నల్ల కళ్లద్దాలు .. నోట్లో బీడీ .. ఆ నవ్వు .. ఆ లుక్కు రజనీ స్టైలు షరా మాములే .. కానీ కూలీ చూసిన ప్రేక్షకులు మాత్రం ఇకపై హీరో నాగార్జున విలనేషాలతో సెటిలై పోవచ్చు అంటారు !

Spread the love

నల్ల కళ్లద్దాలు .. నోట్లో బీడీ .. ఆ నవ్వు .. ఆ లుక్కు రజనీ స్టైలు షరా మాములే .. కానీ కూలీ చూసిన ప్రేక్షకులు మాత్రం ఇకపై హీరో నాగార్జున విలనేషాలతో సెటిలై పోవచ్చు అంటారు !

మాములుగా రజనీకాంత్ సినిమాల్లో కథతో పెద్దగా పనుండదు

స్క్రీన్ ప్లే మీద గ్రిప్పింగ్ ఉన్న దర్శకుడు , డ్రమ్ములు గట్టిగా వాయించే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే సరిపోతుంది
మిగతాదంతా రజనీ చూసుకుంటాడు

తలైవాకి ఏజ్ పెరుగుతున్నా ఆ గ్రేస్ తగ్గలేదు

ఆ నడక .. నల్ల కళ్లద్దాలు , బవిరి గడ్డం , నవ్వు , లుక్కు , స్టైలు చాలు అభిమానులను అలరించటానికి

రజనీ టాలెంటును బేస్ చేసుకునే దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూలీ ని తెరకెక్కించాడు అనిపిస్తుంది

కధేంటి ?

కథ గురించి చెప్పుకోవాలంటే డాన్ నేపథ్యంలో గతంలో రకరకాల కథలతో సినిమాలు వచ్చాయి

వాటికి మాదక ద్రవ్యాలు , గోల్డ్ స్మగ్లింగ్ వంటివి రా మెటీరియల్

అవే దినుసులు వాడితే రొటీన్ అయిపోతుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఇక్కడ ఖరీదైన గోల్డ్ వాచీల స్మగ్లింగ్ అంశాన్ని తీసుకున్నాడు

వైజాగ్ పోర్టుని కింగ్ పిన్ లాజిస్టిక్స్ పేరుతొ మాఫియా డాన్ సైమన్ ( నాగార్జున ) 99 సంవత్సరాలకు లీజుకి తీసుకుంటాడు

కానీ లాజిస్టిక్స్ పేరుతొ సైమన్ గోల్డ్ వాచీల స్మగ్లింగ్ చేస్తుంటాడు

ఆ పోర్టులో ఇతడి వ్యవహారాలు అన్నీ చూసుకునే వ్యక్తి దయాల్ ( సౌబిన్ సాహిర్ )

పోర్టులో జరిగే చీకటి వ్యవహారాలపై అనుమానం వచ్చిన పోలీసులు పనివాళ్లుగా పోర్టులో చేరి సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తుంటాడు
దయాల్ వాళ్ళని కనిపెట్టి చంపేస్తుంటాడు

అయితే చంపేసిన తర్వాత శవాలను ఎలా మాయం చెయ్యాలన్న సమస్య వస్తుంది

సరిగ్గా అదే సమయంలో రాజశేఖర్ ( సత్యరాజ్ ) కనిపెట్టిన మొబైల్ క్రిమేటర్ కుర్చీ గురించి తెలుస్తుంది

దాంతో అతని ముగ్గురు కూతుళ్లను చంపేస్తామని బెదిరించి సత్యరాజ్ ను ఒప్పించి ఆ కుర్చీ సాయంతో శవాలను కాల్చి బూడిద చేస్తుంటారు

ఇదిలా ఉండగా అనూహ్యంగా రాజశేఖర్ హత్యకు గురి అవుతాడు

దీనితో తన ప్రాణ స్నేహితుడ్ని హత్య చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు చెన్నై నుంచి దేవా ( రజనీకాంత్ ) వైజాగ్ వస్తాడు

అక్కడ్నుంచి అసలు కథ మొదలౌతుంది

అసలు దేవా ఎవరు ? దేవాకి రాజశేఖర్ కి ఉన్న స్నేహం వెనుక అసలు కధేంటి ?

స్మగ్లింగ్ పేరుతొ సైమన్ చేస్తున్న అసలు దందా ఏంటి ?

వీళ్ళందరికీ ఇంటర్నేషనల్ డాన్ దాహా ఎవరు ? అనే ప్రశ్నలకు జవాబులు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే

ఎవరెలా చేసారు ?

సినిమాలో కధానాయకుడు రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు

ఇండస్ట్రీలో 50 సంవత్సరంనుంచి నటిస్తున్నా ఈరోజుకి ఆ గ్రేస్ తగ్గలేదు .. కూలీ సినిమాలో కూడా అదే గ్రేస్ చూపించి థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించాడు

కథతో సంబంధం లేకుండా కేవలం రజనీ స్టైలు చూడటం కోసం థియేటర్లకు వచ్చే అభిమానులు ఆయనకున్నారు

ఈ సినిమాలో కూడా అభిమానులకు రజనీ పూనకాలు తెప్పిస్తాడు

అయితే సాధారణంగా రజనీ డాన్సుల్లో స్టెప్పులు మామూలుగానే ఉంటాయి

డాన్స్ మాస్టర్ రజనీతో ఏజ్ కి మించి ప్రభుదేవా స్టెప్పులు వేయించాడు

ఎంట్రీ సాంగ్ లో రజనీ నేల మీద పడుకుని భూ చక్రంలా తిరగడం కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది

దర్శకుడు గ్రాఫిక్స్ సరిగా వాడినట్టు లేదు

ఒక సన్నివేశంలో రజనీ బైకు మీద వెళ్తూ నేల చూపులు చూస్తుంటాడు
కనీసం బైక్ రన్ అవుతున్నట్టు కూడా తెలీదు

ఇక సైమన్ పాత్ర వేసిన హీరో నాగార్జున ఇకపై విలన్ వేషాల్లో ప్రయత్నించవచ్చు

బాడీ లాంగ్వేజ్ లో కానీ , డైలాగ్ డెలివరీ లో కానీ మాఫియా లీడర్ విలనత్వం బాగా ప్రదర్శించాడు

కూలీ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర ఇంకోటుంది

దయాల్ .. ఈ పాత్ర వేసిన మళయాళ నటుడు సౌబిన్ సాహిర్ సినిమాకి ప్రాణం పోసాడు

తనకిచ్చిన పాత్రలో రకరకాల షేడ్స్ ప్రదర్శించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు

ముఖ్యంగా మోనికా పాటలో పూజా కన్నా సౌబిన్ స్టెప్పులకే ఈలలు మరు మోగాయి

సౌబిన్ భార్యగా నటించిన రచితా రామ్ కూడా చక్కటి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారు

ప్రీతి పాత్రలో శృతిహాసన్ ను కేవలం ఎమోషన్స్ కోసం వాడుకున్నారు

సత్యరాజ్ , ఉపేంద్ర కనిపించింది కొద్ది సేపే అయినా పాత్రలకు న్యాయం చేసారు

కాకపోతే కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఉపేంద్ర ఇందులో రజనీ అసిస్టెంట్ గా వేయడం ఆయన అభిమానులకు నచ్చదు

ఇంటర్నేషనల్ స్మగ్లర్ దాహా పాత్రలో అమీర్ ఖాన్ క్లైమాక్సులో కనిపిస్తాడు

సింహంలాంటి కుక్కలతో , ఒళ్ళంతా టాటూ లతో , వెనుక బాడీ గార్డులతో భయంకరమైన ఎలివేషన్లు ఇచ్చిన అమీర్ ఖాన్ చేత కొద్దిగా కామెడీ స్కిట్ చేయడానికి ప్రయత్నించడంతో ఆ సీరియస్ నెస్ పోయింది

సినిమాకి ప్రాణం పోసిన ఇంకో వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్

సన్నివేశాలకు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి సినిమాకు న్యాయం చేసాడు

ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది ?

ఫస్ట్ హాఫ్ లో స్టోరీ అర్ధం కాదు
సెకండాఫ్ లోకి వచ్చాకే కథ కొద్దీ కొద్దిగా అర్థమౌతుంటుంది

మొదటి భాగంలో సత్యరాజ్ క్రిమేటర్ కుర్చీలు తయారుచేయడం , సైమన్ అతడ్ని బెదిరించి తన పనులకు వాడుకోవడం వంటి సన్నివేళల్లో ల్యాగ్ ఎక్కువగా కనిపించింది

సెకండాఫ్ లో ట్విస్టులు ఒకటొకటి బయటపడుతున్నాయి అనుకునే సమయంలో
క్లైమాక్స్ లో రజనీ ఫ్లాష్ బ్యాక్ ను మాత్రం సింపుల్ గా మాటలతో సరిపుచ్చేసాడు దర్శకుడు

సినిమా గురించి ?

సినిమాటిక్ లిబర్టీ పేరుతొ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కొన్ని ప్రయోగాలు చేయడం అందరికీ నచ్చకపోవచ్చు

ఉదాహరణకు దోమల్ని చంపినట్టు మనుషుల్ని చంపే సైమన్ కు , దయాల్ కు శవాల్ని ఎలా మాయం చెయ్యాలో తెలియకపోవడం ఆశర్యం

శవాలను మాయం చేయడం కోసం సత్యరాజ్ తయారుచేసే క్రిమేటర్ కుర్చీలను గొప్ప ఇన్వెన్షన్ గా చూపించి మాఫియా డాన్ సత్యరాజ్ ను బెదిరించి ఆ కుర్చీలను వాడుకోవడం ఇంకా ఆశర్యం

ఇదే సినిమాలో చనిపోయిన సత్యరాజ్ శవాన్ని ఎలెక్ట్రానికి క్రిమినేషన్ మిషన్ లో వేస్తె నిమిషాల్లో కాలి బూడిద అవడం కూడా చూపించాడు

అలాంటప్పుడు సత్యరాజ్ ఏదో గొప్ప ప్రయోగం చేసినట్టు చూపించడం ఏంటి ?

సత్యరాజ్ ను దయాల్ ఎందుకు చంపుతాడో క్లారిటీ లేదు ?

చంపిన సత్యరాజ్ ను అదే కుర్చీలో తగలబెట్టకుండా కూతుళ్ళకు ఎలా అప్పగించాడో తెలీదు

ఎప్పుడో నాలుగేళ్లకు సత్యరాజ్ కూతురుకి కూడా కుర్చీ ఆపరేట్ చేయడం వచ్చని నిద్రలో కనుక్కుని వెంటపడటం ఏంటో ?

అసలు కథా పరంగా సైమన్ కొడుకు అవసరం ఏంటో అర్ధం కాదు

తండ్రేమో పెద్ద మాఫియా డాన్ .. కొడుకేమో దయాల్ భార్యతో ప్రేమలో పడటం ఏంటో? వీళ్లిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాల అవసరం ఏంటో అర్ధం కాదు

ఇంత పెద్ద అండర్ వరల్డ్ మాఫియా స్టోరీలో పోలీసుల పాత్ర ఏంటో అర్ధం కాదు

పోర్టులోకి చీమ కూడా దూరని బందోబస్త్ ఉంటే రజనీ మాత్రం సొంతింటిలో తిరిగినట్టు పోర్ట్ అంతా యథేచ్ఛగా తిరిగేస్తుంటాడు

రజనీ కాంత్ చేతిలో కనీసం ఉల్లిపాయ తరిగే కత్తి కూడా ఉండదు .. కానీ ఏకే 47 పట్టుకున్న బాడీ గార్డులను సముద్రంలోకి విసిరి కొడతాడు

అంత భారీ ఎలివేషన్లు ఇచ్చిన నాగార్జున సైమన్ పాత్ర కూడా పుసుక్కున రజనీ చేతిలో ముగియడం కొంత అసంపూర్ణంగా అనిపించింది

సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే కళ్ళముందు బాషా , జైలర్ , విక్రమ్ లు కనిపిస్తారు

ప్రీతిని బంధించిన దయాల్ తో దేవా వీడియో కాల్ లో మాట్లాడుతూ ఒకసారి నీ పరిస్థితేంటో మీవాళ్ళని అడిగి తెలుసుకో అంటాడు
సేమ్ డిటో టు డిటో ఇదే సన్నివేశం జైలర్ లో కూడా ఉంది

రజనీ ఫ్లాష్ బ్యాక్ లో మనకు బాషా గుర్తుకొస్తాడు

ఇలాంటి కొన్ని సన్నివేశాల వల్ల సినిమాలో ఫ్రెష్ నెస్ పోయింది

ముగింపు : కధలో లాజిక్కుల జోలికి పోకుండా సినిమా చూస్తే మాత్రం నచ్చుతుంది
రజనీ మార్క్ స్టైల్ చూడాలనుకుంటే కూలీ సినిమా ఒకసారి చూడొచ్చు

రేటింగ్ 3 / 5
పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!