సమయం శనివారం తెల్లవారు ఝాము ఒంటి గంట కావస్తుంది
ట్రంప్ మాటలను తేలిగ్గా తీసుకున్న వెనిజులా ప్రెసిడెంట్ మదురో అధ్యక్ష భవనంలో ఏసీ వేసుకుని గాఢ నిద్రలోకి జారుకున్నాడు
మరికాసేపట్లో వెనిజులా అధ్యక్ష భవనం మీద అతి పెద్ద సైనిక ఆపరేషన్ జరుగుతుందని ఆ క్షణాన ప్రెసిడెంట్ మదురో కి తెలీదు
మరోవైపు అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మాత్రం మేలుకునే ఉండి డెల్టా ఫోర్స్ అండ్ ఎఫ్బిఐ లను వెనిజులా మీదకు సైనిక చర్యకు సమాయత్తం చేస్తున్నాడు
ఆ అర్ధరాత్రి వేళ షుమారు 150 కి పైగా యుద్ధ హెలికాఫ్టర్లు వాయువేగంతో వెనిజులా వైపు దూసుకుపోయాయి
వెనిజులా లో ఎంటర్ అవుతూనే బోలివరీయన్ నావీ , మిలిటరీ అకాడమిల మీద దాడులు చేసాయి
అక్కడికి దగ్గర్లోనే ఉన్న పోర్ట్ మీద బాంబుల వర్షం కురిపించింది
కారకాస్ కి వెళ్లేముందు మిరాండా ఎయిర్ బేస్ మీద కూడా దాడులు చేసింది
ఫైనల్లీ వెనిజులా కాపిటల్ సిటీ కారకాస్ లోకి ప్రవేశించేముందు విద్యుత్ సరఫరా మొత్తం నిలుపుదల చేసింది
దాంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు కూడా అర్ధం కాలేదు
చుట్టూ గాఢాంధకారం , పైనుంచి యుద్ధ విమానాలు , హెలికాఫ్టర్ల ద్వారా బాంబుల వర్షం కురుస్తుండటంతో భయపడి దాక్కున్నారు
కానీ డెల్టా ఫోర్స్ హెలికాఫ్టర్లు నివాసిత ప్రాంతాల జోలికి పోలేదు
చాలా పకడ్బందీగా ప్రెసిడెంట్ మదురో ని టార్గెట్ చేసి పక్కా వ్యూహంతో అధ్యక్ష భవనం మీద దాడులు చేసారు
ఈ దాడుల్లో వెనిజులా ప్రెసిడెంట్ సెక్యూరిటీని పుర్తిగా తుదముట్టించిన తర్వాత ఫోర్స్ నేరుగా మదురో బెడ్ రూమ్ లోకి వెళ్లి ఆయన్ను , ఆయన భార్యను అదుపులోకి తీసుకుని బేడీలు వేసి యూఎస్ కు తరలించారు
ఇదంతా తెల్లవారు ఝామున ఒంటిగంట నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల లోపలే జరిగింది
మదురో ని పట్టుకున్నాం అనే మెసేజ్ వచ్చిన తర్వాతనే ట్రంప్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియచేసాడు
హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా టాస్క్ ని మూడు గంటల్లోపల పూర్తి చేసింది డెల్టా ఫోర్స్
అర్ధరాత్రి ఏకంగా ఒక దేశ అధ్యక్షుడిని అతని భవనంలోనే బందీగా పట్టుకుని బేడీలు వేసి అమెరికాకు తరలించడం సంచలనం అయ్యింది
అన్నంత పనీ చేసిన ట్రంపరి తనాన్ని చూసి ప్రపంచ దేశాలు విస్తుపోయాయి
ఈ ఘటనపై రష్యా , ఇరాన్ వంటి దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా బాహాటంగా విమర్శించగా , కొన్ని దేశాలు ట్రంప్ చర్యను సమర్ధించాయి
మరికొన్ని దేశాలు గోడమీది పిల్లి వాటంలా అనుకూలమూ , వ్యతిరేకమూ కాకుండా స్పందించాయి
రష్యా అయితే ఏమన్నా ఉంటే అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా తేల్చుకోవాలి కానీ సార్వభౌమాధికారం మీద దాడులు చేయడం ఏంటని ? నిలదీసింది
ఇంతకీ అసలు గొడవేంటి ?
ట్రంప్ అప్పటికప్పుడు అర్ధరాత్రి మదురో ని బంధించి తీసుకురాలేదు
ఈ గొడవ ఎప్పటినుంచో జరుగుతున్నదే
ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా అమెరికాకి డ్రగ్స్ తరలిస్తుండటంతో వెనిజులా ప్రెసిడెంట్ ను బంధించి అదుపులోకి తీసుకున్నామని ట్రంప్ చెపుతున్నప్పటికీ అసలు కారణం ముడి చమురు నిక్షేపాలు అన్న సంగతి ప్రపంచానికి తెలిసిందే
కాకపోతే మదురో ని ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలను ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే చాలా తెలివిగా ఎస్టాబ్లిష్ చేసాడు
అమెరికన్ చట్టాల ప్రకారం ఇది అతి పెద్ద నేరం కాబట్టి వెనిజులా ప్రెసిడెంట్ ను పట్టిచ్చిన వారికీ , ఆచూకీ తెలియచేసిన వారికీ 15 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని ప్రకటించాడు
ఆ సమయంలోనే మదురో మీద నార్కోటిక్ యాక్ట్ కింద న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో చార్జిషీట్ పెట్టించాడు
తర్వాత బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆ రివార్డ్ ను 50 మిలియన్ డాలర్లకు పెంచారు
రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ ఫైలును రీ ఓపెన్ చేసి నార్కోటిక్ టెర్రరిజం కింద ప్రత్యేక విభాగం కిందికి తీసుకువచ్చాడు
అక్కడ్నుంచి ట్రంప్ పలుమార్లు వెనిజులా ప్రెసిడెంట్ కి వార్నింగ్ ఇచ్చాడు
గత కొద్దికాలం క్రితం వెనిజులా సముద్ర తీరం నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్న పడవలను యూఎస్ ఫోర్స్ పట్టుకుని నాశనం చేసాయి
ఈ కార్యక్రమం మొత్తం రికార్డ్ చేసి ప్రపంచ దేశాలకు , ముఖ్యంగా అమెరికాకు డ్రగ్స్ తరలింపులో వెనిజులా అధ్యక్షుడి ప్రమేయం కూడా ఉందని ఆధారాలతో సహా చెప్తూ మదురో ని లొంగిపొమ్మని హెచ్చరించాడు
అయినా మదురో వినకపోవడంతో వెనిజులా నుంచి వెళ్లే చమురు ట్యాంకర్లను సీజ్ చేసాడు
ఇంతవరకు ట్రంప్ పక్కాగానే ప్లాన్ చేసాడు కదా
సో , వెనిజులా అధ్యక్షుడి మీద అమెరికన్ న్యాయ స్థానాల్లో ఛార్జ్ షీట్ దాఖలు అయ్యింది
అతడి తల మీద 50 మిలియన్ డాలర్ల వెల కట్టబడింది
డ్రగ్స్ కేసులో ఆయన్ని లొంగిపొమ్మని ట్రంప్ గత నెలలో ఫైనల్ వార్నింగ్ కూడా ఇచ్చాడు
మదురో ఏం చేసాడు ?
ఇంత జరుగుతున్నా మదురో లైట్ తీసుకున్నాడు
ట్రంప్ వి ఉడుత బెదిరింపులు అనుకున్నాడు
తన మీద ఉచ్చు బిగిస్తుందని తెలిసిన ఏ దేశ అధ్యక్షుడైనా ముందు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడమో , అంతర్జాతీయ దేశాల మద్దతు తీసుకోవడమో చేయాలి
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి కి , మదురో కి నాయకత్వంలో తేడా అదే
ఎప్పుడైతే రష్యా తన మీద వార్ మొదలుపెడుతుందని తెలిసిందో అప్పుడే క్షణం ఆలస్యం చేయకుండా ఆయన ప్రపంచ దేశాల మద్దతు తీసుకున్నాడు
అలా చేసాడు కాబట్టే కార్తీక దీపం సీరియల్ మాదిరి రష్యా యుద్ధం ఎపిసోడ్ల వారీగా నడుస్తుంది
ప్రస్తుతానికి వస్తే మదురో ట్రంప్ తో రాజీ అయినా చేసుకోవాలి , యుద్ధానికైనా వెళ్ళాలి
ఈ రెండూ చేయకుండా డాన్స్ చేసాడు
ఎస్ .. మీరు చదివింది కరెక్టే
గత డిసెంబర్ నెలలో మదురో ని లొంగిపొమ్మని ట్రంప్ ట్వీట్ పెడితే దానికి రిప్లై గా మదురో వేడుకల్లో డాన్సులు చేస్తూ ,’ ప్రస్తుతం ప్రపంచానికి వార్ కాదు కావాల్సింది .. శాంతి ‘ అంటూ ఎగతాళి క్యాప్షన్ పెట్టాడు
ఆ డాన్సులు చూసిన ట్రంప్ కి సరిగ్గా ఎక్కడ కాలాలో అక్కడ కాలింది
అయినప్పటికీ పెద్దమనిషి తరహాగా” మిస్టర్ మదురో .. వెంటనే లొంగిపో ” అని శనివారం ఉదయం కూడా ట్వీట్ పెట్టాడు
కానీ మదురో పట్టించుకుంటేగా ,
తానో పెద్ద ముదురో అనుకున్నాడు
హాయిగా దుప్పటి ముసుగేసుకుని ఇంట్లో పడుకున్నాడు
నేనిక్కడ నిద్ర మానుకుని అరిచి గీ పెడుతున్నా పట్టించుకోకుండా పడకేస్తాడా ? అని ట్రంప్ పిడికిలి బిగించి డెల్టా ఫోర్స్ కి కనుసైగ చేసాడు
అంతే అర్ధరాత్రి మదురో ఇంటిమీద వాలిపోయి లేపుకొచ్చేసారు
పనిలో పనిగా ఆయన భార్యని కూడా బండి ఎక్కించారు
నిద్రమత్తు వదిలినతర్వాత కానీ మదురో కి చేతికి వేసిన బేడీలు కనిపించలేదు
మాములుగా అయితే ఎంతైనా ఒక దేశానికి అధ్యక్షుడు కాబట్టి మదురో కి కొంత ప్రోటోకాల్ ఇవ్వాలి
కానీ ఈయన చేసిన డాన్స్ కళ్ళముందు కనిపించడంతో ట్రంప్ కి బిపి పెరిగిపోయి ప్రోటోకాల్ లేదు ఏం లేదు చైన్ వేసేసి లాక్కొచ్చేయండి అని ఆర్డర్ వేయడంతో ఆ రకంగా మదురో అమెరికా తీసుకురాబడ్డాడు
పిక్స్ జాగ్రత్తగా గమనించి చూడండి
ఆయనకు దాహం వేసి వాటర్ బాటిల్ అడిగితే ఒక సైనికుడు గొలుసులున్న చేతికే బాటిల్ అందించాడే కానీ చైన్ బ్రేక్ చేసి ఇవ్వలేదు
సరే ఎట్టాగైతేనేమి మదురో ని అమెరికా తీసుకొచ్చి రాజకీయ ఖైదీలను ఉంచే సెల్ లో పడేసారు
ఆ తర్వాత కోర్టులు , విచారణలు మాములే
అయితే ఈ ఎపిసోడ్ లో ఎవరికీ అర్ధం కానిది ఏంటంటే కేసులో ఛార్జ్ షీట్ పెట్టింది వెనిజులా ప్రెసిడెంట్ మదురో ఒక్కడిమీదే
అలాంటిది భార్యా సహితంగా ఆయన్ని ట్రంప్ అమెరికా ఎందుకు పట్టుకొచ్చాడనేది మిలియన్ డాలర్ల టారిఫ్ ప్రశ్న
సరే , ఇక్కడివరకు అమెరికన్ చట్టాల ప్రకారం మదురో ని యూఎస్ కోర్ట్ గుమ్మాలను తొక్కించాడు బానే ఉంది
ఇంత కష్టపడి , ఇంత ప్రయాస పడి , బోలెడు ఖర్చు పెట్టుకుని , 150 యుద్ధ విమానాలను , హెలికాఫ్టర్లను వాడింది కేవలం డ్రగ్ కేసు కోసమేనా ?
ఇక్కడ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి
వెనిజులాలో ఏం జరిగింది ?
కష్ట కాలంలో ఉన్నప్పుడు ప్రతి దేశంలోనూ ఓ విప్లవకారుడో , సంస్కరణవాదో పుట్టుకొస్తాడు
అలా ఓ పదేళ్ల క్రితం వెనిజులాలో కూడా హ్యూగో చావెజ్ రూపంలో ఓ సంస్కరణవాది ఉద్భవించాడు
అప్పటికే వెనిజులా ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతుంది
దీనికి తోడు కొండలా ఉండి ఎంతకీ తరగని ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి
అది చాలదూ ,
ఇవాళ అగ్ర దేశాలు సైతం కొన్ని చిన్న చిన్న దేశాల మీద ఆధారపడుతున్నాయి అంటే క్రూడాయిల్ నిక్షేపాల వల్లనే కదా
ఆ చమురు నిక్షేపాలు ఇచ్చిన బలుపు తో చావెజ్ కూడా ‘మనదగ్గర ఇన్నన్ని ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి కదా .. వీటిల్ని కొన్ని కార్పొరేట్ కంపెనీలు తక్కువ ధరకు కొనుక్కుని ప్రపంచ దేశాల్లో అమ్ముకుని లాభాలు గడుస్తున్నాయి.. కాబట్టి ఈ నిక్షేపాలను మనమే సొంతంగా వాడుకుని లాభాలను కూడా మనమే పంచుకుందాం ” అని ఓ కొత్త ఆలోచనకు నాంది పలికాడు
ఈ ఎఫెక్ట్ అందరికన్నా ముందు అమెరికా మీద పడింది
డాలర్ కి , క్రూడాయిల్ కు ఉన్న ఇంటర్నల్ లింకుల వల్ల ఆర్థికంగా , వాణిజ్యపరంగా కూడా అమెరికాకి ఇది పెద్ద దెబ్బ అయ్యింది
దాంతో ఆ చావెజ్ కు నచ్చచెప్పడానికి అమెరికా అప్పట్లోనే ప్రయత్నించింది
అయినా సరే ఆయన వినకుండా వచ్చిన లాభాలను నా ప్రజలకే పంచుతా అని ఉచితాలను అలవాటు చేసాడు
తిని కూర్చుంటే కొండైనా కరుగుతుంది అనే నానుడి మాదిరి ఉచితాల దెబ్బకు వెనిజులా కూడా ఢమాల్ అయ్యింది
చేసిన తప్పు తెలుసుకునేసరికి అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది
ఆ చావెజ్ పోతూ పోతూ ఈ మదురో కి వారసత్వ బాధ్యతలు అప్పగించిపోయాడు
పోనీ నాయకత్వం మారింది కాబట్టి ఈయన ద్వారా ట్రై చేద్దామని యూఎస్ తిరిగి ప్రయత్నించింది
అయినా ఫలితం లేకపోవడంతో ఈయన్ని నిద్రలోనే లేపుకుపోయారు
ఇప్పుడేం జరుగుతుంది ?
తమ ప్రెసిడెంటుని లేపుకుపోయారు అని తెలియగానే జనాలు ఆవేశంతో వీధుల్లోకి , అట్నుంచి వైట్ హౌస్ మీదికి వచ్చేస్తారని అనుకున్నాడు మదురో
కానీ ఊహించిన స్థాయిలో అలాంటి విప్లవాలు ఏమీ జరగకపోవడంతో ఖంగు తిన్నాడు
ఈయన్ని లేపుకుపోయారని తెలిసిన వైస్ ప్రెసిడెంట్ ఒకామె తనని తాను వెనిజులాకి ప్రెసిడెంట్ గా ప్రకటించేసుకుని ట్రంప్ మీద పళ్ళు నూరింది
కానీ ట్రంప్ అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే వాళ్ళిద్దర్నీ ఎత్తుకుపోయాడనే విషయం వీళ్ళకి తెలీదు
అఖండ 2 మూవీలో దేశ ప్రతిపక్ష నాయకుడు ఒకడుంటాడు
ప్రధానిని దింపేసి తాను ఎప్పుడు పీఎం అవుదామా అని కాచుకుకూర్చుంటాడు
ఆ ప్రతిపక్ష నాయకుడితో ‘ మా మాట వింటే నెక్స్ట్ నిన్నే పీఎం ను చేస్తాం’ అని చైనా తోలుబొమ్మలాట ఆడుతుంది
ఆ సినిమా చూశాడో ఏంటో ట్రంప్ కూడా సేమ్ అదే మాదిరి వెనిజులా ప్రతిపక్ష నాయకుడ్ని ఆల్రెడీ మోపు చేసేసాడు
మళ్ళీ ఆయిల్ నిక్షేపాలు అన్నీ యూఎస్ కంట్రోల్ లోకి వెళ్తాయి
కోర్టులు , విచారణలు అంటూ మదురో అమెరికాలో అన్ని ప్రదేశాలు చుట్టి వస్తాడు
పక్కన భార్య కూడా ఉంది కాబట్టి ఆయనకు ఇబ్బందేం లేదు
ముగింపు : ఆపరేషన్ వెనిజులా అయిపోయిన తర్వాత ట్రంప్ .. ఎలాన్ మస్క్ తో కలిసి హాయిగా పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసాడు
ఇప్పుడీ డిన్నర్ లో విశేషం ఏముంది ?
ఎప్పుడూ వాళ్ళు చేసేదిగా అని మదురోలా తేలిగ్గా కొట్టిపడేయకండి
ట్రంప్ స్వతహాగా వ్యాపారస్తుడు
లెక్కలు బాగా తెలిసినవాడు
ఆయన తీసుకునే నిర్ణయాలలో దేశాధ్యక్షుడి కోణంలో కన్నా వ్యాపారవేత్త కోణంలోనే ఎక్కువ ఉంటాయి
అందుకే తన పక్కన తోడుగా ఇంకో వ్యాపారస్తుడ్ని పెట్టుకున్నాడు
ఆ వ్యాపారస్తుడికి ఇండియాలో కార్ల మార్కెట్ బిజినెస్ లో అనుకున్నంత షేర్ రాలేదు
కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇండియా అంటే పెద్దగా ఆబ్లిగేషన్ కూడా లేదు
కడుపునిండా డిన్నర్ చేసిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ” మోడీ నాకు మంచి మిత్రుడే కానీ వాణిజ్యం విషయంలో నా మాట వినడం లేదు .. ఇలా అయితే నేను హర్ట్ అవుతా .. హర్ట్ అయితే టారిఫ్లు పెరుగుతాయి ” అని పరోక్షముగా తన మన్ కి బాత్ చెప్పాడు
దౌత్యపరంగా ఇదేదో ఆలోచించాల్సిన విషయమే !
