ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ మరియు జాకీర్ హుస్సేన్ నటించిన ది తాజ్ స్టోరీ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది
ఈ సినిమా విడుదలను రద్దు చేసి బ్యాన్ చేయాలని ఇప్పటికే హైకోర్టులో రెండు అత్యవసర ప్రజా ప్రయోజన వాజ్యాలు ( పిల్స్) దాఖలు అయ్యాయి
అయితే బుధవారం ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాజ్యాలను అత్యవసరంగా విచారించటానికి నిరాకరించింది
తాజాగా ఈ వివాదంపై ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు పరేష్ రావల్ వివరణ ఇచ్చారు
ది తాజ్ స్టోరీ కథను దర్శకుడు తుషార్ గతంలో జరిగిన సంఘటనల యొక్క చారిత్రక నేపధ్యం పరిశీలించిన తర్వాతనే రాసుకున్నారని చెప్పారు
చరిత్ర ఆధారంగానే సినిమాలో కధనం ఉంటుందని , ఎక్కడా హిందూ – ముస్లిం విద్వేషాలను రెచ్చగొట్టే సన్నివేశాలు ఉండవని చెప్పారు
దర్శకుడే కాదు మేము కూడా ఒక బృందంగా ఏర్పడి వాస్తవ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకున్న తరవాతనే సినిమాకి సైన్ చేశామని చెప్పారు
ఈ సినిమాలో సంఘర్షణకు బదులు హిందూ – ముస్లిం భాగస్వామ్య చరిత్రను మాత్రమే ప్రస్తావించడం జరిగిందని పరేష్ రావల్ అన్నారు
ఇందుకు సాక్ష్యంగా ఈ సినిమాలో ఓ సన్నివేశం గురించి కూడా చెప్పారు
సినిమాలో ఓ పాత్ర ” ఇక్కడ హిందూ – ముస్లింలు సోదరులు .. వారిని విడగొట్టి విభజించేది మీరే ” అని జర్నలిస్టుని ఉద్దేశించి అంటుంది
ఈ సన్నివేశం హిందూ – ముస్లిం ఐక్యత చాటే విధంగా ఉంటుందే కానీ సంఘర్షణలను పెంచే విధంగా ఉండదు అని అయన అన్నారు
సినిమాలోనే మరో సన్నివేశంలో తాజ్ మహల్ గురించి వచ్చిన ప్రస్తావనలో ఒక పాత్ర దాన్ని పడగొట్టమని చెప్తుంది
కానీ వెంటనే రెండో పాత్ర” లేదు సోదరా .. మనం నాశనం చేసేవాళ్ళం కాదు .. ఆ కట్టడానికి చిన్న గీత కూడా పడనివ్వొద్దు .. సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుందాం ” అని చెప్తుంది అన్నారు
ఈ సినిమాలో వాస్తవిక చరిత్ర ఆధారంగా సన్నివేశాలు తెరకెక్కించారని , అద్భుతమైన కట్టడం తాజ్ మహల్ నిర్మించడం వెనుక అసలు కథ ఏంటి ? షాజహాన్ గురించి చరిత్రకారులు చెప్పిన విషయాలు ఏంటి ?
ఇంత అద్భుతమైన కట్టడం వెనుక మరుగునపడిపోయిన కొన్ని నిజాలు కూడా ఉన్నాయి .. అవి ఏంటి ? అసలు చరిత్ర ఏంటి ? అనే విషయాలు ఈ సినిమా ది తాజ్ స్టోరీ ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేశామని అయన అన్నారు
ఇలా ఉండగా సినిమాని నిషేదించాలని వేసిన పిల్స్ పూర్తిగా దురుద్దేశ్యంతో కూడుకున్నదని అయన చెప్పారు
ఇప్పటికే ఈ సినిమాకి సీబీఎఫ్సీ సర్టిఫికెట్ కూడా వచ్చిందని , నిజంగా అభ్యంతకర సన్నివేశాలు ఉంటే ఆ సర్టిఫికెట్ రాదు కదా అని అయన చెప్పారు
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రారంభం నుంచి వివాదాల్లో నడుస్తూనే ఉంది
షాజహాన్ నిర్మించాడని చెప్తున్న తాజ్ మహల్ కట్టడంలో నిజానికి గతంలో తేజోమహాలయ అనే హిందూ దేవాలయం ఉండేదని హిందూ సంఘాలు వాదించాయి
తాజ్ మహల్ నిర్మాణం వెనుక అసలు చరిత్ర ఏంటో ప్రపంచానికి తెలియాలని కోరుకుంటూ కొన్ని సంఘాలు నాయస్థానాల్లో పిటిషన్లు వేయగా , మరికొన్ని సంఘాలు ఆందోళనలు చేసాయి
ఇన్ని వివాదాల నేపథ్యంలో ది తాజ్ స్టోరీ సినిమా ప్రారంభం అయ్యింది
తుషార్ అమ్రిష్ గోయల్ దర్శకత్వం వహించిన ది తాజ్ స్టోరీ లో పరేష్ రావల్ మరియు జాకీర్ హుస్సేన్ ప్రధాన పాత్రలు పోషించారు
భారతదేశ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం ప్రధాన ఇతివృత్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31 న థియేటర్లలో రిలీజ్ అవుతుంది !
