గత కొన్ని సంవత్సరాల నుంచి టీటీడీ అక్రమార్కులకు నిలయం అయిపోతుంది అన్న సంగతి వార్తల్లో చూస్తూనే ఉన్నాం
ఇదే విషయం మీద ప్రభుత్వాలను ప్రశ్నిస్తే నేరం నాది కాదు గత పాలకులది అనే సమాధానం వస్తుంది .
డాలర్ నుంచి పరకామణి నోట్ల వరకు
లడ్డు నెయ్యి నుంచి పట్టు దుపట్టా వరకు
బ్రేక్ దర్శనాల నుంచి శ్రీవాణి ట్రస్ట్ బ్లాక్ టికెట్ల వరకు
స్వామి ఆభరణాల నుంచి మాన్యాల వరకు
ఒకటా రెండా
ఎక్కడ చూసినా అవినీతి , అక్రమాలే
తరచి చూస్తే రోజుకో స్కాం బయటపడుతుంది
కేసులు , విచారణలు షరా మాములే
అత్యంత ధనిక హిందూ ఆలయంలో అక్రమార్కులందరూ చేరి అందినకాడికి దోచుకుపోతున్నారు
ఏం చేసినా ఆ స్వామి తమను ఏమీ చేయలేడని ఎంత ధైర్యం ?
ధనిక ఆలయం సంగతి అటుంచితే కోట్లాదిమంది భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోవడం లేదా ?
తోటకూర నాడే అన్న సామెతలా మొదటి స్కాం దొరికినప్పుడే కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే ఇన్ని వరుస దోపిడీలు జరిగేవా ?
ఒకదానివెంట ఒకటి ఏళ్లకు ఏళ్ళు కొత్త మోసాలు బయటపడుతున్నాయి
టిటిడి అంటే నలుగురు సిబ్బందితో నడిపించే చిన్న కార్యాలయం కాదు
అదొక పెద్ద వ్యవస్థ
దీనికింద ఐఏఎస్ ఆఫీసర్లు మొదలుకుని అటెండర్ల వరకు వందలాదిమంది సిబ్బంది పనిచేస్తున్నారు
సాధారణ పరిపాలన కాకుండా పోలీస్ , విజిలెన్సు సేవలు కూడా ఉంటాయి
వీరు కాకుండా రాజకీయ పునరావాసం పొందిన నిరుద్యోగులు ట్రస్ట్ బోర్డు లో ఎలానూ ఉన్నారు
వీరందరిపైన ప్రభుత్వ అజమాయిషీ కూడా ఉంది
ఇంతమంది సిబ్బంది , ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న టిటిడిలో రోజుకో అవినీతి , అక్రమాలు బయటికి వస్తుంటే బాధ్యత ఎవరు తీసుకుంటారు ?
ప్రభుత్వం మారినప్పుడల్లా గత ప్రభుత్వ హయాంలోనే దోపిడీలు జరిగాయని చిల్లర స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం మినహా ఇంతవరకు నేరగాళ్లకు శిక్షలు పడ్డ కేసులు ఎన్ని ?
ఇప్పుడు జరిగిన పట్టు స్కాం ని గత ప్రభుత్వం మీద నెట్టేయడానికి కూడా వీలు లేకుండా రెండు ప్రభుత్వాల హయం నుంచి గత పదేళ్లుగా నిక్షేపంగా జరుగుతూనే ఉంది
పదేళ్ళబట్టి మోసం జరుగుతూనే ఉన్నా ఇప్పటివరకు విజిలెన్సు ఎందుకు పసిగట్టలేకపోయింది ?
దోషులు ఎవరు ? తెర వెనుక వారికి అండగా నిలబడుతున్న పెద్ద మనుషులు ఎవరు ?
అన్నీ జవాబు దొరకని ప్రశ్నలే ?
ఇంతకీ ఈ పట్టు స్కాం కధేంటి ?
దేవాలయానికి విరాళాలు ఇచ్చిన దాతలకు , ప్రముఖులకు , పండితులకు వేద ఆశీర్వచనం సమయంలో పట్టు వస్త్రాలతో సన్మానం చేయడం టిటిడిలో అనాదిగా జరుగుతున్న సంప్రదాయం
ఈ దుపట్టాలు స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో తయారుచేసి ఉండాలి
ఇందుకుగాను పట్టువస్త్రాలు తయారుచేసే కంపెనీలకు టెండర్లు పిలవడం ద్వారా టిటిడి ఆర్డర్ ఇస్తుంది
పదేళ్ల క్రితం చిత్తూరు జిల్లా నగరికి చెందిన విఎస్ఆర్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ టెండర్ దక్కించుకుని టిటిడికి పట్టు వస్త్రం ఒక్కింటికి షుమారు 1400 రూపాయలకు సరఫరా చేసేట్టు అగ్రిమెంట్ కుదుర్చుకుంది
అయితే టెండర్ నిబంధనల ప్రకారం దుపట్టాలు మేలు రకం మల్బరీ పట్టుతోనే తయారుచేయాలి
దానిమీద తప్పనిసరిగా సిల్క్ మార్క్ హాలోగ్రామ్ ఉండాలి
శాలువా 180 గ్రాముల బరువుతో ఉండి ఓం నమో వెంకటేశాయ అనే నామం కనిపించేలా ఎంబ్రాయిడరీ చేయించాలి
అదే విధంగా అందిస్తామని ఒప్పుకుని 2015 నుంచి ఆ సంస్థ టిటిడికి పట్టు వస్త్రాలు సరఫరా చేస్తూ వస్తుంది
మోసం ఎలా బయటపడింది ?
దొరికితేనే దొంగలు ..లేకపోతే దొరలు అన్న చందంగా ఈ సంస్థ పదేళ్ళబట్టి యథేచ్ఛగా దోపిడీ చేస్తుంది
సాధారణంగా తయారీ యూనిట్ నుంచి టిటిడి గోదాములకు దుపట్టాలు వచ్చినప్పుడు టిటిడి అధికారులు వాటిలోనుంచి శాంపిల్ తీసి కంచి లోని సిల్క్ ల్యాబ్ లో పరీక్షలు చేస్తారు
ఆ ల్యాబ్ నుంచి ఈ దుపట్టాలు వంద శాతం మల్బరీ పట్టుతోనే తయారైందని సర్టిఫికెట్ వస్తేనే బిల్లు అవుతుంది
గత పదేళ్ళబట్టి టిటిడి ప్రతి శాంపిల్ ను కంచి ల్యాబ్ కి పంపడం , వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మల్బరీ దుపట్టాలు అని సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతూనే ఉంది
క్రమం తప్పకుండా నాణ్యతా సర్టిఫికెట్లు వస్తుండటంతో మరో ఆలోచన లేకుండా అదే కంపెనీకి ఆర్డర్లు ఇస్తూ వచ్చారు
అయితే ఎందుకో విజిలెన్సు అధికారులకు అనుమానం వచ్చి శాంపిల్ ను ఎప్పుడూ పంపే కంచి ల్యాబ్ కు కాకుండా బెంగుళూరు ల్యాబ్ కి పంపారు
అక్కడ వారికి షాకింగ్ న్యూస్ తెలిసింది
ఈ దుపట్టాలు మల్బరీ తో తయారవడం సంగతి అటుంచి నాసి రకం పాలిస్టర్ తో తయారు చేస్తున్నట్టు గుర్తించారు
అంటే వంద రూపాయలు కూడా ఖరీదు చేయని పాలిస్టర్ దుపట్టాలను మేలు రకం మల్బరీ పట్టుగా చూపించి ఇన్నేళ్లు గుట్టుగా 54 కోట్లు దోపిడీ చేసేసారు
విషయం తెలుసుకున్న టిటిడి చైర్మన్ కూడా అవాక్కయ్యారు
వెంటనే సదరు కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులను కోరారు
సరే విఎస్ఆర్ కంపెనీ దోపిడీ భాగోతం ఇప్పటికైనా వెలుగులోకి వచ్చింది
అయితే ఇక్కడ స్వామి భక్తులకు కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి
సాధారణంగా టెండర్ నిబంధనలలో సదరు కాంట్రాక్టు ఏడాది వరకు మాత్రమే ఉండేటట్లు అగ్రిమెంట్లు ఉంటాయి
పెర్ఫార్మన్స్ బాగుంటే ఇంకో ఏడాది పెంచుకోవచ్చు
అలా గరిష్టంగా మూడేళ్ళ కాలపరిమితి ఉంటుంది
అలాంటిది గత పదేళ్ల బట్టి ఇదే కంపెనీ ఆర్డర్లు ఎలా పొందగలుగుతుంది ?
మార్కెట్ రేటు ప్రకారం చూసుకున్నా కంపెనీ సరఫరా చేస్తున్న రేటు తక్కువేమీ కాదు
మరి అధిక ధర పెట్టి ఇదే కంపెనీలో దుపట్టాలు కొనేంత ప్రేమ ఎవరికి ఉంది ?
ఈ కంపెనీ కేవలం టిటిడినే మోసం చేయలేదు
కోట్లాది మంది భక్తుల మనోభావాలను మోసం చేసింది
ఇన్నాళ్లు స్వామి వారి బహుమతిగా తాము పొందిన శాలువాలు నాసిరకంవి అని తెలిసిన దాతల మనసులు ఎలా ఉంటాయి ?
గతంలో బయటపడ్డ స్కాముల్లో కొత్తగా ఇంకోటి చేరింది
ఇది కూడా విచారణలకు వెళ్తుంది
ఈ సందర్భంగా ఇప్పటివరకు టిటిడిలో బయటపడ్డ దోపిడీల గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం
ఎందుకంటే విచారణల తీరు ఏ విధంగా ఉందో కొంత తెలుస్తుంది
డాలర్ స్కాం
స్వామివారి పేరుమీద తయారుచేయబడిన బంగారు లాకెట్ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని అప్పట్లో టిటిడి విజిలెన్సు కేసులు నమోదు చేసింది
కల్తీ నెయ్యి కేసు

తిరుమల అనగానే ప్రతి ఒక్క భక్తుడికి స్వామి వారి లడ్డు ప్రసాదం ఖచ్చితంగా గుర్తుకొస్తుంది
తిరుమలని మనసులో ఎంత పవిత్రంగా భావించుకుంటారో స్వామి వారి లడ్డుని కూడా భక్తులు అంతే పవిత్రంగా భావించుకుంటారు
తరతరాలుగా భక్తులకి తిరుమల లడ్డు ఒక ఎమోషన్ , ఒక కనెక్షన్
ఆ ప్రసాదం నోట్లో పడగానే ఏదో తెలియని అనిర్వచనీయమైన అనుభూతి కలిగేది
ఇదంతా మూడు దశాబ్దాల కిందటిమాట
అలాంటి స్వామివారి లడ్డు ప్రసాదంలో కూడా అక్రమార్కులు కల్తీ చేసారు
ముందు లడ్డులో నాసి రకం నెయ్యి వాడారు అనుకున్నారు . తర్వాత నెయ్యి కల్తీ చేసారని తెలిసింది . విచారణలో అది అసలు నెయ్యే కాదని సింథటిక్ రసాయనాలు వాడారని తెలిసింది
ఇది దుర్మార్గానికి పరాకాష్ట
క్షమించరాని నేరం
ఒకేఒక్క తప్పుతో కోట్లాదిమంది భక్తుల హృదయాలను గాయపర్చారు
ఈ కేసు ఇంకా విచారణ జరుగుతుంది
పరకామణి కేసు

భక్తులు స్వామివారికి హుండీలో సమర్పించిన కానుకలను పరకామణిలో లెక్కిస్తారు
ఈ లెక్కింపుకి వచ్చే వ్యక్తులు కేవలం బనీను , పంచెలతో మాత్రమే రావాలి
అంతేకాదు లెక్కింపు వ్యవహారం మొత్తం సిసి కెమెరాల్లో రికార్డ్ అవుతుంది
అలా ఓ రోజు విజిలెన్సు సిబ్బంది చేసిన తనిఖీల్లో రవి కుమార్ అనే గుమస్తా పట్టుబడ్డాడు
ఇతడు 900 డాలర్లను దొంగతనం చేసి తన పంచె లోపల ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో దాచుకుని వెళ్లబోతుండగా పట్టుకున్నారు
దాని విలువ ఇండియన్ కరెన్సీలో షుమారు 72 వేలు
ఈ మొత్తం ఒక్క రోజులో అతడు చేసిన దొంగతనం విలువ
అలా సంవత్సరాల తరబడి పరకామణి లో అతడు చేసిన దొంగతనాలకు లెక్కలేదు
అయితే చోరీ చేసి దొరికిపోయిన రవి కుమార్ ను కేసునుంచి బయటపడేసేందుకు కొన్ని ఆస్తులను తమపేరు మీద రాయించుకుని ఒక పార్టీకి చెందిన నేతలు పైరవీలు చేశారనే ఆరోపణలు రావడంతో విషయం రాజకీయం అయిపొయింది
కేసులోనుంచి అతడు బయటపడేందుకు వీలుగా లోక్ అదాలత్ లో రాజీ చేయించారు
ఈ విషయం తెలిసి టిటిడి బోర్డు మెంబర్ హైకోర్టుని ఆశ్రయించడంతో కేసు సీఐడీకి బదలాయించారు
పరకామణి లో జరిగింది చిల్లర దొంగతనం కాదు కాబట్టే పెద్ద తలకాయలు సైతం ఈ కేసు విషయంలో రంగంలోకి దిగాయి
ఇది ఎంతవరకు పోయిందంటే కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారిని హత్య చేసేంత వరకు
అందుకే హైకోర్టు కూడా దొంగతనం కేసులో రాజీ చేసుకుని కేసు క్లోజ్ చేస్తామంటే ఎలా కుదురుతుంది ? అందుకే దీనిపై పూర్తి విచారణ జరగాల్సిందే అని ఉత్తర్వులు ఇచ్చింది
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పరకామణిలో రవి కుమార్ చోరీ చేసిన సొత్తు మూడు వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు
పరకామణిలో భక్తుల కానుకలకు భద్రత అలా ఉంది
లేటెస్టుగా స్వామివారి ప్రసాదంలో వాడే జీడిపప్పు కుంభకోణం కూడా బయటికి వచ్చింది
తప్పుడు పత్రాలతో టిటిడికి జీడిపప్పు సరఫరా చేస్తున్న చెన్నైకి చెందిన రెండు సంస్థలను ఈ మధ్యే బ్లాక్ లిస్టులో పెట్టారు
చూసారుగా చిట్టా
తిరుమలలో పరిస్థితులను సరిదిద్దకుండా ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కుంభకోణం జరగని రోజు మీడియాకి వార్త అవుతుంది
ఇప్పటికే రాజకీయ పార్టీలు టీటీడీని తమ అవసరాలకు వాడుకుంటున్న సంగతులు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి
అధికారులకు , రాజకీయ నాయకులకు మధ్య సయోధ్య లేకపోవడం కూడా అనర్దాలకు మూలం
అన్నిటికన్నా ముఖ్యంగా టిటిడికి రాజకీయ నాయకులతో కూడిన నామినేటెడ్ పాలక మండళ్ల నియామకాలు నిలిపివేసి ధార్మిక సంస్థలకో , స్వచ్ఛంద సేవా సంస్థలకో , బాధ్యతలు అప్పచెబితే ఇంతకన్నా మంచి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి
ఎందుకంటే రాజకీయ పార్టీలతో కూడిన నిరుద్యోగులకు టిటిడి బోర్డులో పునరావాసం కల్పించడం వల్ల తిరుమల పవిత్రత దెబ్బతినడమే కాదు ఇటువంటి అక్రమాలకు అవకాశాలు కూడా ఏర్పడతాయి
ప్రభుత్వం , హిందూ సంఘాలు ఇప్పటికైనా అలోచించి టిటిడి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి !
