ఓటమి గెలుపుకి నాంది !
నర్తనశాలలో నటనకు గానూ అంతర్జాతీయ పురష్కారం అందుకున్న తోలి భారతీయ నటుడు ఎస్వీ రంగారావు మొదటి సినిమా ఫ్లాప్ అన్న సంగతి తెలుసా ?
ఎస్.. మొదటి సినిమా ఫ్లాప్ అవడంతో నిరాశ పడి ఆయన నటన నుంచి విరమించుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమ ఒక మహానటుడి విశ్వ రూపాన్ని చూసే అవకాశం అప్పుడే కోల్పోయేది కదా ?
చిన్నతనం నుంచి సినిమాలంటే తనకున్న ప్యాషనే ఎస్వీ రంగారావును వెండి తెరమీద మహానటుడిగా నిలిపింది అన్నది వాస్తవమే అయినా ఆ స్థాయికి చేరుకోవడానికి చేసిన కఠోర శ్రమే ఆయన అసలు విజయ రహస్యం
ఎస్వీ రంగారావు రాత్రికి రాత్రి సినీ స్టార్ అయిపోలేదు
ఆయన సినీ ప్రస్థానం వీధి నాటకాలతో ప్రారంభం అయ్యింది
చదువుకుంటున్న రోజుల్లోనే స్కూల్లో నాటకాలు వేసి బహుమతులు పొందాడు
చదువు పూర్తి అయిన తర్వాత ఆయనకు ఫైర్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది
పెద్దగా పని ఉండే జాబ్ కాకపోవడంతో ఖాళీ సమయాల్లో నాటకాలు వేసేవాడు
అయినా ఎస్వీఆర్ కు సంతృప్తి కలగలేదు
ఎప్పటికైనా సినిమాల్లో పెద్ద స్టార్ కావాలనేది ఆయన గోల్
అందుకే చక్కటి ఉద్యోగం అయినా కూడా రాజీనామా చేసి సినిమాల్లో అవకాశాల కోసం మద్రాస్ వెళ్ళాడు
1946 లో ఎస్వీఆర్ వరూధిని అనే సినిమాతో మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చాడు
కానీ ఆయన దురదృష్టం కొద్దీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది
దాంతో ఎస్వీఆర్ డైలమాలో పడ్డాడు
సినిమాల మీద మోజుతో అనవసరంగా బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకుని పొరపాటు చేసానా? అని మధనపడి జమ్షెడ్పూర్ లో టాటా సంస్థలో చిన్న ఉద్యోగంలో చేరారు
అయినా సినిమాల మీద ఆశ మాత్రం వదులుకోలేదు
సరిగ్గా ఇలాంటి సమయంలో ఎస్వీఆర్ కు మద్రాస్ నుంచి పిలుపొచ్చింది
దాంతో ఆయన మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు
ఆ తరవాత ఎస్వీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు
తెలుగు , కన్నడ , మలయాళం ,హిందీ భాషల్లో మూడొందలకు పైగా సినిమాల్లో నటించాడు
రావణుడు , ఘటోత్కచుడు , హిరణ్య కశ్యపుడు లాంటి పౌరాణిక పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించాడు
ఆరడుగుల ఆజానుబాహుడు ఎస్వీఆర్ పౌరాణిక పాత్రలో గదను పైకెత్తితే వెండితెర మీద పూల వర్షం కురిసేది
వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ ముఖంలో హావభావాలు పలికిస్తుంటే థియేటర్లలో ఈలలు మారుమోగిపోయేవి
ఉమ్మడి కుటుంబంలో పెద్దన్న పాత్రలో పంచె కట్టులో ఎస్వీఆర్ డైలాగులు చెప్తుంటే ప్రేక్షకుల హృదయాలు ఆర్ద్రతతో నిండిపోయేవి
అదీ ఇదీ అని కాదు ఎస్వీఆర్ అల్ రౌండర్
తనకిచ్చిన పాత్ర ఏదైనా కానీ అందులో నటించేవాడు కాదు .. జీవించేవాడు
అందుకే ఎస్వీఆర్ సినిమాల్లో ఆయన కనిపించడు .. పాత్రలే కన్పిస్తాయి
పాతాళభైరవి , మాయాబజార్ , నర్తనశాల ఇలా చెప్పుకుంటూ పొతే ఆయన నటించిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే
నర్తనశాలలో ఎస్వీఆర్ నటనకు రాష్ట్రపతి అవార్డ్ రావడమే కాదు తొలిసారి ఒక భారతీయుడికి నటనలో అంతర్జాతీయ పురష్కారం లభించింది
అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడి చేతిలో పురష్కారం అందుకుని మద్రాస్ వస్తే అసంఖ్యాక అభిమానులతో పటు ఎన్టీఆర్ , ఎంజీఆర్ వంటి అగ్ర నటులు విమానాశ్రయంలో ఎస్వీఆర్ కు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు
ఎస్వీ రంగారావు గురించి దాసరి నారాయణ రావు చెప్తూ ‘ నాకు ఆయన దేవుడి లాంటి వాడు .. ఆయన లేకపోతే తాత మనవడు సినిమా లేదు ‘ అన్నారు
కిరాయి రౌడీలు లాంటి సినిమాల్లో చేసిన నటులకు కూడా పద్మశ్రీలు , పద్మభూషణ్ లు ఇచ్చిన ప్రభుత్వం ఎందుకో ఎస్వీ రంగారావుకు గొప్ప అవార్డులేమీ ఇవ్వలేదు
సరిగ్గా ఇదే రోజు 1918 జులై 3 న ఏపీలోని కృష్ణాజిల్లా న్యూజివీడులో జన్మించిన ఎస్వీ రంగారావు చిన్నవయసులోనే (56) 1974 లో గుండెపోటుతో మరణించారు
ఈరోజు మహానటుడు ఎస్వీ రంగారావు జయంతి సందర్భంగా నివాళులు !
పరేష్ తుర్లపాటి