Home » జేమ్స్ కామెరూన్ మూడో అవతారం ఎలా ఉంది ? -అవతార్ 3 మూవీ రివ్యూ

జేమ్స్ కామెరూన్ మూడో అవతారం ఎలా ఉంది ? -అవతార్ 3 మూవీ రివ్యూ

Spread the love

2009 లో జేమ్స్ కామెరూన్ అనే హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ‘ అవతార్ ‘ అనే విజువల్ వండర్ ని పరిచయం చేసినప్పుడు ప్రపంచం అబ్బురపడింది

అసలు ఎవరీ కామెరూన్ ?
ఏంటి ఇతడి మాయాజాలం ?
అతడి చేతిలో ఏ మంత్రం దండం ఉందో వెండితెర మీద ఇంత అద్బుతాన్నిసృష్టించాడు ?

థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయి కళ్లప్పగించి సినిమా చూసి వ్వావ్ అనుకుంటూ బయటికి వచ్చిన రోజులు అవి

ప్రపంచ సినిమా గతిని ఒక్క విజువల్ మాయతో మరో ప్రపంచానికి మలుపుతిప్పిన మూవీ అవతార్

అప్పట్లో ఈ మేనియా ఎంతలా పాకిందంటే ఎక్కడ చూసినా , ఏ ఇద్దరు సినీ ప్రేక్షకులు కలిసినా అవతార్ అనే చర్చలే

అవతార్ స్టిక్కర్లు విచ్చలవిడిగా తమ వాహనాలకు అతికించుకుని తిరిగిన అభిమానులు కూడా ఉన్నారు

కొందరైతే అవతార్ టాటూలు కూడా వేసుకున్నారు

మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల కలెక్షన్ సునామీ సృష్టించింది

ఎక్కడిదాకో ఎందుకు ?
ఒక్క హైద్రాబాదులోనే వంద రోజులు ఆడి తెలుగు పంపిణీదారులకు కూడా కాసుల వర్షం కురిపించింది

అప్పటిదాకా ఫ్యామిలీ బాండింగ్ తెలుగు సినిమాలు , హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు అలవాటు పడ్డ సినీ అభిమానులను ఒక్కసారిగా తనతోపాటు ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మిక్స్ చేస్తూ యాక్షన్ సన్నివేశాలను కలుపుతూ పండోరా అనే ఓ కొత్తగ్రహానికి తీసుకెళ్లాడు కామెరూన్

మొదటిభాగానికి వచ్చిన రెస్పాన్స్ తో ఆయన రెండో భాగానికి శ్రీకారం చుట్టి 2022 లో అవతార్ పార్ట్ 2 ది వే ఆఫ్ వాటర్ అనే పేరుతొ మరో విజువల్ వండర్ ని ప్రపంచం మీదకు వదిలాడు

ఇదీ అంతే వసూళ్లను రాబట్టింది
అతడిలో ఏదో మాయ ఉందని జనాలు ఫిక్స్ అయిపోయారు

అదే అంచనాలతో ఇప్పుడు అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ యాష్ మూవీకి పరుగులు పెట్టారు

మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా మూడో భాగం కూడా మెప్పించిందా ? లేదా ?అనేది ఇప్పుడు చూద్దాం

ఇంతకీ కధేంటంటే ?

మూడో భాగం కథ గురించి చెప్పుకోవాలంటే ఇంతకుముందు జరిగిన రెండు భాగాలలోని కథ గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకోవాలి

2009 లో రిలీజ్ అయిన అవతార్ లో పండోరా అనే గ్రహం మీదకు మనుషులు వెళ్లి అక్కడి విలువైన సహజ వనరులను దోచుకుంటూ ఉంటారు

వీరి దోపిడీలను నేత్రి నాయకత్వంలో పండోరా తెగ ఎదుర్కుంటూ పోరాటం చేస్తూ ఉంటుంది

ఈ దశలో జేక్ సల్లీ ఆమెను పెళ్ళిచేసుకుని అక్కడే సెటిలై తమ గ్రహాన్ని కాపాడుకునే ప్రయత్నాలలో తెగ వాసులతో కలిసి పోరాటాలు చేస్తూ ఉంటాడు
ఇదే ఇతివృత్తంలో దాదాపు మొదటిభాగమంతా సాగుతుంది

ఇక 2022 లో వచ్చిన రెండో భాగం అవతార్ ది వే ఆఫ్ వాటర్ లో యుద్ధాలను ప్రకృతినుంచి నీటిమీదుగా మళ్ళించాడు

అంటే ఈ భాగంలో పండోరా గ్రహ వాసులకు , నీటితో సంబంధం ఉన్న తెగలతో వచ్చే పోరాట సన్నివేశాలు చూపించాడు

ఇక తాజాగా అవతార్ ఫైర్ అండ్ యాష్ మూడో భాగంలో నిప్పు దగ్గరికి వచ్చాడు

ఇదెలా ఉందంటే రెండో భాగంలో నీటికి సంబంధించిన తెగలతో సన్నివేశాలు అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆయన నిప్పు – బూడిద అని కొత్త తెగను సృష్టించాడనుకోవాలి

ఈసారి నాలుగో భాగంలో కామెరూన్ గాలి తెగను సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు

అదే పండోరా గ్రహం , అదే తెగ , అవే ప్రదేశాలు
కేవలం , నీరు , నిప్పు అనుకుంటూ స్టోరీలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ చూసిందే చూపించడంతో ఇంతకు ముందున్న కిక్ పోయింది

మూడో పార్ట్ కి వస్తే కొడుకు పోయిన విచారంలో జేక్ సల్లీ (సామ్ వర్డింగ్టన్ ) , నేత్రి (జో సల్ధానా ) ఉంటారు

మిగిలిన పిల్లల్ని కాపాడుకుంటూనే కొడుకు చావుకి కారణమైనవారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వేచి ఉంటారు

ఈ పరిస్థితుల్లో అవతార్ 2 లో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్ ) నావి తెగకు చెందిన వ్యక్తిలా తిరిగి జీవం పోసుకుని వస్తాడు

జేక్ సల్లీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి యితడు ఎదురుచూస్తుంటారు
ఈ దశలో అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఉనా చాప్లిన్ ) ఇతడితో చేతులు కలుపుతుంది

వీరికి తోడు పండోరా గ్రహాన్ని నాశనం చేయాలని ఎదురుచూస్తున్న ఇంకో బృందం కూడా జత కలుస్తుంది

ఇప్పుడు ఈ మూడు బృందాల ఉమ్మడి లక్ష్యం పండోర తెగని నాశనం చేయడమే

మరి ఇలాంటి పరిస్థితుల్లో జేక్ సల్లీ తన కుటుంబాన్ని కాపాడుకుంటూనే పండోరా గ్రహాన్ని శత్రువుల బారినుంచి ఎలా రక్షిస్తాడు అనేదే మిగిలిన కథ

ఎలా ఉందంటే ?

సిరీస్ చూస్తున్నవారికి ఒకటి అర్ధమయ్యే ఉంటుంది

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కథకన్నా విజువల్స్ నే ఎక్కువగా నమ్ముకున్నాడని

కానీ తినగ తినగ గారెలు చేదు అవుతాయన్న మన తెలుగు సామెతలు ఆయనకి తెలిసినట్టు లేదు

అవతార్ లో మొదటిసారి పండోరా గ్రహాన్ని చూసిన ప్రేక్షకులు ఆ మాయాజాలానికి అబ్బురపడిపోయారు

అదో వింత లోకం , అక్కడో విచిత్రమైన తెగలు
జీవులే కానీ మనుష్యులు కాదు

మనుషులను పోలిన కొత్త గ్రహాంతర వాసులను తయారుచేసి దానికి విజువల్స్ రంగులు అద్దటంతో ప్రేక్షకులకు మొదటిసారి ఏదో మాయా ప్రపంచంలో విహరించిన అనుభూతి కలిగింది

ఆ అనుభూతే సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది

దాంతో కామెరూన్ ఇంకో పదమూడేళ్ళ టైమ్ తీసుకుని మొదటిభాగానికే చిన్న చిన్న మార్పులు చేసి నీటి తెగలను సృష్టించి ది వే ఆఫ్ వాటర్ పేరుతో ఇంకో మాయాజాలాన్ని వదిలాడు

కధలో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేకపోయినా గ్రాఫిక్స్ అద్భుతాలు చేసాడు కాబట్టి కలెక్షన్ల పరంగా పార్ట్ 2 కూడా మంచి వసూళ్లనే రాబట్టింది

అయితే మొదటి భాగానికి , రెండో భాగానికి వచ్చిన కలెక్షన్ల మధ్య తేడాలను దర్శకుడు జాగ్రత్తగా పరిశీలించి ఉంటే ఇప్పుడు ఈ నిప్పు – బూడిద లో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేవాడేమో?

చూసిన గ్రాఫిక్సే మళ్లీమళ్లీ చూస్తుండటంతో ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ పోయి పాత సినిమాలనే మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది

గ్రాఫిక్స్ అద్దడంలో విజయం సాధించిన అంత పెద్ద దర్శకుడు కూడా కథ విషయంలో తడబడుతున్నాడు

కొత్త తెగలను ఎలా సృష్టించాలా అని తెగ మధనపడుతున్నారు
దాని పర్యవసానమే నీరు , నిప్పు తెగలు

ఇలా తెగలను మార్చుకుంటూ అదే పండోరా లోకాన్ని పదేపదే చూపిస్తే ప్రేక్షకులు కూడా థియేటర్లోనే పండుకుంటారు అనే విషయం దర్శకుడు తెలుసుకోవాలి

కేవలం గ్రాఫిక్స్ కోసమే అయితే ఆ స్థాయిలో కాకపోయినా కొంత అబ్బురపరిచే సన్నివేశాలు యూ ట్యూబులో కూడా కనపడతాయి
పైగా అసలే ఇప్పుడు ai రోజులకు వచ్చేసాం
కాబట్టి మొదటి రెండు భాగాలతో పోలిస్తే మూడో భాగం అంత కిక్ ఇవ్వలేకపోయింది

దానికి తోడు దాదాపు మూడు గంటల పదిహేడు నిమిషాల సుధీర్గ నిడివి తీసుకోవడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష అవడమే కాకుండా అప్పుడప్పుడు వీడియో గేములు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది

ఇంగ్లీష్ సినిమాల్లో మాకు కధలతో పనిలేదు అనుకుని కేవలం గ్రాఫిక్స్ మాయాజాలం చూడాలనుకునేవారికి , థియేటరిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునేవారికి పార్ట్ 3 కూడా నచ్చుతుంది

ఇందులో మొదటి రెండు భాగాలను మించిన క్వాలిటీ కనిపిస్తుంది
పదిహేనేళ్ల క్రితానికి , ఇప్పటికీ టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి కదా

అందుకే దర్శకుడు ఇందులో అప్డేటెడ్ వెర్షన్ వాడటంతో విజువల్స్ పరంగా ఆ క్వాలిటీ స్క్రీన్ మీద కనిపిస్తుంది

సినిమా చూస్తున్నవారికి టెక్నాలజీని వాడుకోవడంలోని ఆయన పనితనం స్పృష్టంగా కనిపిస్తుంది
అదే కామెరూన్ విజయ రహస్యం

ఎవరెలా చేసారంటే ?

జేక్ సల్లీ పాత్రలో సామ్ వర్డింగ్టన్ పూర్తి న్యాయం చేసాడు
ఫ్యామిలీ బాండింగ్ మెయింటైన్ చేస్తూనే యాక్షన్ సన్నివేశాలు చేయడంతో ఇతడి పాత్ర బాగా సెట్ అయ్యింది
కుటుంబాన్ని కాపాడుకుంటూనే పండోరా గ్రహాన్ని కాపాడుకునే పాత్రలో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి

నేత్రి పాత్ర పోషించిన జోయా సల్ధానా ఇప్పటికే చక్కటి నటిగా ప్రూవ్ చేసుకుంది

లేడీ విలన్ వరంగ్ పాత్ర పోషించిన ఉనా చాప్లిన్ కి కూడా ఇందులో మంచి సీన్లు పడ్డాయి

సాంకేతికంగా ఎలా ఉంది ?

నిజానికి ఇటువంటి సినిమాలకు కథ ఎలా ఉంది ? ఎవరెలా చేసారు ? అని రివ్యూ చేసేకన్నా సాంకేతికత ఎలా ఉంది ? అనే పరిశీలన చేయడమే అత్యంత ముఖ్యం . ఎందుకంటే ఈ సిరీస్ కి సాంకేతికతే ప్రామాణికం

దర్శకుడు కామెరూన్ కూడా ఇప్పటిదాకా చేసిన మూడు భాగాల్లో ఈ సాంకేతికతను వాడుకునే విజయం సాధించాడు

యధాప్రకారం ఇందులో కూడా లేటెస్ట్ ఐమాక్స్ వెర్షన్ కూడా వాడి చక్కటి గ్రాఫిక్స్ ప్రదర్శించాడు

రస్సెల్ కార్పెంటర్ అనే వ్యక్తి ఇందులో కీలకం
ఎందుకంటే ఫోటోగ్రఫీలో అద్భుతమైన పనితనం అంతా ఈయన కెమెరా మ్యాజిక్కే

ఇలాంటి సినిమాలకు చక్కటి నేపధ్య సంగీతం కూడా అవసరమే
ఆ పరంగా బాగానే ఉంది

ముగింపు : ఓవరాల్ గా మరోసారి విజువల్స్ మాయాజాలం చూద్దామనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది. అంతకన్నా ఎక్కువ ఆశిస్తే నిరాశ మిగులుతుంది

నటీనటులు : సామ్ వర్డింగ్టన్ , జోయా సల్ధానా తదితరులు
దర్శకత్వం : జేమ్స్ కామెరూన్
విడుదల : 19 – 12 – 2025

రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!