Home » రోబోలతో మనుషులు కలిసి జీవించగలరా ? ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 మూవీ రివ్యూ

రోబోలతో మనుషులు కలిసి జీవించగలరా ? ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 మూవీ రివ్యూ

Spread the love

ఈ సినిమా చాలామంది చూసే ఉంటారు
అలాగే కొంతమంది చూసి ఉండకపోవచ్చు కూడా

అలా ఈ రోజుకీ ఈ మూవీ చూడని వారికోసం ఈ రివ్యూ

సమయం లేకనో , పబ్లిసిటీ లేకనో , మన దృష్టికి రాకనో కొన్ని మంచి సినిమాలను మిస్ అవుతూ ఉంటాం

ఓటిటీ ప్లాట్ ఫార్మ్ వచ్చిన తర్వాత అన్ని భాషల్లో కుప్పలుతెప్పలుగా సినిమాలు వచ్చి పడుతున్నాయి

వీటిలో కొన్ని థియేటర్లలో రిలీజ్ కాగా మరికొన్ని నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అయినవి ఉన్నాయి

సాధారణంగా ఓటీటీల్లో చూసే ప్రేక్షకులు మాతృ భాషలో సినిమాలు చూడటానికి ప్రిఫర్ చేస్తారు
మరీ బాగుందని టాక్ వస్తే ఇతర భాషల్లో కూడా చూస్తారు

ఇటీవల కాలంలో ఆ ఇతర భాషా మూవీల్లో మళయాళం సినిమాలు ఆదరణ పొందుతున్నాయి

అలా తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలై మంచి రేటింగ్ సాధించిన సినిమానే ఈ ఆండ్రాయిడ్ కట్టప్ప

2020 లోనే ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 పేరుతో వచ్చిన ఈ మళయాళం మూవీ కేరళలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది
తర్వాత మళయాళం వెర్షన్ ప్రైమ్ ఓటిటీ లో కూడా రిలీజ్ చేసారు

ఇదే సినిమాని ఆండ్రాయిడ్ కట్టప్ప వెర్షన్ 5.25 పేరుతో తెలుగులో కూడా డబ్ చేసి ఆహా ఓటిటీ లో రిలీజ్ చేసారు

డిజిటల్ ప్రపంచం వచ్చాక మానవ సంబంధాలు కూడా యాంత్రికం అయిపోతున్నాయనేది వాస్తవం

మనుషులు మాట్లాడుకోవడం మానేసి చాట్ చేయడం మొదలుపెడుతున్న రోజులు వచ్చేసాయి

భవిష్యత్తు అంతా Ai దేనని , మానవ వనరుల స్థానంలో రోబోలు ప్రాముఖ్యం వహిస్తాయని ఐటి ఎనలిస్టులు ఇప్పుడు చెప్తున్నారు

కానీ ఆరేళ్ళ క్రితమే ఈ దర్శకుడు ఇలాంటి పరిణామాలను ఊహించినట్టున్నాడు

రోబోలతో మనుషులు కనెక్ట్ అయితే మానవాళి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది సింపుల్గా సినిమా భాషలో చెప్పారు

ఇదే విషయాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చెప్తే కంప్యూటర్ పరిజ్ఙానం లేని సామాన్యులకు అంతగా ఎక్కకపోవచ్చు

కానీ అదే విషయాన్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చెప్తే ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది
ఆండ్రాయిడ్ కుంజప్పలో దర్శకుడు చేసిన ప్రయోగం అదే

ఇంతకీ ఈ ఆండ్రాయిడ్ కధేంటి ?

సినిమా ప్రారంభమే ఓ వృద్ధుడు తన రోబోకి కాఫీ ఆర్డర్ చేస్తాడు
రోబో కాఫీ ప్రిపేర్ చేసి ట్రే లో పెట్టుకుని ఆ వృద్ధుడి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి కప్ చేతికి అందిస్తుంది

ఇంతవరకు బాగానే ఉంది
రోబో మెషిన్ మాదిరి కమాండ్ మేరకు పనిచేస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు

కానీ అదే కమాండ్ ను ఎవరైనా దుర్వినియోగం చేస్తే ఎదురయ్యేది దుష్ఫలితాలే
ఈ సన్నివేశంలో జరిగింది అదే

కాఫీ బాగాలేదని ఆ వృద్దుడికి కోపం వచ్చి కప్పుని విసిరి రోబో ముఖాన కొడతాడు
దాంతో రోబోకి కూడా కోపం వచ్చి ఆ వృద్దుడ్ని గొంతు పిసికి చంపుతుంది

ఈ ఒక్క సన్నివేశంతోనే రోబోలతో మానవాళికి కలిగే లాభాలు , ఎదురయ్యే దుష్ఫలితాలు దర్శకుడు క్లియర్ గా చెప్పాడు

దానికి కొనసాగింపుగా మనల్ని కథలోకి తీసుకెళ్తాడు

కేరళలోని ఓ పల్లెటూరులో భాస్కరన్ (సూరజ్ వెంజరమూడ్) అనే చాదస్తపు వృద్ధుడు తన కొడుకు సుబ్రహ్మణ్యం తో ( సౌబిన్ సాహిర్ ) కలిసి నివసిస్తూ ఉంటాడు

ఈ భాస్కరన్ కి అసలే చాదస్తం ఎక్కువ
పైగా పాత కాలం మనిషి

ఇంట్లో మిక్సీలు , గ్రైండర్లు , స్మార్ట్ ఫోనులు లాంటివి ఏవీ వాడటం రాదు

ఇతడి కొడుకు సుబ్రహ్మణ్యం మాత్రం నేటి తరం మనిషి
మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు

కానీ తండ్రి చాదస్తం వల్ల అతడు ఏ ఉద్యోగంలోనూ సెటిల్ కాలేకపోతాడు
కొడుకు ఎక్కడ ఉద్యోగంలో చేరినా ఏదో కారణాలు చెప్పి తనవద్దకు పిలిపించుకుంటూ ఉంటాడు

కొడుక్కేమో మంచి ఉద్యోగంలో చేరి జీవితంలో సెటిల్ అవ్వాలని కోరిక
కానీ తండ్రి ఆరోగ్యం దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లలేకపోతాడు

అప్పటికీ తండ్రి కోసం సహాయకులుగా నర్సులను , వంట మనుషులను కూడా పెడతాడు
కానీ భాస్కరన్ చాదస్తానికి జడిసి వాళ్ళు పని మానేసి వెళ్ళిపోతారు

ఇదే సమయంలో కొడుక్కి రష్యాలో రోబోలు తయారుచేసే కంపెనీలో ఉద్యోగం వస్తుంది

విదేశాలకు వెళ్లినా తండ్రి క్షేమం గురించిన ఆలోచనలతో అతడు ఒక ఆలోచన చేస్తాడు
అదే ఆండ్రాయిడ్ కుంజప్పన్

పల్లెటూరిలో చేదోడువాదోడుగా ఉంటూ సాయం చేసేందుకు ఓ రోబోని తయారుచేసి తండ్రికి అప్పచెప్పి సుబ్రహ్మణ్యం తిరిగి రష్యా వెళ్ళిపోతాడు

మొదట్లో రోబో రాకను వ్యతిరేకించిన భాస్కరన్ క్రమక్రమంగా దానితో ఎలా కనెక్ట్ అవుతాడు ?

రోబో రాక తండ్రీ , కొడుకుల సంబంధాల మీద ఎలాంటి ప్రభావం చూపించింది ?

ఆ పల్లెటూరిలో రోబో రాకతో ఎలాంటి పరిణామాలు సంభవించాయి ? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

ఆండ్రాయిడ్ కుంజప్పన్ అంటే ఇదేదో కంప్యూటర్ లాంగ్వేజ్ మీద తీసిన సినిమా అనుకునేరు
అదేమీ కాదు

మానవ సంబంధాల మీద టెక్నాలజీ ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది ?
హ్యూమన్ రిలేషన్స్ ని రోబోలు భర్తీ చేయగలవా ?
ఇప్పటికే యాంత్రిక జీవనం అనుభవిస్తున్న మానవాళికి రోబోల రాక మంచి చేస్తుందా ? కీడు చేస్తుందా ? లాంటి రకరకాల ప్రశ్నలకు ఈ సినిమాలో సమాధానాలు దొరుకుతాయి

తండ్రీ , కొడుకుల మధ్య అనుబంధాన్ని సున్నితంగా చూపిస్తూనే మరో కోణం కూడా ఆవిష్కరించారు

కొడుకు చెయ్యాల్సిన పని రోబో చేస్తుందా ?
రోబో చేస్తున్న పనులను కొడుకు చేయగలడా ? అని ఒక సన్నివేశంలో ఆలోచన రేకెత్తిస్తారు

వృద్దాప్యంలో ఒంటరితనంతో బాధపడే వారు తమకు ఏదైనా ఆసరా దొరుకుతుందేమో అని తపన పడే సన్నివేశాలను హృద్యంగా చూపించారు

నిజంగా ఒక్కోసారి భాష్కరానికి కుంజప్పన్ ( రోబో ) చేస్తున్న సేవలు చూస్తే భవిష్యత్తులో ప్రతి ఒక్క వృద్ధులకూ ఇటువంటి రోబోలు అవసరమేమో అనిపిస్తుంది

టెక్నాలజీ అసలేమాత్రం తెలియని భాస్కరన్ లాంటి చాదస్తుడు కూడా రోబో సాయంతో చిన్న చిన్న సాంకేతిక విషయాలను తెలుసుకోవడమే కాకుండా ఆఖరికి ఆ రోబోతో ఎంతలా కనెక్ట్ అవుతాడంటే కుంజప్పన్ ను తన కొడుకులా భావించుకుంటాడు

కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మూవీలో నిజమైన తండ్రీ కొడుకులు భాస్కరన్ , సుబ్రమణ్యాలా ? లేకపోతే భాస్కరన్ , కుంజప్పన్ లా ( రోబో ) అనిపిస్తుంది

కొడుకు స్థానంలో భాస్కరన్ రోబోతో కనెక్ట్ అవడం హృద్యంగా చూపించారు

అలా అని కొడుకేమీ తండ్రిని గాలికి వదిలేసిన దుర్మార్గుడు కాదు
ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి అనుబంధం ఉంటుంది

ఉద్యోగ రీత్యా కొడుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో భాస్కరన్ కూడా కొడుకును ఇబ్బంది పెట్టకుండా రోబోతో కనెక్ట్ అయ్యాడా అనిపిస్తుంది

అలా అని కుంజప్పన్ సీరియస్ సినిమా కాదు
హాయిగా నవ్వుకోవడానికి సన్నివేశాలు ఉంటాయి

క్లైమాక్స్ సన్నివేశం మాత్రం ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేస్తుంది

ఎవరెలా చేసారు ?

ఎవరెలా చేసారంటే ఇద్దరి గురించే చెప్పుకోవాలి
ఎందుకంటే ఈ సినిమా మొత్తం తండ్రీ ,కొడుకుల చుట్టూనే నడుస్తుంది

మధ్యలో రోబో కూడా ఉంది కానీ ముందుగా చెప్పుకోవాల్సింది భాస్కరన్ గా నటించిన సూరజ్ వెంజరమూడ్ అండ్ సుబ్రహ్మణ్యం గా నటించిన సౌబిన్ సాహిర్ ల నటన గురించే చెప్పుకోవాలి

ఈ సినిమా కోసం ఇద్దరూ పోటీ పడి నటించారు
ఇద్దరిలో ఏ ఒక్కరికీ తక్కువ మార్కులు వేయలేము.

వృద్ధ తండ్రిగా బాడీ లాంగ్వేజ్ లో కానీ , డైలాగ్ డెలివరీలో కానీ , ఎక్స్ప్రెషన్స్ లో కానీ సూరజ్ నూరు శాతం పాత్రకు న్యాయం చేసాడు

అలాగే వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్న తండ్రికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని పరితపించే కొడుకుగా , మరోపక్క కెరీర్ కోసం తపనపడే యువకుడిగా సౌబిన్ సాహిర్ అత్యుత్తమ నటన ప్రదర్శించాడు

సాంకేతికత :

బిజుబల్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది

కేరళ ప్రకృతి అందాలను , భాస్కరన్ ఉంటున్న పల్లె పరిసరాలను , వర్షం సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ అందంగా తెరకెక్కించారు
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి

యాంత్రిక జీవనంలో మానవ సంబంధాలపై రోబోల ప్రభావం గురించి దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింటును ఎమోషనల్ టచ్ ఇచ్చి మరీ చెప్పారు

విశ్లేషణ

ఓ పల్లెటూరు , ఓ చాదస్తపు తండ్రి , కెరీర్ కోసం ఆ తండ్రిని విడిచిపెట్టి దూరం వెళ్లలేక మధనపడే కొడుకు , వీళ్ళ జీవితాల్లోకి రోబో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది ? అనే ఆలోచనతో తీసిన సినిమా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది . ఉన్న ఊరిని వదిలి రాలేక ఒంటరి వృద్దులు పడే ఇబ్బందులు ,అలాగే అమ్మానాన్నలను విడిచి వెళ్లలేక తప్పనిసరై కెరీర్ కోసం అమెరికా వెళ్లి సెటిలైపోయిన కొడుకులను , కూతుళ్లను ఇప్పటికీ నిజ జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం . ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే తమ జీవితాన్నే పోలి ఉందని కొందరైనా అనుకుంటారు . మూవీలో ఎక్కడా అసభ్యతా , అశ్లీల సన్నివేశాలు లేవు కాబట్టి ఇంట్లోనే హాయిగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు

నటీనటులు : సూరజ్ వెంజమూడ్ , సౌబిన్ సాహిర్
దర్శకత్వం : రతీష్
విడుదల : ప్రైమ్ అండ్ ఆహా ఓటిటీ
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!