎంతో జిజ్ఞాస ఉండాలి
తెలుగు మీడియంలో చదువుకున్నఈయన ఇంగ్లీష్ భాష మీద పట్టు ఎలా సాధించారు ?
పట్టాభిరామ్ ఆంగ్ల భాషపై పట్టు సాధించడం వెనుక ఓ గమ్మత్తైన సంఘటన ఉంది
1970 లలో స్కూల్ చదువులు అన్నీ దాదాపు తెలుగు మీడియంలోనే సాగేవి
ఇంగ్లీష్ మీడియంలో చదవడం అంటే క్రేజ్ ఉన్న రోజులు అవి
విజయవాడ సత్యనారాయణ పురం ఎకెటిపివివి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకుంటున్న ఈయన ఆ రోజుల్లోనే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్న విద్యార్థుల దగ్గర చులకన కావడం జరిగింది
ఒకే కాలనీలో ఉంటున్న తోటి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు తెలుగు మీడియంలో చదువుకుంటున్న ఈయనను ఇంగ్లీష్ లో మాట్లాడుతూ హేళన చేసేవాళ్ళు
లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండటంతో కమ్యూనికేషన్ సమస్యలు కూడా వచ్చాయి
ఆ రోజే ఈయన ఎలాగైనా ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలని నిర్ణయించుకున్నాడు
నిర్ణయించుకోవడమే కాదు స్కూల్ తర్వాత పీజీ దాకా పై చదువులు అన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే చదివి భాష మీద పట్టుసాధించడమే కాకుండా ఏకంగా 600 పుస్తకాలు రచించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కూడా సంపాదించుకున్నారు
నాగార్జున యూనివర్సిటీ పురస్కారం
ఆంగ్ల భాషలో ఆరు వందల పుస్తకాలు రచించి గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఎక్కిన సందర్భంగా విజయవాడలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు పట్టాభిరామ్ కు పురస్కారం ప్రకటించారు
విశేషమేమిటంటే తాను చదువుకున్న నాగార్జున యూనివర్సిటీ చేతుల మీదుగానే పట్టాలతో పాటు ప్రతిభా పురస్కారం కూడా అందుకున్నారు
తుర్లపాటి ప్రశంస

ఈయన రచనా వ్యాసంగాలను పరిశీలించిన ప్రముఖ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబ రావు కూడా ప్రశంసా పూర్వక అభినందనలు అందచేసి ప్రోత్సహించారు
ఆంగ్ల భాషలో అన్ని పుస్తకాలు ఒకే రచయిత కలం నుంచి వచ్చాయంటే అందుకు ఎంతో సాహిత్యాభిలాష కావాలని ఆయన అన్నారు
పట్టాభిరామ్ పూర్తిపేరు తుర్లపాటి వెంకట శ్రీనివాస పట్టాభిరామారావు అయితే కుటుంబరావు గారు ఆయనకి పట్టాభిరామ్ అనే షార్ట్ కట్ నేమ్ సూచించడంతో అదే కొనసాగుతూ వచ్చింది
సాహిత్య ప్రస్థానం
పట్టాభిరామ్ కు చిన్నతనం నుంచి సాహిత్యం మీద మక్కువ ఎక్కువ
ఈయన పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే పత్రికలకు కవితలు , వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు
ప్రజాశక్తిలో వర్ధమాన రచయితలకు స్వాగతం అనే ప్రకటన చూసి అప్పటికప్పుడు పెళ్ళైన మహిళల సాధకబాధకాలు ఇతివృత్తంగా చక్రబంధంలో స్త్రీ అనే కధానిక రాసి పంపారు
రాసిన మొదటి రచనే మహిళల సమస్యల నేపథ్యంలో రాయడంతో మంచి పేరు వచ్చింది
అప్పటి ప్రజాశక్తి సంపాదకురాలు శ్రీమతి ఉదయలక్ష్మి ఫోన్ చేసి అభినందించడమే కాదు వంద రూపాయల పారితోషికం కూడా ప్రకటించారు
ఆమె అభినందనలే ఈయనకు మరిన్ని రచనలు రాసే విధంగా ప్రేరణ అయ్యింది
అదే ఉత్సాహంతో తరంగిణి అనే మాస పత్రికకు పంపించిన కవిత కూడా అచ్చు కావడంతో ఇక వెనుతిరిగి చూసుకునే అవసరం లేకపోయింది
ఈనాడు , ఆంధ్రజ్యోతి , ఆంధ్ర పత్రిక , ఆంధ్ర ప్రభ వంటి దినపత్రికలలో కూడా ఈయన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి
తర్వాత ఆంగ్ల భాష లో కూడా పట్టు సాధించి ది హిందూ , డెక్కన్ క్రానికల్ , ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి పత్రికలకు కూడా పట్టాభిరామ్ వ్యాసాలు రాసారు
మొదట్లో ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన పట్టాభిరామ్ తర్వాత స్కోర్ మోర్ ఫౌండేషన్ స్థాపించారు
స్కోర్ మోర్ ఫౌండేషన్ లక్ష్యాలు ఏంటి ?
సాధారణంగా కొన్ని ఫౌండేషన్లు విద్యార్థుల కులం ఆధారంగానో , మతం ఆధారంగానో సహాయం చేస్తాయి
కానీ స్కోర్ మోర్ ఫౌండేషన్ లో కులం , మతం ,ప్రాంతాలతో సంబంధం లేకుండా అవసరమైన విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులను నేర్పిస్తారు
కేవలం స్కిల్స్ నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు
విద్యార్థులలో స్కిల్ డెవలప్ చేసి పోటీ పరీక్షలకు వెళ్లే విధంగా శిక్షణ ఇస్తారు
శిక్షణ పొందిన విద్యార్థులకు ప్లేస్మెంట్లో కూడా సహాయం అందచేస్తారు
ఇందుకుగాను ఒక్క పైసా కూడా ఫౌండేషన్ కు చెల్లించాల్సిన పని లేదు
ఇప్పటికే ఈ సంస్థ ద్వారా వందలాదిమంది విద్యార్థులకు మంచి బాట ఏర్పరిచారు
ఒకపక్క స్కోర్ మోర్ ఫౌండేషన్ ద్వారా విద్యా రంగంలో అవసరమైన సేవలు చేస్తూనే ఈయన భారతీయ కళావేదిక అనే సంస్థను కూడా స్థాపించారు
భారతీయ కళావేదిక లక్ష్యాలు ఏంటి ?
ఈ సంస్థ ద్వారా ప్రాచీన భారతీయ కళలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది
కూచిపూడి , భరత నాట్యం వంటి కళలలో ప్రావీణ్యం సంపాదించేందుకు సహకారం అందించటమే కాకుండా దేశ విదేశాల్లో వారిచే నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తారు
ఈ ప్రదర్శనలలో పాల్గొనటానికి ప్రతిభే కొలమానం
ఇందుకు కూడా పైసా చెల్లించాల్సిన పని లేదు
భారతీయ కళలను నేర్చుకోవాలనే ఆసక్తి , ఉత్సాహం , అంకిత భావం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కళావేదికలో చేరవచ్చు
ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 14 దేశాల్లో కళాకారులు , కళాకారిణులు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది
నిజంగా ఇది చాలా మంచి కార్యక్రమం
ప్రభుత్వాలు చేయాల్సిన పని వ్యక్తిగా పట్టాభిరామ్ చేస్తున్నారు
ఎటువంటి లాభాపేక్ష లేకుండా , ప్రభుత్వాలను కానీ , సంస్థలను కానీ నయాపైసా అడక్కుండా సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని కళామతల్లికి సేవ చేస్తున్న తుర్లపాటి పట్టాభిరామ్ అభినందనీయుడు
పదవులు
పట్టాభిరామ్ బోధనా రంగంలో వారణాసి , అలహాబాద్ , నైనిటాల్ , ఢిల్లీ లతో పాటు పలు రాష్ట్రాల్లో సేవలు అందించారు
నాలుగు దశాబ్దాల వృత్తి జీవితంలో బోధనా రంగంతో పాటు కన్సల్టెన్సీ , పరిశోధన , పరిపాలన రంగాల్లో సమర్ధవంతమైన పాత్ర పోషించారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ మొదలుపెట్టిన పట్టాభిరామ్ పలు విద్యా సంస్థలకు ప్రిన్సిపాల్ గా , అకడమిక్ డైరెక్టర్ గా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పలు రాష్ట్రాల్లో సేవలు అందించారు
తర్వాత స్కోర్ మోర్ అనే ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా , భారతీయ కళావేదిక డైరెక్టర్ గా , ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వ్యవస్థాపకుడిగా , స్కోర్ మోర్ న్యూస్ ప్రధాన సంపాదకుడిగా , ఐ స్టార్ లండన్ లిమిటెడ్ డైరెక్టర్ గా పలు బాధ్యతలను నిర్వహిస్తున్నారు
పురస్కారాలు
ఈయన సేవలను గుర్తించిన పలు సంస్థలు ప్రతిభా పురస్కారాలతో సత్కరించాయి
ఆంగ్ల సాహిత్యంలో చేసిన పరిశోధనలకు గాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రతిభా పురస్కారాన్ని అందచేసింది
ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఉత్తమ రచనలకు పురస్కారం అందచేశారు
మన దేశంలోనే కాదు మలేషియా , థాయిలాండ్ లలో కూడా పట్టాభిరామ్ పురస్కారాలు పొందారు
చివరగా పట్టాభిరామ్ మాట్లాడుతూ ” లాభాపేక్ష కోసమో , కీర్తి కండూతి కోసమో నేను స్వచ్ఛంద సంస్థలను నడపటం లేదు .. స్కోర్ మోర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం , భారతీయ కళావేదిక ద్వారా మన కళలను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాం . ఇందుకు గాను ఏ ఒక్కరి దగ్గర్నుంచి నయాపైసా తీసుకోకుండా పూర్తిగా సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని మరీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం . మా సంస్థ చేస్తున్న చిరు ప్రయత్నానికి మనః స్ఫూర్తిగా ప్రోత్సహించి మద్దతు ఇస్తే మాకు అదే పదివేలు ” అని చెప్పారు
నిజమే లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేస్తున్న తుర్లపాటి పట్టాభిరామ్ లాంటి వ్యక్తులను ప్రతిఒక్కరూ ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది !
