దైవం మానుష రూపేణా
ఏ దిక్కులేనివాడికి దేవుడే దిక్కు అన్నారు పెద్దలు
అయితే మాములు మనుషులం మనకే ఇన్ని పనులుంటే సర్వాంతర్యామి దేవుడికి ఇంకెన్ని పనులుంటాయి ?
అన్ని అర్జీలను పరిశీలించి పరిష్కారించటానికి ఒకోసారి ఆయనక్కూడా సమయం సరిపోదు
అందుకని కొంతమంది మనుషుల్లోనే దేవుళ్ళని సృష్టించాడు
అలాంటి మనుషుల్లోని దేవుళ్ళ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను
ఫోటోలో చూసారు కదా పిల్లలు
అమ్మానాన్నలు ఎవరో తెలియని ఆనాధలు
జగమంత కుటుంబం నాది .. ఏకాకి జీవితం నాది అని సిరివెన్నెల గారన్నట్టు ఏకాకులైన వీళ్లది కూడా జగమంతా కుటుంబమే
కన్నతల్లితండ్రులు ఎవరో తెలియకపోయినా ఆపన్నహస్తం అందించిన ప్రతి చేయీ అమ్మానాన్నలదే అనుకునే పసి మనసులు
అందుకే ఈ పసిమనసులను అక్కున చేర్చుకుని ఆదరించేందుకు సీఎస్ రాజు గారు కాప్ బౌల్ పేరిట అనాధ పిల్లలకోసం ఓ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు
సికింద్రాబాద్ లోని సౌత్ లాలాగూడలో తన ఇంటినే పిల్లల షెల్టర్ గా మార్చి ఎంతో మంది అనాధ పిల్లలకు సేవలు అందిస్తున్నారు
పిల్లలకు వస్త్రాలు ,ఆహరం ,చదువు చెప్పటం మొదలైన అన్ని పనులు వీరే చేస్తారు
వీరి సేవకు మెచ్చి కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సత్కరించారు కూడా
కాప్ బౌల్ ఫౌండర్ సీఎస్ రాజు మరణంతో ఆయన భార్య ప్రస్తుతం అనాధ పిల్లల ఆలనాపాలనా చూస్తున్నారు
స్వచ్ఛంద సేవా సంస్థలు , ఇతర దాతలు ఇచ్చే విరాళాలతో ఇప్పటివరకు పిల్లలకు ఏ లోటూ లేకుండా చేసుకుంటున్నామని ఆవిడ చెప్పారు
మొన్న శుక్రవారం రాత్రి మా అన్నయ్య గారి కొడుకు జ్ఞాపకార్థం అక్కడి అనాధ పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది
భోజనం చేసే ముందు అందరూ ప్రార్థన చేసారు
అన్నదానం అనంతరం పిల్లలకు స్వీట్లు , చాకోలెట్లు ,గిఫ్ట్ ప్యాకెట్లు ఇస్తే వారి కళ్ళల్లో కనిపించిన సంతోషం వర్ణనాతీతం
ఇలాంటి చిన్న ఆత్మీయతలే కదా మనకూ మనసుకి హాయి అనిపించేది అలాగే అనాధ పిల్లల జీవితాల్లో వెలుగు నింపేవి !
అనాధ పిల్లల వెల్ఫేర్ కోసం విరాళాలు ఇచ్చేవారు గూగుల్ లో కాప్ బౌల్ చిల్డ్రన్స్ హోమ్ సికింద్రాబాద్ అని సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి !
పరేష్ తుర్లపాటి