కాశ్మీర్లో ఉగ్రవాదం ప్రధాన అంశంగా తెరకెక్కించిన సినిమాలు గతంలో చాలా వచ్చాయి
వాటిలో పండిట్ల ఊచకోత కథలు కూడా ఉన్నాయి
అయితే ఏ సినిమా చూసినా కాశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు , వాటిని ధీటుగా ఎదుర్కున్న మన సైనికులు అనే పాయింటులోనే ఉంటాయి
ఇది కాకుండా ఆ కథల్లో మితిమీరిన వయొలెన్స్ కూడా అదనంగా ఉంటుంది
అయితే వయోలెన్సుకి ప్రాధాన్యత తగ్గించి ఒక సున్నితమైన అంశాన్ని సినిమాటిక్ లిబర్టీగా మలిచి ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంగా చెప్పటానికి దర్శకుడు చేసిన ప్రయత్నమే బారాముల్లా మూవీ అనిపిస్తుంది
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న బారాముల్లా తీసింది దురంధర్ మూవీ తీసిన నిర్మాణ సంస్థే కావడంతో ఇది కూడా చూస్తే పోలా అనిపించింది
ఎందుకంటే దురంధర్ మూవీతో ఆదిత్య ధర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు
సునామీ అనేది చిన్న పదం కానీ కలెక్షన్లలో సునామీని కూడా మించిపోయింది దురంధర్
నెట్ ఫ్లిక్స్ లో డిస్క్రిప్షన్ చూస్తే ఇది కూడా కాశ్మీర్ , ఉగ్రవాదానికి సంబంధించిన కధాంశం అని అర్థమైంది
అయినా సరే నిర్మాణ సంస్థ మీద , దర్శకుడి మీద ఉన్న నమ్మకంతో బారాముల్లా చూడటం మొదలుపెట్టా
బారాముల్లా కధేంటి ?
సినిమా ప్రారంభమే మ్యాజిక్ షోతో మొదలౌతుంది
మనం గతంలో చాలా మ్యాజిక్ షోలు చూసాం కదా
అబ్రకదబ్రా అంటూ ఒక మెజీషియన్ చేతిలో కర్ర తిప్పుతూ సంచిలో ఉన్న పావురాన్ని మాయం చేస్తాడు
అలాగే ఈ మ్యాజిక్ షోలో కూడా ఒక మెజీషియన్ తన ముందు ఉన్న చెక్కపెట్టెలో ఎవరైనా పిల్లవాడు కూర్చుంటే క్షణాల్లో మాయం చేస్తా అని ఛాలెంజ్ చేస్తాడు
జనంలోనుంచి ఓ పిల్లవాడు ముందుకొచ్చి తాను చెక్కపెట్టెలో కూర్చుంటా అని ధైర్యంగా కూర్చుంటాడు
ఆశ్చర్యం
చెక్కపెట్టెలో కూర్చోగానే ఆ పిల్లవాడు నిజంగానే మాయం అవుతాడు
ఈ సంఘటన ఎవరూ ఊహించరు
ఆఖరికి మెజీషియన్ కూడా
ఇంతకీ ఆ మాయమైపోయిన పిల్లవాడు స్థానిక మాజీ ఎమ్మెల్యే కొడుకు కావడంతో పోలీసుల మీద ప్రెషర్ పడుతుంది
ఉన్నతాధికారులు ఈ కేసును దర్యాప్తు చేయటానికి ప్రత్యేకంగా డిఎస్పీ రిధ్వాన్ (మానవ్ కౌల్ ) ను బారాముల్లా పంపిస్తారు
కేసును దర్యాప్తు చేయడానికి బారాముల్లా వచ్చిన రిధ్వాన్ తన భార్య ,కొడుకు , కూతురితో కలిసి ఓ బంగ్లాలో దిగుతాడు
ఆ బంగ్లాలో వీరికి సహాయకుడిగా ఇక్బాల్ అనే సర్వెంట్ ఉంటాడు
ఎమ్మెల్యే కొడుకు మాయం కేసులో డిఎస్పీ రిధ్వాన్ దర్యాప్తు చేస్తున్న సమయంలోనే బారాముల్లాలో స్కూల్ పిల్లలు ఒకరొకరుగా మాయం అవుతూ ఉంటారు
అదే సమయంలో అతడి ఇంట్లో కూడా రాత్రిళ్ళు శబ్దాలు రావడం , బాడ్ స్మెల్ రావడం వంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి
దీనికి తోడు ఇక్బాల్ రాత్రిళ్ళు ఎవరికో ప్లేటులో ఆహారం పట్టుకెళ్ళడం రిధ్వాన్ కూతురు కూడా గమనిస్తుంది
అదేంటో తెలుసుకుందామని వెళ్లిన రిధ్వాన్ కూతురు నూరీ కూడా మాయం అవుతుంది
ఎమ్మెల్యే కొడుకు మాయం కేసులో దర్యాప్తు చేస్తున్న రిధ్వాన్ ఆఖరికి తన కూతురు కూడా కనిపించకుండా పోవడంతో షాక్ అవుతాడు
ఈ పరిస్థితుల్లో డిఎస్పీ రిధ్వాన్ ఏం చేస్తాడు ?
బారాముల్లాలో వరుసగా పిల్లలు ఎందుకు మాయం అవుతున్నారు ?
కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న డిఎస్పీ రిధ్వాన్ ఇంట్లో రాత్రిళ్ళు వింత వింత శబ్దాలు రావడానికి కారణం ఏంటి ?
గతంలో ఆ ఇంట్లో నివసించిన కాశ్మీరీ పండిట్లకు ఆ శబ్దాలకు ఉన్న సంబంధం ఏంటి ? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
ముందే చెప్పినట్టు కాశ్మీర్లో ఉగ్రవాదం గురించి , కాశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి గతంలో చాలా సినిమాలు వచ్చాయి
బారాముల్లా దర్శకుడు ఆదిత్య జంబాలే అదే విషయాన్ని మూస ధోరణిలో చెప్పకుండా సరికొత్తగా చెప్పటానికి ప్రయత్నం చేసాడు
సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీకి కొంచం హార్రర్ టచ్ నెక్స్ట్ సన్నివేశంలో ఇవ్వడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకులలో కలిగించారు
సైన్యం , పోలీసులు , ఉగ్రవాదుల నేపథ్యంలో సినిమా తీస్తే రొటీన్ రోడ్డ కొట్టుడు అయిపోతుంది
అందుచేత ఇందులోకి ఆత్మలను తీసుకొచ్చాడు
ఎప్పుడైతే మూవీలో ఆత్మలు రంగప్రవేశం చేశాయో అప్పుడే స్టోరీ డిఫరెంట్ టర్న్ తీసుకుంది
అంతకుముందు మొదటి అర్ధగంట వరకు బాయ్ మిస్సింగ్ , పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనే రొటీన్ ఫార్ములాతోనే కథ సాగుతుంది
బిగినింగ్ చాలా స్లోగా సాగుతుంది
స్టార్టింగ్ చూస్తే ఒక రకంగా మనకు బోర్ కొడుతోంది కూడా
ఇలాంటి సీన్లు గతంలో ఎన్ని సినిమాల్లో చూడలేదూ ?
స్కూల్ పిల్లాడ్ని ఏ టెర్రరిస్టో కిడ్నాప్ చేసి ఉంటాడు
ఆ కిడ్నాప్ కేసును ఈ డీఎస్పీ రిధ్వాన్ ఇన్వెస్టిగేట్ చేసి బోర్డర్లో ఉగ్రవాదులతో పోరాడి పిల్లవాడ్ని విడిపించుకు వస్తాడు .. అంతేకదా అని ఆవలిస్తాం
కానీ ఇక్కడే దర్శకుడు కొద్దిగా తెలివిగా వ్యవహరించాడు
రొటీన్ ఫార్మాట్లో ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలను నడిపిస్తూనే సడెన్గా ఆత్మలను ప్రవేశపెట్టడంతో మూవీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది
సెకండాఫ్ నుంచి కధనంలో డెప్త్ పెరుగుతుంది
ఒకటొకటిగా పజిల్స్ చిక్కుముడులు వీడుతాయి
స్కూల్ పిల్లల కిడ్నాప్ దందా వెనుక ఉన్న భాయీజాన్ ఎవరనేది క్లైమాక్సులో రివీల్ చేస్తారు
ఈ మూవీలో విలన్లకన్నా డిఎస్పీ రిధ్వానే ఎక్కువసేపు కనిపిస్తాడు
అసలామాటకొస్తే గతంలో చాలా సినిమాల్లో చూసినట్టు పెద్ద పెద్ద టెర్రరిస్టు స్థావరాలు ,చుట్టూ గన్నులు పట్టుకుని పహారా కాసే వందలాది మంది మిలిటంట్లు లాంటి హడావుడులు ఏమీ లేకుండా సింపుల్గా చూపించేసాడు
ఒక్క క్లైమాక్సులో అటూఇటూ తుపాకులతో కాల్చుకోవడం మినహా మూవీలో ఎక్కడా మితిమీరిన వయొలెన్స్ లేదు
కాకపొతే ఈ ఆత్మల గోల అంత తొందరగా మనకు అర్ధం కాదు
రిధ్వాన్ కొడుకు , కూతురు రాత్రిళ్ళు అదే ఇంట్లో అండర్ గ్రౌండ్లోకి వెళ్లడం , పనివాడు ఇక్బాల్ ప్లేటులో ఆహరం పట్టుకుని చీకట్లో నేల మీద పెట్టిరావడం లాంటివి అక్కడేదో జరుగుతుందని అనిపిస్తుంది కానీ ఏంటో అర్ధం కాదు
పిల్లల మాయం గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డిఎస్పీ తన ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకపోవడం వింతగా అనిపిస్తుంది
ఇంట్లో ఏదో బాడ్ స్మెల్ వస్తుందని కూతురు రెండుమూడు సార్లు చెప్పినా ఆ పోలీసు బుర్రకు ఎక్కకపోవడం ఏంటో అర్ధం కాదు
కధనంలో కంటికి కనిపించే చిన్న చిన్న లోపాలు కొన్ని ఉన్నాయి
అయినా క్లైమాక్సులో ఆ ఇంట్లో కాశ్మీరీ పండిట్ల ఊచకోత సన్నివేశాలను చూసిన తర్వాత ప్రేక్షకులు ఆ లోపాలను మర్చిపోతారు
వారి కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని తల్చుకుని మనసు చివుక్కుమంటుంది
ఎవరెలా చేసారు ?
సినిమా మొత్తం ఆల్మోస్ట్ ప్రతి సన్నివేశంలోనూ డీఎస్పీ రిధ్వాన్ కనిపిస్తాడు . ఈ పాత్రను పోషించిన మానవ్ కౌల్ పెర్ఫార్మన్స్ బాగుంది
అతడి భార్య , పిల్లల నటన కూడా బాగుంది
మూవీలో వీరు కాకుండా చెప్పుకోదగ్గ పాత్రలు లేవు
సాంకేతికత :
ఇలాంటి సినిమాలకు బీజీఎమ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్
ఆ పరంగా సునీత్ లిమాయే అందించిన నేపధ్య సంగీతం బావుంది
బీజీఎమ్ తర్వాత చెప్పుకోవాల్సిందో ఫోటోగ్రఫీ గురించి
సినిమా ప్రారంభమే కాశ్మీర్లోని మంచు కొండల్లో ప్రారంభం అవుతుంది
కాశ్మీర్ అందాలను చక్కగా చూపించారు
వెరసి సినిమాటోగ్రఫీ కూడా బావుంది
విశ్లేషణ :
రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీకే కొంచం హర్రర్ టచ్ ఇచ్చి బారాముల్లాను తెరకెక్కించడంలో హర్రర్ జానర్ ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది . వయొలెన్స్ తక్కువగా ఉండటం , అసభ్య , అశ్లీల దృశ్యాలు లేకపోవడంతో ఇంట్లో ఫ్యామిలీతో కలిసి నిక్షేపంగా చూడొచ్చు . ఆత్మలు ఉన్నాయి కదా అని భయపడక్కర్లేదు . అవేమీ అంతగా భయపెట్టవు . కాబట్టి చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. తెలుగులో కూడా ఉంది కాబట్టి అందరూ చూడొచ్చు
నటీనటులు : మానవ్ కౌల్ , నీలోఫర్ హమీద్ తదితరులు
దర్శకత్వం : ఆదిత్య జంబాలే
విడుదల : నెట్ ఫ్లిక్స్
రేటింగ్ : 3 /5
