Home » బాలు గానానికి కూడా హద్దులు ఉంటాయా ?

బాలు గానానికి కూడా హద్దులు ఉంటాయా ?

Spread the love

శంకరాభరణంలో ఓ పాట ఉంటుంది
అది కూడా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారే పాడారు

శంకరా నాద శరీరా పరా
వేదం విహారా జీవేశ్వరా
ప్రాణము నీవని
గానమే నీదని
ప్రాణమే గానమనీ
మౌన విచక్షణ .. గాన విలక్షణ
రాగమే యోగమనీ
నాదోపాసన చేసినవాడను నీ వాడను నేనైతే
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సితకంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించారా
విని తరించరా

ఈ పాట ద్వారా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి తన అంతరంగం ఆవిష్కరించుకున్నారా అనిపించింది

అటువంటి గాన గంధర్వుడికి మరణాంతరం ప్రాంతం పేరిట హైద్రాబాదులో జరిగిన అవమానం ఆయన అభిమానులు ప్రతి ఒక్కరికీ కన్నీరు తెప్పిస్తుంది

కొంతమంది రాజకీయ నాయకులు తమ వికృత విన్యాసాలకు , అధికార దాహానికి కులం , మతం , ప్రాంతం , భాష లను పావులుగా వాడుకుంటాయనే సంగతి చరిత్రలో చూసాం . ఇప్పుడూ చూస్తూనే ఉన్నాం

ఈ రాక్షస రాజకీయ క్రీడాకారులకు మంచి చెడులు ఉండవు
పాపపుణ్యాలు అసలే తెలియవు

తెలిసిందల్లా అధికార దాహం
అహంకారపూరిత ఉన్మాద మనస్తత్వం

ఇప్పుడీ ఉపాధ్ఘాతం ఎందుకంటే ,

దేశం మెచ్చిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యాన్ని కూడా ఒక ప్రాంతానికి పరిమితం చేస్తూ మాట్లాడిన తెలంగాణకు చెందిన కుసంస్కార అజ్ఞానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి

రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహ ఆవిష్కరణకు శుభలేఖ సుధాకర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు

ప్రభుత్వం ద్వారా ఇందుకు సంబంధించిన అనుమతులు కూడా తెచ్చుకున్నారు

ఈ దశలో విగ్రహ ఏర్పాట్లు పర్యవేక్షించటానికి రవీంద్ర భారతికి వచ్చిన ఆయన్ని తెలంగాణా ఉద్యమ కారుడిగా చెప్పుకుంటున్న పృథ్విరాజ్ అనే వ్యక్తి అటకాయించి ఎస్పీ బాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవాడు కాదు కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడ పెట్టటానికి వీల్లేదంటూ గొడవకు దిగాడు

దానితో శుభలేఖ సుధాకర్ సౌమ్యంగా ఆయనకి నచ్చచెబుదామని ఎంతసేపు ప్రయత్నించినా వినకపోగా నువ్వు అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ గొడవకు దిగాడు

ఆ వ్యక్తి ఆగడాలు భరించలేక సుధాకర్ కారులో వెళ్లిపోవడం కనిపించింది
ఇదీ జరిగింది

ప్రాంతీయ వాదం వేరు
ప్రాంతీయ ఉన్మాద ఉగ్రవాదం వేరు

పై సంఘటనలో అందరికీ రెండోదే కనిపించింది

ఈ దృశ్యాన్ని వీడియోలో చూసిన తెలంగాణా వాసులు కూడా కన్నీరు పెట్టుకున్నారు
ఈ దుశ్చర్యని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు

దేశం మెచ్చిన గాయకుడు ఎస్పీ బాలుని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయడమేంటని మండిపడుతున్నారు

ఎక్కడో పుట్టి ప్రాంతాల హద్దులను చెరిపేసుకుంటూ సాగునీరు , తాగునీరు అందిస్తూ గమ్యానికి చేరుకునే జీవనది లాంటి వారు ఎస్పీ బాలసుబ్రమణ్యం

తను నడిచి వెళ్లిన దారిలో పాటల పరిమళాలను వెదచల్లుకుంటూ వెళ్ళాడు

దశాబ్దాలుగా ఆ పాటలను వినేగా మనం పరవశాన మైమరిచింది
ఆ పాటలను వినేగా మన కష్టాలను , కన్నీళ్లను కొద్దిసేపైనా మరవగలిగింది

ఆయన పాటలకు మెచ్చి తమిళులు ఏకంగా తమ రాష్ట్రంలో ఒక వీధికి బాలు గారి పేరు పెట్టుకుని తమ అభిమానాన్ని హుందాగా చాటుకున్నారు
ఇక్కడ బాలు గారు తమిళుడు కాదే ?

మరెందుకు ఆయన మీద వాళ్ళు అంత అభిమానం చూపించారు
వాళ్ళు ఆయనలో ఎస్పీ బాలసుబ్రమణ్యాన్ని చూడలేదు
గాన గంధర్వుడిని చూసారు
ఆయన పాటలను చూసారు .. విన్నారు

కన్నడిగులకి , బాలుకి ఏ సంబంధం ఉందని వాళ్ళు నేటికీ ఆయన్ని గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు ?

గాన గంధర్వుడు సైతం మనకోసం దివి నుంచి భువికి దిగొచ్చి కొన్ని దశాబ్దాల పాటు మానవాళికి గానామృతం పంచి వచ్చిన పని అయిపోయిన తర్వాత తిరిగి గంధర్వ లోకానికి వెళ్లిపోయారు

అటువంటి బాలసుబ్రమణ్యం మన తెలుగు వాడు కావడం మనందరి అదృష్టం
మనందరికీ గర్వకారణం కూడా

ఇప్పటికే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే బాలు గారి జ్ఞాపకార్థం తెలుగు రాష్ట్రాలు చూపిస్తున్న అలసత్వం పట్ల ఆయన అభిమానులు అసంతృప్తితో ఉన్నారు

ప్రభుత్వాలు చేయలేని పనిని తాను చేద్దామని శుభలేఖ సుధాకర్ ముందుకొచ్చి ఏర్పాట్లు చేస్తుంటే స్వాగతించాల్సింది పోయి చనిపోయిన వ్యక్తి మీద ప్రాంతీయ ద్వేషం చూపించడం ఎంత వరకు సబబు ?

ఇదేనా తెలుగు వారిగా బాలుకి ఇచ్చే గౌరవం ?
ఇదేనా ప్రఖ్యాత గాయకుడికి మరణాంతరం అర్పించే నివాళి ?

రోజు రోజుకీ దిగజారిపోతున్న మానవత్వానికి పరాకాష్ట ఈ సంఘటన

మనిషన్నవాడు మాయమైపోతున్నాడమ్మా అంటూ గాయకుడు అందెశ్రీ పాడిన పాట బహుశా ఇటువంటి వారిని ఉద్దేశించే అయ్యుంటుంది

ఎస్పీ బాలూది తెలంగాణా కాకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించిన బుద్దుడిది ఏ ప్రాంతం ?

సచివాలయం పక్కన ప్రతిష్టించిన అంబేద్కర్ ది ఏ ప్రాంతం ?

తెలంగాణాలో వందలాదిగా ప్రతిష్టించిన ఇందిరమ్మ , రాజీవ్ , ఎన్టీఆర్ , వైఎస్సార్ , తదితరులది ఏ ప్రాంతం ?

దేశానికి చేసిన సేవలకో , రాష్ట్రానికి చేసిన సేవలకో గుర్తింపుగా అభిమానంతో ప్రాంతాలకు అతీతంగా తెలంగాణా అంతటా వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు లేని నొప్పి బాలు గారి విగ్రహం పెట్టుకుంటుంటే ఎందుకొచ్చింది ?

సంకుచిత మనస్తత్వానికి కూడా ఓ హద్దు ఉంటుంది

అమర గాయకుడి విషయంలో ఆ హద్దులు కూడా దాటేసి విద్వేషంతో తెలంగాణా సెంటిమెంట్ ప్రయోగిద్దామని చూస్తే తెలంగాణా వాదులే తిరగబడే రోజు వస్తుంది

ప్రభుత్వం కూడా ఇటువంటి విద్వేషకారులని కఠినంగా శిక్షించవల్సిన అవసరం ఉంది

నిజానికి గాన గంధర్వుడికి తెలంగాణాలో చిన్న విగ్రహం ఏర్పాటు చేయడమనేది చాలా చిన్న విషయం

ఆయన స్థాయికి తెలంగాణా ప్రభుత్వం స్వయంగా పూనుకుని స్మృతి వనం ఏర్పాటు చేస్తే దేశం మొత్తం అభినందిస్తుంది

సీఎం రేవంత్ రెడ్డి గారూ .. జర ఆ దిశగా ఆలోచన చెయ్యండి సార్
చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!