డీఎస్ ఈరే ఈ మళయాళం మూవీ పేరే వెరైటీగా ఉందికదా ..కానీ దానికో అర్ధం ఉంది – మూవీ రివ్యూ

Spread the love

సాధారణంగా హర్రర్ సినిమాలకు దయ్యం అనో , చీకటి అనో , మిస్టరీ అనో టైటిళ్లు ఉంటాయి.. నిజానికి అలాంటి సినిమాలకు టైటిల్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది . హర్రర్ జానర్లో టైటిల్ డిజైన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే ప్రేక్షకులకు సినిమా మీద అంత ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది .

కానీ ఈ మళయాళ హర్రర్ సినిమాకి డీఎస్ ఈరే అనే టైటిల్ పెట్టారు.. ఈ టైటిల్ చాలామందికి అర్ధం కాలేదు . మూవీ పోస్టర్ చూస్తే హర్రర్ థ్రిల్లర్ అని అర్ధమౌతుంది . కానీ టైటిల్ చూస్తే డిఫరెంట్ జానరేమో అని అనుమానం వస్తుంది .

దీనికి ముందు భ్రమయుగం , భూతకాలం వంటి రొటీన్ టైటిళ్లు పెట్టి హర్రర్ మూవీలు తీసి జనాల్ని భయపెట్టిన మళయాళ దర్శకుడు రాహుల్ సదాశివన్ ఈ మూవీకి మాత్రం డీఎస్ ఈరే అని టైటిల్ పెట్టి సర్ప్రైజ్ ఇచ్చాడు .

నిజానికి ఆయన ఈ టైటిల్ను లాటిన్ భాషనుంచి లాక్కొచ్చాడు.. లాటిన్ భాషలో డీఎస్ ఈరే అంటే కోప దినం అని అర్థమట . ఈ సినిమాలో ఆత్మ నేపథ్యంలో దర్శకుడు కథ రాసుకుని తెరకెక్కించాడు కాబట్టి ఆత్మకి కోపం వస్తే అని మనం అర్ధం చేసుకోవాలన్నమాట .

బుర్ర చించుకుని ఇంత అర్ధం చేసుకునేకన్నా స్ట్రయిట్ గా ఆత్మ కోపం అని టైటిల్ పెట్టి ఉంటే సాధారణ ప్రేక్షకులకు కూడా ఇంకా బాగా రీచ్ అయ్యేదేమో ? అయినాసరే థియేటర్లలో రిలీజ్ అయి ఓ వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టేసుకుందిలెండి . ఈమధ్య తెలుగులో జియో హాట్ స్టార్ (ఓటిటి) లోకి కూడా వచ్చింది .

ఇప్పుడు కధేంటో చూద్దాం ?

కధానాయకుడు రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్ ) ఆర్కిటెక్ట్ .. ఇతడి తండ్రికి అమెరికా , కేరళలో బోలెడు వ్యాపారాలు ఉంటాయి.. ఓసారి వ్యాపార పనిమీద కేరళ వచ్చిన రోహన్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటుండగా అతడి గర్ల్ ఫ్రెండ్ కణి (సుష్మిత భట్ ) సూసైడ్ చేసుకుందని తెలుస్తుంది . అప్పటికి ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందనేది కూడా ఎవరికీ తెలీదు .

రోహన్ ఆమె ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె జ్ఞాపకాల కోసం అక్కడ దొరికిన ఓ హెయిర్ పిన్ తనవెంట తెచ్చుకుని ఇంటికి వచ్చేస్తాడు . అక్కడ్నించి అతడికి చిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి . ఎవరో తనని ఫాలో అవుతున్నట్టు , ఎవరో తన చుట్టూ తిరుగుతున్నట్టు రకరకాల ఫీలింగ్స్ వస్తుంటాయి . దాంతో కొంపదీసి కణి ఆత్మ తన చుట్టూ తిరుగుతుందా ? అని అనుమానం వస్తుంది .

అసలేం జరుగుతుందో అర్ధం కాక కణి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆమె ఇంటి ఎదురుగా ఉండే మధుసూదన్ ను (గిబిన్ గోపినాథ్ ) కలుస్తాడు .

అతడితో మాట్లాడిన తర్వాత రోహన్ కు ఏం తెలుస్తుంది ? రోహన్ ఫీల్ అవుతున్నట్టు నిజంగానే ఆత్మ అతడివెంట పడుతుందా ? అయితే ఆ ఆత్మ ఎవరు ?

కణి ఆత్మ రూపంలో రోహన్ వెంటపడుతోందా ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

సాధారణంగా హర్రర్ సినిమాలకు కథతో పెద్దగా పనుండదు.. చిన్న హెయిర్ పిన్ ఆధారంగా కూడా కథ అల్లుకుని ముందుకెళ్లిపోవచ్చు . థియేటర్లో హర్రర్ మూవీ చూస్తున ప్రేక్షకుడ్ని ఎంతవరకు భయపెట్టాం , ఎంత క్యూరియాసిటీ కలిగించాం అనేదాని మీద సినిమా కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి.

ఈ విషయాల్లో మళయాళ దర్శకులు దిట్ట.. వాళ్ళకి కథతో పెద్దగా పనుండదు.. కధనంతో మ్యాజిక్కులు చేస్తారు.. శబ్దాలతో భయపెట్టేస్తారు .. విజువల్స్ తో కన్నార్పకుండా చేస్తారు . డైలాగులు తక్కువ , సౌండ్స్ ఎక్కువ అన్నమాట .

దయ్యాలు , ఆత్మలు అనే కథలతో క్రీస్తు పూర్వం నుంచి సినిమాలు వస్తున్నప్పటికీ అదే కథను ప్రేక్షకుడికి బోరు కొట్టకుండా సరికొత్తగా చూపిస్తే ఖచ్చితంగా రీచ్ ఉంటుంది . కధాంశం ఇది కాకపోయినా శివ సినిమాలో రామ్ గోపాల్ వర్మ వాడుకున్న టెక్నిక్ టెక్నాలజీనే . అందుబాటులో ఉన్న సాంకేతికతను వాడుకుని డైలాగులు తక్కువ , సౌండ్ ఎక్కువతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు .

ఈ సినిమాలో దర్శకుడు సదాశివన్ కూడా అదే టెక్నాలజీ వాడుకున్నాడు .. సౌండ్స్ తో భయపెట్టాడు.

పెద్ద పెద్ద ఆర్టిస్టులు లేకుండా ఓ నలుగురైదుగురు మెయిన్ క్యారెక్టర్స్ తోటి సింపుల్ లొకేషన్లలో తీసిన ఇలాంటి సినిమాకు పెద్ద ఖర్చు కూడా కాదు.. కానీ వసూళ్లు మాత్రం రికార్డులు బద్దలు కొడతాయి . ఇక ఈ సినిమాలో ద్వితీయ భాగంతో పోలిస్తే ప్రథమార్థం చూస్తున్నప్పుడు పెద్దగా ఎగ్జైట్ అయ్యేంత సీన్లేమీ లేవు . సాధారణ కథలాగే అనిపిస్తుంది .

ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ తో ద్వితీయార్థం మీద క్యూరియాసిటీ కలుగుతుంది.. కణి సూసైడ్ , హెయిర్ పిన్ , ఆత్మల ఫీలింగుతో కథ నడుస్తున్న సమయంలో కణి తమ్ముడు కూడా అకస్మాత్తుగా చనిపోవడంతో స్టోరీ డెప్తులోకి వెళ్తుంది .

మళయాళం సినిమాలతో మనకొక ఇబ్బంది ఉంది.. ఏదీ గబాల్న చెప్పరు . ట్విస్టులతో స్టోరీని మెల్లిగా లాగి ఆఖర్లో సస్పెన్స్ రివీల్ చేసి మనల్ని సడెన్గా సర్ప్రైజ్ చేస్తారు . అన్నిటికన్నా ముఖ్యం ఆఖరి అర్ధగంటలో మనల్ని చూపు తిప్పుకోనీకుండా మ్యాజిక్ చేస్తారు . ఇందులో కూడా అదే జరిగింది .

అయితే కధకు ప్రధానమైన కణి ఎందుకు సూసైడ్ చేసుకుందో సరైన కారణం తెలియలేదు .
బహుశా సెకండ్ పార్ట్ లో ఏమన్నా చెప్తారేమో ?

ఎవరెలా చేసారు ?

ఒక్క టాలీవుడ్ లోనే కాదు అన్ని ఉడ్ లలో హీరోల వారసత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది . మళయాళంలో కూడా మమ్ముట్టి కొడుకు దుల్ఖర్ సల్మన్ చాన్నాళ్ళక్రితమే హీరోగా అరంగేట్రం చేసి తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు .

ఇప్పుడు ఇంకో మళయాళ నటుడు మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . మళయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ రిలీజ్ చేసారు . అయితే ఈ ప్రణవ్ ను చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని యాంగిల్స్ లో మోహన్ లాల్ మాదిరి కనిపించాడు .

మోహన్ లాల్ నటన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఆ మధ్య వచ్చిన తుడరమ్ సినిమాలో చక్కటి నటన ప్రదర్శించి మంచి వసూళ్లను సాధించాడు . వారసులు అయినంతమాత్రాన అందరికీ అదే నటనా వారసత్వం వస్తుందనే గ్యారంటీ లేదు . కానీ ఈ సినిమా వరకు చెప్పుకుంటే ప్రణవ్ నటన బాగుంది .

హర్రర్ సినిమాలకు హావభావాలతో ఎక్కువ పనుంటుంది.. ఆ పరంగా ఇతడు సమయానుకూలంగా హావభావాలు ప్రదర్శించాడు . ముందు ముందు ఇతడికి తెలుగు చిత్రసీమలో కూడా మంచి స్కోప్ ఉంటుంది .

మిగతావాళ్ళ గురించి చెప్పుకోవాలంటే క్లైమాక్సులో కనిపించిన జయ కురుప్ నటన సినిమాకి కీలకం
కధకి ఆ పాత్ర చాలా ప్రాముఖ్యం అనిపించింది . దానికి తగ్గట్టు ఆమె పాత్రకు ప్రాణం పోశారు .

సాంకేతికత

ఇందాక చెప్పాను కదా దర్శకుడు సౌండ్స్ తో భయపెట్టాడని.. ఓటిటి లో చూస్తేనే ఇలా ఉందంటే థియేటర్లో ఎలా ఉండేదో అనిపించింది . మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో గ్జేవియర్ ను దర్శకుడు సరిగా వాడుకున్నాడు .. సన్నివేశాలకు తగ్గ బీజీఎమ్ ఇచ్చాడు .. సినిమాకి ఇతడి బీజీఎమ్ కీలకం . సైలెంటుగా ఉన్న సన్నివేశంలో ఒక్కసారిగా ఢాం అని సౌండ్ వస్తే సహజంగా ప్రేక్షకుడు ఉలిక్కిపడతాడు . అదే రణగొణధ్వనుల మధ్య ఎన్ని ఢాం లు పేలినా అది అంత ఇంపాక్ట్ ఇవ్వదు . ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు .

అలాగే హర్రర్ సినిమాల్లో మ్యూజిక్ తో పాటు విజువల్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి.. పట్టపగలు లైట్ల వెలుగులో దయ్యాలను చూపిస్తే చిన్నపిల్లోడు కూడా భయపడడు.. సన్నివేశానికి తగ్గట్టు డార్క్ మోడ్ లో విజువల్స్ ఉండాలి . ఈ విషయంలో సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్ పర్ఫెక్ట్ గా వర్క్ చేసాడు .

నిజానికి దర్శకుడు ఎన్నుకున్న కథ కొత్తదేం కాదు.. కానీ వీళ్లిద్దరూ పాత కధకు కొత్త ప్రాణం పోశారు.

నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి .

విశ్లేషణ

సినిమా సూపరా అని ఒక్కమాటలో అడిగితే గబుక్కున సరైన సమాధానం చెప్పలేం. హర్రర్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది . కొన్ని సన్నివేశాలు భయపెడతాయి . కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందా ? అని కొంత ఎగ్జైట్ అవుతాం .ఇంకోవైపు నెమ్మదిగా సాగే కధనం సాధారణ ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు .

నటీనటులు : ప్రణవ్ మోహన్ లాల్ , సుష్మిత భట్
దర్శకత్వం : రాహుల్ సదాశివన్
విడుదల : జియో హాట్ స్టార్ ( తెలుగు )
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!