పర్యాటక రంగం మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలే కానీ దాన్ని మించిన చక్కటి ఆదాయ వనరు మరోటి ఉండదు . చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుని ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి . కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు నిరుపయోగంగా మారిపోతున్నాయి . చక్కటి టూరిజం స్పాట్లు ఉన్నా కూడా వాటి మీద దృష్టి పెట్టకపోవడంతో అవి అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి . దాంతో పర్యాటక రంగంలో ఆదాయాన్ని ఆయా ప్రభుత్వాలు కోల్పోతున్నాయి . నిజంగా అధికారులు టూరిజం అభివృద్ధి చేయాలనుకుంటే భారీ బడ్జెట్ కూడా అవసరం లేదు . సరైన ప్రణాళిక ఉంటే సరిపోతుంది . స్థానికంగా చిన్న , చిన్న మౌలిక వసతులు కల్పిస్తే సరిపోతుంది .
దక్షిణాది రాష్ట్రాల్లో టూరిజం విషయంలో కేరళ , తమిళనాడు మెరుగ్గా ఉంటాయి . ప్రకృతి పరంగా కేరళలో చక్కటి అందాలను ఆస్వాదించే అవకాశం ఉండగా .. రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో పాటు చక్కటి దేవాలయాల సందర్శనకు తమిళనాడు అనువుగా ఉంటుంది . అందుకే కేరళని దేవతల భూమిగా అభివర్ణిస్తారు . పచ్చదనానికి స్థానిక ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తాయి . కేరళలో ఎటు చూసినా పచ్చదనంతో సరికొత్త అందాలను ప్రసాదిస్తుంది . నిజంగా ప్రకృతి ప్రేమికులకు కేరళ రమణీయ స్థలం . అందువలననే టూరిజం ఆదాయంలో కేరళ ముందుంటుంది .
ఇక తమిళనాడు గురించి చెప్పుకోవాలంటే ఆధ్యాత్మిక పరంగా గుళ్ళు ,గోపురాలకు కొదవ లేదు . వెయ్యేళ్ళ క్రితం గుళ్లు కూడా నేటికీ చెక్కుచెదరకుండా ఇంజనీరింగ్ అద్భుతాలుగా నిలిచాయి . అలాగే స్థానిక ప్రభుత్వాలు కూడా వారసత్వ సంపదను జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాయి . దాదాపు ప్రతి ఊరికీ ఒక అద్భుతమైన దేవాలయం ఉండటంతో దేశ , విదేశాల నుంచి తమిళనాడు దేవాలయాల సందర్శనకు వచ్చే భక్తులు ఎక్కువే . తెలంగాణలోని వరంగల్ రామప్ప దేవాలయం కూడా వెయ్యేళ్ళ క్రితం నిర్మించిందే . కానీ అధికారుల నిర్లక్ష్యమో , సరైన ఆలనాపాలనా లేకపోవడంతో తెలీదు కానీ ఇందులో చాలావరకు శిల్ప సంపద జీర్ణ దశకు చేరుకున్నాయి . నిజంగా వేయి స్తంభాల గుడి కానీ , రామప్ప దేవాలయం కానీ ఆనాటి అద్భుతమైన ఇంజనీరింగ్ కు ప్రతీకగా నిలుస్తాయి .ఈ రోజుకీ ఇక్కడ సందర్శకుల తాకిడి బాగా ఉంటుంది . అధికారులు కొంచం శ్రద్ద పెడితే ప్రాచీన వారసత్వ సంపదను పరిరక్షించడమే కాకుండా భావి తరాలకు కూడా భారతీయ శిల్ప కళను పరిచయం చేసిన వారు అవుతారు .
ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా చక్కటి టూరిజానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి . కానీ ప్రభుత్వాల అశ్రద్ధ వల్లో .. అధికారుల నిర్లక్ష్యం వల్లనో తెలీదు కానీ పర్యాటక రంగం ఆశించిన విధంగా అభివృద్ధి చెందలేదు .
తెలంగాణాలో హైద్రాబాదుకు 75 కిలోమీటర్ల దూరంలో వికారాబాదు సమీపంలో ఫారెస్ట్ ఏరియాలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే అనంతగిరి హిల్స్ ఉంది . చుట్టూ చిన్న చిన్న కొండలతో పచ్చందాలు పరుచుకుని పర్యాటకులను చూపు తిప్పుకోనీయవు .వికారాబాద్ దాటిన తర్వాత చుట్టూ ఫారెస్టును తలపించే పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి . నిజానికి అదంతా ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతమే . ఆ దారిగుండా కొద్ది దూరం ప్రయాణించి ముందుకు వస్తే అనంతగిరి హిల్స్ మనకు స్వాగతం పలుకుతాయి .
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే షుమారు వెయ్యి సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి కోవెల ఉంది . చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన కోవెల భక్తులను ఆధ్యాత్మిక భావనతో కట్టిపడేస్తుంది . అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో పురాతన శివాలయం ఉంది . పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న శివాలయం భక్తులకు మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది . చాలామంది భక్తులు దూర ప్రాంతాల నుంచి ఈ దేవాలయ సందర్శన కోసం వస్తారు .
ఇక అనంతగిరి హిల్స్ కేవలం భక్తులకు మాత్రమే కాదు పర్యాటకులకు కూడా చక్కటి అనుభూతిని ఇచ్చే ప్రదేశం . అనంత పద్మనాభ స్వామి గుడి నుంచి షుమారు 20 కిలోమీటర్లు వెళితే వ్యూ పాయింట్ వస్తుంది . మీరు వ్యూ పాయింట్ ఎంట్రన్స్ లోకి రాగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గార్డ్ వెహికల్ పార్కింగ్ కి టోకెన్ ఇచ్చి 50 రూపాయలు తీసుకుంటాడు. అలా అని ముందుకెళ్లి పార్కింగ్ ఎక్కడుందా అని చూస్తే మనకేమీ కనిపించదు .
అక్కడ కొంత ఖాళీ స్థలం కనిపిస్తుంది . మనం అదే పార్కింగ్ అనుకోవాలి . మేము వెళ్ళినప్పుడు వర్షం పడటంతో ఆ ఖాళీ స్థలం అంతా బురదతో నిండిపోయింది . పోనీ ఆ ఖాళీ స్థలాన్ని ఉచిత పార్కింగ్ కింద వదిలేశారా అంటే అదీ లేదు . పార్కింగ్ రుసుము కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాభై రూపాయలు వసూలు చేయడాన్ని తప్పు పట్టడం లేదు . అలా పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్నప్పుడు కనీస సౌకర్యాలు కల్పించాలి కదా ? గుంతలు , బురదతో ఆ ప్రదేశమంతా అస్తవ్యస్తంగా ఉంటుంది . చిన్నకార్లు బురదలో దిగబడితే అంతే సంగతులు .
సరే ఎలాగోలా ఆ బురద గుంతలలోనే ఎక్కడో ఒకచోట వెహికల్స్ పార్క్ చేసుకుని వ్యూ పాయింట్ చూద్దామని ఒక ఐదు వందల మీటర్లు నడుచుకుంటూ వెళితే చెరువు కనిపిస్తుంది. వ్యూ పాయింట్ అంటే అక్కడ ఏదో బ్రహ్మాండమైన సీనరీ ఉందనుకుంటే తప్పులో కాలేసినట్టే . అలాంటివేమీ ఉండవు . చిన్న రిజర్వాయర్ చుట్టూ చెరువు ఉంటుంది .
అక్కడ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళో , కాంట్రాక్టరో తెలీదు కానీ ఒక చిన్న టెంటులో ఓ కుర్రాడు బల్ల వేసుకుని టికెట్లు కొడుతున్నాడు . తెడ్డు వేసుకుని చిన్న పడవ మీద సెల్ఫ్ డ్రైవ్ వెళ్లాలంటే ముప్పై నిమిషాలకు ఇద్దరికీ 300 రూపాయలు తీసుకుంటాడు . పెడెస్టెల్ బోట్ అయితే 400 రూపాయలు తీసుకుంటాడు . నిజానికి అక్కడ చెరువును చూసినవాళ్ళకి ఈ పడవల రేట్లు ఎక్కువే అని అనిపించక మానవు . కొంతలో కొంత నయం ఏంటంటే టికెట్ తీసుకున్నవాళ్ళకి లైఫ్ జాకెట్లు ఇస్తారు . అవి వేసుకుని ఓ అర్ధగంట అలా చెరువులో షికారు చేసి రావొచ్చు అన్నమాట . వాళ్ళు చేసిన ఇంకో మంచి పని ఏంటంటే ఒకవేళ నీటి ప్రమాదాలు ఏర్పడితే రక్షించటానికి గజ ఈతగాళ్లను సైతం సిద్ధంగా ఉంచారు .
ఇంతవరకు బానే ఉంది . కానీ వచ్చిన పర్యాటకులు కూర్చుని సేద తీరడానికి అక్కడ కనీస సౌకర్యాలు లేవు . ఎంతమంది వచ్చినా నిలబడాల్సిందే . బోటింగ్ పాయింట్ అన్నప్పుడు అక్కడ కనీసం కూర్చునే సదుపాయాలు అయినా కల్పించాలి కదా ? అవేమీ లేవు . పోనీ నేల మీద కూర్చుందామా అంటే నేలంతా చెత్తాచెదారంతో తడిగా ఉండటంతో కింద కూర్చోలేం . బోట్ రైడింగ్ కోసం అంతంత ధరలతో టికెట్లు పెట్టినప్పుడు పర్యాటకుల కోసం కనీసం కొన్ని సీటింగ్ ఛైర్స్ వేయలేరా ? సరే ఇవేమీ వద్దు . కనీసం ఆ వ్యూ పాయింటును అందంగా తీర్చి దిద్దారా ? అంటే అదీ లేదు . టూరిజం అధికారులు కాస్త శ్రద్ద పెడితే వ్యూ పాయింట్ అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు .
చెరువు గట్టు అంతా చక్కటి లాన్ వేస్తే చూడటానికి అందంగా ఉండటంతో పాటు పర్యాటకులు సేద తీరడానికి అనువుగా ఉంటుంది . అక్కడే చిన్నపిల్లల కోసం ప్లే ఏరియా ఏర్పాటు చేసి టికెట్లు పెడితే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు పర్యాటకులు ఎంజాయ్ చేస్తారు .
ఇక ఎంతో దూరాల నుంచి మారుమూల ప్రాంతాలకు వచ్చిన పర్యాటకులకు అక్కడ సరైన టాయిలెట్ సదుపాయాలు లేవు . యూరినల్స్ కోసం అక్కడే ఒక పెయిడ్ మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసారు కానీ పూర్తి అపరిశుభ్రంగా ఉంది .అంతమంది పర్యాటకులకు ఆ ఒక్క పెయిడ్ మొబైల్ వ్యాన్ ఒక్కటే దిక్కు . పోనీ అదన్నా సరిగా మెయింటైన్ చేస్తున్నారా ? అంటే అదీ లేదు . టూరిజం అధికారులు శ్రద్ద తీసుకుని శాశ్వత ప్రాతిపదికన గ్రీన్ పబ్లిక్ టాయిలెట్ సిస్టం అందుబాటులోకి తీసుకువస్తే మహిళలు ఇబ్బంది పడకుండా ఉంటారు .
ఇక అక్కడికి వచ్చిన పర్యాటకులకు ఫుడ్ కావాలంటే రోడ్ సైడ్ కాకా హోటళ్లే దిక్కు . పోనీ అక్కడ ఫుడ్ బావుంటుందా అంటే అదీ లేదు . రుచీపచీ ఉండవు . దానికి తోడు శుభ్రత అసలే ఉండదు . దుమ్ము ధూళి , ఈగలతో అపరిశుభ్రంగా ఉంటాయి . ధరలు చూస్తే మాత్రం నిలువు దోపిడీ .
పట్టించుకునే నాధుడు లేనప్పుడు అంతే ఉంటుంది కదా . అధికారులు హరిత హారం రెస్టారెంట్లు ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే బావుంటుంది .
అక్కడ్నుంచి తిరిగొస్తుంటే ట్రెక్కింగ్ పాయింట్ కనిపిస్తుంది . ట్రెక్కింగ్ చేయాలనుకునే పర్యాటకులు ఆ కొండల్లోకి పోయి సాయంత్రానికి తిరిగి రావాలి . నిజానికి ఈ ట్రెక్కింగ్ లో థ్రిల్ యెంత ఉంటుందో ఆదమరిస్తే కిల్ కూడా అంతే ఉంటుంది . రైనీ సీజన్లో ఈ ట్రెక్కింగ్ మరీ డేంజర్ .. కాలు జారితే అంతే సంగతులు .
మొన్న మేము వెళ్ళినప్పుడు వర్షంలో కుర్రకారు ట్రెక్కింగ్ చేస్తూ ఎక్కడికో వెళ్లిపోతున్నారు .
ఇక్కడ కూడా పట్టించుకునే నాధుడు లేడు . ప్రాణాపాయం సంగతి అలా ఉంచితే పోకిరీల బారి నుంచి అమ్మాయిలకు రక్షణ కల్పించే కనీస ఏర్పాట్లు ఏవి ? నిర్మానుష్యమైన ఆ ప్రాంతంలో చిన్న సెక్యూరిటీ పోస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది .
చివరగా ప్రభుత్వ పెద్దలు .. టూరిజం అధికారులు కొంచెం శ్రద్ద పెడితే అనంతగిరి హిల్స్ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారుతుంది అనడంలో సందేహం లేదు !
పరేష్ తుర్లపాటి
