ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్
చూసారుగా రోజువారీ క్రైమ్ వార్తల్లో అరెస్ట్ అయిన ముద్దాయిలు , నిందితుల జాబితాలో జర్నలిస్టుల పేర్లు కూడా చేరుతున్నాయి . భవిష్యత్తులో జర్నలిస్టులు తమ అరెస్ట్ వార్తలను తామే టీవీల్లో చెప్పుకునే రోజులు కూడా వస్తాయేమో?
కొమ్మినేని అరెస్ట్ అనేది సాధారణ వార్త . సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ అనేది సంచలన వార్త . సాక్షి టీవీలో జర్నలిస్ట్ కాబట్టే అరెస్ట్ చేశారనేది విచిత్ర వార్త .
ప్రస్తుతం వార్త ఎలా చెప్పొచ్చు అనేది ఆయా పత్రికల ,న్యూస్ ఛానళ్ల అధిపతుల ఇష్టాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది . గతంలో ఫోర్త్ ఎస్టేట్ అనేది ఒక ప్రత్యేక వింగ్ మాదిరి పనిచేసేది . సమాజంలో జరుగుతున్న అన్యాయాలను , అక్రమాలను వెలికితీయడంలో ప్రముఖ పాత్ర పోషించేవి . ప్రజల సమస్యలు అధికారులకు ,ప్రభుత్వాలకు చేరవేసి పరిష్కార మార్గాలు చూపడంలో దిక్సూచిగా పనిచేసేవి . సమాజంలో నికార్సైన పాత్రికేయానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది . నిస్పక్షపాతంగా వార్తలు అందించే నిజాయితీ పరులకు జర్నలిస్టులుగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉండేవి . వారు అందించే వార్తలకు విశ్వసనీయత ఉండేది .
అవన్నీ అలా ఉంచితే అసలు రాన్రాను జర్నలిస్ట్ అనే పదంలో మార్పులు చోటుచేసుకుని ఎర్నలిస్ట్ అనే కొత్త అర్దాలు చలామణిలోకి వచ్చాయి . జర్నలిజం అనే పదానికి ఎర్నలిజం అనే కొత్త పేర్లు వాడుకలోకి వచ్చాయి . సంపాదకులకు అర్దాలు మారిపోయి ఆ హోదా గురించి చెప్పుకోవడానికే సిగ్గు పడే రోజులు వచ్చాయి .
రాజకీయ నాయకులే వ్యాపారస్తులై మీడియా రంగంలో అడుగుపెడుతుంటే కొంతమంది జర్నలిజం పేరుతో బానిసత్వంతో తన యజమానికి ఊడిగం చేస్తూంటే ఇంకెక్కడి జర్నలిజం? ఇంకెక్కడి జర్నలిస్టులు?
బడా వ్యాపారస్తులు రంగంలోకి దిగి కార్పొరేట్ స్థాయిలో జర్నలిజం మీద పెట్టుబడులు పెట్టి అబద్ధాలనే సత్యాలని నమ్మించి కోట్లు గడిస్తుంటే ఇంకెక్కడి జర్నలిజం ఉంది ?
ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వారు.. నండూరి వారు.. నార్ల వారు అని గౌరవంగా పిలుచుకునే స్థాయి నుంచి బూతు కిట్టిగా.. రేయ్ ఫైవూ.. అరేయ్ సాంబడూ.. లాంటి నిక్ నేములతో సోషల్ మీడియాలో దురభిమానులు తిట్టే పరిస్థితికి దిగజారింది నేటి జర్నలిజం ( క్షమించాలి..ఇటువంటి పిలుపులను నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించను .కానీ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నేను ఇలాంటి తిట్లే చూస్తున్నాను)
అలా పిలిపించునే పరిస్థితికి కారణం ఎవరు? పడిపోయిన జర్నలిజం విలువలా?
సొంత మీడియాలను పోషిస్తున్న రాజకీయ నాయకులదా ? నాలుగు రాళ్ల కోసం యజమానికి బానిసలు అవుతున్న ఎర్నలిస్టులదా?
గతంలో నేను జర్నలిస్టును అని గౌరవంగా చెప్పుకునే పరిస్థితి సమాజంలో ఉండేది. ఇప్పుడు అది కాస్తా నేను జర్నలిస్టును అని చెప్పుకోగానే ముందు నువ్వు ఏ పార్టీయో చెప్పు.. లేదా ఏ ఛానల్ లో పనిచేస్తున్నావో చెప్పు.. నువ్వే పార్టీకి బాకా ఊదుతావో నేనే చెప్తా అనే స్థితికి వచ్చింది నేటి ఎర్నలిస్టుల పరిస్థితి . ఫలానా పత్రికలోనో , ఫలానా ఛానల్ లోనో పనిచేస్తున్నా అంటే వెనకున్న యజమాని బట్టి గౌరవం ఇచ్చే పరిస్థితులు వచ్చాయి . అందరూ అటువంటి వారే అని అర్ధం కాదు కానీ ఈ అక్షర కాలుష్యంలో చాలామంది భాగస్వాములు అయ్యారు .
టీవీ 5 , ABN ఛానల్స్ ఓపెన్ చేస్తే ఏ పార్టీకి బాకా ఊదుతాయో ఇట్టే తెలిసిపోతుంది. ఏ నాయకుడ్ని భుజాన మోస్తాయో వెంటనే అర్థమౌతుంది . ఆ ఛానల్స్ లో జగన్ రెడ్డి అంటూ ప్రతి సాయంత్రం వెటకారపు చర్చలు మొదలౌతాయి .
చర్చలు అంటే పెద్దగా ఏమీ ఉండదు . ఛానల్ డిస్కషన్స్ లో ఎవరికీ అనుకూలంగా మాట్లాడాలో ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాలో ముందే నిర్ణయించిన స్క్రిప్ట్ ను చదువుకుని స్టూడియోకు వచ్చిన నలుగురు పెద్దమనుషులు తాన అంటే తందాన అంటే చాలు . మిగతాదంతా మోడరేటర్ గా ఉన్న న్యూస్ యాంకర్ చూసుకుంటాడు .
జగన్ రెడ్డి ఫలానా ప్రాజెక్టులో ఫలానా అవినీతి చేసాడని ఆరోపణలు వచ్చాయి..దీనిపై మీ స్పందన ఏంటి? అని అతగాడు సదరు చర్చకు వచ్చిన పెద్దమనిషికి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలో హింట్ కూడా ఇస్తాడు .
అలాగే సాక్షి ఛానల్ ఓపెన్ చేస్తే చంద్రబాబు పాలనపై చర్చ ఉంటుంది . ప్రతి సాయంత్రం న్యూట్రల్ ముసుగులో ఉన్న పెద్దమనుషులను స్టూడియోలో కూర్చోబెట్టుకుని చంద్రబాబు మీద తమకు కావాల్సిన తిట్లను తిట్టిస్తారు .
ఈ ఎపిసోడ్లు అన్నిటికీ జర్నలిజం అనే పేరు . ఇదంతా జర్నలిజం ముసుగులో పక్కగా జరుగుతున్న రాజకీయ కార్యకలాపాలు . ఇందులో దాపరికాలు ఏమీ లేవు . దాచుకోవడానికి కూడా ఏమీ లేదు . అంతా ఓపెన్ గా జరుగుతున్న వ్యవహారమే .
ఇదిలా ఉండగా ఆయా ఛానళ్ల తాలూకు రాజకీయ పార్టీల సోషల్ మీడియాలు కూడా ఇటువంటి అమ్ముడుపోయిన ఛానళ్లను తమ భుజాన మోస్తూ ఇతోధికంగా సాయం చేస్తూ ఉంటాయి .
రాజకీయ పార్టీల అంటకాగినందుకు ఆయా ఎర్నలిస్టులకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో కూడా అటు రాజకీయ పార్టీలు కానీ ఇటు పుచ్చుకుంటున్న వారుగానీ నామోషీ పడుతున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు . తమ పార్టీలకు వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా వారికి ప్రభుత్వ సొమ్ముతో భారీ జీతభత్యాలు , అలవెన్సులు ,కొన్నిచోట్ల క్యాబినెట్ ర్యాంకులు కూడా ఇచ్చి రుణం తీర్చుకుంటున్నారు . ఇవన్నీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా బహిరంగంగా జరిగిపోతున్నాయి .
ప్రభుత్వ సలహాదారు పదవి అధిష్టించిన సీనియర్ జర్నలిస్ట్ ఏకంగా పార్టీ జెండాలనే భుజాన వేసుకుని పని చేస్తున్నా అడిగే నాధుడు లేడు . మరికొందరు పార్టీ జెండా కనిపించకుండా పైకి మాత్రం జర్నలిజం తోలు కప్పుకుని చీకటి పనులు చేస్తున్నారు . వీళ్ళని ప్రశ్నించే నాధుడు లేడు . నేటి రోజుల్లో జర్నలిజం ఎంత చండాలంగా తయారైందంటే నికార్సైన జర్నలిస్టును అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడేంతలా తయారయ్యింది పరిస్థితి .
మళ్ళీ కొమ్మినేని అరెస్ట్ వార్త విషయానికి వస్తే,
యథాప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షి టీవీలో నిర్వహించే చర్చా కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని అని టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ అమరావతి వేశ్యల రాజధాని అని తాను కొత్తగా కనుగొన్న విషయాన్ని చెప్పాడు .
అమరావతిలో వేశ్యలు ఉంటారు అనడానికి వేశ్యలంతా అమరావతిలో ఉంటారు అనడానికి చాలా తేడా ఉంది . ఆయన మాటల్లో రెండో అర్థమే ధ్వనించింది . నిజానికి జర్నలిజం భాషలో చెప్పాలంటే ఇది విపరీతమైన వ్యాఖ్యలు . బాధ్యతాయుతమైన వృత్తిలో అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ స్థాయికి తగిన వ్యాఖ్యలు కావు . ఈ వాఖ్యల వల్ల ఆశించిన రాజకీయ ప్రయోజనం సంగతి అటుంచితే మహిళల నుంచి ఆయన తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది . ఏదైనా జర్నలిస్టును అని చెప్పుకునే ఆ పెద్ద మనిషి అటువంటి వాఖ్యలు చేయడం ముమ్మాటికీ తప్పే అవుతుంది .
ఈ విషయంలో సాక్షి ఛానల్ కూడా ఆ వాఖ్యలు పూర్తిగా అతడి వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి సాక్షి ఛానల్ బాధ్యత వహించదని వివరణ ఇచ్చింది . ఆ రోజు ఆ కార్యక్రమానికి మోడరేటర్ గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు , కృష్ణంరాజు అటువంటి వాఖ్యలు చేసినప్పుడు వెంటనే ఖండించి ఉండాల్సిందనీ.. లేదా లైవ్ లోనే అతడి చేత క్షమాపణలు చెప్పించి ఉండాల్సిందని సాటి జర్నలిస్టులే అభిప్రాయ పడ్డారు .
ఈ వివాదం పైన కృష్ణంరాజు వివరణ ఇచ్చారు కానీ ఆ వివరణ సమర్ధింపు ధోరణిలో ఉంది కానీ పశ్చాత్తాప ధోరణిలో లేదు . ఇది మరో తప్పిదం . తెలియక దొర్లిన తప్పును పశ్చాప్త ధోరణితో కొంతవరకు సరిదిద్దుకోవచ్చు . కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి .
ఈ నేపధ్యంలో ప్రభుత్వం కొమ్మినేనిని అరెస్ట్ చేసింది . చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే సిద్ధాంతాన్ని నమ్మేవారే జర్నలిస్టును అరెస్ట్ చేయడం అక్రమం అని నిరసనలు వ్యక్తం చేసారు . కొమ్మినేని కానివ్వండి.. టీవీ 5 మూర్తి కానివ్వండి.. సాంబశివరావు కానివ్వండి.. వెంకట కృష్ణ కానివ్వండి.. ఎవరైనా చట్టానికి అతీతులు కారు అనే సత్యాన్ని ఇటువంటి పరిస్థితుల్లో విస్మరించడం సరి అయినది కాదు కదా ?
ఇక కొమ్మినేని అరెస్టును వారు అంటున్నట్టు ఇంకో కోణంలో కూడా పరిశీలించి చూద్దాం .
కొమ్మినేని విషయంలో ఒక జర్నలిస్టును అరెస్ట్ చేయడం ఎంతమాత్రం తప్పు కాదు కానీ అది రాజకీయ ప్రేరేపిత కక్షతో చేస్తే మాత్రం ముమ్మాటికీ తప్పే . రాజకీయ ప్రేరేపిత కక్షలలో భాగంగా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే ప్రతి ఒక్కరూ ఖండించవల్సిందే . అటువంటి సంఘటనలలో పోరాడటానికి , న్యాయం పొందటానికి న్యాయస్థానాలు ఎటూ ఉన్నాయి . వాటి ద్వారా పూర్తి న్యాయం ఎలానూ పొందే అవకాశం ఉంటుంది . కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉద్రిక్తల నివారణకు సహకారం అందించడమే నిజమైన జర్నలిస్టుల బాధ్యత .
ఏతావాతా ఈ సంఘటనతో జర్నలిస్టులు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీల కొమ్ము కాస్తే ఏ నాటికైనా ఆ పార్టీ నాయకుల కన్నా వ్యక్తిగతంగా వీళ్ళకే ఎక్కవ చేటు చేస్తుందని తెలుసుకోవాలి . అంతిమంగా ప్రజల మద్దతు కూడా విలువలతో కూడిన జర్నలిజానికీ.. నిష్పాక్షికంగా వార్తలు అందించే జర్నలిస్టులకు మాత్రమే ఉంటుంది !
