శోభన్ బాబు , శారద భార్యాభర్తలు
అయితే విశాఖలో ఉండే శోభన్ బాబు పెద్ద బిజినెస్ మాన్ కావడంతో తరచూ పనిమీద ఊటీ వెళ్తుంటాడు
అక్కడ శోభన్ బాబుకి అనుకోకుండా శ్రీదేవి పరిచయం అవడం , ఇద్దరు ఒకటి అవడం జరుగుతుంది
పనిముగించుకుని విశాఖ వచ్చిన శోభన్ బాబు ఈ విషయం భార్యకి చెప్పకుండా దాచిపెడతాడు
ఓ రోజు అనుకోకుండా శ్రీదేవి విశాఖ వస్తుంది
దాంతో అసలు విషయం భార్యకు ఎక్కడ తెలిసిపోతుందో అని శోభన్ బాబు తెగ కంగారుపడిపోతాడు
భార్యకి ,ప్రియురాలికి మధ్య నలిగిపోతాడు
ఆగండాగండి ,
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ రాస్తాడనుకుంటే ఇదేదో శోభన్ బాబు కార్తీక దీపం సినిమా గురించి రాస్తున్నాడేంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ?
సరే , అయితే ఇది చూడండి
వెంకటేష్ , సౌందర్యలు భార్యాభర్తలు
హైద్రాబాదులో ఉండే వెంకటేష్ బిజినెస్ పనిమీద నేపాల్ వెళతాడు
అక్కడ వినీత అనే అమ్మాయి పరిచయం అవడం , ఇద్దరు ఒకటి అవడం జరుగుతుంది
పనిముగించుకుని హైద్రాబాద్ వచ్చిన వెంకటేష్ ఈ విషయం భార్యకు చెప్పకుండా దాచిపెడతాడు
అయితే ఓ రోజు అనుకోకుండా ఆ నేపాల్ అమ్మాయి వంటలమ్మి రూపంలో ఏకంగా వెంకటేష్ ఇంట్లోనే దిగుతుంది
దాంతో అసలు విషయం భార్యకు ఎక్కడ తెలిసిపోతుందో అని వెంకటేష్ తెగ కంగారు పడిపోతూ ఉంటాడు
ఇంట్లో ఇల్లాలికి , వంటింట్లో ప్రియురాలికి మధ్య నలిగిపోతూ ఉంటాడు
మళ్ళీ ఆగండాగండి ,
ఇప్పుడు కూడా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ రాయకుండా ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు మూవీ గురించి చెప్తున్నాడేంటా ? అని ఆశ్చర్యంగా ఉందా ?
ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కూడా పైన చెప్పిన రెండు సినిమాల తాలూకూ ఒకే తానులోని మూడో ముక్క
నిజానికి ఇలా లెక్కేసుకుంటే ఇల్లాలు , ప్రియురాలి మధ్య నలిగిపోయే మొగుళ్ళ మీద గతంలో బోలెడు సినిమాలు వచ్చాయి
ఈ సినిమాలంటికీ బ్రాండ్ అంబాసడర్ శోభన్ బాబు
ఈయన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటే చాలు.. బొమ్మ బ్లాక్ బస్టరే
శోభన్ బాబు గారు వెళ్ళిపోయాక వెంకటేష్ ఆ వారసత్వాన్ని తీసుకుని కొన్నాళ్ళు ఇద్దరితో నడిపాడు
ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది
ప్రియురాలితో కలిసిన సంగతి భార్య దగ్గర దాచిపెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఆయనలాంటి ఇంకొందరు టూ బై త్రీలకు చెప్పడానికి వచ్చాడు
కధేంటి ?
కథ గురించి పైన అంత వివరంగా చెప్పుకున్నాం కదా .. కధేంటో ఈపాటికి మీకు అర్దమైపోయే ఉంటుంది
అయినా క్లుప్తంగా చెప్పుకుందాం
రామ్ సత్యనారాయణ ( రవితేజ ) , బాలామణి (డింపుల్ హయతి ) భార్యాభర్తలు
ఈ రామసత్యనారాయణ పెద్ద వైన్ బిజినెస్ మ్యాన్
ఈ మొగుడుగారంటే భార్యకు భక్తితో కూడిన ప్రేమ
తన భర్త శ్రీరామచంద్రుడంతటివాడని ఆమె ప్రగాఢ నమ్మకం
అయితే ఓరోజు వైన్ బిజినెస్లో భాగంగా రామ్ స్పెయిన్ దేశం వెళ్లాల్సివస్తుంది
అక్కడ అనుకోకుండా ఇదే బిజినెస్ చేస్తున్న మానస శెట్టి ( ఆషికా రంగనాథ్ ) పరిచయం అవడం , ఇద్దరు ఒకటి అవడం చకచకా జరిగిపోతాయి
పనిముగించుకుని ఇండియా వచ్చిన రామ్ జరిగిన విషయాన్ని భార్యకు చెప్పకుండా దాచిపెడతాడు
అయితే ఓరోజు అనుకోకుండా మానస ఇండియా వస్తుంది
దీంతో తమ విషయం భార్యకు ఎక్కడ తెలిసిపోతుందో అని రవితేజ తెగ కంగారు పడిపోతూ ఉంటాడు
ఇల్లాలు , ప్రియురాల మధ్య రామ్ ఏ విధంగా నలిగిపోతాడు ?
మరి వీరి బంధం సంగతి బాలామణికి తెలిసిపోతుందా ?
రామ్ కు ఆల్రెడీ పెళ్లయిందని మానసకు తెలిసిపోతుందా ?
అప్పుడేం జరుగుతుంది ? అనేది మిగతా కథలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
కథ చదివారు కదా
ఇల్లాలు , ప్రియురాలి మధ్య నలిగిపోయిన మొగుళ్ళ కధలకు ఇది కొనసాగింపు అన్నమాట
ఇక్కడ మ్యాజిక్కంతా ఒక్కటే
సినిమా హిట్ అనేది స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఉంటుంది
సరైన కామెడీ టైమింగ్ చేయగల హీరోని పట్టుకుని తెరమీద సమపాళ్లలో కథనాన్ని నడిపించగలిగితే ఇంకో పది సినిమాలు ఇట్లాంటివి తీసినా ప్రేక్షకులు చూస్తారు
వీటిలో మొదటిది కామెడీ టైమింగ్ చేయగల హీరో
ఆ విషయంలో రవితేజ సెలక్షన్ సరైనదే
మాస్ మహారాజ్ గా పేరుబడ్డ రవితేజలో చక్కటి హాస్యాన్ని పండించగల నటుడు ఉన్నాడు
అనుకున్నట్టుగానే ఈ సినిమాలో రవితేజ తనదైన మార్క్ హాస్య రుచులను సంక్రాంతి ప్రేక్షకులకు పంచాడు
ప్రారంభంలో ఇడియట్ , ఖడ్గం , విక్రమార్క , కిక్ , దుబాయి శ్రీను వంటి సినిమాల్లో ఎనర్జిటిక్ గా కనిపించి మాస్ మహారాజ్ బిరుదుని సొంతం చేసుకున్న రవితేజ రాజా ది గ్రేట్ సినిమాకి ముందునుంచి షుగర్ పేషేంట్ మాదిరి సన్నబడిపోయి షేపులు మారిపోవడంతో ఆయనకు కొద్దిగా క్రేజ్ తగ్గిన మాట వాస్తవం
దానికి తోడు వరుసగా మూస కథలతో సినిమాలు చేయడంతో ఆయన ఖాతాలో సరైన హిట్ పడలేదు
మళ్ళీ ఇన్నాళ్లకు రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి తో వింటేజ్ లుక్ లో కనిపించాడు
దాని అర్ధం హిట్ పడింది అని కాదు
మళ్ళీ పాత రవితేజ స్క్రీన్ మీద సందడి చేస్తున్నాడని అర్ధం
రవితేజనుంచి అభిమానులు ఆశించేది పాత ఎనర్జిటిక్ మాస్ మహారాజ్ అండ్ వింటేజ్ లుక్ లో కనిపించే కొత్త రవితేజ
ఆ లోటు ఈ సినిమాతో కొంతవరకు తీరింది
కాసేపు తన మాస్ ఇమేజుని పక్కనబెట్టి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గెటప్పులో కనిపించాడు
రవితేజలాంటి కామెడీ టైమింగ్ హీరోలపక్కన సత్య , వెన్నెల కిషోర్ , సునీల్ లాంటి సీమటపాకాయలుంటే థియేటర్లో నవ్వుల టపాసులు పేల్తాయి
వీరి కాంబో బావుంది
దర్శకుడు సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతుంటాడు అనుకుంటా
సంభాషణల్లో ఆ పంచులను బాగా వాడుకున్నాడు
ప్రథమార్థం వరకు గతంలో చూసిన భార్య , ప్రియురాల మధ్య నలిగిపోయే మొగుడి సన్నివేశాలతో రొటీన్ సినిమాల మాదిరే అనిపిస్తుంది
పాత స్టోరీ లైను నే తీసుకుని సరికొత్తగా కామెడీ పండించి ఇంకో కోణంలో ఆవిష్కరిద్దామనుకున్న దర్శకుడి తపన బాగానే ఉంది కానీ ఇలాంటి లైనులో మరింత డెప్త్ లో హాస్యాన్ని పండించాల్సి ఉంది
కొన్ని సన్నివేశాల్లో హాస్యం శృతిమించి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది
ముగింపు మీద కూడా దర్శకుడు ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు లేదు
ఆ ఫ్లోలో తీసుకెళ్లి వదిలేసాడు
ఎవరెలా చేసారు ?
మాములుగా నేటి జెనెరేషన్లో ఇలాంటి పాత్రలు విక్టరీ వెంకటేష్ కు కొట్టిన పిండి
ఇద్దరు భామల మధ్య నలిగిపోయే భర్తగా రకరకాల హావభావాలు ముఖంలో పలికించాల్సి ఉంటుంది
భయం , కంగారు , ఎమోషన్ , కామెడీ లను ఏ టైంలో ఎప్పుడు వాడాలో తెలిసి ఉండాలి
ఈ విషయంలో రవితేజ తనపాత్రకు న్యాయం చేసాడనే చెప్పాలి
పైగా చాన్నాళ్లకు ఈ సినిమాలో రవితేజ వింటేజ్ లుక్ లో కనిపించి ఫ్రెష్ గా ఉన్నాడు
డైలాగ్ డెలివరీ , డాన్సులు , ఫైటింగులు షరామామూలుగా తనదైన స్టైలులో పండించాడు
కథానాయికలు డింపుల్ హయతి , ఆషికా రంగనాథ్ లు ఇద్దరూ ఎవరి పరిధిలో వారు బాగానే చేసారు
కాకపోతే పాత్ర స్వభావం దృష్ట్యా ఆషికా రంగనాథ్ మరింత గ్లామర్ గా కనిపించింది
ఇక ఈ సినిమాకి ప్రధాన బలం కామెడీయే కాబట్టి మాంచి కాంబోనే సెలెక్ట్ చేసుకున్నారు
వెన్నెల కిషోర్ ఆ మధ్య వరుసగా దాదాపు ప్రతి సినిమాలో కనిపించేవాడు
ఎందుకో గ్యాప్ వచ్చినట్టుంది
మళ్ళీ హాస్యాన్ని పండించటానికి ఈ సినిమాతో స్క్రీన్ మీదకు వచ్చాడు
సత్య , సునీల్ లు కూడా తమవంతు హాస్యాన్ని అందించారు
సాంకేతికత :
ఈ మధ్య భీమ్స్ సిసిరోలియో చక్కటి నేపధ్య సంగీత దర్శకుడిగా ఫోకస్ లోకి వస్తున్నారు
సంక్రాంతి బరిలో ఈయన సంగీత సారధ్యంలో సినిమాలు బాగానే పడ్డాయి
ఇందులో కూడా భీమ్స్ సంగీతం బావుంది
ముఖ్యంగా వామ్మో ,వాయ్యో పాట హుషారు రేకెత్తించింది
సినిమాటోగ్రఫీ కూడా బావుంది
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి
ముగింపు :
సంక్రాంతి పండక్కి నవ్వుల పిండివంటలతో ప్రేక్షకులను సంతృప్తి పరచటానికి దర్శకుడు చేసిన ప్రయోగం పేరే భర్త మహాశయులకు విజ్ఞప్తి . అయితే పిండివంటలో కొన్ని పదార్దాలు బావున్నాయి అనుకునేలోపల కొన్ని పదార్దాలు తేలిపోయి నిరుత్సాహపరుస్తాయి . వెరసి ఈ సంక్రాంతి వంటకం రవితేజ అభిమానులకు ఫుల్ మీల్స్ .. సాధారణ ప్రేక్షకులకు ప్లేట్ మీల్స్ అన్నమాట
నటీనటులు : రవితేజ , డింపుల్ హయతి , ఆషికా రంగనాథ్ , సునీల్ , సత్య తదితరులు
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
నిర్మాత : చెరుకూరి సుధాకర్
దర్శకత్వం : కిషోర్ తిరుమల
విడుదల : 13 -01 -2026
రేటింగ్ : 2.5 / 5
