‘వాణిశ్రీ ఎవరో జర్నలిస్ట్ ని చెప్పుతో కొట్టిందట!’

Spread the love

అసమాన నటి వాణిశ్రీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో ..

‘వాణిశ్రీ ఎవరో జర్నలిస్ట్ ని చెప్పుతో కొట్టిందట!’

క్షణాల్లో వార్త ఊరంతా పాకిపోయింది
ఆరోజు ఆనాటి మద్రాస్ నగరం అట్టుడికిపోయింది

స్టూడియోలన్నీ మూసుకు పోయాయి.

సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ
ఏం జరిగింది? … ఏం జరిగింది ??

నగరమంతా విభ్రాంతి!!!

ఇంత కాఫీ ఇచ్చి నవ్వుతూ మాట్లాడితే ఎంత పనయినా చేసి పెట్టే మా అక్కా వాళ్ల పనమ్మాయి అర్జెంట్ గా ఆ విషయం మోసుకొచ్చింది.

ఇంకా అప్పటికి హబీబుల్లా రోడ్డులో ఇల్లు కట్టుకోని మా అక్కావాళ్ళు నుంగంబాకం లోని తిరుమూర్తి నగర్ లో అద్దెకుండేవాళ్ళు.

ఎదురుగా ఇప్పుడు హాస్పిటల్ గా మారిన జెమిని గణేషన్ ఇల్లు ఉండేది.

సెలవులోస్తే అక్కా వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో చెన్నై చాలా అందం గా ఉండేది. విశాలమైన మౌంట్ రోడ్డు, ఎర్రె ర్రెని గోపురాలతో సెంట్రల్ స్టేషన్ అలానే స్పెన్సర్ బిల్డింగ్, మూర్ మార్కెట్… ముఖ్యం గా సినీతారాలు అక్కడే ఉంటారని … వాళ్ళని చూడాలని మాకు యమసరదా!

“అయ్యో, అలా చేసిందేమిటి ?.. అప్పుడే సినిమాల్లో పైకొస్తూ…..? అని అందరూ కంగారుగా ఆలోచిస్తున్న వేళ వాణిశ్రీ మాత్రం ఆదరలేదు… బెదరలేదు.

ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్న నెపం తో ఆమె వంటి రంగుని అపహాస్యం చేసేడా జర్నలిస్ట్!

అంతే.. ఆమె వళ్లుమండి వేసుకున్న హై హీల్ చెప్పు తీసి చెంపవాయగొట్టింది.

అదీ ఆమె ఆత్మ గౌరవం!

అందరూ అనుకొన్నట్లుగా ఆమె కెరీర్ కి ఏ భంగమూ ఏర్పడలేదు.

మా వీధి వెనుక వున్న వీరభద్రయ్య వీధిలో ఉండేవారామె . మేము అలా వాకింగ్ వెళ్తూ ఆమె కనపడతారేమో నని ఇంట్లోకి తొంగి చూసేవాళ్ళం.

అంతలో వారి అక్క కాంతమ్మ గారితో స్నేహం, తర్వాత వాణిశ్రీ గారితో చకచకా జరిగిపోయాయి.

ఒకసారి ఆమె మమ్మల్ని ఒక సినిమా షూటింగ్ కి తీసుకెళ్లారు.

అక్కడ కొన్ని సీన్స్ ఎస్వీఅర్, వాణిశ్రీలతో తీశారు. తర్వాత ఏయన్నార్ వచ్చారు.

షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఆమె డేట్స్ కోసం వచ్చారు.

ఆమె అతని మొహం చూడలేదు. పలకరించలేదు.

అతను పక్కకి వస్తే తనువెళ్లి మరోచోట కూర్చుని ఏడిపించింది.

తర్వాత కాంతమ్మగారు చెప్పారు. అతని సినిమాలో చిన్న వేషం అడిగితే ” నీకు వేషం ఇస్తే నా స్టూడియోలో ఉన్న మేకప్ డబ్బాలాన్నీ నీకే సరిపోతాయి “అని గతంలో హేళన చేసేడట సదరు ప్రొడ్యూసర్.

తర్వాత బ్లాంక్ చెక్ ఇచ్చి ఆమెను ప్రసన్నం చేసుకుని ఎన్నో ఘనవిజయం సాధించిన సినిమాలు తీసారాయన .

అదీ వాణిశ్రీ పౌరుషం!

ఎన్టీఆర్, ఏయన్నార్ కి Rs. 25000/- ఇస్తున్నప్పుడు ఆమె రెమ్యూనరేషన్ అక్షరాలాRs. 50,000/-అని తెలిసి ఆశ్చర్యపోయాను.

అదీ ఆమె స్థామినా!

ఛాయ తక్కువ కాబట్టి  మేకప్ కి ఎక్కువ టైం తీసుకునేవారు.  వాచకం లోనూ, నటనలోనూ   స్టయిల్ లోనూ  ఎంతో శ్రద్ధ కనబరచి    ఆమె  ఫాషన్  ఐకాన్ అయ్యారు.

అంతటి అద్భుతమైన నటికి మనవారు ఒక్క నందిని బహూకరించ లేకపోవడం మన తెలుగువారి ప్రత్యేకత!

పరపతి తో పంచుకునే అవార్డులు రాకపోతేనే ఈనాడు గౌరవమేమో… లేక ఆమె అసమాన ప్రతిభని కొలిచే అవార్డ్ లేదేమో మరి!

తమిళప్రభుత్వం, ప్రజలు ఆమెను ఓన్ చేసుకుని గౌరవించారు.

ఇటీవల ఎవరో దుర్మార్గం గా ఆక్రమించిన ఆమె స్థలాన్ని ఆమెకు తిరిగి వచ్చేలా చేసింది తమిళనాడు ప్రభుత్వం!

ఈ రోజుకీ ఆమె కెరీర్ మొదట్లో కొన్న ఇంటిలోనే వుంటున్నారు.
అది ఆమె సింప్లిసిటీ!

ఆమె మంచి రచయిత్రి కూడా!

జీవితమన్నాకా కష్టాలు వస్తుంటాయి. తల్లిదండ్రులుగా భావించిన అక్కబావే ఆమెను మోసగించారు. కన్నకొడుకు మరణించాడు.

ఆమె వీటన్నిటినీ అధిగమించి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని మనసారా కోరుకుంటూ వాణిశ్రీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

మన్నెం శారద ( 03-08-2025 )


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!