Home » డీఎస్ ఈరే ఈ మళయాళం మూవీ పేరే వెరైటీగా ఉందికదా ..కానీ దానికో అర్ధం ఉంది – మూవీ రివ్యూ

డీఎస్ ఈరే ఈ మళయాళం మూవీ పేరే వెరైటీగా ఉందికదా ..కానీ దానికో అర్ధం ఉంది – మూవీ రివ్యూ

Spread the love

సాధారణంగా హర్రర్ సినిమాలకు దయ్యం అనో , చీకటి అనో , మిస్టరీ అనో టైటిళ్లు ఉంటాయి

నిజానికి అలాంటి సినిమాలకు టైటిల్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది

హర్రర్ జానర్లో టైటిల్ డిజైన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే ప్రేక్షకులకు సినిమా మీద అంత ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది

కానీ ఈ మళయాళ హర్రర్ సినిమాకి డీఎస్ ఈరే అనే టైటిల్ పెట్టారు
ఈ టైటిల్ చాలామందికి అర్ధం కాలేదు

మూవీ పోస్టర్ చూస్తే హర్రర్ థ్రిల్లర్ అని అర్ధమౌతుంది
కానీ టైటిల్ చూస్తే డిఫరెంట్ జానరేమో అని అనుమానం వస్తుంది

దీనికి ముందు భ్రమయుగం , భూతకాలం వంటి రొటీన్ టైటిళ్లు పెట్టి హర్రర్ మూవీలు తీసి జనాల్ని భయపెట్టిన మళయాళ దర్శకుడు రాహుల్ సదాశివన్ ఈ మూవీకి మాత్రం డీఎస్ ఈరే అని టైటిల్ పెట్టి సర్ప్రైజ్ ఇచ్చాడు

నిజానికి ఆయన ఈ టైటిల్ను లాటిన్ భాషనుంచి లాక్కొచ్చాడు
లాటిన్ భాషలో డీఎస్ ఈరే అంటే కోప దినం అని అర్థమట

ఈ సినిమాలో ఆత్మ నేపథ్యంలో దర్శకుడు కథ రాసుకుని తెరకెక్కించాడు కాబట్టి ఆత్మకి కోపం వస్తే అని మనం అర్ధం చేసుకోవాలన్నమాట

బుర్ర చించుకుని ఇంత అర్ధం చేసుకునేకన్నా స్ట్రయిట్ గా ఆత్మ కోపం అని టైటిల్ పెట్టి ఉంటే సాధారణ ప్రేక్షకులకు కూడా ఇంకా బాగా రీచ్ అయ్యేదేమో ?

అయినాసరే థియేటర్లలో రిలీజ్ అయి ఓ వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టేసుకుందిలెండి
ఈమధ్య తెలుగులో జియో హాట్ స్టార్ (ఓటిటి) లోకి కూడా వచ్చింది

ఇప్పుడు కధేంటో చూద్దాం ?

కధానాయకుడు రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్ ) ఆర్కిటెక్ట్

ఇతడి తండ్రికి అమెరికా , కేరళలో బోలెడు వ్యాపారాలు ఉంటాయి

ఓసారి వ్యాపార పనిమీద కేరళ వచ్చిన రోహన్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటుండగా అతడి గర్ల్ ఫ్రెండ్ కణి (సుష్మిత భట్ ) సూసైడ్ చేసుకుందని తెలుస్తుంది

అప్పటికి ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందనేది కూడా ఎవరికీ తెలీదు

రోహన్ ఆమె ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె జ్ఞాపకాల కోసం అక్కడ దొరికిన ఓ హెయిర్ పిన్ తనవెంట తెచ్చుకుని ఇంటికి వచ్చేస్తాడు

అక్కడ్నించి అతడికి చిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి

ఎవరో తనని ఫాలో అవుతున్నట్టు , ఎవరో తన చుట్టూ తిరుగుతున్నట్టు రకరకాల ఫీలింగ్స్ వస్తుంటాయి

దాంతో కొంపదీసి కణి ఆత్మ తన చుట్టూ తిరుగుతుందా ? అని అనుమానం వస్తుంది

అసలేం జరుగుతుందో అర్ధం కాక కణి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆమె ఇంటి ఎదురుగా ఉండే మధుసూదన్ ను (గిబిన్ గోపినాథ్ ) కలుస్తాడు

అతడితో మాట్లాడిన తర్వాత రోహన్ కు ఏం తెలుస్తుంది ?

రోహన్ ఫీల్ అవుతున్నట్టు నిజంగానే ఆత్మ అతడివెంట పడుతుందా ?

అయితే ఆ ఆత్మ ఎవరు ?

కణి ఆత్మ రూపంలో రోహన్ వెంటపడుతోందా ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

సాధారణంగా హర్రర్ సినిమాలకు కథతో పెద్దగా పనుండదు
చిన్న హెయిర్ పిన్ ఆధారంగా కూడా కథ అల్లుకుని ముందుకెళ్లిపోవచ్చు

థియేటర్లో హర్రర్ మూవీ చూస్తున ప్రేక్షకుడ్ని ఎంతవరకు భయపెట్టాం , ఎంత క్యూరియాసిటీ కలిగించాం అనేదాని మీద సినిమా కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి

ఈ విషయాల్లో మళయాళ దర్శకులు దిట్ట

వాళ్ళకి కథతో పెద్దగా పనుండదు

కధనంతో మ్యాజిక్కులు చేస్తారు
శబ్దాలతో భయపెట్టేస్తారు
విజువల్స్ తో కన్నార్పకుండా చేస్తారు

డైలాగులు తక్కువ , సౌండ్స్ ఎక్కువ అన్నమాట

దయ్యాలు , ఆత్మలు అనే కథలతో క్రీస్తు పూర్వం నుంచి సినిమాలు వస్తున్నప్పటికీ అదే కథను ప్రేక్షకుడికి బోరు కొట్టకుండా సరికొత్తగా చూపిస్తే ఖచ్చితంగా రీచ్ ఉంటుంది

కధాంశం ఇది కాకపోయినా శివ సినిమాలో రామ్ గోపాల్ వర్మ వాడుకున్న టెక్నిక్ టెక్నాలజీనే

అందుబాటులో ఉన్న సాంకేతికతను వాడుకుని డైలాగులు తక్కువ , సౌండ్ ఎక్కువతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు

ఈ సినిమాలో దర్శకుడు సదాశివన్ కూడా అదే టెక్నాలజీ వాడుకున్నాడు
సౌండ్స్ తో భయపెట్టాడు

పెద్ద పెద్ద ఆర్టిస్టులు లేకుండా ఓ నలుగురైదుగురు మెయిన్ క్యారెక్టర్స్ తోటి సింపుల్ లొకేషన్లలో తీసిన ఇలాంటి సినిమాకు పెద్ద ఖర్చు కూడా కాదు
కానీ వసూళ్లు మాత్రం రికార్డులు బద్దలు కొడతాయి

ఇక ఈ సినిమాలో ద్వితీయ భాగంతో పోలిస్తే ప్రథమార్థం చూస్తున్నప్పుడు పెద్దగా ఎగ్జైట్ అయ్యేంత సీన్లేమీ లేవు

సాధారణ కథలాగే అనిపిస్తుంది

ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ తో ద్వితీయార్థం మీద క్యూరియాసిటీ కలుగుతుంది

కణి సూసైడ్ , హెయిర్ పిన్ , ఆత్మల ఫీలింగుతో కథ నడుస్తున్న సమయంలో కణి తమ్ముడు కూడా అకస్మాత్తుగా చనిపోవడంతో స్టోరీ డెప్తులోకి వెళ్తుంది

మళయాళం సినిమాలతో మనకొక ఇబ్బంది ఉంది
ఏదీ గబాల్న చెప్పరు

ట్విస్టులతో స్టోరీని మెల్లిగా లాగి ఆఖర్లో సస్పెన్స్ రివీల్ చేసి మనల్ని సడెన్గా సర్ప్రైజ్ చేస్తారు

అన్నిటికన్నా ముఖ్యం ఆఖరి అర్ధగంటలో మనల్ని చూపు తిప్పుకోనీకుండా మ్యాజిక్ చేస్తారు
ఇందులో కూడా అదే జరిగింది

అయితే కధకు ప్రధానమైన కణి ఎందుకు సూసైడ్ చేసుకుందో సరైన కారణం తెలియలేదు
బహుశా సెకండ్ పార్ట్ లో ఏమన్నా చెప్తారేమో ?

ఎవరెలా చేసారు ?

ఒక్క టాలీవుడ్ లోనే కాదు అన్ని ఉడ్ లలో హీరోల వారసత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది

మళయాళంలో కూడా మమ్ముట్టి కొడుకు దుల్ఖర్ సల్మన్ చాన్నాళ్ళక్రితమే హీరోగా అరంగేట్రం చేసి తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు

ఇప్పుడు ఇంకో మళయాళ నటుడు మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

మళయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ రిలీజ్ చేసారు

అయితే ఈ ప్రణవ్ ను చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని యాంగిల్స్ లో మోహన్ లాల్ మాదిరి కనిపించాడు

మోహన్ లాల్ నటన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు
ఆ మధ్య వచ్చిన తుడరమ్ సినిమాలో చక్కటి నటన ప్రదర్శించి మంచి వసూళ్లను సాధించాడు

వారసులు అయినంతమాత్రాన అందరికీ అదే నటనా వారసత్వం వస్తుందనే గ్యారంటీ లేదు
కానీ ఈ సినిమా వరకు చెప్పుకుంటే ప్రణవ్ నటన బాగుంది

హర్రర్ సినిమాలకు హావభావాలతో ఎక్కువ పనుంటుంది
ఆ పరంగా ఇతడు సమయానుకూలంగా హావభావాలు ప్రదర్శించాడు

ముందు ముందు ఇతడికి తెలుగు చిత్రసీమలో కూడా మంచి స్కోప్ ఉంటుంది

మిగతావాళ్ళ గురించి చెప్పుకోవాలంటే క్లైమాక్సులో కనిపించిన జయ కురుప్ నటన సినిమాకి కీలకం
కధకి ఆ పాత్ర చాలా ప్రాముఖ్యం అనిపించింది
దానికి తగ్గట్టు ఆమె పాత్రకు ప్రాణం పోశారు

సాంకేతికత

ఇందాక చెప్పాను కదా దర్శకుడు సౌండ్స్ తో భయపెట్టాడని
ఓటిటి లో చూస్తేనే ఇలా ఉందంటే థియేటర్లో ఎలా ఉండేదో అనిపించింది

మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో గ్జేవియర్ ను దర్శకుడు సరిగా వాడుకున్నాడు
సన్నివేశాలకు తగ్గ బీజీఎమ్ ఇచ్చాడు
సినిమాకి ఇతడి బీజీఎమ్ కీలకం

సైలెంటుగా ఉన్న సన్నివేశంలో ఒక్కసారిగా ఢాం అని సౌండ్ వస్తే సహజంగా ప్రేక్షకుడు ఉలిక్కిపడతాడు

అదే రణగొణధ్వనుల మధ్య ఎన్ని ఢాం లు పేలినా అది అంత ఇంపాక్ట్ ఇవ్వదు

ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు

అలాగే హర్రర్ సినిమాల్లో మ్యూజిక్ తో పాటు విజువల్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి

పట్టపగలు లైట్ల వెలుగులో దయ్యాలను చూపిస్తే చిన్నపిల్లోడు కూడా భయపడడు
సన్నివేశానికి తగ్గట్టు డార్క్ మోడ్ లో విజువల్స్ ఉండాలి

ఈ విషయంలో సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్ పర్ఫెక్ట్ గా వర్క్ చేసాడు

నిజానికి దర్శకుడు ఎన్నుకున్న కథ కొత్తదేం కాదు
కానీ వీళ్లిద్దరూ పాత కధకు కొత్త ప్రాణం పోశారు

నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి

విశ్లేషణ

సినిమా సూపరా అని ఒక్కమాటలో అడిగితే గబుక్కున సరైన సమాధానం చెప్పలేం. హర్రర్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది . కొన్ని సన్నివేశాలు భయపెడతాయి . కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందా ? అని కొంత ఎగ్జైట్ అవుతాం .ఇంకోవైపు నెమ్మదిగా సాగే కధనం సాధారణ ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు

నటీనటులు : ప్రణవ్ మోహన్ లాల్ , సుష్మిత భట్
దర్శకత్వం : రాహుల్ సదాశివన్
విడుదల : జియో హాట్ స్టార్ ( తెలుగు )
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!