హైద్రాబాద్ల అన్ని ఫ్లయివర్లు మస్తుంటయ్ .. ఆ ఒక్కటి తక్క !
దక్షిణాది రాష్ట్రాల రాజధానుల్లో తెలంగాణా రాజధాని హైదరాబాద్ రోజు రోజుకీ అభివృద్ధిపథంలో దూసుకుపోతుంది
జంటనగరాల సరసన సైబరాబాద్ చేరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచింది
తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ ప్రకటనతో ప్రపంచ పెట్టుబడిదారుల చూపులు హైద్రాబాద్ మీద పడుతున్నాయ్
బడ్జెట్ లో హైద్రాబాదు వరకే పది వేల కోట్లు కేటాయించడంతో మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ ముందంజలో ఉంటుంది
అంతా బానే ఉంది కానీ ,
పంటికింది రాయిలా హైదరాబాద్ కీర్తి కిరీటంలో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ రూపంలో చిన్న అపశృతి కనిపిస్తుంది
హైదరాబాద్ సిటీలోకి వచ్చే అన్ని రహదారులు ఒకెత్తు
వరంగల్ హైవే నుంచి ఉప్పల్ మీదుగా సిటీలోకి వచ్చే రహదారి మరొకెత్తు
2017 లో మొదలుపెట్టిన ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడక నడవటంతో ఈ రహదారి నిర్మాణం అస్తవ్యస్తం అయ్యింది
నిర్మాణ సంస్థ కేవలం ఫ్లై ఓవర్ పిల్లర్లు మాత్రమే వేసి అసంపూర్తిగా వదిలేసారు
దానితో ఈ దారిలో వెళ్లే వాహనదారులకు పగలే చుక్కలు కనిపిస్తాయి
ఆదమరిస్తే వాహనం ఏ గోతిలో పడుతుందో తెలీదు
దీనికి తోడు విపరీతమైన దుమ్ము, ధూళి ,పొగ కాలుష్యం ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడేవారు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు యాదాద్రి వెళ్లాలన్నా , స్వర్ణగిరి వెళ్లాలన్నా ఈ దారినుంచే వెళ్ళాలి
దానితో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ప్రయాణం కుంటి నడక నడిచేది
ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలనీ గతంలో ఉప్పల్ కాలనీ వాసుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేసాయి
ఆ మధ్య కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు వెంటనే పూర్తి కావడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు
ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డితో కలిసి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పర్యవేక్షించారు
ఈ సందర్భంగా మంత్రి ఉప్పల్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు
వచ్చే దసరా నాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు
గతంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టిన గాయత్రీ నిర్మాణ సంస్థ అర్దాంతరంగా ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో వేరొక సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పామనీ .. దసరా నాటికి పనులు పూర్తి అవుతాయని ఆయన చెప్పారు
ఏదిఏమైనా ఇప్పటికైనా మంత్రి మాటలు ఫలించి దసరా నాటికి పనులు పూర్తయితే ఉప్పల్ వాసుల కస్టాలు తీరినట్టే !
పరేష్ తుర్లపాటి