తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో గుమ్మడి నరసయ్య గారి పేరు తెలియని వారు ఉండరు
ఈయన తెలంగాణా లోని ఖమ్మం జిల్లా ఇల్లేందు నియోజకవర్గం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ( మార్కిస్టు & లెనినిస్ట్ ) తరపున ఎన్నికల్లో పోటీ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడిగా ఈయనకు పేరుంది
ముఖ్యంగా ఆదివాసీ , గిరిజనులు , శ్రామిక వర్గాల హక్కుల కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేసారు
5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయన జీవన శైలి చాలా సింపుల్ గా ఉంటుంది
గ్రామాల్లో ప్రజల సమస్యలు కనుక్కోవడానికి సైకిల్ మీద తిరిగేవారు
ఇతర గ్రామాలకు వెళ్లాలంటే మందీ మార్బలం , ఆడంబరాలు వంటి హడావుడి లేకుండా ఒక్కడే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి అక్కడి సమస్యలు కనుక్కునేవారు
పనుల మీద రాజధాని వస్తే సాధారణ క్యాంటీన్ లో భోజనం .. లేకపోతె దారిలో ghmc వారు పేదలకు అందించే 5 రూపాయల భోజనం చేస్తారు
ప్రస్తుత ఎమ్మెల్యేలలో ఇంత సామాన్యంగా ఉండే వాళ్ళని చూడగలమా ?
5 సార్లు ఎమ్మెల్యేగా చేసినా ఒక్క అవినీతి మారక కూడా వంటికి అంటించుకోకుండా నిజాయితీగా అంకిత భావంతో పని చేసిన ఇటువంటి నాయకులను వర్తమాన రాజకీయాల్లో చూడగలమా ?
అంతటి గొప్ప నాయకుడి జీవిత చరిత్రను పదిమందికి తెలియచేయాలన్న సోయి ఇక్కడి హీరోలకు , దర్శకులకు , టోటల్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు లేకపాయె
ఆఖరికి ఎన్నో చెత్త బయోపిక్ లు తీసిన రామ్ గోపాల్ వర్మ దృష్టిలో కూడా గుమ్మడి నరసయ్య గారు పడలేదు
అయినా అదీ ఒకందుకు మంచే అయ్యిందిలే
ఆయన చేతిలో పడితే అసలు చరిత్ర ఖునీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయిగా
ఆర్ నారాయణ మూర్తి గారు ప్రయత్నించి ఉండాల్సింది
ఆయన ఎందుకు చేయలేదో తెలియదు
అందుకే తెలుగు వారు మరిచిన తెలుగు నాట విశిష్ట రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్యను కన్నడ చిత్ర పరిశ్రమ గుర్తించింది
శివ రాజ్ కుమార్ హీరోగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాత్రలో తెలుగులోకి అడుగుపెట్టనున్నారు
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ బయోపిక్ ‘గుమ్మడి నరసయ్య’తో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ ప్రముఖ నటుడు టైటిల్ పాత్రను పోషిస్తున్నారు
ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన జీవితం మరియు పోరాటాల నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రాన్ని ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ఎన్ సురేష్ రెడ్డి నిర్మిస్తుండగా దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహించనున్నారు
శివ రాజ్ కుమార్ భుజంపై ఎర్రటి శాలువాతో తెల్లటి కుర్తా పైజామాలో గుమ్మడి నరసయ్య వేషధారణలో ఉన్న పోస్టర్ ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది.
త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ బయోపిక్ సినిమా పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
నీతికీ , నిజాయితీకి మారుపేరుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వంగా చెప్పుకునే గుమ్మడి నరసయ్య గారి జీవిత చరిత్రను తెరకెక్కించి ప్రపంచానికి పరిచయం చేస్తున్న కన్నడ చిత్ర పరిశ్రమకు , కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారికి అభినందనలు !
