ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పేరుతొ ప్రాంతీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే
అయితే 1993 లో లక్ష్మి పార్వతిని వివాహం చేసుకున్న తర్వాత ఆయన రాజకీయ జీవితంలోనూ , వ్యక్తిగత జీవితంలోనూ పెను మార్పులు సంభవించాయి
తల్లిని అమితంగా ప్రేమించిన ఎన్టీఆర్ వారసులు లక్ష్మి పార్వతిని తల్లి స్థానంలో ఊహించలేకపోయారు
పార్టీలో కొందరు అన్నగారి నిర్ణయానికి మద్దతు తెలపగా , మరికొంతమంది బయటపడకుండా గుంభనంగా ఉన్నారు
ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి రాక పార్టీలోనూ .. కుటుంబ సభ్యులలోనూ అగ్ని పర్వతంలా రగిలి 1995 లో చంద్రబాబు ఎన్టీఆర్ మీద చేసిన తిరుగుబాటుతో పరాకాష్టకు చేరింది
ఈ తిరుగుబాటుకు నాంది పడింది ఎక్కడో తెలుసా ?
విజయవాడలో ఓ వస్త్ర దుకాణంలో
అదీ ఓ సాయంకాలం దినపత్రిక విలేఖరి అడిగిన ప్రశ్నకు లక్ష్మి పార్వతి ఇచ్చిన సమాధానంతో ఆంద్రప్రదేశ్ రాజకీయాలే అనూహ్యంగా మారిపోయాయి
ఆఖరికి అల్లుడు చంద్ర బాబు తిరుగుబాటుతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది
అసలు ఇంతకీ ఆ రోజు విజయవాడలో ఏం జరిగింది ?
ఎన్టీఆర్.. లక్ష్మి పార్వతిని వివాహం చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆమె విజయవాడ అలంకార థియేటర్ కాంప్లెక్స్ లో నల్లి సిల్క్స్ అనే ఓ వస్త్ర దుకాణం షో రూమ్ ప్రారంభోత్సవానికి వచ్చారు
అప్పటికి ఎన్టీఆర్ వైపు నిలబడిన ఎమ్మెల్యేలు కొంతమంది ఈ కార్యక్రమానికి వచ్చారు
పార్టీలో కీలకమైన నిర్ణయాలు అన్నీ లక్ష్మి పార్వతీ తీసుకుంటుందని అప్పట్లోనే పార్టీలో బహిరంగంగా చెప్పుకునేవాళ్ళు
ఎన్టీఆర్ కూడా పార్టీ విషయాల్లో లక్ష్మి పార్వతి సలహాలు తీసుకునేవారు
సరే ఇదిలా ఉండగా విజయవాడ వచ్చిన లక్ష్మి పార్వతికి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికారు
కంకిపాడు ఎమ్మెల్యే దేవినేని నెహ్రు ఆమె పర్యటన ఏర్పాట్లు అన్నీ స్వయంగా చూసుకున్నారు
లక్ష్మి పార్వతి రాక సందర్భంగా అలంకార్ థియేటర్ సెంటర్లో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసారు
ఇంతలో లక్ష్మి పార్వతి రానే వచ్చింది
నల్లి సిల్క్స్ షో రూమ్ వారు ఆమెను సాదరంగా ఆహ్వానించారు
లక్ష్మి పార్వతి షాప్ ప్రారంభోత్సవం చేసి తిరుగు పయనం అవుతుండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది
పోలీస్ బందోబస్త్ ను దాటుకుని ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ లక్ష్మి పార్వతి దగ్గరకు వచ్చాడు
పోలీసులు అతడ్ని నెట్టబోయేలోపు జేబులోనుంచి తన ప్రెస్ ఐడి కార్డు తీసి చూపించాడు
లక్ష్మి పార్వతి కూడా మీడియాతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంది కాబట్టి అతడ్ని దగ్గరకు పిలిచి ఏంటన్నట్టు చూసింది
ఆ కుర్రాడు ఓ సాయంకాలం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ విలేఖరి
“మేడం ! మిమ్మల్ని రెండే రెండు ప్రశ్నలు అడుగుతా ప్లీజ్ ” అని రిక్వెస్టింగ్ గా అడిగాడు
” అడగండి ” అంది లక్ష్మి పార్వతి
” మేడం ! మంత్రివర్గంలో మార్పులూ చేర్పులు చేస్తారని తెలిసింది ? క్యాబినెట్లో ఎవరు ఉంటారు ? ఎవర్ని తీసేస్తారు ?”
” అది మేము ఎన్టీఆర్ గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం “
” మేడం రెండో ప్రశ్న అండ్ ఆఖరి ప్రశ్న ? చంద్ర బాబు గారి పదవి సంగతి ?? అని ప్రస్నార్ధకంగా ఆపేసాడు
లక్ష్మి పార్వతి అతడివంక చూసి చిన్నగా నవ్వూతూ ” అదంతా అధిష్టానం చూసుకుంటుంది .. అధిష్టానం ముందు అందరూ సమానమే ” అని నర్మగర్భంగా సమాధానం చెప్పింది
“థాంక్యూ మేడం’ అంటూ ఆ కుర్రాడు ఆఫీసుకు వెళ్లి ఆ రెండు ప్రశ్నలూ లక్ష్మి పార్వతి ఇచ్చిన సమాధానాలు రాసి పేపర్ కు పంపించి వెళ్ళిపోయాడు
పేపర్లో కూడా ఆ వార్త ఎక్కడో చిన్న కాలంలోకి చేరుకుంది
కానీ తాను ఇచ్చిన ఆ వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది అవుతుందని ఆ క్షణాన ఆ యువ జర్నలిస్టుకు కూడా తెలీదు
అది సాయంకాలం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కాబట్టి చాలామందికి ఈ న్యూస్ తెలీదు
కానీ తెలియాల్సిన వాడికి ఆ న్యూస్ చేరింది
వేగుల ద్వారా చంద్ర బాబుకు సమాచారం చేరింది
అంతే ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు .. నిన్నగాక మొన్న వచ్చి అధిష్టానం అంటే తానేనని పార్టీ కేడర్ కు సంకేతాలు ఇస్తుందా ?
మంత్రి వర్గంలో నేనుండాలో లేదో కూడా ఆమే డిసైడ్ చేస్తుందా ?
ముఖ్యమంత్రి భార్య హోదాలో ఊళ్ళు తిరుగుతూ పెత్తనాలు చేస్తుందా ? అని పార్టలో తన ఆంతరంగికుల దగ్గరా , ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల దగ్గరా వాపోయారు
లక్ష్మి పార్వతిని ఇలాగె వదిలేస్తే ఎన్టీఆర్ ను పూర్తిగా గుప్పిటలో పెట్టుకుని ఆఖరికి ఆయన వారసులను కూడా గెంటేస్తుందని ఫైర్ అయ్యారు
ఫలితం 1995 లో ఎన్టీఆర్ పై చంద్రబాబు తిరుగుబాటు
ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే
అలా విజయవాడలో ఓ వస్త్ర దుకాణంలో ఓ చిన్న సాయంకాలం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ జర్నలిస్టుతో లక్ష్మి పార్వతి చేసిన చిన్న చిట్ చాట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది అయ్యింది
ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే ఎవరూ ఊహించని విధంగా సంచలనాలు సృష్టిస్తాయి
(తన పేరు బయటపెట్టొద్దని ఆ జర్నలిస్ట్ కోరినందున అతడి పేరు మెన్షన్ చెయ్యట్లేదు క్షమించాలి )
తరువాతి కధనంలో విజయవాడలో రాజకీయ నాయకుల అవినీతి భాగోతాలపై వార్తలు రాసినందుకు ఓ యువ జర్నలిస్టును వేటాడిన దుండగులు ఏం చేసారో రచ్చబండ కబుర్లు లో చెప్పుకుందాం !
పరేష్ తుర్లపాటి