మాములుగా రజనీకాంత్ సినిమాల్లో కథతో పెద్దగా పనుండదు. సినిమా ప్రారంభంలో సూపర్ స్టార్ రజనీ అని టైటిల్ పడితే చాలు తలైవా ,తలైవా అనే స్లొగన్స్ తో అభిమానులు లేచి నిలబడి డాన్సులు చేస్తారు . వెండితెర మీద రజనీ కనపడితే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి . ఈలలతో థియేటర్లు మారుమోగిపోతాయి . స్క్రీన్ ప్లే మీద గ్రిప్పింగ్ ఉన్న దర్శకుడు , డ్రమ్ములు గట్టిగా వాయించే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే సరిపోతుంది.
మిగతాదంతా తలైవా చూసుకుంటాడు . అదే రజనీ మ్యాజిక్ .
తలైవాకి ఏజ్ పెరుగుతున్నా ఆ గ్రేస్ తగ్గలేదు . ఆ నడక .. నల్ల కళ్లద్దాలు , బవిరి గడ్డం , నవ్వు , లుక్కు , స్టైలు చాలు అభిమానులను అలరించటానికి . కొన్ని దశాబ్దాలుగా అభిమానులు రజనీని డాన్ గెటప్ లో చూడటానికి ఇష్టపడుతున్నారు . మరీ ముఖ్యంగా భాషా సినిమా నుంచి రజనీ గ్రాఫ్ మారిపోయింది . రజనీ నుంచి ప్రతి సినిమాకి ఆ గెటప్ కోరుకుంటున్నారు అభిమానులు .
రజనీ టాలెంటును బేస్ చేసుకునే దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూలీ ని తెరకెక్కించాడు అనిపిస్తుంది . నిజానికి ఈయన కూడా రజనీ హార్డ్ కోర్ అభిమానే . రజనీ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజే థియేటర్లో చూసి హంగామా చేసే అభిమానుల్లో ఈ లోకేష్ కనగరాజ్ ముందుంటాడు .
ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన కూలీ సినిమా ఎలా ఉందో చూద్దాం .
కధేంటి ?
కథ గురించి చెప్పుకోవాలంటే డాన్ నేపథ్యంలో గతంలో రకరకాల కథలతో సినిమాలు వచ్చాయి . వాటికి మాదక ద్రవ్యాలు , గోల్డ్ స్మగ్లింగ్ వంటివి రా మెటీరియల్ . ఒక్కో సినిమాలో ఒక్కో రా మెటీరియల్ తీసుకున్నా డాన్ నేపథ్యంలో ఉన్న సినిమాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి .
అవే దినుసులు వాడితే రొటీన్ అయిపోతుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఇక్కడ ఖరీదైన గోల్డ్ వాచీల స్మగ్లింగ్ అంశాన్ని తీసుకున్నాడు . వైజాగ్ పోర్టుని కింగ్ పిన్ లాజిస్టిక్స్ పేరుతో మాఫియా డాన్ సైమన్ ( నాగార్జున ) 99 సంవత్సరాలకు లీజుకి తీసుకుంటాడు . పేరుకు లాజిస్టిక్ బిజినెస్సే కానీ ఆ పేరుతో సైమన్ గోల్డ్ వాచీల స్మగ్లింగ్ చేస్తుంటాడు .
ఆ పోర్టులో ఇతడి వ్యవహారాలు అన్నీ చూసుకునే వ్యక్తి దయాల్ ( సౌబిన్ సాహిర్ ) . ఈ దయాల్ సైమన్ కు నమ్మిన బంటు . ఇదిలా ఉండగా పోర్టులో జరిగే చీకటి వ్యవహారాలపై అనుమానం వచ్చిన పోలీసులు అక్కడ పనివాళ్లుగా చేరి సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తుంటారు .
దయాల్ వాళ్ళని కనిపెట్టి చంపేస్తుంటాడు .
అయితే చంపేసిన తర్వాత శవాలను ఎలా మాయం చెయ్యాలన్న సమస్య వస్తుంది. సరిగ్గా అదే సమయంలో రాజశేఖర్ ( సత్యరాజ్ ) కనిపెట్టిన మొబైల్ క్రిమేటర్ కుర్చీ గురించి తెలుస్తుంది . ఆ కుర్చీలో శవాన్ని కూర్చోబెట్టి స్విచ్ వేస్తే ఎముకలు కూడా మిగలకుండా క్షణాల్లో కాల్చి బూడిద చేస్తుంది . దాంతో అతని ముగ్గురు కూతుళ్లను చంపేస్తామని బెదిరించి సత్యరాజ్ ను ఒప్పించి ఆ కుర్చీ సాయంతో శవాలను కాల్చి బూడిద చేస్తుంటారు.
ఇదిలా ఉండగా అనూహ్యంగా రాజశేఖర్ హత్యకు గురి అవుతాడు . దీనితో తన ప్రాణ స్నేహితుడ్ని హత్య చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు చెన్నై నుంచి దేవా ( రజనీకాంత్ ) వైజాగ్ వస్తాడు . అక్కడ్నుంచి అసలు కథ మొదలౌతుంది .
అసలు దేవా ఎవరు ? దేవాకి రాజశేఖర్ కి ఉన్న స్నేహం వెనుక ఉన్న అసలు కధేంటి ?
స్మగ్లింగ్ పేరుతో సైమన్ చేస్తున్న అసలు దందా ఏంటి ?
వీళ్ళందరికీ బాస్ అయిన ఇంటర్నేషనల్ డాన్ దాహా ఎవరు ? అనే ప్రశ్నలకు జవాబులు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే .
ఎవరెలా చేసారు ?
సినిమాలో కధానాయకుడు రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు . ఇండస్ట్రీలో 50 సంవత్సరాలనుంచి నటిస్తున్నా ఈరోజుకీ ఆ గ్రేస్ తగ్గలేదు .. కూలీ సినిమాలో కూడా అదే గ్రేస్ చూపించి థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించాడు. కథతో సంబంధం లేకుండా కేవలం రజనీ స్టైలు చూడటం కోసం థియేటర్లకు వచ్చే అభిమానులు ఆయనకున్నారు .
ఈ సినిమాలో కూడా అభిమానులకు రజనీ పూనకాలు తెప్పిస్తాడు . అయితే సాధారణంగా రజనీ డాన్సుల్లో స్టెప్పులు మామూలుగానే ఉంటాయి. ఆయన ఫైటింగులు బాగుంటాయి కానీ డాన్సులు మాత్రం సాధారణంగానే ఉంటాయి .
కానీ డాన్స్ మాస్టర్ రజనీతో ఏజ్ కి మించి ప్రభుదేవా స్టెప్పులు వేయించాడు . ఎంట్రీ సాంగ్ లో రజనీ నేల మీద పడుకుని భూ చక్రంలా తిరగడం కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది .
దర్శకుడు గ్రాఫిక్స్ సరిగా వాడినట్టు లేదు . ఒక సన్నివేశంలో రజనీ బైకు మీద వెళ్తూ నేల చూపులు చూస్తుంటాడు . కనీసం బైక్ రన్ అవుతున్నట్టు కూడా తెలీదు . ఇలాంటి చిన్న చిన్న విషయాలే దర్శకత్వంలో పెద్ద లోపాలుగా బయటపడతాయి .
ఇక సైమన్ పాత్ర వేసిన హీరో నాగార్జున ఇకపై విలన్ వేషాల్లో ప్రయత్నించవచ్చు . బాడీ లాంగ్వేజ్ లో కానీ , డైలాగ్ డెలివరీ లో కానీ మాఫియా లీడర్ విలనత్వం బాగా ప్రదర్శించాడు .
కూలీ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర ఇంకోటుంది . దయాల్ .. ఈ పాత్ర వేసిన మళయాళ నటుడు సౌబిన్ సాహిర్ సినిమాకి ప్రాణం పోసాడు . తనకిచ్చిన పాత్రలో రకరకాల షేడ్స్ ప్రదర్శించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు . ముఖ్యంగా మోనికా పాటలో పూజా కన్నా సౌబిన్ స్టెప్పులకే ఈలలు మరు మోగాయి .
సౌబిన్ భార్యగా నటించిన రచితా రామ్ కూడా చక్కటి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారు .
ప్రీతి పాత్రలో శృతిహాసన్ ను కేవలం ఎమోషన్స్ కోసం వాడుకున్నారు .
సత్యరాజ్ , ఉపేంద్ర కనిపించింది కొద్ది సేపే అయినా పాత్రలకు న్యాయం చేసారు.
కాకపోతే కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఉపేంద్ర ఇందులో రజనీ అసిస్టెంట్ గా వేయడం ఆయన అభిమానులకు నచ్చదు .
ఇంటర్నేషనల్ స్మగ్లర్ దాహా పాత్రలో అమీర్ ఖాన్ క్లైమాక్సులో కనిపిస్తాడు . సింహంలాంటి కుక్కలతో , ఒళ్ళంతా టాటూ లతో , వెనుక బాడీ గార్డులతో భయంకరమైన ఎలివేషన్లు ఇచ్చిన అమీర్ ఖాన్ చేత కొద్దిగా కామెడీ స్కిట్ చేయడానికి ప్రయత్నించడంతో ఆ సీరియస్ నెస్ పోయింది .
సినిమాకి ప్రాణం పోసిన ఇంకో వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ . సన్నివేశాలకు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి సినిమాకు న్యాయం చేసాడు .
ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది ?
ఫస్ట్ హాఫ్ లో స్టోరీ అర్ధం కాదు . సెకండాఫ్ లోకి వచ్చాకే కథ కొద్ది కొద్దిగా అర్థమౌతుంటుంది. మొదటి భాగంలో సత్యరాజ్ క్రిమేటర్ కుర్చీలు తయారుచేయడం , సైమన్ అతడ్ని బెదిరించి తన పనులకు వాడుకోవడం వంటి సన్నివేశాల్లో ల్యాగ్ ఎక్కువగా కనిపించింది .
సెకండాఫ్ లో ట్విస్టులు ఒకటొకటి బయటపడుతున్నాయి అనుకునే సమయంలో
క్లైమాక్స్ లో రజనీ ఫ్లాష్ బ్యాక్ ను మాత్రం సింపుల్ గా మాటలతో చెప్పి సరిపుచ్చేసాడు దర్శకుడు .
సినిమా గురించి ?
సినిమాటిక్ లిబర్టీ పేరుతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కొన్ని ప్రయోగాలు చేయడం అందరికీ నచ్చకపోవచ్చు . ఉదాహరణకు దోమల్ని చంపినట్టు మనుషుల్ని చంపే సైమన్ కు , దయాల్ కు శవాల్ని ఎలా మాయం చెయ్యాలో తెలియకపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది .
శవాలను మాయం చేయడం కోసం సత్యరాజ్ తయారుచేసే క్రిమేటర్ కుర్చీలను గొప్ప ఇన్వెన్షన్ గా చూపించి మాఫియా డాన్ సత్యరాజ్ ను బెదిరించి ఆ కుర్చీలను వాడుకోవడం ఇంకా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . అసలు ఇందులో పెద్ద ఇన్వెన్షన్ ఏముంది ?
ఇదే సినిమాలో చనిపోయిన సత్యరాజ్ శవాన్ని ఎలెక్ట్రానికి క్రిమినేషన్ మిషన్ లో వేస్తే నిమిషాల్లో కాలి బూడిద అవడం కూడా చూపించాడు . అలాంటప్పుడు సత్యరాజ్ ఏదో గొప్ప ప్రయోగం చేసినట్టు చూపించడం ఏంటి ? అసలు సత్యరాజ్ ను దయాల్ ఎందుకు చంపుతాడో క్లారిటీ లేదు ?
చంపిన సత్యరాజ్ ను అదే కుర్చీలో తగలబెట్టకుండా కూతుళ్ళకు ఎలా అప్పగించాడో తెలీదు . ఎప్పుడో నాలుగేళ్లకు సత్యరాజ్ కూతురుకి కూడా కుర్చీ ఆపరేట్ చేయడం వచ్చని నిద్రలో కనుక్కుని వెంటపడటం ఏంటో ?
అసలు కథా పరంగా సైమన్ కొడుకు అవసరం ఏంటో అర్ధం కాదు . తండ్రేమో పెద్ద మాఫియా డాన్ .. కొడుకేమో దయాల్ భార్యతో ప్రేమలో పడటం ఏంటో? వీళ్లిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాల అవసరం ఏంటో అర్ధం కాదు .
ఇంత పెద్ద అండర్ వరల్డ్ మాఫియా స్టోరీలో పోలీసుల పాత్ర ఏంటో అర్ధం కాదు .
పోర్టులోకి చీమ కూడా దూరని బందోబస్త్ ఉంటే రజనీ మాత్రం సొంతింటిలో తిరిగినట్టు పోర్ట్ అంతా యథేచ్ఛగా తిరిగేస్తుంటాడు . రజనీ కాంత్ చేతిలో కనీసం ఉల్లిపాయ తరిగే కత్తి కూడా ఉండదు .. కానీ ఏకే 47 పట్టుకున్న బాడీ గార్డులను సముద్రంలోకి విసిరి కొడతాడు .
అంత భారీ ఎలివేషన్లు ఇచ్చిన నాగార్జున సైమన్ పాత్ర కూడా పుసుక్కున రజనీ చేతిలో ముగియడం కొంత అసంపూర్ణంగా అనిపించింది .
సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే కళ్ళముందు భాషా , జైలర్ , విక్రమ్ లు కనిపిస్తారు.
ప్రీతిని బంధించిన దయాల్ తో దేవా వీడియో కాల్ లో మాట్లాడుతూ ఒకసారి నీ పరిస్థితేంటో మీవాళ్ళని అడిగి తెలుసుకో అంటాడు . సేమ్ డిటో టు డిటో ఇదే సన్నివేశం జైలర్ లో కూడా ఉంది . రజనీ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో మనకు భాషా గుర్తుకొస్తాడు . ఇలాంటి కొన్ని సన్నివేశాల వల్ల సినిమాలో ఫ్రెష్ నెస్ పోయింది .
ముగింపు : కధలో లాజిక్కుల జోలికి పోకుండా సినిమా చూస్తే మాత్రం నచ్చుతుంది.
రజనీ మార్క్ స్టైల్ చూడాలనుకుంటే కూలీ సినిమా ఒకసారి చూడొచ్చు.
నటీనటులు : రజనీ కాంత్ , నాగార్జున ,సత్య రాజ్ , సౌబిన్ సాహిర్ , ఉపేంద్ర , అమీర్ ఖాన్ తదితరులు
సంగీతం : అనిరుధ్
సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్
నిర్మాత : కళానిధి మారన్
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
విడుదల : 14 -08 -2025
రేటింగ్ 3 / 5
