చిన్నప్పుడు ఏదన్నా కథలు చెప్పుకునేముందు అనగనగా అనే పదాలతో ప్రారంభించేవాళ్ళు
ముఖ్యంగా చందమామ , బాలమిత్ర లాంటి పుస్తకాలలో అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అనే లైన్స్ తో కథ మొదలయ్యేది
ఒకరకంగా చెప్పాలంటే అప్పట్లో కథలకు మెయిన్ డోర్ ఈ అనగనగా అనే పదాలే
చాన్నాళ్లకు నవీన్ పోలిశెట్టి అనబడే ఈ యువ హీరో అనగనగా ఒక రాజు అంటూ అదే పదాలతో సొంతంగా డైలాగులు రాసుకుని సంక్రాంతికి మనముందుకు వచ్చాడు
వచ్చేముందు ట్రైలర్లలో కొంత హంగామా కూడా చేసాడు
పండక్కి మీ ఊరొచ్చి మీకందరికీ గోదావరి రుచులను అందిస్తా కాచుకోండి
నవ్వుల పువ్వులు రువ్వి మీ ఇంట్లో పండగ శోభను తీసుకొస్తా చూసుకోండి అంటూ ఒకటే అదరగొట్టేసాడు
ట్రైలర్ చూస్తే బావున్నట్టే ఉంది
పైగా నేనే జాతిరత్నాన్ని అంటూ గతంలో తెలుగు రాష్ట్రాల్లో నవ్వుల పంట పండించిన చరిత్ర ఈ కుర్రాడికి ఉంది
జాతిరత్నాలు సినిమా చూసినప్పుడు ఈ కుర్రాడిపేరు నవీన్ పోలిశెట్టినా ? నవ్వుల పోలిశెట్టినా ? అని చాలామందికి బహుళ డౌట్లు వచ్చాయి కూడా
పర్లేదు .. యువ హీరోలో మాంచి కామెడీ టైమింగ్ ఉంది ..ముందుముందు పనికొస్తాడు అనుకుంటున్నంతలోనే మధ్యలో ఏమైందో ఏమో మాయం అయిపోయాడు
అలా మూడేళ్లు పత్తా లేడు
ఏదో యాక్సిడెంట్ అయిందని అనుకుంటున్నారు
సరే ఏదైతేనేమి , ఇప్పుడు ఫ్రెష్ గా పండక్కి మనూర్లలో దిగాడు
ఆల్రెడీ సంక్రాతి పండక్కి ఇంకో ముగ్గురు అల్లుళ్ళు వచ్చి థియేటర్లలో హల్చల్ చేస్తున్నారు
వీరిలో గడుసరి గట్టి అల్లుడెవరో ,అసలు సరుకే లేని అల్లుడెవరో ఇప్పటికే ప్రేక్షకులు కనిపెట్టేసారు
తాజాగా అనగనగా అంటూ మనకేదో కథ చెప్పటానికి ముందుకొచ్చిన ఈ కుర్ర అల్లుడి పెర్ఫార్మన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం
కధేంటి ?
రివ్యూలలో కథ గురించి చెప్పాలంటే అదో పెద్ద ప్రహసనం
ఎందుకంటే కథ గురించి చెప్తుంటే చప్పున ఎప్పుడో చూసిన సినిమాలో కథ మనకు గుర్తుకొస్తుంది
ఈ సినిమా కథ చెప్తానని చెప్పి క్రీస్తుపూర్వం సినిమా కథ చెప్తున్నాడేంటి ? అని కొంతమంది ప్రేక్షకులకు కోపం రావొచ్చు
కానీ ఏం చేస్తాం ?
సోమాలియా కరువుకైనా పరిష్కారం దొరుకుతుందేమో కానీ తెలుగు కథల కరువుకు పరిష్కారం దొరకటం లేదు
ఉన్న కధలన్నీ ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ , శోభన్బాబులతోనే వాడేశాం
ఇంకా కొత్త కథలంటే ఎక్కడ్నుంచి పుట్టుకొస్తాయి ?
అందుచేత గుర్రం నాడా దొరికితే గుర్రం కొన్నట్టు , పాత కథలో లైను దొరికితే దాంతోనే కొత్త సినిమాలు తీసేస్తాం అన్నట్టున్నాయి కొన్ని సినిమాలు
ఈ సినిమా చూసినా కూడా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ , జమీందారుల కథల నేపథ్యంలో అప్పుడెప్పుడో వినోద్ కుమార్ చేసిన సినిమాలు గుర్తుకొచ్చినా గుర్తుకురావొచ్చు
కానీ ఆ సినిమాలు వేరు
ఈ సినిమా వేరు
ఆ హీరోల కామెడీ టైమింగ్ వేరు
ఈ హీరో కామెడీ టైమింగ్ వేరు
ఇంతకీ ఈ సినిమాలో కధేంటో ఓసారి చూద్దాం
అనగనగా ఒక రాజు
రాజు అంటే ఏనుగు అంబారీ మీద సవారీ చేస్తూ కత్తి యుద్దాలు చేసే మహారాజు కాదు
గౌరవపురం జమిందారు గోపరాజు అన్నమాట
ఈ గోపరాజు గారు పేరుకి జమిందారు అయినప్పటికీ మాంచి కళాపోషకుడు
ఉన్న ఆస్తినంతా జల్సాలకు ఖర్చుపెట్టి హారతి కర్పూరం చేస్తాడు
ఆ గోపరాజు గారి మనవడే మన కధానాయకుడు రాజు గారు ( నవీన్ పోలిశెట్టి )
పేరుకి జమిందారు వంశం అయినప్పటికీ చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు
అయినా బయటపడకుండా ఢాంభికాలు పోతూ ఉంటాడు
ఈ పరిస్థితుల్లో తన బంధువుల కుర్రాడు బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్ళిచేసుకుని వాడు కూడా ఇంకా బాగా రిచ్ అయ్యాడన్న విషయం తెలుస్తుంది
ఇదేదో బావున్నట్టుంది అనుకుని మనోడు కూడా బాగా డబ్బున్న అమ్మాయిల కోసం వెతుకుతూ ఉంటాడు
ఈ క్రమంలో అతడికి పొరుగూరు జమిందారు భూపతిరాజు ( రావు రమేష్ ) కూతురు చారులత గురించి తెలుస్తుంది
దాంతో ఆ అమ్మాయికి లైనేసి పెళ్ళిచేసుకుంటే తాను కూడా రిచ్ అల్లుడిని అయిపోవచ్చని ప్లానేసి అమలుచేసేస్తాడు
కానీ చారులతను పెళ్లిచేసుకున్న తర్వాత తొలిరాత్రే అతడికి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది
ఇది ఇంటర్వెల్ ట్విస్ట్ అన్నమాట
ఇంతకీ చారులతని పెళ్ళిచేసుకుంటే రిచ్ అల్లుడు అయిపోవచ్చనుకున్న రాజుకి తెలిసిన అసలు నిజం ఏంటి ?
రిచ్ అల్లుడి హోదా సంగతి అలా ఉంచితే రాజు ఆఖరికి రాజకీయాల్లోకి ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వస్తుంది ?
అసలు గోల్ వదిలేసి సర్పంచ్ పదవికి రాజు ఎందుకు నామినేషన్ వేస్తాడు ? ఇత్యాది విషయాలు మిగతా సినిమా చూస్తేనే తెలుస్తాయి
ఎలా ఉంది రాజా ?
ఎలా ఉందంటే ఏం చెప్తామ్ ?
కథ విన్నారుగా
ఇలాంటి కథలను కామెడీ టైమింగ్ మీద పట్టున్న హీరో అయితే అవలీలగా చేసేసి ప్రేక్షకులని కథ గురించి మర్చిపోయేలా చేస్తాడు
ఆ పని నవ్వుల పోలిశెట్టి చేసాడు
కథ సంగతి కాసేపు పక్కనబెట్టవోయ్.. పండక్కి కాసేపు సరదాగా నవ్వుకుని వెళ్ళిపో అని సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించేసాడు నవీన్
అందులో ప్రస్తుతం మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నామేమో కొన్ని రీల్స్ కళ్ళముందు గిరగిరా తిరుగుతాయి
పంచు డైలాగులు పటాసుల్లా పేలతాయి
మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న పదాలనే నవీన్ ఇందులో వాడినట్టున్నాడు
అందులో కొన్ని పేలాయి
మరికొన్ని తుస్సుమన్నాయి
సరే , ఎంతకష్టపడి ఒక్కడే తబలా వాయించినా పక్క వాయిద్యాలు లేకపోతే శృతి గతి తప్పుతుంది
ఈ సినిమాలో నవీన్ కు తోడుగా జబర్దస్త్ టీమ్ ను కొంతమందిని దించినా వాళ్ళ యాక్షన్ కూడా హీరోగారే చేయడంతో ఎక్కడ నవ్వాలో తెలియక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారు
యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు ఎలివేషన్ల దృష్ట్యా వన్ మ్యాన్ షో నడుస్తుందేమో కానీ కామెడీ సినిమాల్లో నడవదు
పక్కవాయిద్యాలు కంపల్సరీ
జంధ్యాల చూడండి
రాజేంద్రప్రసాద్ వంటి నవ్వుల రేడుతో సినిమా తీసినా ఏ బ్రహ్మానందాన్నో , కోటనో సమాంతరంగా వాడుకుని హాస్యాన్ని సమపాళ్లలో పండించారు
ఇక్కడ సర్వం నవీన్ పోలిశెట్టి వారే అయిపోయారు
అతను బాగా చేయలేదని కాదు
తనవరకు ఎప్పటిలానే కామెడీ టైమింగుతో థియేటర్లో నవ్వులు పూయించాడు
కాకపోతే మిగతావాళ్లకు కూడా కూసింత అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది
సరే ఎలాగైతేనేమి ఫస్టాఫ్ అంతా పూటకు లేని జమిందారు వారసుడి పాత్రలోనూ , చారులతను లైన్లో పడేసి పెళ్లిచేసుకోవడానికి రాజు పడే తంటాలతోను , విన్యాసాలతోను సరదా , సరదాగా నడిచిపోతుంది
ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఇవ్వడంతో సెకండాఫ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది
అయితే సెకండాఫ్ స్టోరీ టర్న్ తీసుకుని పొలిటికల్ యాంగిల్ లోకి వెళ్తుంది
పల్లెటూరు , సర్పంచ్ ఎన్నికలు , కామెడీ ట్రాక్ , ఎమోషనల్ టచ్ లతో సెకండాఫ్ రన్ చేసారు
రెండు అర్దలలో మొదటిభాగం కామెడీ ఎక్కువ స్పేస్ ఆక్రమించగా , రెండో అర్ధలో ఇంకోనాలుగైదు రసాలు యాడ్ అయ్యాయి
టోటల్ గా అనగనగా ఒక రాజు కొత్త కధేం కాదుగానీ కథనం మాత్రం కొత్తదే
మిమిక్రి కళాకారుడు ఒకే డైలాగును చిరంజీవి పలికితే ఎలా ఉంటుంది , వెంకటేష్ పలికితే ఎలా ఉంటుంది అంటూ మిమిక్రి చేస్తాడు చూడండి
అలా ఈ సినిమాకి నవీన్ తనదైన శైలిలో నటించి కొత్తదనం చూపించటానికి ట్రై చేసాడు
ఎవరెలా చేసారు ?
గతంలో మనకు కామెడీ టైమింగ్ ఉన్న హీరోలకు కొదవ లేదు
రాజేంద్రప్రసాద్ , వీకే నరేష్ , అల్లరి నరేష్ వంటి హీరోలు చక్కటి హాస్యాన్ని పండించి దశాబ్దాలుగా వెండితెరను ఏలారు
ఈ జెనెరేషన్లో ఆ పరంగా కొద్దిగా కొరత ఏర్పడింది
అయినా సరే నవీన్ పోలిశెట్టి నేనున్నాను అంటూ ఆ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు
ఓ రెండు గంటలు కామెడీ స్కిట్ లను చేసి చూపించమంటే నవీన్ అవలీలగా చేసేస్తాడు
అలాగే ఈ సినిమాలో కూడా దాదాపు ఆ రెండు గంటలు అన్నీ తానే అయి సినిమాని నడిపించాడు
ఈ సినిమాకి ప్లస్ నవీన్ పోలిశెట్టి నటనే
ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి చెప్పుకోవాలంటే కిందటి ఏడు సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చి సందడి చేసి వెళ్ళింది
ఆ సినిమాలో యాక్షన్ , కామెడీ రెండు విభాగాల్లోనూ ప్రతిభ చూపించింది
అన్నట్టు ఈ అమ్మాయి బాగా పొడవు
నవీన్ పక్కన కొంచెం హైట్ అవుతుందేమో అనిపించింది కానీ , బాగానే మ్యాచ్ అయ్యింది
నటన కూడా బాగానే చేసింది
రావు రమేష్ చాలా చక్కటి క్యారక్టర్ ఆర్టిస్టు
సరిగా వాడుకోవాలే కానీ అద్భుతాలు చేస్తాడు
ఇందులో కూడా బాగానే చేసాడు కానీ ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవాల్సింది
ఇక చమ్మక్ చంద్ర , బుల్లిరాజు తదితరులను కామెడీ ట్రాక్ కోసం తీసుకున్నట్టున్నారు
పర్లేదు
కథ రాసుకోవడంలో రైటర్ చిన్మయికి నవీన్ పోలిశెట్టి కూడా తోడవడంతో కొన్ని పంచ్ డైలాగులు పడ్డాయి
దర్శకుడు మారి కూడా కథలో కొత్తదనం చూపించటానికి తనవంతు తాపత్రయం పడ్డాడు
సాంకేతికత ?
సాంకేతికంగా సినిమా అనుకున్న స్థాయిలోనే ఉంది
మిక్కీ జె మేయర్ సంగీతం బాగానే ఉంది
పల్లెటూరు , జమిందారుల వంశం నేపధ్యం కాబట్టి కెమెరా పని తనం బాగుండాలి
ఆ పరంగా బాగానే ఉంది
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి
కామెడీ ఫ్లో కోసం కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఏ సినిమాకైనా తప్పవనుకుంటా ?
ఇందులో కూడా ఉన్నాయి
కొద్దిగా ట్రిమ్మింగ్ చేసి ఉంటే బాగుండేది
ముగింపు : మీ దంతాలు ఊడిపోతున్నాయా ? పుచ్చిపోతున్నాయా ? చిగుళ్లు వాచాయా ? మరేం కంగారు లేదు . బొగ్గుతో కూడిన మా టూత్ పేస్ట్ వాడండి . మార్పు చూసి మీరే షాక్ అవుతారు అని టీవీలో వచ్చే యాడ్ చూసి గబగబా డీ మార్టుకు పోయి బొగ్గుతో కూడుకున్న టూత్ పేస్ట్ కొనుక్కుని దంతాలను పరపరా తోమి ఆనక అద్దంలో చూసుకుని నిజంగానే షాక్ అయిన సగటు టీవీ ప్రేక్షకుడి మాదిరి ట్రైలర్లో ఏదో చూపించారు కదా అని ఆవేశపడిపోయి సినిమా చూస్తే టూత్ పేస్ట్ యాడ్ మాదిరి షాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి . అందుచేత ఏ ఎక్స్పెక్టేషన్లు లేకుండా కాసేపు కామెడీ ప్రోగ్రాం చూద్దామనుకుని థియేటర్లలోకి వెళ్లినవాళ్లకు షాకులు గట్రా తగలవని , కూసేపు సరదాగా నవ్వుకుంటారని తెలియచేయడమైనది
నటీనటులు : నవీన్ పోలిశెట్టి , మీనాక్షి చౌదరి , రావు రమేష్ , చమ్మక్ చంద్ర తదితరులు
సంగీతం : మిక్కీ జె మేయర్
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం : మారి
విడుదల : 14 -01 -2026
రేటింగ్ : 2.5 / 5
