తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కొద్ది రోజుల్లోనే రేవంత్ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపించటానికి తన దగ్గరున్న ప్రణాళికలు ఏంటో స్పృష్టంగా చెప్పారు
చెప్పడమే కాదు రైజింగ్ తెలంగాణా 2047 పేరుతొ విజన్ డాక్యుమెంట్ రూపొందించడానికి కసరత్తులు కూడా మొదలుపెట్టారు
ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన తొలినాళ్లలోనే ” అభివృద్ధి సాధించడంలో మా పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదు . మేము ప్రపంచంతోనే పోటీ పడి అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం ” అని చెప్పారు
ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ కి వచ్చిన స్పందన చూస్తుంటే ఆయన మాటలు నిజమే అనిపిస్తుంది
అందులో భాగంగానే ఆయన తీసుకున్న మొదటి అంశం మూసి ప్రక్షాళన
ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులు , మంత్రులతో కలిసి లండన్ లోని రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించి వచ్చారు
ఆ స్థాయిలో మూసి ప్రక్షాళన కూడా చేపట్టి అభివృద్ధి చేయాలని అప్పుడే ప్రణాళికలు కూడా వేసుకున్నారు
ఇంతలో ప్రతిపక్షాలు మూసి నిర్వాసితుల తరలింపును అడ్డుకోవడంతో విషయం పొలిటికలైజ్ అయ్యింది
మూసి ప్రక్షాళన ప్రాజెక్టు కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు , ధర్నాలు చేసినప్పటికీ సీఎం తన నిర్ణయం లో కించిత్తు మార్పు కూడా చేసుకోలేదు
పైపెచ్చు త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రైజింగ్ తెలంగాణా 2047 విజన్ డాక్యుమెంట్ కి రూపకల్పన చేసారు
ఇంతకీ ఈ విజన్ డాక్యుమెంట్లో ఏముంది ?
మొత్తం డాక్యుమెంట్ అర్బన్ , సెమి అర్బన్ , రూరల్ రీజియన్ విభాగాలుగా విభజించుకుని ఏఏ రంగాల్లో ఎంతమేరకు అభివృద్ధి చేయాలో నిర్దేశించుకున్నారు
అది కూడా మొక్కుబడిగా నలుగురు అధికారులకు అప్పచెప్పి ఊరుకోలేదు
ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో తెలంగాణకు చెందిన అధికారులతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్ కు సంబంధించిన ప్రొఫెసర్లు , ఆర్బీఐ మాజీ గవర్నర్ , ఇతర ఆర్థికవేత్తలు ,మేధావులు పాల్గొన్నారు
అంతేకాదు డాక్యుమెంట్ కోసం పూర్తిగా అధికారుల మీదే ఆధారపడకుండా షుమారు నాలుగు లక్షల మంది ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేసారు
ఇందులో ఫ్యూచర్ సిటీ , మూసి ప్రక్షాళన , రీజనల్ రింగ్ రోడ్ , గ్రీన్ ఫీల్డ్ హైవే , రింగ్ రైల్ , బుల్లెట్ ట్రైన్ వంటి ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి
మొత్తం 83 పేజీలతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్లో రైతులు , విద్యార్థులు , మహిళలు , నిరుద్యోగులకు ప్రాధాన్యత ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టారు
ప్రాధాన్యతా క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఉంది
- యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ
విద్యార్థులలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఉద్యోగ , ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను చైర్మన్ గా నియమిస్తూ యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటును ప్రకటించారు
.
తనకున్న బిజీ షెడ్యూల్ లో అదనపు బాధ్యతలు నిర్వహించటం కష్టమని భావించి ఆయన మొదట ఈ పదవిని స్వీకరించటానికి నిరాకరించారట
కానీ ముఖ్యమంత్రి రేవంత్ విజన్ డాక్యుమెంట్ లోని అంశాలు ఆయనకు సమగ్రంగా వివరించడంతో ఇది తప్పకుండా విజయవంతం అవుతుందని నమ్మకం కలిగి పదవి బాధ్యతలు స్వీకరించారు
నిజానికి 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ అంతకన్నా ఎక్కువ అభివృద్ధి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని ఆనంద్ మహీంద్రా సైతం మీడియాతో మాట్లాడుతూ సంతృప్తి వ్యక్తం చేసారు
భవిష్యత్తులో ఉద్యోగాలకు Ai ముప్పు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా బ్లూ కాలర్ ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు
అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వనరులు , టెక్నాలజీ పూర్తిగా ఉన్నప్పటికీ నైపుణ్యాల కొరత ఉంది . అటువంటి నైపుణ్యం కలిగిన మానవ వనరులు మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి .
స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులలో మరింత నైపుణ్యం పెంచుతాం . తద్వారా ఉద్యోగ , ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు
మహిళల కోసం కూడా కొన్ని ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి
అందులో భాగంగానే జహీరాబాద్ లో తమ సంస్థ ఆధ్వర్యంలోని ఆటో ట్రాక్టర్ల యూనిట్ లో పూర్తిగా మహిళలను మాత్రమే నియమించుకుని ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు
- తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
డిసెంబర్ 8 ,9 తేదీలలో వంద ఎకరాల ఫ్యూచర్ సిటీ స్థలంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కు పెట్టుబడులు వెల్లువెత్తాయి
మొదటిరోజు 3,97,500 కోట్లకు ఒప్పందాలు కుదరగా , రెండో రోజు 1,77,500 కోట్లకు ప్రభుత్వంతో ఎంఓయూ లు జరిగాయి
మొత్తంగా చూస్తే రెండ్రోజుల్లో 5,75,000 కోట్లకు ఒప్పందాలు కుదిరాయి
రెండ్రోజుల్లో ఇంతమొత్తంలో ఒప్పందాలు కుదరడంతో కార్యక్రమం విజయవంతమైనట్టు ప్రభుత్వం భావిస్తుంది
- ప్రపంచ స్థాయి ఫుట్ బాల్ అకాడమీ
రేవంత్ స్వతహాగా ఫుట్ బాల్ క్రీడాకారుడు . ప్రపంచ క్రీడా రంగం దృష్టి తెలంగాణా మీద పడేందుకు ఆయనే స్వయంగా ఫుట్ బాల్ క్రీడాకారుడిగా మైదానంలోకి దిగబోతున్నారు
ఈ నెల పదమూడున హైదరాబాద్ లో నిర్వహించబోయే మ్యాచ్ లో అంతర్జాతీయ దిగ్గజ ఆటగాడు మెస్సితో తలపడబోతున్నారు
తెలంగాణాలో క్రీడల అభివృద్ధికి ఒక ముఖ్యమంత్రి స్వయంగా క్రీడాకారుడిగా మైదానంలోకి అడుగుపెట్టడం బహుశా ఇదే మొదటిసారేమో
భవిష్యత్తులో హైదరాబాదు గచ్చిబౌలిలో ప్రపంచ స్థాయి ఫుట్ బాల్ స్టేడియం నిర్మించటానికి కూడా ప్లాన్ సిద్ధం చేసారు
గ్లోబల్ సమ్మిట్ కి క్రీడా రంగం తరపున పుల్లెల అకాడమీ ఛైర్మన్ , బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ , పివి సింధు , గుత్తా జ్వాలా , క్రికెటర్ అనిల్ కుంబ్లే , రాయుడు , అజారుద్దీన్ తదితరులు హాజరయ్యారు
ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి ఆ రంగంలో పెట్టుబడులు పెట్టడమే కాదు క్రీడా స్ఫూర్తికి కూడా తమ వంతు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు
సీఎం కూడా స్వతహాగా క్రీడాకారుడు కావడంతో ఈ రంగంపైన ఆయన ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి అజారుద్దీన్ అన్నారు
*ముఖేష్ అంబానీ వంతారా ప్రాజెక్టు
ఇప్పటికే గుజరాత్ లోని జామ్ నగర్ లో ముఖేష్ అంబానీ గ్రూపు ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి జూ పార్క్ నిర్వహించబడుతుంది
తాజాగా అదే ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీలో కూడా జూ పార్క్ నిర్మిస్తామని ప్రభుత్వంతో ముఖేష్ అంబానీ ఎంఓయూ చేసుకున్నారు
ఈ నెలాఖరుకి సీఎం రేవంత్ స్వయంగా గుజరాత్ వెళ్లి వంతారా జూ పార్కుని సందర్శిస్తారు
*గ్లోబల్ సమ్మిట్ లో ఎవరేమన్నారు ?
దువ్వూరి సుబ్బారావు , ఆర్బీఐ విశ్రాంత గవర్నర్
వచ్చే పదేళ్లలో తెలంగాణా ప్రపంచానికి రోల్ మోడల్ అవుతుందని ఆర్బీఐ విశ్రాంత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు
ఈ ప్రాజెక్టులో తనని కూడా సలహాదారుడిగా నియమించినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు
- యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్
రైజింగ్ తెలంగాణా విజన్ రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఆన్లైన్లో ప్రసంగిస్తూ సందేశం ఇచ్చారు . ఈ డాక్యుమెంట్ దేశ అభివృద్ధి స్థాయిలో రూపొందించారని ఆయన మెచ్చుకున్నారు
త్వరలో ఇండియా వచ్చి తెలంగాణా రాష్ట్ర సందర్శన చేయడమే కాదు ప్రాజెక్టులో పాలుపంచుకుంటామని ఆయన అన్నారు
- ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్
గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణా ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా మారిందని ప్రముఖ ఆర్థికవేత్త , శాండియాగోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్తీక్ మురళీధర్ అభినందించారు
ఈ డాక్యుమెంట్ తెలంగాణా అభివృద్ధికే కాదు దేశాభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఆయన అన్నారు
- చిరంజీవి , నాగార్జున
గ్లోబల్ సమ్మిట్ లో చిత్ర పరిశ్రమ తరపున మొదటిరోజు నాగార్జున పాల్గొనగా , రెండో రోజు చిరంజీవి హాజరై ప్రసంగించారు
విజన్ డాక్యుమెంట్ లో యానిమేషన్ స్టూడియోలు , ఫిల్మ్ సిటీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు
అక్కినేని నాగార్జున ఫ్యూచర్ సిటీలో తమ అన్నపూర్ణ స్టూడియోను విస్తరించే ఆలోచన చేస్తున్నట్టు ప్రకటించారు
ఈ ఈవెంట్ కు తనని ఆహ్వానించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్తూ చిరంజీవి మాట్లాడారు
విజన్ డాక్యుమెంట్ లో చిత్ర పరిశ్రమకు కూడా సముచిత ప్రాధాన్యత ఇచ్చినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేసారు
హైదరాబాద్ ను సినీ హబ్ గా మార్చేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ తరపున తమ వంతు కృషి చేస్తామని చెప్పారు
సీఎం రేవంత్ చొరవతోనే బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ , అజయ్ దేవగన్ లాంటివారు ఇక్కడ స్టూడియోలు నిర్మించటానికి ముందుకు వస్తున్నారని ప్రశంసించారు
దీన్ని మేము కూడా స్ఫూర్తిగా తీసుకుని ఫ్యూచర్ సిటీలో కూడా తమ వంతు పాత్ర పోషిస్తామని ఆయన చెప్పారు
- ముగింపు వేడుకలో డ్రోన్ షో
రైజింగ్ తెలంగాణా గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలో ఫ్యూచర్ సిటీ థీమ్ తో నిర్వహించిన లేజర్ షో పలువురిని ఆకట్టుకుంది
గతంలో సౌదీలో జరిగిన రెండు వేల డ్రోన్ లేజర్ షో రికార్డుని బ్రేక్ చేస్తూ మూడు వేల డ్రోన్ లతో షో నిర్వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు
పాత రికార్డ్ బ్రేక్ చేసి లేజర్ షో నిర్వహించినందుకు గిన్నిస్ బుక్ రికార్డ్స్ వారు సీఎం రేవంత్ కి ధ్రువ పత్రాన్ని అందచేశారు
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కి వచ్చిన స్పందన పట్ల సీఎం రేవంత్ సంతృప్తి వ్యక్తం చేసారు
గ్లోబల్ సమ్మిట్ లో ఆకర్షించిన అంశాలు
రైజింగ్ తెలంగాణా డాక్యుమెంట్ సభకు ప్రెజెంట్ చేసేటప్పుడు మానవ ఆకారంలో ఉన్న రోబో నడుచుకుంటూ వచ్చి సీఎం రేవంత్ చేతిలో బ్రోచర్ బండిల్ పెట్టడం పలువురిని ఆకర్షించింది
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత , మంత్రి కొండా సురేఖ వాఖ్యల నేపథ్యంలో నాగార్జునకు , ముఖ్యమంత్రికి , ప్రభుత్వానికి కొంత గ్యాప్ వచ్చిందని అందరూ భావించారు
కానీ సమ్మిట్ మొదటిరోజు నాగార్జున ముఖ్యమంత్రి పక్కనే ఉండి అన్ని స్టాళ్లను పరిశీలించడం కొంతమందికి ఆశ్చర్యం కలిగించింది
సీఎం కూడా నాగార్జునకు ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది
- విశ్లేషణ
గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన స్పందనను విశ్లేషించుకుంటే రేవంత్ కొంత సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు
అతి తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రంగాన్ని ఆకర్శించి పెట్టుబడులు సాధించడంలో సఫలం అయ్యారు
గ్లోబల్ సమ్మిట్ లో చేసిన ఏర్పాట్ల గురించి కూడా పాజిటివ్ స్పందనే వచ్చింది
అయితే ప్రపంచస్థాయి పారిశ్రామిక వేత్తలను గ్లోబల్ సమ్మిట్ కి రప్పించడంలో సక్సెస్ అయిన రేవంత్ సొంత పార్టీ అధిష్టానాన్ని రప్పించడంలో మాత్రం విఫలం అయ్యారు
ఈవెంట్ లో కొంతమంది మంత్రులు రేవంత్ కు చేదోడువాదోడుగా నిలిచి సహకరించినప్పటికీ పార్టీ అధిష్టానం పార్లమెంట్ సమావేశాల సాకుతో రాకపోవడం రాష్ట్ర స్థాయి నాయకులకు నిరాశ కలిగించిన మాట వాస్తవం
పార్టీ విభేదాలకు అతీతంగా అభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం సమ్మిట్ లో పాల్గొని నిరూపించారు
తమ పార్టీ పాలిత ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంత పెద్ద సమ్మిట్ కి రావడానికి మల్లిఖార్జున్ ఖర్గే , రాహుల్ గాంధీలకు కుదరకపోయినప్పటికీ కనీసం ప్రియాంక గాంధీ అయినా వచ్చి ఉంటే ఆ వెయిటేజి ఖచ్చితంగా ఉండేది
పార్టీ లీడర్లలో కర్ణాటక నుంచి వచ్చిన డిప్యూటీ సీఎం శివకుమార్ ఒక్కరే కాస్త సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు
ఈ సమ్మిట్ ని రేవంత్ తీసుకున్నంత ప్రతిష్టాత్మకంగా ఆ పార్టీ అధినాయకత్వం తీసుకోలేకపోయింది
చివరగా ఈ సమ్మిట్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలీదు కానీ వ్యక్తిగతంగా కానీ , రాజకీయ కెరీర్ పరంగా కానీ రేవంత్ కి పూర్తిగా ఉపయోగపడుతుంది అనటం లో సందేహం లేదు !
అన్నిటికన్నా ముఖ్యమైనది కేవలం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు , ఎంఓయూ లతో సంబరాలు చేసుకుంటే సరిపోదు . ఇదే ఊపులో నిర్మాణాత్మాత్మకంగా పనులు జరిగి విజన్ తెలంగాణా డాక్యుమెంట్ లో అనుకున్న విధంగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పూర్తి చేయగలిగితే రేవంత్ కోరుకున్నట్టు రాష్ట్రానికి పదేళ్లు సీఎం కావడం పెద్ద కష్టం కాదు !
