నిజాలను నిజాయితీగా నిష్పక్షపాతంగా వెలుగులోకి తేవడం అంటే ఇదేనా? అసలు జర్నలిజం ఎటు పోతుంది?

Spread the love

ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్


భవిష్యత్తులో జర్నలిస్టులు తమ అరెస్ట్ వార్తలను తామే టీవీల్లో చెప్పుకునే రోజులు కూడా వస్తాయేమో

కొమ్మినేని అరెస్ట్ అనేది సాధారణ వార్త

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ అనేది సంచలన వార్త

సాక్షి టీవీలో జర్నలిస్ట్ కాబట్టే అరెస్ట్ చేశారనేది విచిత్ర వార్త

అవన్నీ అలా ఉంచితే అసలు రాన్రాను జర్నలిస్ట్ అనే పదంలో ఎర్నలిస్ట్ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది

రాజకీయ నాయకులే వ్యాపారస్తులై మీడియా రంగంలో అడుగుపెడుతుంటే కొంతమంది జర్నలిజం పేరుతో బానిసత్వంతో తన యజమానికి ఊడిగం చేస్తూంటే ఇంకెక్కడి జర్నలిజం? ఇంకెక్కడి జర్నలిస్టులు?

ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వారు.. నండూరి వారు.. నార్ల వారు అని గౌరవంగా పిలుచుకునే స్థాయి నుంచి బూతు కిట్టిగా.. రేయ్ ఫైవూ.. అరేయ్ సాంబడూ.. లాంటి నిక్ నేములతో సోషల్ మీడియాలో దురభిమానులు తిట్టే పరిస్థితికి దిగజారింది నేటి జర్నలిజం ( క్షమించాలి.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నేను ఇలాంటి తిట్లే చూస్తున్నాను)

అలా పిలిపించునే పరిస్థితికి కారణం ఎవరు?

పడిపోయిన జర్నలిజం విలువలా?

సొంత మీడియాలను పోషిస్తున్న రాజకీయ నాయకులదా ?

నాలుగు రాళ్ల కోసం యజమానికి బానిసలు అవుతున్న ఎర్నలిస్టులదా?

గతంలో నేను జర్నలిస్టును అని గౌరవంగా చెప్పుకునే పరిస్థితి సమాజంలో ఉండేది

ఇప్పుడు అది కాస్తా నేను జర్నలిస్టును అని చెప్పుకోగానే ముందు నువ్వు ఏ పార్టీయో చెప్పు.. లేదా ఏ ఛానల్ లో పనిచేస్తున్నావో చెప్పు.. నువ్వే పార్టీకి బాకా ఉదుతావో నేనే చెప్తా అనే స్థితికి వచ్చింది నేటి ఎర్నలిస్ట్ల పరిస్థితి

టీవీ 5 , ABN ఛానల్స్ ఓపెన్ చేస్తే ఏ పార్టీకి బాకా ఊదుతాయో ఇట్టే తెలిసిపోతుంది

ఏ నాయకుడ్ని భుజాన మోస్తాయో వెంటనే అర్థమౌతుంది

ఆ చానల్స్ లో జగన్ రెడ్డి అంటూ ప్రతి సాయంత్రం వెటకారపు చర్చలు మొదలౌతాయి

చర్చలు అంటే పెద్దగా ఏమీ ఉండదు

ఛానల్ డిస్కషన్స్ లో ఎవరికీ అనుకూలంగా మాట్లాడాలో ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాలో ముందే నిర్ణయించిన స్క్రిప్ట్ ను చదువుకుని స్టూడియోకు వచ్చిన నలుగురు పెద్దమనుషులు తాన అంటే తందాన అంటే చాలు

మిగతాదంతా మోడరేటర్ గా ఉన్న న్యూస్ యాంకర్ చూసుకుంటాడు

జగన్ రెడ్డి ఫలానా ప్రాజెక్టులో ఫలానా అవినీతి చేసాడని ఆరోపణలు వచ్చాయి..దీనిపై మీ స్పందన ఏంటి? అని అతగాడు సదరు చర్చకు వచ్చిన పెద్దమనిషికి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలో హింట్ కూడా ఇస్తాడు

అలాగే సాక్షి ఛానల్ ఓపెన్ చేస్తే చంద్రబాబు పాలనపై చర్చ ఉంటుంది

ప్రతి సాయంత్రం న్యూట్రల్ ముసుగులో ఉన్న పెద్దమనుషులను స్టూడియోలో కూర్చోబెట్టుకుని చంద్రబాబు మీద తమకు కావాల్సిన తిట్లను తిట్టిస్తారు

ఈ ఎపిసోడ్లు అన్నిటికీ జర్నలిజం అనే పేరు

ఇదంతా జర్నలిజం ముసుగులో పక్కగా జరుగుతున్న రాజకీయ కార్యకలాపాలు

ఇందులో దాపరికాలు ఏమీ లేవు
దాచుకోవడానికి కూడా ఏమీ లేదు

అంతా ఓపెన్ గా జరుగుతున్న వ్యవహారమే

ఆయా ఛానళ్ల తాలూకు రాజకీయ పార్టీల సోషల్ మీడియాలు కూడా ఇటువంటి అమ్ముడుపోయిన చానళ్ళు ను తమ భుజాన మోస్తూ ఇతోధికంగా సాయం చేస్తూ ఉంటాయి

రాజకీయ పార్టీల అంటకాగినందుకు ఆయా ఎర్నలిస్టులకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో కూడా అటు రాజకీయ పార్టీలు కానీ ఇటు పుచ్చుకుంటున్న వారుగానీ నామోషీ పడుతున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు

నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆ కార్యక్రమాలు కూడా బహిరంగంగా జరిగిపోతున్నాయి

సజ్జల వంటి కొందరు జర్నలిస్టులు ఏకంగా పార్టీ జెండాలనే భుజాన వేసుకుని పని చేస్తున్నారు

మరికొందరు పార్టీ జెండా కనిపించకుండా పైకి మాత్రం జర్నలిజం తోలు కప్పుకుని చీకటి పనులు చేస్తున్నారు

నేటి రోజుల్లో జర్నలిజం ఎంత చండాలంగా తయారైందంటే నికార్సైన జర్నలిస్టును అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడేంత


మళ్ళీ కొమ్మినేని అరెస్ట్ వార్త విషయానికి వస్తే,

యథాప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షి టీవీలో నిర్వహించే చర్చా కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని అని టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ అమరావతి వేశ్యల రాజధాని అని తాను కొత్తగా కనుగొన్న విషయాన్ని చెప్పాడు

అమరావతిలో వేశ్యలు ఉంటారు అనడానికి వేశ్యలంతా అమరావతిలో ఉంటారు అనడానికి చాలా తేడా ఉంది

ఆయన మాటల్లో రెండో అర్థమే ధ్వనించింది

ఏదైనా జర్నలిస్టును అని చెప్పుకునే ఆ పెద్ద మనిషి అటువంటి వాఖ్యలు చేయడం తప్పే

ఈ విషయంలో సాక్షి ఛానల్ కూడా ఆ వాఖ్యలు పూర్తిగా అతడి వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి సాక్షి ఛానల్ బాధ్యత వహించదని వివరణ ఇచ్చింది

ఆ రోజు ఆ కార్యక్రమానికి మోడరేటర్ గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు అటువంటి వాఖ్యలు చేసినప్పుడు వెంటనే ఖండించి ఉండాల్సిందనీ.. లేదా లైవ్ లోనే అతడి చేత క్షమాపణలు చెప్పించి ఉండాల్సిందని సాటి జర్నలిస్టులే అభిప్రాయ పడ్డారు

ఈ వివాదం పైన కృష్ణంరాజు వివరణ ఇచ్చారు కానీ ఆ వివరణ సమర్ధింపు ధోరణిలో ఉంది కానీ పశ్యాత్తాప ధోరణిలో లేదు

ఈ నేపధ్యంలో ప్రభుత్వం కొమ్మినేనిని అరెస్ట్ చేసింది

చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే సిద్ధాంతాన్ని నమ్మేవారే జర్నలిస్టును అరెస్ట్ చేయడం అక్రమం అని నిరసనలు వ్యక్తం చేసారు

కొమ్మినేని కానివ్వండి.. టీవీ 5 మూర్తి కానివ్వండి.. సాంబశివరావు కానివ్వండి.. వెంకట కృష్ణ కానివ్వండి.. ఎవరైనా చట్టానికి అతీతులు కారు

అయితే కొమ్మినేని విషయంలో ఒక జర్నలిస్టును అరెస్ట్ చేయడం ఎంతమాత్రం తప్పు కాదు కానీ అది రాజకీయ ప్రేరేపిత కక్షతో చేస్తే మాత్రం ముమ్మాటికీ తప్పే

ఏతావాతా ఈ సంఘటనతో జర్నలిస్టులు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీల కొమ్ము కాస్తే ఏ నాటికైనా ఆ పార్టీ నాయకుల కన్నా వ్యక్తిగతంగా వీళ్ళకే ఎక్కవ చేటు చేస్తుందని తెలుసుకోవాలి

అంతిమంగా ప్రజల మద్దతు కూడా విలువలతో కూడిన జర్నలిజానికీ.. నిష్పాక్షికంగా వార్తలు అందించే జర్నలిస్టులకు మాత్రమే ఉంటుంది !

పరేష్ తుర్లపాటి ✍️


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!