భర్త మహాశయులకు రవితేజ చేసిన విజ్ఞప్తి ఏంటి ? – మూవీ రివ్యూ

Spread the love

శోభన్ బాబు , శారద భార్యాభర్తలు .. అయితే విశాఖలో ఉండే శోభన్ బాబు పెద్ద బిజినెస్ మాన్ కావడంతో తరచూ పనిమీద ఊటీ వెళ్తుంటాడు.. అక్కడ శోభన్ బాబుకి అనుకోకుండా శ్రీదేవి పరిచయం అవడం , ఇద్దరు ఒకటి అవడం జరుగుతుంది..

పనిముగించుకుని విశాఖ వచ్చిన శోభన్ బాబు ఈ విషయం భార్యకి చెప్పకుండా దాచిపెడతాడు . ఓ రోజు అనుకోకుండా శ్రీదేవి విశాఖ వస్తుంది . దాంతో అసలు విషయం భార్యకు ఎక్కడ తెలిసిపోతుందో అని శోభన్ బాబు తెగ కంగారుపడిపోతాడు . భార్యకి ,ప్రియురాలికి మధ్య నలిగిపోతాడు .

ఆగండాగండి ,

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ రాస్తాడనుకుంటే ఇదేదో శోభన్ బాబు కార్తీక దీపం సినిమా గురించి రాస్తున్నాడేంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ?

సరే , అయితే ఇది చూడండి ,

వెంకటేష్ , సౌందర్యలు భార్యాభర్తలు.. హైద్రాబాదులో ఉండే వెంకటేష్ బిజినెస్ పనిమీద నేపాల్ వెళతాడు.. అక్కడ వినీత అనే అమ్మాయి పరిచయం అవడం , ఇద్దరు ఒకటి అవడం జరుగుతుంది. పనిముగించుకుని హైద్రాబాద్ వచ్చిన వెంకటేష్ ఈ విషయం భార్యకు చెప్పకుండా దాచిపెడతాడు.

అయితే ఓ రోజు అనుకోకుండా ఆ నేపాల్ అమ్మాయి వంటలమ్మి రూపంలో ఏకంగా వెంకటేష్ ఇంట్లోనే దిగుతుంది.. దాంతో అసలు విషయం భార్యకు ఎక్కడ తెలిసిపోతుందో అని వెంకటేష్ తెగ కంగారు పడిపోతూ ఉంటాడు . ఇంట్లో ఇల్లాలికి , వంటింట్లో ప్రియురాలికి మధ్య నలిగిపోతూ ఉంటాడు.

మళ్ళీ ఆగండాగండి ,

ఇప్పుడు కూడా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ రాయకుండా ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు మూవీ గురించి చెప్తున్నాడేంటా ? అని ఆశ్చర్యంగా ఉందా ?

ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం ,

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కూడా పైన చెప్పిన రెండు సినిమాల తాలూకూ ఒకే తానులోని మూడో ముక్క . నిజానికి ఇలా లెక్కేసుకుంటే ఇల్లాలు , ప్రియురాలి మధ్య నలిగిపోయే మొగుళ్ళ మీద గతంలో బోలెడు సినిమాలు వచ్చాయి .

ఈ సినిమాలంటికీ బ్రాండ్ అంబాసడర్ శోభన్ బాబు.. ఈయన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటే చాలు.. బొమ్మ బ్లాక్ బస్టరే . శోభన్ బాబు గారు వెళ్ళిపోయాక వెంకటేష్ ఆ వారసత్వాన్ని తీసుకుని కొన్నాళ్ళు ఇద్దరితో నడిపాడు . ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది .

ప్రియురాలితో కలిసిన సంగతి భార్య దగ్గర దాచిపెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఆయనలాంటి ఇంకొందరు టూ బై త్రీలకు చెప్పడానికి వచ్చాడు .

కధేంటి ?

కథ గురించి పైన అంత వివరంగా చెప్పుకున్నాం కదా .. కధేంటో ఈపాటికి మీకు అర్దమైపోయే ఉంటుంది .

అయినా క్లుప్తంగా చెప్పుకుందాం ,

రామ్ సత్యనారాయణ ( రవితేజ ) , బాలామణి (డింపుల్ హయతి ) భార్యాభర్తలు.. ఈ రామసత్యనారాయణ పెద్ద వైన్ బిజినెస్ మ్యాన్.. ఈ మొగుడుగారంటే భార్యకు భక్తితో కూడిన ప్రేమ..
తన భర్త శ్రీరామచంద్రుడంతటివాడని ఆమె ప్రగాఢ నమ్మకం . అయితే ఓరోజు వైన్ బిజినెస్లో భాగంగా రామ్ స్పెయిన్ దేశం వెళ్లాల్సివస్తుంది .

అక్కడ అనుకోకుండా ఇదే బిజినెస్ చేస్తున్న మానస శెట్టి ( ఆషికా రంగనాథ్ ) పరిచయం అవడం , ఇద్దరు ఒకటి అవడం చకచకా జరిగిపోతాయి . పనిముగించుకుని ఇండియా వచ్చిన రామ్ జరిగిన విషయాన్ని భార్యకు చెప్పకుండా దాచిపెడతాడు . అయితే ఓరోజు అనుకోకుండా మానస ఇండియా వస్తుంది . దీంతో తమ విషయం భార్యకు ఎక్కడ తెలిసిపోతుందో అని రవితేజ తెగ కంగారు పడిపోతూ ఉంటాడు .

ఇల్లాలు , ప్రియురాల మధ్య రామ్ ఏ విధంగా నలిగిపోతాడు ? మరి వీరి బంధం సంగతి బాలామణికి తెలిసిపోతుందా ? రామ్ కు ఆల్రెడీ పెళ్లయిందని మానసకు తెలిసిపోతుందా ?

అప్పుడేం జరుగుతుంది ? అనేది మిగతా కథలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

కథ చదివారు కదా.. ఇల్లాలు , ప్రియురాలి మధ్య నలిగిపోయిన మొగుళ్ళ కధలకు ఇది కొనసాగింపు అన్నమాట.. ఇక్కడ మ్యాజిక్కంతా ఒక్కటే .. సినిమా హిట్ అనేది స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఉంటుంది .

సరైన కామెడీ టైమింగ్ చేయగల హీరోని పట్టుకుని తెరమీద సమపాళ్లలో కథనాన్ని నడిపించగలిగితే ఇంకో పది సినిమాలు ఇట్లాంటివి తీసినా ప్రేక్షకులు చూస్తారు . వీటిలో మొదటిది కామెడీ టైమింగ్ చేయగల హీరో.. ఆ విషయంలో రవితేజ సెలక్షన్ సరైనదే .

మాస్ మహారాజ్ గా పేరుబడ్డ రవితేజలో చక్కటి హాస్యాన్ని పండించగల నటుడు ఉన్నాడు . అనుకున్నట్టుగానే ఈ సినిమాలో రవితేజ తనదైన మార్క్ హాస్య రుచులను సంక్రాంతి ప్రేక్షకులకు పంచాడు .

ప్రారంభంలో ఇడియట్ , ఖడ్గం , విక్రమార్క , కిక్ , దుబాయి శ్రీను వంటి సినిమాల్లో ఎనర్జిటిక్ గా కనిపించి మాస్ మహారాజ్ బిరుదుని సొంతం చేసుకున్న రవితేజ రాజా ది గ్రేట్ సినిమాకి ముందునుంచి షుగర్ పేషేంట్ మాదిరి సన్నబడిపోయి షేపులు మారిపోవడంతో ఆయనకు కొద్దిగా క్రేజ్ తగ్గిన మాట వాస్తవం . దానికి తోడు వరుసగా మూస కథలతో సినిమాలు చేయడంతో ఆయన ఖాతాలో సరైన హిట్ పడలేదు .

మళ్ళీ ఇన్నాళ్లకు రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి తో వింటేజ్ లుక్ లో కనిపించాడు .. దాని అర్ధం హిట్ పడింది అని కాదు . మళ్ళీ పాత రవితేజ స్క్రీన్ మీద సందడి చేస్తున్నాడని అర్ధం.. రవితేజనుంచి అభిమానులు ఆశించేది పాత ఎనర్జిటిక్ మాస్ మహారాజ్ అండ్ వింటేజ్ లుక్ లో కనిపించే కొత్త రవితేజ .

ఆ లోటు ఈ సినిమాతో కొంతవరకు తీరింది .. కాసేపు తన మాస్ ఇమేజుని పక్కనబెట్టి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గెటప్పులో కనిపించాడు .

రవితేజలాంటి కామెడీ టైమింగ్ హీరోలపక్కన సత్య , వెన్నెల కిషోర్ , సునీల్ లాంటి సీమటపాకాయలుంటే థియేటర్లో నవ్వుల టపాసులు పేల్తాయి .. వీరి కాంబో బావుంది .

దర్శకుడు సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతుంటాడు అనుకుంటా.. సంభాషణల్లో ఆ పంచులను బాగా వాడుకున్నాడు .

ప్రథమార్థం వరకు గతంలో చూసిన భార్య , ప్రియురాల మధ్య నలిగిపోయే మొగుడి సన్నివేశాలతో రొటీన్ సినిమాల మాదిరే అనిపిస్తుంది . పాత స్టోరీ లైను నే తీసుకుని సరికొత్తగా కామెడీ పండించి ఇంకో కోణంలో ఆవిష్కరిద్దామనుకున్న దర్శకుడి తపన బాగానే ఉంది కానీ ఇలాంటి లైనులో మరింత డెప్త్ లో హాస్యాన్ని పండించాల్సి ఉంది .

కొన్ని సన్నివేశాల్లో హాస్యం శృతిమించి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.. ముగింపు మీద కూడా దర్శకుడు ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు లేదు.. ఆ ఫ్లోలో తీసుకెళ్లి వదిలేసాడు .

ఎవరెలా చేసారు ?

మాములుగా నేటి జెనెరేషన్లో ఇలాంటి పాత్రలు విక్టరీ వెంకటేష్ కు కొట్టిన పిండి.. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే భర్తగా రకరకాల హావభావాలు ముఖంలో పలికించాల్సి ఉంటుంది . భయం , కంగారు , ఎమోషన్ , కామెడీ లను ఏ టైంలో ఎప్పుడు వాడాలో తెలిసి ఉండాలి.. ఈ విషయంలో రవితేజ తనపాత్రకు న్యాయం చేసాడనే చెప్పాలి . పైగా చాన్నాళ్లకు ఈ సినిమాలో రవితేజ వింటేజ్ లుక్ లో కనిపించి ఫ్రెష్ గా ఉన్నాడు . డైలాగ్ డెలివరీ , డాన్సులు , ఫైటింగులు షరామామూలుగా తనదైన స్టైలులో పండించాడు .

కథానాయికలు డింపుల్ హయతి , ఆషికా రంగనాథ్ లు ఇద్దరూ ఎవరి పరిధిలో వారు బాగానే చేసారు. కాకపోతే పాత్ర స్వభావం దృష్ట్యా ఆషికా రంగనాథ్ మరింత గ్లామర్ గా కనిపించింది .

ఇక ఈ సినిమాకి ప్రధాన బలం కామెడీయే కాబట్టి మాంచి కాంబోనే సెలెక్ట్ చేసుకున్నారు.. వెన్నెల కిషోర్ ఆ మధ్య వరుసగా దాదాపు ప్రతి సినిమాలో కనిపించేవాడు.. ఎందుకో గ్యాప్ వచ్చినట్టుంది.. మళ్ళీ హాస్యాన్ని పండించటానికి ఈ సినిమాతో స్క్రీన్ మీదకు వచ్చాడు .

సత్య , సునీల్ లు కూడా తమవంతు హాస్యాన్ని అందించారు .

సాంకేతికత :

ఈ మధ్య భీమ్స్ సిసిరోలియో చక్కటి నేపధ్య సంగీత దర్శకుడిగా ఫోకస్ లోకి వస్తున్నారు .
సంక్రాంతి బరిలో ఈయన సంగీత సారధ్యంలో సినిమాలు బాగానే పడ్డాయి . ఇందులో కూడా భీమ్స్ సంగీతం బావుంది . ముఖ్యంగా వామ్మో ,వాయ్యో పాట హుషారు రేకెత్తించింది .

సినిమాటోగ్రఫీ కూడా బావుంది .
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి .

ముగింపు :

సంక్రాంతి పండక్కి నవ్వుల పిండివంటలతో ప్రేక్షకులను సంతృప్తి పరచటానికి దర్శకుడు చేసిన ప్రయోగం పేరే భర్త మహాశయులకు విజ్ఞప్తి . అయితే పిండివంటలో కొన్ని పదార్దాలు బావున్నాయి అనుకునేలోపల కొన్ని పదార్దాలు తేలిపోయి నిరుత్సాహపరుస్తాయి . వెరసి ఈ సంక్రాంతి వంటకం రవితేజ అభిమానులకు ఫుల్ మీల్స్ .. సాధారణ ప్రేక్షకులకు ప్లేట్ మీల్స్ అన్నమాట .

నటీనటులు : రవితేజ , డింపుల్ హయతి , ఆషికా రంగనాథ్ , సునీల్ , సత్య తదితరులు
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
నిర్మాత : చెరుకూరి సుధాకర్
దర్శకత్వం : కిషోర్ తిరుమల
విడుదల : 13-01-2026
రేటింగ్ : 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!