- పేరాల బాలకృష్ణ
 
జ్ఞానపీఠ విశ్వనాధ సత్యనారాయణ గురువు గారికి భక్తితో నమస్కరించి వ్రాయునది ,
ఆనాడు పొద్దున 7 గంటల వార్తల్లో వచ్చింది విశ్వనాథ సత్యనారాయణ గురువు గారికి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించారని .. ఆ రోజుల్లో సెల్ ఫోన్లా….! వాట్సప్లా ….! ఏదో అక్కడక్కడా కొందరిళ్ళలో టెలిఫోన్లుండేవి.
నాన్నగారికి వంటి మీద గుడ్డ నిలవటం లేదు. తెగ హడావిడి పడిపోతూ ఆనందంగా గెంతుతూ… మా బామ్మని ఊపి పారేస్తున్నారు.
పంచ లాల్చీ వేసుకుని గురువుగారింటికి బయల్దేరబోతున్నారు.
ఇంతలో గేటు చప్పుడైతే చూసేసరికి….. గురువుగారు….! అదే గుడ్డ బనీను, మోకాళ్ళ పైకి మడిచి కట్టిన పంచ, భుజం మీద కాశీ తువాలు, బొటన వేలితో అరచేతిలో నొక్కి పట్టుకున్న పొడుం కాయ …. లోపలికొచ్చి వరండాలో నాన్నగారి పడక్కుర్చీలో కూచున్నారు.
నాన్నగారు మాస్టారికి కాళ్ళకు నమస్కారం చేసి శుభాకాంక్షలు చెప్పి ఇంకో కుర్చీ లాక్కున్ని కూచున్నారు.
రెండు నిమిషాలు మాట్లాడింతర్వాత….
” అదేంటి మాష్టారూ! మీరు ఇక్కడికొచ్చారు …. ? అవతల ప్రెస్సు వాళ్ళు, రేడియోవాళ్ళు మీకోసం వచ్చే టైం కదా ఇంటికెళదాం పదండి …. అక్కడే మాట్లాడుకుందాం” అంటూ లేవబోయారు నాన్నగారు
” అక్కర్లేదు కూచో…. భరత శర్మా! నిన్నటికి ఇవాళ్టికీ ఏంటి తేడా…వీడు …నిన్నా ఇదే విశ్వనాథ సత్యనారాయణ …ఇవాళా ఇదే విశ్వనాథ సత్యనారాయణ …. అదే జీవుడు…అదే ఏడుపు …కూచో ఎక్కడికీ వెళ్ళక్కరలేదు …అంటూ కూర్చోబెట్టారు.
” అయినా ఇంతసేపైంది నేనొచ్చి ….. కాఫీ ఇవ్వరేం? అంటూ …అమ్మాయ్!” అని అమ్మని పిలిచారు…మాట మారుస్తూ…పిలుస్తుండగానే అమ్మ కాఫీ గ్లాసు, మంచినీళ్ళ గ్లాసుల్తో వచ్చి గురువుగారికి, నాన్నగారికి కాఫీలిచ్చి లోపలి కెళ్లింది!
ఇంతలో బామ్మ వచ్చింది కొంగు భుజం మీదకు లాక్కుంటూ” బాబుగారూ ! చాలా సంతోషంగా ఉంది . భరతుడు ఇప్పుడే చెప్పాడు మీకు జ్ఞానపీఠ బహుమానం వచ్చిందని అని సంతోషంగా చెప్పింది
అప్పట్లో ఇంకా ఈ కంగ్రాచులేషన్స్ ! ఫెంటాస్టిక్ న్యూస్! గ్రేట్ ఎచీవ్మెంట్ వావ్ లాంటి మాటలు అంతగా వాడకంలో లేవు మనలాంటి వాళ్ళ ఇళ్ళల్లో ….ఇలాగే చాలా సంతోషం, భలే మాట…. మంచి కబురు లాంటి మాటల్తప్ప! అవే గనక అంత ప్రచారంలో ఉంటే మా బామ్మ ఖచ్చితంగా గురువుగారికి కంగ్రాట్స్ అనో, కంగ్రాచులేషన్స్ అనో … బొటనవేలు పిడికిలి బైటకు పెట్టి థంబ్స్అప్ కరన్యాసంతో ఓహ్ సూపర్ అనో చెప్పి ఉండేదేనేమో! ఏమో..!)
“ఆ.. ఏముందమ్మా ..! ఎవడికో ఒకడికివ్వాలిగా …వీడికిచ్చారు! సంతోషం ఏమిటంటే…కల్పవృక్షానికిచ్చారు … ” అన్నారు గురువు గారు కాఫీగ్లాసు కిందపెడుతూ …!
ఇంతలో కార్లో విజయవాడ రేడియో స్టేషన్ నుండి కల్చరల్ న్యూస్ టీమ్ వచ్చారు. వాళ్లు గురువుగారింటికి వెళ్లి, ఇక్కడున్నారని తెలుసుకుని ఇక్కడకొచ్చారు.
వాళ్ళతో ఇంటర్వ్యూ … వాళ్ళ ప్రశ్నలు … హడావిడీ…మధ్యలో ఒకటి రెండు చోట్ల నాన్నగారిని కూడా ఏదో అడగటం, నాన్నగారి స్పందన…. ఆ తర్వాత వాళ్ళు వెంటనే ప్రసారం చెయ్యాలని పరుగులు పెట్టారు.
రేడియో వాళ్లు అలా వెళ్ళారో లేదో ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక, ఆశ్చర్యంగా విశాలాంధ్ర దినపత్రికల విలేఖరులు (అప్పుడు రాఘవాచారి గారు విశాలాంధ్ర సంపాదకులనుకుంటా), ఫోటోగ్రాఫర్లతో వచ్చి చాలా సేపు ఇంటర్వ్యూలు తీసుకున్నారు.
నాన్నగారు మళ్ళీ ఒత్తిడి చేసి మాష్టార్ని తీసుకుని వాళ్లింటికి వెళ్ళారు.
ఈ కోలాహలమంతా గురువు గారింట్లో జరగాలనీ, వాళ్ళ కుటుంబం … అమ్మమ్మ గారు, పావని బాబాయి , దుర్గత్తయ్య, గురువుగారి తమ్ముళ్లు వేంకటేశ్వర్లు గారు, రామ్మూర్తి గార్ల మధ్య జరగాలనీ నాన్నగారి ఆశ.
అలా ఆశ పడ్డందుకు… మళ్ళా ఈ పత్రికల సాంస్కృతిక విలేఖర్లు, వారితో పాటు హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కల్చరల్ రిపోర్టర్లు అందరూ వచ్చి ఒకరొకరుగా ఇంటర్వ్యూలు, ఫోటోలు తీసుకున్నారు.
మేమంతా ఉబ్బితబ్బిబ్బై పోతుంటే …తాతగారు మాత్రం పద్మపత్ర మివాంభసుడిలా నిన్నటి విశ్వనాథ లాగే, స్తుతమతులై ఉండి ఆ విలేఖర్ల సమావేశం ముగించారు.
వారి ఆ స్థితప్రజ్ఞత, ధీరో దాత్తత చూస్తే ఆశ్చర్యమేసింది.
అదేముందిలేండి ….! వారు జీవితంలో చూసిన ఆటుపోట్లు, తిన్న ఢక్కాముక్కీలు సామాన్యమైనవా?
నిజ జీవితంలోనూ సాహిత్య యాత్రలోనూ అన్నిట్నీ ఎదురీది సాధించిన ధిషణాహంకారి కదా …. పరమగురువులు శ్రీ విశ్వనాథ !
వారు నడచిన నేలపై నడవగలగటం, వారు పీల్చిన గాలినే పీల్వ గలగటం వారి మనోజ్ఞమైన గొంతు వినగలగటం, వారి ధీర గంభీర విగ్రహాన్ని కనులారా కనగలగటం, స్పృశించి పులకరించ గలగటం ఆ నా తండ్రి భరతుడు, తల్లి కుసుమమ్మలు నను తమ కడుపున కని నాకు అందించిన మహా ప్రసాదం!
పరమ గురువులు శ్రీ విశ్వనాథ చేయిపట్టి ఆడుకున్న ఆ చిన్ననాటి జ్ఞాపకాల స్ఫురణతో పరవశిస్తూ, పులకరిస్తూ ……
