Home » సీరియల్ కిల్లర్స్ కేసులో పోలీసులకు క్లూ దొరికిందా ? – తడయం మూవీ రివ్యూ

సీరియల్ కిల్లర్స్ కేసులో పోలీసులకు క్లూ దొరికిందా ? – తడయం మూవీ రివ్యూ

Spread the love

తడయం అంటే తెలుగులో క్లూ అని అర్ధం
అపరాధ పరిశోధనలో ఈ క్లూ అనేది అత్యంత ముఖ్యమైనది

పోలీసులకు ఏ మాత్రం చిన్న క్లూ దొరికినా చాలు నేరస్తులను పట్టుకోవడానికి మార్గం దొరికినట్టే

అందుకే పోలీసులు ,ఫోరెన్సిక్ నిపుణులు , క్లూస్ టీమ్ నేర స్థలంలో ఈ క్లూస్ కోసమే గాలిస్తాయి

సముద్రఖని నటించిన తడయం వెబ్ సిరీస్ కి ఆ పేరు పెట్టడం వెనుక చట్టానికి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న సీరియల్ కిల్లర్స్ ని పట్టుకోవడానికి పోలీసులు క్లూల కోసం వెతకడం కారణం అయ్యుంటుంది

సీరియల్ హత్యలు , పోలీసుల ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు ,వెబ్ సిరీస్ లు వచ్చాయి
ఆ జాబితాలో ఇప్పుడు తడయం కూడా చేరింది

అయితే ఓటిటీ ప్లాట్ ఫార్మ్ లో తడయం కు మంచి రేటింగ్ వచ్చింది
జీ 5 లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో తమిళ డబ్బింగ్ వెర్షన్లో అందుబాటులో ఉంది

డైరెక్ట్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేకపోయినా తెలుగు ప్రేక్షకుల్లో కూడా తడయం వెబ్ సిరీస్ మంచి రేటింగ్ పొందుతుంది

అసలుకు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి ఏ భాషలో అయినా సరే మంచి ఆదరణ ఉంటుంది

ఈ జానర్లో దక్షిణాదిలో తెలుగు , తమిళ , మళయాళం మూవీలు ఎక్కువగా పోటీ పడుతున్నాయి

దానికితోడు క్రైమ్ థ్రిల్లర్ జానర్లో డైరెక్ట్ మూవీలకన్నా వెబ్ సిరీస్ లు మంచి రేటింగులు సాధిస్తున్నాయి

సిరీస్ ఎపిసోడ్స్ వారీగా ఉండటం , ప్రతి ఎపిసోడ్ చివరలో తరువాతి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా చూసేలా సన్నివేశాలు ఉండటం లాంటివి వెబ్ సిరీస్ లు ఆదరణ పొందటానికి కారణాలు

ఇప్పుడు తడయం కధేంటో చూద్దాం

అధియామాన్ ( సముద్రఖని ) ఆంధ్రా సరిహద్దులో తమిళనాడులోని ఓ పోలీస్ స్టేషన్లో ఎస్సై గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు

డిపార్ట్మెంట్లో మంచి తెలివైన ఆఫీసర్ గా ఇతడికి పేరుంటుంది

కానీ 20 ఏళ్ళ సర్వీసులో ఇతడు ఎస్సైగానే మిగిలిపోగా , ఇతడితో పాటు ఎస్సైగా జాయిన్ అయిన వ్యక్తి డిఎస్పీ స్థాయికి ఎదుగుతాడు

తాను ఛేదించిన కేసుల తాలూకూ క్రెడిట్స్ కోసం వెంపర్లాడకపోవడం , విధి నిర్వహణలో ఉదాసీనంగా ఉండటం అందుకు కారణాలు

అధియామాన్ సాయంత్రం వేళల్లో ఇంటిదగ్గర చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం హాబీగా పెట్టుకుంటాడు

అందుకే పోలీస్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి పిల్లలకు పాఠాలు చెప్పాలని నిర్ణయించుకుని విఆర్ఎస్ కు కూడా అప్లై చేస్తాడు

ఇదే సమయంలో ఆ స్టేషన్లో ఎస్సై లక్ష్మి (శివద) జాయిన్ అవుతుంది

సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఊళ్ళో జంట హత్యలు జరుగుతాయి

హంతకులు భార్యా భర్తలను దారుణంగా హత్య చేసి ఇంట్లో బంగారం ,డబ్బుల జోలికి పోకుండా కేవలం ఆడవారి మెళ్ళో మంగళ సూత్రాలను , మగవారి మొలతాడును మాత్రమే తెంపుకుపోతారు

ఇదే తరహాలో ఇంకో మూడు హత్యలు కూడా జరగడంతో ఇన్స్పెక్టర్ లక్ష్మి , ఎస్సై అధియామాన్ లు సీరియల్ కిల్లర్స్ ను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతారు

వీరి ఇన్వెస్టిగేషన్ లో సీరియల్ కిల్లర్స్ కు సంబంధించిన క్లూలు ఏమైనా దొరుకుతాయా ?

సీరియల్ కిల్లర్స్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు ?

అసలు ఈ సీరియల్ కిల్లర్స్ ఎవరు ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

తడయం వెబ్ సిరీస్ మీద ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ నడుస్తుంది . 2026 లోనే అత్యుత్తమ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అని రివ్యూలు ,రేటింగులు వస్తున్నాయి

నిజానికి ఈ సిరీస్ లో అంత విషయం ఉందా అని నిశితంగా సమీక్షిస్తే లేదనే జవాబు వస్తుంది

క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఇంతకన్నా చక్కటి గ్రిప్పింగ్ తో , అడుగడుగునా అదిరేటి ట్విస్టులతో గతంలో చాలా సినిమాలు ,సిరీస్ లు వచ్చాయి

ఒక్కొక్క ఎపిసోడ్ షుమారు 20 నుంచి 29 నిమిషాలపాటు సాగుతుంది
నిడివి తక్కువే కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు
అలా ఆరు ఎపిసోడ్లు చూస్తే సీజన్ వన్ అయిపోతుంది

ఇక ఈ సిరీస్ విషయానికి వస్తే మొదటి నాలుగు ఎపిసోడ్లు సాదాసీదాగా సాగిపోతాయి

పెద్దగా మెరుపులు ,ట్విస్టులు ,థ్రిల్లులు ,వావ్ అనుకోవడాలూ ,టెన్షన్తో గోళ్లు కొరుక్కోవడాలూ ఏమీ ఉండవు

తెలుగు టీవీ సీరియల్ మాదిరి ఒక పోలీస్ స్టేషన్ ,అందులో మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే ఎస్సై ఇలా రొటీన్ గా సాగిపోతుంది

కథాకాలం 1990 ల నాటిది అని చెప్పారు కాబట్టి ఆ కాలానికి సరిపడా నేటివిటీని మాత్రం బాగానే చూపించారు

అత్యంత క్లిష్టమైన కేసులను కూడా గంటల్లోనే ఛేదించగల పోలీస్ ఆఫీసర్ గా పేరున్న అధియామాన్ 20 ఏళ్ళైనా ఎస్సైగా మిగిలిపోవడం లాజిక్ గా అనిపించదు
బహుశా సర్వీస్ రూల్స్ ఇతడికి వర్తించకూడదని దర్శకుడి రూల్ అయ్యుంటుంది

పైగా మధ్యలో ఆ లేడీ ఎస్సై లవ్ స్టోరీ ట్రాక్ ఎందుకో తెలీదు

అదీకాకుండా హంతకులు ఎవరో మనకి ముందే తెలిసిపోవడంతో కథనంలోని గాఢత తగ్గిపోయింది

ఇద్దరు హంతకులు ఆంధ్రా తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో వరుసపెట్టి 72 హత్యలకు పైనా చేసినా పోలీసులకు క్లూ దొరకకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది

పైగా ఈ హంతకులు అనుమానాస్పదంగా పోలీసుల మధ్యలోనే తిరుగుతున్నా కనీసం అనుమానపడకపోవడం డిపార్టుమెంటుకు ఏమీ తెలీదు అనుకోవాలనేమో ?

అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసులు ,గ్రామస్తులు రాత్రి వేళ కాగడాలు పట్టుకుని హంతకుల కోసం గ్రామంలో కాపలా కాస్తుంటే కిల్లర్స్ తాపీగా బీడీలు కాల్చుకుంటూ ,లుంగీలు సర్దుకుంటూ ఇంకో మర్డర్ చేసి ముసుగులేసుకుని చెరో కాగడా పట్టుకుని పోలీసుల వెనుకే తిరుగుతారు

గ్రామస్తులు ఎవరూ ముసుగులు వేసుకోరు , వీళ్లిద్దరు తప్ప
అప్పుడైనా ఎస్సైకి అనుమానం రావాలి కదా ?

పైగా మీరు కూడా పోయి ఊళ్లో వెతకండి అని హంతకులతోనే విసుక్కుంటుంది

చదువుసంధ్యలు అసలే లేని ఇద్దరు మొద్దబ్బాయిలు వరుస పెట్టి 72 కు పైగా మర్దర్లు చేస్కుంటూ పోతున్నా తడయం ..అదే క్లూస్ కోసం పోలీసులు జుట్టు పీక్కోవడం , మొత్తమ్మీద అధియామాన్ ఒక్కడే తెలివైనవాడు అన్నట్టు చూపించడం కొద్దిగా ఎక్కువైంది

ఐదు ,ఆరు ఎపిసోడ్లు మాత్రం కాస్త క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి అనుకున్నంతలోనే దర్శకుడు ముగింపులో మళ్ళీ తడబడ్డాడు

తనదగ్గర క్లూ ఉంచుకుని కూడా అధియామాన్ నిస్సహాయంగా మిగిలిపోవడం చాలామందికి రుచించదు

చేతిలో ఉన్న క్లూ సహాయంతో సీరియల్ కిల్లర్లను నేరుగా కోర్టుకు అప్పగించి అసలు దోషులకు కూడా శిక్ష పడేలా అధియామాన్ చేసి ఉంటే కథ ఇంకోలా ఉండేది

కాకపోతే సీజన్ 2 కోసం దర్శకుడు తనదగ్గర కొంత ముడి సరుకును దాచుకున్నట్టున్నాడు

ఎవరెలా చేసారు ?

కధనంలో లోపాల సంగతి అలా ఉంచితే తడయం ని సముద్రఖని తన భుజాల మీద వేసుకుని నడిపించాడు

ఖాకీ యూనిఫార్మ్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు
ఎక్కడా ఎమోషన్ అవకుండా అదొకరకమైన మానరిజంతో ఆకట్టుకున్నాడు

ఇక ఇన్స్పెక్టర్ లక్ష్మి పాత్ర పోషించిన శివద నటన క్యూట్ గా ఉంది
ఆ పోలీస్ స్టేషన్లో ఈమె ఒక్కతే అందంగా కనిపించడం ప్రేక్షకులకు బిగ్ రిలీఫ్
లేడీ ఎస్సై పాత్రలో నప్పింది

సాంకేతికత

నేపధ్య సంగీతం బాగానే ఉంది
సినిమాటోగ్రఫీ కి ఇంకా స్కోప్ ఉంది
అయినప్పటికీ పర్లేదు
నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి

విశ్లేషణ

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాబట్టి అతిగా ఊహించుకుని చూస్తే డిజప్పాయింట్ అవుతాము. ఏ ఎక్సపెక్టేషన్లు లేకుండా సరదాగా చూస్తే పర్లేదు అనిపిస్తుంది . నిజానికి సిరీస్ ఇంకొంచం గ్రిప్పింగ్ గా తీసి ఉండాల్సింది .అదలా ఉంచితే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు అంటే ఫ్యామిలీతో చూడటానికి సంకోచిస్తాము . కానీ ఇందులో అసభ్యత ,అశ్లీలతలు లేవు కాబట్టి ఇంట్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడొచ్చు . కాకపోతే తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేదు . ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో తమిళంలో చూడాలి

నటీనటులు : సముద్రఖని , శివద తదితరులు
దర్శకత్వం : నవీన్ కుమార్ పళనివేల్
విడుదల : జీ 5 ఓటిటీ
రేటింగ్ : 2.5 /5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!