Home » ముఖ్యమంత్రిని కూడా బురిడీ కొట్టించిన యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ ఎలా దొరికిపోయాడు ? జర్నలిస్ట్ పేజీ

ముఖ్యమంత్రిని కూడా బురిడీ కొట్టించిన యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ ఎలా దొరికిపోయాడు ? జర్నలిస్ట్ పేజీ

Spread the love

యూరో లాటరి కోలా కృష్ణమోహన్ స్టోరీ తెలుసు కదా ?

టెక్నాలజీ అప్డేట్ అవడం వల్ల మానవాళికి లాభాలు ఎన్ని ఉంటాయో నష్టాలు కూడా అన్ని ఉంటాయి . టెక్నాలజీని ఎలా వాడుతారు అనేదాన్ని బట్టి లాభనష్టాలు మారుతూ ఉంటాయి . ఉల్లిపాయ కోసే కత్తి గొంతు కోయడానికి కూడా ఉపయోగపడినట్టు టెక్నాలజీ అనేది మంచికీ ,చెడుకీ ఉపయోగపడుతుంది . ఈ రోజుల్లో ప్రతిదీ డిజిటల్ మయం అయిపొయింది . ఛాయ్ తాగి పదిరూపాయలు పే చేయాలన్నా ఒక్క క్లిక్కుతోనే పని అయిపోతుంది . అయితే అదే సమయంలో తెలియని లింకులు క్లిక్కితే మొత్తం పోతుంది . ఈ మధ్య వార్తలు చూస్తుంటే రోజుకో సైబర్ నేరం బయటపడుతుంది . ఒక్క క్లిక్కుతో బ్యాంకుల్లో అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి . ఈ సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎంతలా మితిమీరిపోయాయి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా సైబర్ నేరాలకు సంబంధించి విచారణల కోసం ప్రత్యేక సైబర్ విభాగం ఓపెన్ చేసారు .

కానీ ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే షుమారు 80 కోట్ల సైబర్ ఫ్రాడ్ చేసిన టక్కరి దొంగ ఒకడున్నాడు . అతడి పేరు కోలా కృష్ణమోహన్ . అసలు సైబర్ నేరాలకు ఆద్యుడు ఈ కోలా కృష్ణమోహన్ .

షుమారు మూడు దశాబ్దాల క్రితం ఏ సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లోనే ఈ వ్యక్తి ఒక మాస్టర్ పీస్ ప్లాన్ వేసాడు . ఆ ప్లాన్ తో రాత్రికి రాత్రి సెలెబ్రిటీ అయిపోయాడు . ఎంతటి నేరస్తుడైనా ,ఎంత పకడ్బందీగా నేరం చేసినా ఎక్కడో ఒకచోట ఒక చిన్న తప్పు చేసి చట్టానికి దొరికిపోతాడు . అలాగే కోలాకృష్ణమోహన్ కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి దొరికిపోయి చివరికి కటకటాలపాలయ్యాడు .

తనకు యూరో లాటరీ వచ్చిందని మీడియాను , రాజకీయ నాయకులనూ , సెలెబ్రిటీలను బురిడీ కొట్టించిన కోలా కృష్ణ మోహన్ ఆఖరికి ఎలా దొరికిపోయాడు ? దీనివెనుక ఒక ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ఉంది . పోలీసులు సైతం కనుక్కోలేని ఇతడి ఫ్రాడ్ ను ఇద్దరు జర్నలిస్టులు పరిశోధించి ఛేదించారు .

ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం స్టోరీ చదవండి .

1998 లో ఓ రాత్రి వేళ సరిగ్గా పేపర్ ఎడిషన్ ప్రింటింగ్ కు వెళ్లేముందు విజయవాడ ఆంధ్రజ్యోతి కి ఒక మెయిల్ వచ్చింది . విజయవాడకు చెందిన కోలా కృష్ణ మోహన్ అనే వ్యక్తికి 12.5 మిలియన్ల యూరో పౌండ్స్ లాటరి వచ్చింది అనే మెసేజ్ అందులో ఉంది .
అప్పట్లో 12 .5 మిలియన్ల యూరో పౌండ్స్ లాటరీ రావడం అంటే మాటలు కాదు . ఈ వ్యక్తి ఎవరో కానీ జాక్ పాట్ కొట్టారు అనుకున్నారు అక్కడి స్టాఫ్ .

వెంటనే ప్రింటింగ్ ఓ పదినిముషాలు ఆపమని ఆంధ్రజ్యోతి డెస్క్ ఇన్ ఛార్జ్ సంబంధిత సెక్షన్ స్టాఫ్ కు చెప్పి తమకు వచ్చిన ఈ మెయిల్ ఒరిజినలా కా దా ? అని కంఫర్మ్ చేసుకోవటానికి వెరిఫై చేసారు . అవతలి వాళ్ళు ఇలా వెరిఫై చేసుకుంటారని ముందే ఊహించి కోలా కృష్ణ మోహన్ దానికి తగ్గ ఏర్పాటు కూడా చేసుకున్నాడు .

ఆంధ్రజ్యోతి నుంచి మెయిల్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ రాగానే వెరిఫైడ్ కన్ఫర్మ్ అని రిప్లై మెసేజెస్ వచ్చాయి . దాంతో ఈ న్యూస్ నిజమే అని ఆంధ్రజ్యోతి డెస్క్ ఇంచార్జి కూడా నమ్మి అప్పటికప్పుడు మెయిన్ పేపర్ బ్యానర్ ఐటెం మార్చి యూరో లాటరీ తగిలిన విజయవాడ వాసి కోలా కృష్ణమోహన్ అని ఒక ఆర్టికల్ రాసి ఎడిషన్ ప్రింటింగ్ కి పంపించారు .

అప్పటికి ఈ మెయిల్ ఇతర ఏ పేపర్లకు రాలేదు కాబట్టి ఈ వార్త ఎక్స్క్లూజివ్ ఆంధ్రజ్యోతిలో మాత్రమే పబ్లిష్ అవుతుంది . ఏ పత్రిక ఇన్ఛార్జులు అయినా ఇటువంటి ఐటెమ్ నే కోరుకుంటారు . కానీ కోలా కృష్ణ మోహన్ కేవలం ఆంద్రజ్యోతికి మాత్రమే మెయిల్ చేయడం వెనుక కూడా ఒక వ్యూహం ఉంది .

ఇదిలా ఉండగా ఆంధ్ర జ్యోతి ఎడిషన్ ఇన్చార్జి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుంటే అనుకోకుండా దారిలో వార్త ఎడిషన్ ఇన్చార్జి గోపిచంద్ ఎదురవడంతో రేపు జ్యోతిలో సెన్సేషనల్ న్యూస్ బ్యానర్ ఐటెంగా వస్తుంది చూడు అని చెప్పి అయన తోవన ఆయన వెళ్ళిపోయాడు . అంతేకానీ అసలు విషయం చెప్పలేదు .

అప్పట్లో పత్రికల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది . ఏ జర్నలిస్ట్ అయినా సంచలన వార్తలను తానే ముందు వెలుగులోకి తేవాలని అనుకుని పనిచేస్తాడు .

అతడు నర్మగర్భంగా చెప్పిన మాటలతో వార్త డెస్క్ ఇంచార్జి గోపిచంద్ కు డౌట్ వచ్చింది. సాధారణంగా పబ్లిష్ చెయ్యాల్సిన న్యూస్ ఐటమ్స్ ఏవైనా సరే అన్ని పేపర్లకూ వస్తాయి . ఒకవేళ లీకులు అనుకున్నా అవి కూడా అన్ని పేపర్లకు చేరతాయి .

కానీ ప్రత్యేకంగా ఒక పేపర్ కే ఎవడో న్యూస్ ఐటెం పంపించాడంటే ఇదేదో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన స్కెచ్ అని అనుమానం వచ్చి అప్పటికప్పుడు వార్త జర్నలిస్ట్ రాజేష్ కు ఫోన్ చేసి అర్జెంట్ గా రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆంధ్ర జ్యోతి మెయిన్ పేజీలో ఏముందో చూడమని చెప్పాడు . రైల్వే స్టేషన్ కు ఎందుకంటే ఆ రోజుల్లో ప్రింట్ అయిన పేపర్ బండిల్స్ రైళ్ల ద్వారానే చుట్టుపక్కల ఊళ్లకు చేరేవి .

సరే టైం చూసుకుంటే అర్ధరాత్రి అవుతుంది . అప్పటికి వార్త పేపర్ కూడా ప్రింటింగ్ కు వెళ్ళిపోయింది . ఎందుకైనా మంచిదని మొత్తం ప్రింట్ కాకుండా చిన్న కాలం అపి ఉంచారు .

ఈలోపు వార్త జర్నలిస్ట్ రాజేష్ ఫోటో గ్రాపర్ రూబెన్ ను తీసుకుని హుటాహుటిన రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆంధ్రజ్యోతి పార్సిల్ బండిల్స్ లో ఉన్న మెయిన్ ఎడిషన్ బ్యానర్ ఐటెం చూసారు . అందులో విజయవాడకు చెందిన కోలా కృష్ణ మోహన్ ను వరించిన యూరో లాటరీ అని బ్యానర్ న్యూస్ కనిపించింది .

దాంతో అప్పటికప్పుడు ఆ వార్తను కంపోజింగ్ కు పంపించి వార్తలో కూడా చిన్న ఐటెం వేశారు . పొద్దున్నే ఈ వార్త దావానలంలా ఏపీ మొత్తం పాకింది . దాంతో అందరి దృష్టి కోలా కృష్ణమోహన్ మీద పడింది

అసలు ఎవరీ కోలా కృష్ణమోహన్ ? అతడికి యూరో లాటరీ ఎలా వచ్చింది ? పోనీ ఫేక్ అనుకుందామా అంటే న్యూస్ పేపర్లలోనే వచ్చింది అనే చర్చ ఎక్కడ చూసినా మోతమోగిపోయింది . దాంతో ఏపీ అంతా ఆయన పేరు మారుమోగిపోయింది .

ఆ రోజుల్లో 12.5 మిలియన్ యూరో పౌండ్స్ అంటే షుమారుగా 83 కోట్లు అంటే మాటలు కాదు. చాలా పెద్ద మొత్తం ..చాలా పెద్ద వార్త .

దరిమిలా కోలా కృష్ణ మోహన్ ఇంటికి సెలెబ్రిటీలు , రాజకీయ నాయకులూ , బ్యాంక్ అధికారులూ , అప్పులు ఇచ్చేవాళ్ళు క్యూ కట్టారు . కోలా కృష్ణమోహన్ అడక్కుండానే ప్రామిసరీ నోట్లు వంటి డాక్యుమెంట్లు కూడా లేకుండానే లక్షల రూపాయలకు చెక్కులు అతడి చేతిలో పెట్టిపోయారు .

ఇప్పుడు కోలా కృష్ణమోహన్ సెలెబ్రిటీ అయిపోయాడు . ఎంతలా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అతడికి గన్ మెన్ ను కూడా ఇచ్చింది .

దెబ్బకు అతడి జీవితం మారిపోయింది . కోట్లు ఖరీదు చేసే విల్లా లో నివాసం , బయటికి వెళ్తే ఫారిన్ కారు .. టోటల్ గా కోలా లైఫ్ స్టైల్ కొత్త టర్న్ తీసుకుంది .

అంతటితో అతడు ఆగలేదు . కోలా ఎంత ఘటికుడు అంటే ఆఖరికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కూడా నమ్మించాడు . టీడీపీకి పార్టీ ఫండ్ కింద కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు . అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కి ఉదారంగా 1,50,000 / రూపాయలు విరాళం ప్రకటించాడు . మనిషి కనిపిస్తే చాలు లక్షల్లో విరాళం ప్రకటిస్తున్నాడని ఇతడి ఇంటికి వీఐపీలు కూడా క్యూ కట్టారు .

కోలా అంతటితో కూడా ఆగలేదు . మచిలీపట్టణం నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు కూడా తనకి తానే ప్రకటించుకున్నాడు . నేరం బయటపడకపోతే కోలా ఎంపీ కూడా అయ్యేవాడు .

ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి . అతడికి ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకోవడం కోసం ఒకరొకరుగా వచ్చి అడగటం మొదలుపెట్టారు . లాటరీ అధికారుల ఫార్మాలిటీస్ వల్ల ఆలస్యం అవుతుందని ఇవాళో రేపో డబ్బులు వచ్చేస్తాయని జనాల్ని నమ్మించడం మొదలు పెట్టాడు .

ఈ విషయం వార్త చైర్మన్ గిరీష్ సంఘీ దాకా వెళ్ళింది . వెంటనే ఆయన విజయవాడ వార్త బ్యూరో జర్నలిస్ట్ రాజేష్ కు ఫోన్ చేసి కోలా విషయంలో ఫాక్ట్స్ చెక్ అసైన్మెంట్ అప్పచెప్పారు .

ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వార్త జర్నలిస్టులు రాజేష్ అండ్ గౌరీ శంకర్ లు కోలా వెబ్ సైట్ చెక్ చేసారు . అక్కడ ఈ మెయిల్ ఆక్టివ్ లోనే ఉండి వెరిఫికేషన్ కన్ఫర్మేషన్ ఇచ్చింది .

కోలా కృష్ణమోహన్ గత జీవితం గురించి ఎంక్వైరీ చేస్తే కొన్ని నిజాలు తెలిసాయి . యితడు గతంలో విజయవాడ క్లబ్ లో పేకాటలు ఆడేవాడనీ .. ఆ పేకాటలో పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడని తెలిసింది . అంతేకాదు కోలా ఈమధ్యనే స్పాన్సర్షిప్ ట్రిప్ మీద US అండ్ UK కూడా వెళ్ళొచ్చాడని కూడా తెలిసింది .

కోలాకు గవర్నర్ పేట ఆంధ్రా బ్యాంక్ లో అకౌంట్ ఉందని తెలిసి అతడి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేద్దామని బ్యాంక్ కు వెళ్లారు ఇద్దరు జర్నలిస్టులు . సరిగ్గా అదే సమయంలో బ్యాంకులో ఇన్స్పెక్షన్ జరుగుతుంది .

బ్యాంక్ మేనేజర్ ను కలిసి తామొచ్చిన పని గురించి చెప్తే విలేఖరులు అని తెలిసి ముందు ఆయన గజగజా వణికిపోయాడు . ఆ తర్వాత మెల్లిగా అసలు విషయం చెప్పాడు .

“సార్ ? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవరికీ చెప్పకండి సార్ .. యూరో లాటరీ వచ్చిందని చెప్పి కోలా కృష్ణమోహన్ మా బ్యాంకులో లండన్ బ్యాంక్ బాండ్స్ పెట్టి 20 లక్షలకు చెక్ డిస్కౌంట్ చేసుకున్నాడు .. అది కాస్తా బౌన్స్ అయింది .. మా బ్యాంక్ తరుపున లండన్ బ్యాంక్ అధికారులను ఎంక్వైరీ చేస్తే ఆ బాండ్స్ ఫేక్ అని తెలిసింది .. కాసేపట్లో పై అధికారులు వస్తున్నారు .. పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు .. అప్పటిదాకా ఈ విషయం నేను చెప్పినట్టు ఎవరికీ చెప్పకండి సార్ .. “అని ప్రాధేయపడ్డాడు .

ఏదైతేనేమి కోలా విషయంలో పెద్ద చిక్కుముడి వీడింది . నిమిషాల్లో ఈ వార్త వార్తా పత్రికకు వెళ్లడం .. ప్రింటింగ్ అవడం ..కోలా అరెస్ట్ అవడం చకచకా జరిగిపోయాయి .

కోలా అరెస్ట్ వార్త బయటికి రాగానే యూరో లాటరీ డబ్బులు వస్తాయని ఆశపడి అతడికి అప్పులు ఇచ్చినవాళ్ళందరూ పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టారు . కానీ అప్పటికే అతడి జేబులో చిల్లిగవ్వ లేకపోవడంతో హతాసులు అయ్యారు .

ఆ రకంగా అందర్నీ నమ్మించి మోసం చేసిన బురిడీ రాయుడు కోలా చట్టానికి దొరికిపోయాడు . ఇంతా చేసి కోలాకు నాలుగేళ్లు జైలు శిక్ష మాత్రమే పడింది !


Spread the love

One thought on “ముఖ్యమంత్రిని కూడా బురిడీ కొట్టించిన యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ ఎలా దొరికిపోయాడు ? జర్నలిస్ట్ పేజీ

  1. Another Hot news on those days He (KOLA) also booked ACTRESS RAASI for few months and kept in his guest house ,hence she was not available for cine producers ..🤣

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!