బుధవారం నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో పర్యటిస్తూ తెలంగాణా వాళ్ళ దిష్టి తగిలే కోనసీమలో కొబ్బరి పంట నాశనం అయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఆయన అధికారికంగా కోనసీమ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడి కొబ్బరి పంట నష్టాన్ని పరిశీలించారు . కొబ్బరికాయలు మొదలంటా ఎండిపోవడం కనిపించింది . కోనసీమ కొబ్బరి పంటకు ప్రసిద్ధి అన్న సంగతి అందరికీ తెలిసిందే .
అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ , కోనసీమ కొబ్బరి పంటకు ప్రసిద్ధి అనీ , పచ్చని పంటపొలాలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందని చెప్తూ , తమదగ్గర ఇంత పచ్చదనం లేదని తెలంగాణా వాళ్ళు అసూయతో దిష్టి పెట్టడం వల్లనే ఇక్కడి కొబ్బరి పంట నాశనం అయ్యిందని ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు .
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాక రేపాయి . కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్దించగా , మరికొందరు వ్యతిరేకించారు . ముఖ్యంగా తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ విమర్శలు చేసారు . దాంతో ఆయన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపాయి .
పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యల గురించి విశ్లేషణ చేసుకునేముందు గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుందాం . గతంలో తెలంగాణాలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళని కించపరుస్తూ మాట్లాడి వివాదాస్పదులు అయ్యారు . అప్పట్లో ఆయన వ్యాఖ్యలను సమైక్యవాదులు ఖండించారు . అయితే ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి .
దాంతో ఇరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారి ఇప్పుడిప్పుడే సుహృద్భావ వాతావరణం ఏర్పడుతున్న వేళ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పాత పుండుని గెలికినట్టు అయ్యింది .
తెలంగాణా సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చి రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన కేసీఆర్ గత ఎన్నికల్లో ఓడిపోయి దాదాపు అస్త్ర సన్యాసం చేసి ప్రస్తుతం ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు .
మరోపక్క ఏపీ ముఖ్యమంత్రికి శిష్యుడిగా ముద్రపడిన రేవంత్ రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నారు . రేవంత్ టిడిపి ని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ చంద్రబాబుతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే .
ఇదిలాఉండగా తెలంగాణా ఉద్యమ సమయంలో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి ఒక్క కేసీఆర్ మరియు బిఆర్ఎస్ శ్రేణులు మినహా ఇతర పార్టీ నాయకులెవరూ ఆంధ్రోళ్ళని పెద్దగా తిట్టింది లేదు .
కానీ రేవంత్ హయం వచ్చిన తర్వాత వ్యూహం మారింది . ఆయన కేసీఆర్ మాదిరి దూకుడుగా ఆంధ్రోళ్ల మీద మాట్లాడి వివాదాల్లోకి వెళ్ళలేదు . తెలంగాణా ఎన్నికల్లో కూడా రేవంత్ ఆరు హామీల అమలును ప్రధాన అస్త్రంగా చేసుకుని పనిచేసాడే కానీ వ్యక్తిగతంగా ఏపీని కానీ అక్కడి ప్రజలను కానీ టార్గెట్ చేస్తూ విమర్శలు చేయలేదు .
ఈ మధ్య కాలంలో అటు టిడిపి ప్రభుత్వం , ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నీటి పంచాయతీల మీద రాజకీయంగా ఒకరినొకరు విమర్శలు చేసుకున్నారే కానీ వ్యక్తిగత ధూషణలు చేసుకోలేదు . అధికారుల బృందంతో కేంద్రం వద్ద తమకు అనుకూలంగా వాదనలు వినిపించారే కానీ వ్యక్తిగతంగా ప్రజలను టార్గెట్ చేయలేదు .
మరోపక్క కేసీఆర్ టీఆరెస్ పార్టీ పేరులో ఎప్పుడైతే తెలంగాణాని తీసేసారో తెలంగాణా ప్రజలు కూడా కేసీఆర్ ను పక్కనబెట్టారు . అక్కడితో తెలంగాణాలో సెంటిమెంట్ రాజకీయాలు చప్పబడిపోయాయి . కేసీఆర్ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ సెంటిమెంట్ రాజకీయాలకు స్వస్తి పలికి తనదైన శైలిలో పరిపాలన చేసుకుంటూ పోతున్నారు .
ఇలాంటి సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి చేసారో కానీ కోనసీమ కొబ్బరికి తెలంగాణా దిష్టి తగిలిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు .
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను జనసేన నాయకులు సమర్థిస్తూ ఉండగా , బిఆర్ఎస్ నాయకులు దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని బయటికి తీసి సంధిస్తున్నారు . ఇరు రాష్ట్రాల ప్రజలు సెంటిమెంట్ గాయాలను దాదాపు మర్చిపోయి తిరిగి అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటున్న తరుణంలో పవన్ చేసిన వ్యాఖ్యలు మానిన గాయాన్ని కెలికినట్టు అయ్యింది .
అయితే గతంలో కేసీఆర్ ఆంధ్రా వాళ్ళ మీద చేసిన ధూషణలతో పోలిస్తే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సాధారణమైనవే అయినా అందుకు ఇది సమయం ,సందర్భం కాదని అనిపిస్తుంది .
కేసీఆర్ తిట్లని ఒకసారి గుర్తు చేసుకోవాలంటే , బ్రిటిష్ వాళ్ళని తెల్లోళ్ళు అని పోల్చినట్టు , ఆంధ్రా వాళ్ళని ఆంధ్రోళ్లు అని కేసీఆర్ సంబోధించేవారు . ఒరిజినల్ బిర్యానీ అంటే హైదరాబాదుదే అనీ , ఆంధ్రోళ్లు పెండ బిర్యానీ తింటారని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఘాటుగా విమర్శించేవారు . వాళ్ళకి భాష , యాస పలకడం రాదని దొంగల లెక్కన తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి . అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్ర ప్రజలను ఆంధ్రోళ్లు వేరు , తెలంగాణా ప్రజలు వేరు అనే సంకేతాన్ని సృష్టంగా తెలంగాణా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు .
ఎన్నికల ప్రచారంలో ఏపీ ప్రజలను దూషించడం వల్లనైతేనేమి , తెలంగాణా సెంటిమెంట్ రగిలించడం వల్లనైతేనేమి , వాడుకలో ఉన్న సామెతలను వాడుకుని భాషలో ,యాసలో తెలంగాణా వాదాన్ని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లడం వల్లనైతేనేమి కేసీఆర్ ఉమ్మడి రాష్ట్ర విభజనను సాధించగలిగారు .
అయితే ఇదంతా గత చరిత్ర . ఇరు రాష్ట్రాలకు సుహృద్భావ సంబంధాలు ఉన్న నాయకులు ముఖ్యమంత్రులు కావడంతో విభజన తాలూకూ విద్వేషపూరిత దూషణల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు ప్రజలకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తేనె తుట్టెను కదిలించినట్టు అయ్యింది .
నిజానికి విభజన గాయాలు నాయకులు చేసిందే కానీ ఇరు రాష్ట్రాల ప్రజల్లో లేవు .
ఇరువైపులా ఒకరినొకరు పండుగలను , ఆచార వ్యవహారాలను , సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించుకుంటూ చేసుకుంటున్నారు . అక్కడివాళ్లు ఇక్కడి బతుకమ్మ పండుగకు వస్తున్నారు . ఇక్కడివాళ్ళు సంక్రాంతికి అక్కడికి వెళ్తున్నారు .
విభజన తాలూకూ రాజకీయ వ్యక్తిగత ధూషణ పర్వాలు నాయకుల్లో ఉన్నాయే కానీ ప్రజల్లో అంతగా లేవు . ఆ విషయాన్ని పండుగలకు హైదరాబాద్ ఖాళీ అవడం తెలియచేస్తుంది . ఇరు రాష్ట్రాల ప్రజలు మనఃస్ఫూర్తిగా కోరుకుంటుంది సుహృద్భావ పూరిత వాతావరం మాత్రమే . తమ నాయకుల నుంచి కోరుకునేది అభివృద్ధిలో పోటీ పడమనే .
ఒకరకంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఫామ్ లో లేని బిఆర్ఎస్ నెత్తిన పాలు పోసినట్టు అయ్యింది . తెలంగాణా సెంటిమెంట్ నినాదాన్ని తిరిగి వాడుకోవడానికి వారికి ఊతకర్ర దొరికినట్టు అయ్యింది .
నిజానికి తెలంగాణా దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి పంట నాశనం అయ్యిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా అంత పరిణతి గా లేవు . డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆచితూచి స్పందించాల్సిన అవసరం ఉంది . మరీ పరిణితి లేకుండా మాట్లాడటం ఆయన హోదాకు తగినది కాదు .
దిష్టి తగలడానికీ , పంట పాడైపోవడానికి సరైన శాస్త్రీయత లేదు . కేవలం దిష్టి తగలడం వల్లనే పంటలు పాడైపోతాయనుకుంటే దేశంలో చాలాచోట్ల పంటలు ఉండవు .
అంతగా పవన్ కళ్యాణ్ తెలంగాణా నాయకులను టార్గెట్ చేయదల్చుకుంటే వేరే సందర్భంలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తే తన వాదానికి కొంత డిఫెన్స్ ఉండేది . కోనసీమలో పంట పాడైపోవడానికి తెలంగాణా వాళ్ళ దిష్టి తగలడమే కారణమని వ్యాఖ్యలు చేయడం వల్ల నవ్వులపాలు అవడం మినహా మరే ప్రయోజనమూ ఉండదు .
పోనీ ఈ వాఖ్యల వల్ల జనసేనకు ఏపీలో పొలిటికల్ మైలేజీ ఏమన్నా పెరుగుతుందా ? అంటే అదీ లేదు . పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పార్టీ నాయకులు సమర్దిస్తారేమో కానీ సాధారణ ప్రజలు సమర్ధించరు . అంతెందుకు కొబ్బరి పంట నస్టపోయిన రైతులు కూడా హర్షించరు .
పంట నష్టపోవడం వెనుక శాస్త్రీయ కారణాలను నిపుణులైన వ్యవసాయ శాఖ అధికారులతో అధ్యయనం చేయించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చి ఉంటే అది డిప్యూటీ సీఎం హోదాకు వన్నె తెస్తుంది . భవిష్యత్తులో చీడపురుగులబారిన పడి పంట నాశనం కాకుండా రైతులకు ఎరువులను సబ్సిడీ మీద అందించే ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది .
అంతేకానీ రైతు సమస్యల మీద శాస్త్రబద్ధం కాని చౌకబారు వ్యాఖ్యలు చేయడం వల్ల లోకువ అయ్యేది ఆయనే అనే విషయం తెలుసుకోవాలి . పైగా ఈ వ్యాఖ్యలు తెలంగాణా బిఆర్ఎస్ నాయకులకు రాజకీయ పరంగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని అలా ఉంచితే తెలంగాణా ప్రజలు కూడా హర్షించరు .
రాజకీయ ప్రయోజనాల కోసం సంకుచిత భావాలను వ్యాప్తి చేస్తే భవిష్యత్తులో నష్టపోయేది ఆయనే . ఇందుకు ఉదాహరణ కేసీఆర్ .
విభజన వాదంతో తెలంగాణాలో నెగ్గి జాతీయ రాజకీయాలకు కూడా ఎదుగుదామనుకున్న ఆయన తరువాతి కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఓడిపోయి ఫార్మ్ హౌస్ కి పరిమితం అయిన సంగతి అందరికీ తెలిసిందే .
విభజన రాజకీయాలు తాత్కాలికంగా ప్రయోజనం కలిగించవచ్చు . కానీ అదే వ్యూహం దీర్ఘ కాలం పనిచేయదు . ఈ పరిణితి ఉంది కాబట్టే చంద్రబాబు కానీ , జగన్ కానీ తెలంగాణా వాళ్ళని వ్యక్తిగతంగా హేళన చేయలేదు .
ఈ విషయం పవన్ కళ్యాణ్ గ్రహించి తెలంగాణతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ , ఏపీ అభివృద్ధికి పూర్తి సమయం , దృష్టి పెడితే భవిష్యత్తులో ఇప్పుడున్న పదవికి ప్రమోషన్ కూడా రావొచ్చు !
