రాజకీయాల్లో కొంతమంది జీవిత కాలం కష్టపడినా ఉన్నత స్థానాలకు ఎదగలేరు . కానీ కొంతమంది మాత్రం అవకాశాలను అందిబుచ్చుకుని అతి తక్కువ సమయంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు . రాజకీయాల్లో సరైన అవకాశాల కోసం వేచి చూసేది కొందరైతే , అవకాశాలను సృష్టించుకుని మరీ పైకి ఎగబాకేది మరికొందరు . ప్రాంతీయ స్థాయిలో నేతగా ఎదిగిన చాలామంది అక్కడితోనే తమ రాజకీయ ప్రస్థానం ముగిస్తారు . కానీ కొంతమంది మాత్రమే తమ నాయకత్వ సామర్థ్యంతో జాతీయ పార్టీ నాయకత్వాలను కూడా మెప్పిస్తారు . అటువంటి వారిలో తెలుగు రాష్ట్రాలనుంచి ముఖ్యంగా ఇద్దరి పేర్లను చెప్పుకోవచ్చు . వారిలో మొదటివారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాగా , రెండో వారు రేవంత్ రెడ్డి
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చక్రం తిప్పి రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన సంగతి అందరికీ తెలిసిందే . కాకపోతే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని వైఎస్ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నా సమీకరణాల దృష్ట్యా ఆయన 2004 వరకు ఆగాల్సి వచ్చింది . రాత్రికి రాత్రి ఆయన సీఎం అవలేదు . ముందునుంచీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ పులివెందుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగాడు . అయినా ఆయన ఆశించిన పదవి దక్కలేదు . అందుకు కారణం జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర విభాగంలో ఉన్న చాలామంది నాయకులలో ఆయన కూడా ఒకరు .
అయినా వైఎస్ చాలామంది నాయకుల మాదిరి తన రాజకీయ ప్రస్థానాన్ని అంతటితో ఆపలేదు . నిరుత్సాహపడి వెనుకంజ వేయలేదు . మెల్లిగా ప్రజల్లోకి వెళ్లి తన బలాన్ని పెంచుకున్నారు . ప్రజల్లో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు . ప్రజా క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు మిగిలిన లీడర్లకు , వైఎస్ కు మధ్య నాయకత్వ సామర్థ్యం స్పృష్టంగా కనిపించేది . నిజానికి వైఎస్ రాజకీయ కెరీర్ పీక్ కు వెళ్ళింది 2004 సంవత్సరం నుంచే మొదలైంది .
ఏపీలో సరైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి వైఎస్ రూపంలో నాయకుడు దొరికాడు . తనకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే పార్టీని పదేళ్ళపాటు అధికారంలోకి తీసుకురాగలననే భరోసాని ఢిల్లీ నాయకత్వంలో కలగచేయడంలో వైఎస్ సఫలం అయ్యారు . పార్టీ అధినాయకత్వం ఆయన మాటలను విశ్వాసంలోకి తీసుకుని రాష్ట్ర పార్టీ పగ్గాలు వైఎస్ చేతిలో పెట్టింది .
అందివచ్చిన అవకాశాన్ని , అధినాయకత్వం తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని వైఎస్ చేజారాదల్చుకోలేదు . కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మండుటెండలో పాదయాత్రలు చేసారు .కాళ్ళు బొబ్బలెక్కినా లెక్కచేయలేదు . వయసును , ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా షుమారు మూడువేల కిలోమీటర్లు మండే ఎండల్లో ఊరు ఊరుకి తిరిగి పాదయాత్రలు చేసారు . వైఎస్ కష్టం ఫలించింది . కార్యకర్తల్లో నమ్మకాన్ని కలిగించడంలోనూ , ద్వితీయ శ్రేణి నాయకులను ఏకతాటి మీద నడిపించడంలోనూ ఆయన విజయం సాధించారు . పార్టీని దిగ్విజయంగా అధికారంలోకి తీసుకువచ్చారు . తమ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో అధినాయకత్వం దృష్టిలో ఆయన నిలిచిపోయారు . దాంతో సోనియాకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు .
అతడి నాయకత్వ సామర్ధ్యాన్ని గుర్తించిన పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది . 2004 లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన వైఎస్ కు పార్టీ అధిష్టానం పాలనలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది . దానితో ఆయన ఆరోగ్యశ్రీ , విధ్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రజల్లో పేరు సంపాదించుకున్నారు . ముఖ్యంగా వైఎస్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పధకం పేదల పాలిట వరం అయ్యింది . రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందటంతో రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోయింది . మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ పధకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ముందుకొచ్చాయి . దాంతో వ్యక్తిగతంగా వైఎస్ పాపులారిటీ కూడా మరింత పెరిగింది .
అందుకే వైఎస్ మీద నమ్మకంతో 2009 లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత ఆయనకే అప్పచెప్పారు సోనియాగాంధీ . పార్టీ అధినాయకురాలికి ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి వచ్చి తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు .
రెండోసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొద్ది నెలలకే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్య ఎదుర్కొంది . వైఎస్ మాదిరి ప్రజల్లో మాస్ లీడర్ గా పేరున్న నేత ఎవరూ లేకపోవడంతో సీనియర్ నేత రోశయ్యకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు . రోశయ్య కేవలం సీనియర్ లీడర్ మాత్రమే కాదు ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కోగల నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉన్నవాడు . అయితే అప్పటికే వయో భారం మీదపడటంతో రోశయ్య అయిష్టంగానే సీఎం పదవికి తాత్కాలిక బాధ్యతలు తీసుకోవడానికి ముందుకువచ్చారు .
రోశయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవిలోకి వచ్చినా రాష్ట్ర నాయకుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు అంతంత మాత్రమే . వైఎస్ స్థాయి నాయకత్వ సామర్థ్యం ఆయనలో లేదు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్య ఎదుర్కొంటూనే ఉంది . ఇలాంటి పరిస్థితుల్లో 2014 లో ఏపీ విభజన అనంతరం జరిగిన ఎన్నికలలో టీఆరెస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు . విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోగా తెలంగాణాలో చతికిలపడింది .
2014 నుంచి 2023 వరకు షుమారు 9 సంవత్సరాల 187 రోజుల కేసీఆర్ పాలన సాగింది . ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణాలో కేసీఆర్ నాయకత్వాన్ని ధీటుగా ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజల్లో మాస్ లీడర్ గా పేరున్న నాయకుడి కోసం కాంగ్రెస్ అధినాయకత్వం గాలించింది . సరిగ్గా ఆ పరిస్థితుల్లో టిడిపికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి వారి దృష్టిలో పడ్డాడు . రేవంత్ ప్రొఫైల్ చూసిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది . ఇది రేవంత్ రాజకీయ కెరీర్ లో దొరికిన అరుదైన అపురూప అవకాశం . ఎందుకంటే రాష్టంలో మహామహులైన సీనియర్ నాయకులూ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను నమ్మి పార్టీ పగ్గాలు అప్పగించింది. ఈ అవకాశాన్ని రేవంత్ చేజార్చుకోలేదు .
అందివచ్చిన అవకాశాన్ని తన పొలిటికల్ కెరీర్ కోసం రేవంత్ చక్కగా వినియోగించుకున్నారు . 2023 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ సారధ్యంలో 119 స్థానాల్లో 64 స్థానాలు గెల్చుకుని పార్టీ అధికారంలోకి వచ్చింది . దరిమిలా ముఖ్యమంత్రి పదవికి అధిష్టానం ఆయన పేరునే ఖరారు చేసింది .
కాంగ్రెస్ పార్టీలాంటి జాతీయ పార్టీలో ప్రాంతీయస్థాయిలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం అంటే కత్తి మీద సాములాంటిదే . సీఎం అటు అధిష్టానానికి జవాబుదారిగా ఉండాల్సిరావడంతో పాటు ఇటు స్థానికంగా మంత్రివర్గ సభ్యులను ,ఎమ్మెల్యేలను కూడా సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సి ఉంటుంది .
కానీ ఏం మాయ చేస్తున్నాడో ఏమిటో కానీ రేవంత్ ఈ రెండు విషయాల్లో చక్కగా మ్యానేజ్ చేసుకుంటూ సక్సెస్ అయ్యాడు . కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో, నాయకులలో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న నాయకులకు కొదవ లేదు . లోపల ఏముందో తెలీదు కానీ ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న నాయకులు కూడా బహిరంగంగా రేవంత్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. అదే రేవంత్ మ్యాజిక్ . నిజానికి ఈ పరిణామాలను కేసీఆర్ కూడా ఊహించలేదు .
ఈ విషయంలో రేవంత్ చాలా చాకచక్యంగా పార్టీ నాయకులను హ్యాండిల్ చేస్తున్నారు. జగ్గారెడ్డి లాంటి నాయకుడు కూడా పదేళ్లు తెలంగాణకు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆ తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి రేసులో తానుంటానని పార్టీ వేదికలో చెప్పారు . అదే తోవలో మిగిలిన మంత్రుల ప్రకటనలు కూడా ఉన్నాయి .
మరోవైపు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందని వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ నిన్న ఢిల్లీ ఏఐసీసీ భవన్ లో కులగణన మీద జరిగిన సదస్సులో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు . కులగణన సర్వే విజయవంతం గా పూర్తిచేసిన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ చరిత్రలో నిలిచిపోతారని ఆయన అన్నారు . ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రేవంత్ మోడల్ ను ఫాలో అవుతున్నారని రాహుల్ పొగడ్తలు కురిపించారు .
అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సదస్సులో కులగణన సర్వే పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి నడిచివస్తుండగా ముందు వరుసలో ఆశీనులైన రాహుల్ గాంధీ లేచి నిలబడి మరీ రేవంత్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు . ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కొత్త అధ్యాయం . రేవంత్ కూడా ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కనే కూర్చున్న మల్లికార్జున్ ఖర్గేకు కూడా ముందు షేక్ హ్యాండ్ ఇచ్చి వెంటనే పాద నమస్కారం కూడా చేసారు .
ఏదిఏమైనా ఢిల్లీలో జరిగిన సదస్సులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి గౌరవం ఇవ్వడమే కాకుండా తెలంగాణాలో ఆయన పని తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది . ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సూపర్ పవర్ నాయకుడిగా ఎదుగుతున్నారని రాజకీయ పరిశీలకులకు ఇట్టే అర్ధమౌపోతుంది !
పరేష్ తుర్లపాటి
