బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ కు చెందిన నితిన్ నబిన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు
ఇప్పటికే పదవీకాలం ముగిసినప్పటికీ రెండు పర్యాయాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న జేపీ నడ్డా స్థానంలో నితిన్ ఇకపై పదవిలో కొనసాగనున్నారు
నడ్డా స్థానంలో నూతన అధ్యక్షుడిగా తలపండిన సీనియర్ నేత పేరు బయటికి వస్తుందని పార్టీలోనే కొంతమంది నాయకులు అంచనా వేసుకుంటున్న తరుణంలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ గత అధ్యక్షులతో పోలిస్తే చిన్నవాడైన నితిన్ పేరు తెరమీదకు వచ్చింది
పైగా ప్రధాని మోడీ సైతం ఎటువంటి భేషజాలకు పోకుండా వయసులో చిన్నవాడు అయినప్పటికీ ‘ ఇకనుంచి నితిన్ నా బాస్ ‘ అని సభాముఖంగా ప్రకటించటంతో అతడి ఎంపిక ఆషామాషీగా జరిగింది కాదని అందరికీ అర్థమైంది
మోడీ స్వయంగా ఆయన్ని తన బాస్ అని చెప్పడంతో సీనియర్లను కాదని జూనియర్ కి పదవీ బాధ్యతలు అప్పగించారనే చర్చకు అవకాశం లేకుండా పోయింది
అంతేకాదు పార్టీలో అత్యున్నత బాధ్యతలు చేపట్టడానికి సామర్ధ్యమే కొలమానం కానీ వయసు కాదని తేల్చి చెప్పారు
వయసులో చిన్నవాడు అయినప్పటికీ పార్టీని విజయపధంలో నడపటానికి నితిన్ అన్ని విధాలా అర్హుడు అని కితాబు కూడా ఇచ్చారు
ఒకరకంగా ఈ ప్రకటన ద్వారా పనిచేసేవాడికే పదవి అని పార్టీ శ్రేణులకు ఆయన బలమైన సంకేతాలు ఇచ్చారు
అఫ్కోర్స్ బీజేపీలో మోడీ , అమిత్ షాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించే నాయకులు ప్రస్తుతానికి లేరనుకోండి. ఇకముందు కూడా ఉండకపోవచ్చు
ఆ మాటకొస్తే ఏ పార్టీలోనూ లేని క్రమశిక్షణ బీజేపీలో కనిపిస్తుంది
పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి ఒక్కటీ సిస్టమాటిక్ గా జరిగిపోతాయి
పార్టీలో మార్పులు చేర్పులు చేయాలంటే కొద్ది నెలలముందే సైలెంట్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది
ఇద్దరు అధినాయకుల కనుసన్నలలో జరిగే ఈ గ్రౌండ్ వర్క్ ఐదో కంటివాడికి కూడా తెలీదు
ఈ బాధ్యతలను మొత్తం పర్యవేక్షించి నివేదికలు ఇచ్చే పనిని ముందుగానే ఒక నాయకుడికి అప్పచెబుతారని పార్టీ వర్గాల్లో బహిరంగ టాక్ ఎప్పుడూ ఉంటుంది
ఆయన పేరు బిఎల్ సంతోష్
ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉందా ?
కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ తరపున ఢిల్లీ నుంచి స్వామీజీలు వచ్చి హైదరాబాద్ రిసార్ట్స్ లో బేరాలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు . గుర్తుందా ?
ఆ ట్రాప్ లో కేసీఆర్ ప్రభుత్వం వారితో పాటు బిఎల్ సంతోష్ అనబడే బీజేపీ నాయకుడి మీద కూడా కేసులు పెట్టింది
ఈ బీఎల్ సంతోష్ బీజేపీ జాతీయ కార్యవర్గంలో కార్యదర్శి హోదాలో ఉన్నారు
అయితే మ్యాటర్ అది కాదు
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చినవాళ్లు ‘ తమ వెనుక ఈ బీఎల్ సంతోష్ ఉన్నారని , ఈయన మోడీ , అమిత్ షా లకు అత్యంత సన్నిహితుడని , విధానపరమైన నిర్ణయాలు అన్నీ ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతాయని ‘ మాట్లాడిన మాటలు టేపుల్లో రికార్డ్ అయ్యాయి
దరిమిలా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న కుట్ర వెనుక బీజేపీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా ఉన్నారని ఆరోపించారు
అయితే ఈ ఆరోపణలను అప్పట్లోనే సంతోష్ ఖండించారు కూడా
తర్వాత కేసు న్యాయస్థానాలకు వెళ్లడంతో రాజకీయ వివాదం అప్పటికి సద్దుమణిగింది
తాజాగా నితిన్ నబిన్ నియామకం వెనుక కూడా ఈయన ఆధ్వర్యంలో సుదీర్ఘ కసరత్తు జరిగిందని అంటుంటారు
దేశ వ్యాప్తంగా పలువురి పేర్లను పరిశీలించి కాచి వడబోసిన తర్వాతనే నితిన్ పేరుకు అధినాయకులు ఆమోదముద్ర వేశారు
ఇదే ఇతర జాతీయ పార్టీలో అయితే సీనియర్లకు పదవి బాధ్యతలు అప్పగించలేదని పెద్ద ఎత్తున అసమ్మతి రేగేది
సరే ఈ నితిన్ నబిన్ పేరు పరిశీలించటం వెనుక బీజేపీ పరిగణలోకి తీసుకున్న అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం
నితిన్ నియామకం ఏదో మోడీ చెప్పారనో , అమిత్ షా చెప్పారనో చేపట్టింది కాదు
ఈయనకి గట్టి రాజకీయ నేపధ్యం ఉంది
విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీ తో మొదలైన ప్రస్థానం ఆరెస్సెస్ లో సుదీర్ఘకాలం కార్యకర్తగా పనిచేయడంతో స్థిరపడింది
తర్వాత బీజేపీ యువమోర్చాకు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసారు
జాతీయ పార్టీలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఇతడి ప్రవేశం కూడా అనుకోని పరిస్థితుల్లో జరిగింది
ఈయన తండ్రి నబీన్ కిషోర్ ఎమ్మెల్యే గా ఉన్న సమయంలోనే మరణించడంతో ఆయన వారసుడిగా నితిన్ 2006 లో పాట్నా వెస్ట్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు
ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు జరిగిన ఎన్నికలలో ఓటమి అనేది ఎరుగకుండా బాంకీ పూర్ నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించడంతో బీజేపీ పెద్దల దృష్టిలో నితిన్ పడ్డాడు
దాని ఫలితమే క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగాడు
ఎంత ఎదిగినా తన ఆరెస్సెస్ మూలలను మర్చిపోలేదు
తరచూ సంఘపరివార్ సమావేశాలకు హాజరు కావడం , ముఖ్య నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుండటంతో పార్టీ జాతీయ నాయకుల దృష్టిలో పడ్డాడు
దాంతో ఈయనకు ఛత్తీస్ ఘడ్ లో పార్టీని గెలిపించే బాధ్యత అప్పగించారు
అక్కడ కూడా ఈయన కృషి ఫలించడంతో అధినాయకత్వం నితిన్ లో గేమ్ ఛేంజర్ను చూసింది
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో బీజేపీ వ్యూహాత్మకంగా నితిన్ నబిన్ ను రంగంలోకి దింపింది
ఈ ఐదు రాష్ట్రాల్లోనూ బెంగాల్ లో గెలుపును బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది
మోడీ కూడా తన ప్రసంగంలో ఇన్ డైరెక్ట్ గా ఇదే విషయం మీద ఆయనకు దిశా నిర్దేశం చేసారు
‘అధ్యక్ష పదవీ బాధ్యతలు అనేవి కేవలం బీజేపీ సంస్థాగత నిర్మాణం వరకే పరిమితం కాదు
రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎన్డీయేను సమర్థవంతంగా సమన్వయపరిచే బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంటుంది’ అని మోడీ స్పృష్టంగా కొత్త అధ్యక్షుడికి హితబోధ చేసారు
‘పార్టీ నాయకత్వం గ్రామఫోను వినే పాత తరంనుంచి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న యువతరం అనేకమంది చేతుల్లోకి మారిందని , ప్రస్తుతం బాధ్యతలు చేపడుతున్న యువ నాయకుడు అటువంటి ఆధునిక సాంకేతికత సాయంతో పార్టీని మరింత సమర్థవంతంగా నడపాలని’ మోడీ ఆకాక్షించారు
ఈ సందర్భంగా మోడీ ఆయన్ను మిలియనీల్ నాయకుడిగా అభివర్ణించారు
గతంలో అధ్యక్షులుగా అమిత్ షా , జేపీ నడ్డా లు పార్టీని సమర్థవంతంగా నడిపించి విజయ బాటలో నడిపించిన విధంగానే నితిన్ కూడా రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు సాధించి పెట్టాలని ఆయన కోరారు
చివరగా నితిన్ మాట్లాడుతూ పార్టీ తనమీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి వారి నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు
ఈ సందర్భంగా ఆయన మోడీకి కృతజ్ఞతలు తెలియచేసారు
ముగింపు : పార్టీ నూతన అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించటానికి నితిన్ ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి రాకముందే అమిత్ షా తో సహా కొంతమంది నాయకులు ఆయనకు స్వాగతం చెప్పడం కోసం ముందుగానే వచ్చి వేచి ఉండటం గమనార్హం. ఈ విషయంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే బీజేపీ లో క్రమశిక్షణ పాళ్ళు ఎక్కువే అనిపిస్తుంది . నితిన్ పార్టీలో జూనియర్ అయినా అధినాయకత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సీనియర్లు కూడా బద్ధులై ఉండటం గొప్ప విషయమే . ఒకరకంగా బీజేపీలో ఉన్న ఈ క్రమశిక్షణ ఆ పార్టీని ఇతర పార్టీలకన్నా ఒక మెట్టు పైన ఉంచుతుంది . ప్రస్తుతానికి పార్టీలో మోడీ , అమిత్ షాలు తిరుగులేని నాయకులుగా స్థిరపడిపోయారనడంలో అతిశయోక్తి లేదు
బెంగాల్ ఎన్నికల్లో ఈ కాంబో సత్ఫాలితాలు సాధిస్తుందో లేదో చూడాలి !
