హీరోలకు రెమ్యునరేషన్ ఎంతైనా ఓకే .. లైట్ బాయ్స్ కి మాత్రం అంతే !

Spread the love

హీరోలకు రెమ్యునరేషన్ ఎంతైనా ఓకే .. లైట్ బాయ్స్ కి మాత్రం అంతే !

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మె సెగ వేడి పుట్టిస్తుంది

తమకు ముప్పై శాతం వేతనాలు పెంచాలని తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు నిన్నటినుంచి సమ్మె చేస్తున్నారు

మరోపక్క వారు డిమాండ్ చేస్తున్న ముప్పై శాతం ఎట్టిపరిస్థితుల్లో పెంచేది లేదని నిర్మాతల మండలి తెగేసి చెప్పేసింది

ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ కార్మికులు నిన్నటినుంచి షూటింగులకు హాజరు కాకుండా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు

దీంతో మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ ముంబై నుంచి ప్రత్యేకంగా సినీ కార్మికులను రప్పించి అన్నపూర్ణా స్టూడియోలో షూటింగ్ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగించారు

ఈ ఘటనతో ఇరువర్గాల్లో పంతాలు , పట్టింపులు పెరిగిపోయాయి

తమ సమ్మెను ఉదృతం చేసేందుకు కార్మిక సంఘాలు ఈరోజు తెలంగాణా లేబర్ కమిషనర్ ను కలిసి సమ్మె నోటీసు ఇచ్చి చట్టబద్ధ పోరాటం చేయాలనీ నిర్ణయించుకున్నారు

మరోపక్క నిర్మాతల మండలి స్పందిస్తూ ఇప్పటికే కార్మికులకు సాఫ్ట్ వేర్ జాబ్ లతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని , కావాలంటే ఇంకో ఐదు శాతం పెంచటానికి సుముఖంగా ఉన్నామని చెప్పారు

ఆలా చెప్తూనే వారు ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా దృష్టి సారించారు

నైపుణ్యం ఉన్న కార్మికులు యూనియన్ లో సభ్యత్వం లేకపోయినా నేరుగా ఛాంబర్ కు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ విడుదల చేసారు

ఇప్పుడు ఇరువర్గాల వాదనలపై చిన్న విశ్లేషణ చేసుకుందాం

చిత్ర పరిశ్రమ లో నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం హీరోల రెమ్యునరేషన్ భారీగా పెరగడమే

థియేటర్ల కొరత ఒకవైపు , పైరసీ బెడద మరోవైపు చిత్ర పరిశ్రమను కుంటుపడేలా చేస్తున్న తరుణంలో సహజంగా పెట్టుబడి పెట్టే నిర్మాతలు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పద్దతులను ఎంచుకుంటారు

కేవలం హీరోలకున్న ఇమేజ్ బట్టి బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టిన సినిమాలు ఉన్నాయి

ప్రస్తుతం వంద రోజులు ఆడే సినిమాలు ఎటూ లేవు

మొదటివారం కలెక్షన్లతోనే లాభాలు రాబట్టుకోవాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు

అందుకే సినిమా టాక్ ఎఫెక్ట్ వసూళ్ల మీద పడకముందే టికెట్ల రేట్ల పెంపుదలకు ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకుని తమ పెట్టుబడులకు బ్రేక్ ఈవెన్ తెచ్చుకునో .. లాభాలు తెచ్చుకునో బయటపడిపోతున్నారు

అలా మొదటివారం కలెక్షన్ రాబట్టుకోవాలంటే హీరో ఇమేజ్ ముఖ్యం

అందుకే హీరోల రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు కాదనకుండా అడిగినంత సమర్పించుకుంటున్నారు

ఒక పెద్ద హీరోతో మూడొందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీసే నిర్మాత షుమారు రెండొందల కోట్లు హీరోకే సమర్పించుకోవాల్సి వస్తుంది

హీరోలతో పోలిస్తే మిగిలిన క్రాఫ్ట్స్ వారికి నిర్మాతలు ఇచ్చేది చాలా తక్కువ

పెద్ద హీరోలకిచ్చే రెమ్యూనరేషన్లో పది శాతం కోత బెట్టినా కార్మికులకు ముప్పై శాతం వేతనాలు అదనంగా ఇవ్వడం నిర్మాతలకు పెద్ద కష్టమైన పనికాదు

హరిహర వీరమల్లు సినిమాకి పవన్ కళ్యాణ్ కు రెండొందల కోట్లకు పై చిలుకు రెమ్యునరేషన్ ఇచ్చారని వార్తలు వచ్చాయి

చిరంజీవి , అల్లు అర్జున్ , ప్రభాస్ ,మహేష్ బాబు తదితరుల రెమ్యునరేషన్లు కూడా భారీగానే ఉన్నాయి

అలాగే కూలీ సినిమాకి రజనీకాంత్ కు 253 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంది

సినిమా బడ్జెట్లో మూడొంతులు హీరోల రెమ్యునరేషన్ కే పోగా మిగిలిన పావు వంతుల్లోనే అందరికీ సర్దుబాటు చేయాల్సి వస్తుంది

హీరోలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే చిత్ర పరిశ్రమ కార్మికులను ఆదుకోవడం పెద్ద కష్టమైన విషయమే కాదు

పరిశ్రమ బతకాలి అని సినిమా ఫంక్షన్లలో ఉపన్యాసాలు ఇచ్చే హీరోలు ఈ విషయం ఆలోచించాలి

అయితే అదే సమయంలో కార్మికులకు ముప్పై శాతం వేతనాల పెంపుదల అనే డిమాండ్ చిన్న నిర్మాతల మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయి

నిజానికి పెద్ద హీరోల సినిమాలతో పోలిస్తే చిన్న హీరోలతో తీసే సినిమాలే ఎక్కువగా షూటింగులు జరుపుకుంటాయి

పెద్ద హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి రెండుకు మించి ఉండటం లేదు

కానీ ఏడాది పొడవునా కార్మికులకు పని కల్పించేది చిన్న నిర్మాతల సినిమాలే

లో బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలు కార్మికులకు 30 శాతం వేతనాలు అదనంగా ఇచ్చే పరిస్థితుల్లో ఉండరు

కాబట్టి కార్మికులు చిన్న నిర్మాతల విషయంలో తమ వేతనాల విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వాల్సిన అవసరం ఉంది

కార్మికుల వేతనాల విషయంలో చిన్న నిర్మాతలను , పెద్ద నిర్మాతలను ఒకే గాటన కట్టలేము

పెద్ద నిర్మాత తల్చుకుంటే హీరో రెమ్యూనరేషన్లో కోత బెట్టి కార్మికులకు అధిక వేతనాలు ఇవ్వగలడు
కానీ చిన్న నిర్మాతలకు అది సాధ్యం కాదు

ముగింపు : చిత్ర పరిశ్రమ కార్మికుల సమస్యల విషయంలో పెద్దన్న పాత్ర పోషించే దాసరి లేని లోటు సృష్టంగా కనిపిస్తుంది.. దాసరి తర్వాత చిత్ర పరిశ్రమ సమస్యలపై స్పందిస్తున్న చిరంజీవి ఈ సమ్మె విషయంలో మధ్యవర్తితం వహించి సమస్య పరిష్కరిస్తారేమో చూడాలి !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!