అదేంటో ఈ మళయాళం వాళ్ళు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు భలే తీస్తారు. కేవలం 28 కోట్లు ఖర్చు పెట్టి తీసిన తుడరుమ్ సినిమా ఇప్పటివరకు 230 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది
ఇక తుడరుం కథ విషయానికి వస్తే రొటీన్ క్రైమ్ థ్రిల్లరే కానీ చూసే ప్రేక్షకులకు రెండున్నర గంటల పాటు ఉత్కంఠత కలిగించే విధంగా వెండి తెర మీద ఆవిష్కరించిన దర్శకుడి ప్రతిభకు పూర్తి మార్కులు పడతాయి
కథ మొత్తం టాక్సీ డ్రైవర్ షణ్ముగం అలియాస్ బెంజ్ ( మోహన్ లాల్ ) , అతడి భార్య లలిత ( శోభన) ఇద్దరు పిల్లలు, SI బెన్నీ ( బిను పప్పు) అండ్ CI జార్జ్ (ప్రకాష్ వర్మ ) దాదాపు ఈ పాత్రల చుట్టూనే తిరుగుతుంది
సినిమా ప్రారంభంలో టాక్సీ నడుపుకుంటున్న బెంజ్ అతడి భార్య లలిత.. ఇద్దరు పిల్లలను చూసి ఇదేదో కుటుంబ కథా చిత్రం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే పోలీసులు బెంజ్ కారును సీజ్ చేస్తారో అప్పట్నుంచి క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఎంటర్ అవుతుంది
బెంజ్ కి తన కారు అంటే ప్రాణం. అలాంటిది ఓ రోజు అనుకోకుండా పోలీసులు గంజాయి కేసులో అతడి కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. తన కారును విడిపించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటాడు బెంజ్. కానీ SI బెన్నీ ఆ కారును తిరిగివ్వడానికి ససేమిరా అంటాడు. చివరికి బెంజ్ CI జార్జ్ ను బతిమాలుకుంటే అడవిలో జరిగే జాతరకు తమను కారులో తీసుకెళ్లాలని కండిషన్ పెట్టి కారు కీస్ ఇస్తాడు . ఎలాగైతేనేమి తన కారు దక్కిందని బెంజ్ ఆ షరతుకు ఒప్పుకుని పోలీసులను అడవిలోకి తీసుకెళ్తాడు.. అక్కడ బెంజ్ ఊహించని సన్నివేశం ఎదురౌతుంది. తన కారు డిక్కీలోనుంచి శవాన్ని అడవిలోకి తీసుకెళ్లడం చూస్తాడు బెంజ్
సరే ఎలాగోలా ఇంటికి చేరుకున్న బెంజ్ కి కొడుకు మిస్సయాడనే వార్త తెలుస్తుంది. దీంతో బెంజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కానీ తన కొడుకు విషయంలో పోలీసులే హంతకులని బెంజ్ కు అప్పటివరకు తెలీదు. తన కూతురిని ప్రేమించాడని పగ పెంచుకున్న CI బెంజ్ కొడుకుని స్టేషన్లోనే చంపేస్తాడు..ఒకరకంగా ఇది చాలా సినిమాల్లో మనం చూసిన పరువు హత్యే. ఈ క్రమంలో తన కొడుకును చంపడంలో SI, CI ల పాత్ర ఉందని తెలుసుకుని వాళ్ళని మట్టు బెట్టడానికి వేట మొదలు పెడతాడు .. చివరికి వాళ్ళిద్దర్నీ బెంజ్ చంపడంతో కథ ముగుస్తుంది
ఇక పాత్రల విషయానికి వస్తే 65 ఏళ్ల మోహన్ లాల్ షణ్ముగం అలియాస్ బెంజ్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. అతడి భార్యగా నాట్య కళాకారిణి శోభన కూడా చక్కటి నటన ప్రదర్శించింది.. ఇక విలన్ల గురించి చెప్పాలంటే ముఖంలో క్రూరత్వం ఎవరైనా పలికిస్తారు. కానీ నవ్వుతూ క్రూరత్వం పలికించేవారు అరుదుగా ఉంటారు. ఈ సినిమాలో జార్జ్ పాత్ర వేసిన ప్రకాష్ వర్మ అటువంటి క్రూరత్వాన్ని ప్రదర్శించి విలన్ గా పూర్తి మార్కులు కొట్టేశారు
తుడరుమ్ కథను ఆద్యంతం ఉత్కంఠత కలిగించేలా మలచడంలో దర్శకుడు తరుణ్ మూర్తి విజయం సాధించారు. కాకపోతే కొన్ని సన్నివేశాలు చూస్తుంటే దృశ్యం కు సీక్వెల్ చూస్తున్నామా అనిపిస్తుంది
ఓవరాల్ గా సస్పెన్స్.. క్రైమ్.. థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవాళ్ళు తుడరుమ్ చూడండి!
Rating 3.5/5
పరేష్ తుర్లపాటి ✍️