మురళీమోహన్ బ్లాంక్ చెక్ పంపించాడు .. అయినా శోభన్ బాబు ఆ సినిమాలో చేయనన్నాడు .. ఎందుకో తెలుసా ?
తెలుగు సినీ ప్రేక్షకులు అందాల నటుడు అని శోభన్ బాబును ఇప్పటికీ మనస్సులో నిలుపుకోవడం వెనుక కారణం కూడా శోభన్ బాబే
ఎందుకో తెలుసా ?
సరైన సమయంలో పరుగును ఆపడం ఓ కళ అని భావించి సినిమాల్లో హీరోగా నటిస్తున్న సమయంలోనే , సినిమా అవకాశాలు వేచి చూస్తున్న సమయంలోనే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి చెన్నైలో స్థిరపడిపోయారు శోభన్ బాబు
ప్రేక్షకులు తనను అందాల నటుడిగా తమ హృదయాలలో నిలుపుకున్నారని అటువంటి స్థానాన్ని వదులుకోవడం తనకు ఇష్టం లేదని అందుకే సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు ఆయన చెప్పారు
అందుకే మురళీమోహన్ తన సినిమాలో నటించేందుకు బ్లాంక్ చెక్ పంపినప్పటికీ శోభన్ బాబు ఆయన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరిస్తూ ఆ సినిమాలో నటించటానికి ఇష్టపడలేదు
ఈ విషయం మురళీ మోహన్ స్వయంగా చెప్పారు
మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అతడు వచ్చే నెలలో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్టు 9 న అతడు సినిమా రీ రిలీజ్ చేయాలనీ నిర్ణయించారు
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మురళీమోహన్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు
‘ అతడు సినిమాలో నాజర్ వేసిన పాత్రకు ముందు శోభన్ బాబును అనుకున్నాం . ఇదే సంగతి డైరెక్టర్ త్రివిక్రమ్ కు చెబితే ఆ పాత్రకు శోభన్ బాబు అయితే చాలా బావుంటుంది . అయితే ఆయన ఒప్పుకుంటారో ? లేదో ? అని సందేహం వెలిబుచ్చాడు
అప్పటికే శోభన్ బాబు సినిమాలు మానేసి చెన్నైలో స్థిరపడిపోయారు .. మేమంతా చెన్నై వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చేసాం
శోభన్ బాబును నేరుగా అడగటానికి నాకు మొహమాటం అడ్డొచ్చింది .
అందుకే మేకప్ మ్యాన్ రాముకి బ్లాంక్ చెక్ ఇచ్చి’ ఆయనకు యెంత రెమ్యునరేషన్ కావాలంటే అంత రాసుకోమను .. ఎలాగైనా సినిమాలో నటించేందుకు ఆయన్ని ఒప్పించమని ‘ చెప్పి చెన్నై పంపించాను
ఎందుకంటే ఆ పాత్రకు శోభన్ బాబు అయితే ఖచ్చితంగా సరిపోవడమే కాకుండా ఆయన నటిస్తే సినిమాకు కూడా విలువ పెరుగుతుందని భావించా
కానీ చెన్నై నుంచి శోభన్ బాబు నాకు ఫోన్ చేసి ‘ సారీ మురళీ మోహన్ గారూ .. నన్ను ప్రేక్షకులు అందాల నటుడిగా మాత్రమే తమ గుండెల్లో పెట్టుకున్నారు .. ఆ భావనలు వాళ్ళ హృదయాల నుంచి చెరిగిపోకూడదనే హీరోగానే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాను . తండ్రి పాత్రలు , తాత పాత్రలు , రోగిష్టి పాత్రలు చేసి నా అభిమానుల భావనలను చెడగొట్టడం నాకిష్టం లేదు .. అంతకుమించి మీ సినిమాలో నటించకపోవడానికి నాకు వేరే కారణం ఏమీ లేదు .. దయచేసి తప్పుగా అనుకోవద్దు .. మీరు సినిమా తీస్తున్నారంటే ఖచ్చితంగా హిట్ సినిమానే తీస్తారు .. అందులో నాకిచ్చే పాత్ర కూడా మంచిదే అయ్యుంటుంది .. లేకపోతె సినిమాలకు నేను రిటైర్మెంట్ ప్రకటించానని తెలిసి కూడా మీరు నన్ను అడగరు .. కానీ నేను మీ సినిమాలో నటించకపోవడానికి కేవలం పైన నేను చెప్పిన కారణమే .. దయచేసి తప్పుగా అనుకోవద్దు ..’ అని నా ఆఫర్ను తిరస్కరించారు అని చెప్పారు మురళీమోహన్ !
పరేష్ తుర్లపాటి