మీ దగ్గర ఐదు కోట్లు ఉంటే మళయాళ దర్శకుల చేతిలో పెట్టి చూడండి
ఓ మాంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీసి తిరిగి 50 కోట్లు మీ చేతిలో పెడతారు
(నేను చెప్పాను కదా అని పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ చేతిలో ఐదు కోట్లు పెట్టి రోజులు లెక్కపెట్టుకోకండి .. డబ్బులతో పాటు మన బుర్రను కూడా కాస్త వాడాలని మనవి )
ఎట్టెట్టా 5 కోట్లకు 50 కోట్లు ఎలా ఇస్తారబ్బా ? అనుకుంటున్నారా?
పేకాట కాదు .. జూదం కాదు .. గ్యాంబ్లింగ్ అసలే కాదు
కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీసి లాభాలు సంపాదించి పెడతారు
వాళ్లకు క్రైమ్ సినిమా తియ్యాలంటే మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అవసరం లేదు
చిన్న వేలిముద్ర ఆచూకీ దొరికినా చాలు దానిచుట్టూ కథ అల్లుకుని సినిమా తీసి వదులుతారు
మాములు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీల్లో ఫలానా వాడు ఫలానావాడ్ని ఫలానా కారణంతో మర్డర్ చేసాడు అని మొదలు పెడతారు
ఈ కేసును పరిశోధించటానికి డిటెక్టివ్ యుగంధర్ రంగంలోకి దిగుతాడు
అతడికి తోడుగా ఓ ముంబై హీరోయిన్ కూడా రంగంలోకి దిగడంతో నాలుగు పాటలు , ఆరు డాన్సులతో వారి ఇన్వెస్టిగేషన్ సాగుతుంది
ఈ మధ్యలో వెకిలి హాస్యంతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కేతిగాడి బ్యాచ్ రంగంలోకి దిగుతారు
దీంతో నవ్వలేక , ఏడవలేక విసుగెత్తిపోయిన ప్రేక్షకుడ్ని ట్విస్టుతో షాకిచ్చి చంపాలని ప్లాన్ చేసుకున్న దర్శకుడు ఓ బ్రహ్మాండమైన ట్విస్ట్ వదులుతాడు
హంతకుడి కోసం గాలిస్తున్న క్రమంలో విలన్ హీరోయిన్ని కిడ్నాప్ చేయడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ తో కథ పెద్ద హోల్ లో పడుతుంది
ఇప్పుడు స్టోరీని మర్డర్ కేసుగా చూడాలా ? లేకపోతే కిడ్నాప్ కేసుగా చూడాలా ? అని మధనపడిన ప్రేక్షకుడు 300 పెట్టి పాప్ కార్న్ కొనుక్కుని నమిలినా ఆన్సర్ దొరకదు
క్లైమాక్స్ కు వచ్చేసరికి హీరోయిన్ని రక్షించడం కోసం విలన్ని హీరో మర్డర్ చేయడంతో అసలు కేసు ఏంటో అర్ధం కాక పోలీసులు , న్యాయవాదులు , కోర్టులు , సినిమా చూస్తున్న ప్రేక్షకులు కష్టపడి జీవితంలో పోగేసుకున్న ఉన్న నాలుగు కేశాలు కూడా పీక్కుని అడ్జర్న్ అంటూ బయటపడతారు
తీసే సినిమా కామెడీ అయితే అదే జానర్లో తియ్యాలి
సస్పెన్స్ అయితే అదే జానర్లో తియ్యాలి
కామెడీకి నవ్వాలి
సస్పెన్స్ కి బిగుసుకుపోవాలి
అంతేకానీ అటుదిటు కారాదు
మళయాళ సినిమాలు చూడండి
చాటలో ఉన్న దినుసులన్నీ కలిపి మిక్సీ లో వేసి రుబ్బి వదలరు
కథని బట్టి స్క్రీన్ ప్లే ఉంటుంది
ఇప్పుడీ ఉపాధ్ఘాతం ఎందుకంటే ఐదు కోట్లు ఖర్చుపెట్టి తీసిన మళయాళ సినిమా ఇప్పటికే 50 కోట్ల వసూళ్లు దాటి దూసుకుపోతుంది
తాజాగా ఓటిటి ప్లాట్ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో కూడా రిలీజ్ అయి ట్రెండింగ్ లో ఉంది
ఇందుకు ప్రథమ కారకుడు దర్శకుడు దింజిత్ అయ్యతానే
గతంలో ఈయన దర్శకత్వంలోనే వచ్చిన కిష్కింధకాండ మూవీ ప్రేక్షకులని సస్పెన్స్ తో కట్టిపడేసింది
ఆయన దర్శకత్వంలోనే వచ్చిన మరో సస్పెన్స్ మూవీ ఎకో
కాకపోతే కిష్కింధకాండలో కోతులతో కథ నడిపిన దర్శకుడు ఎకోలో కుక్కలతో నడిపాడు
ఇప్పుడు కథ ఏంటో చూద్దాం ?
అసలు దర్శకుడు కథ కోసం ఎన్నుకున్న లొకేషనే సినిమాకి సగబలం
ఎక్కడో కేరళ ,కర్ణాటక సరిహద్దుల్లోని ఓ మారుమూల ఎత్తైన కొండమీద నుంచి కథ మొదలౌతుంది
ఆ కొండమీద మలేషియా నుంచి వచ్చిన మిలాతియా (బియానా మోమిస్) ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది
ఆమెను గ్రామానికి తీసుకెళ్లడానికి కొడుకులు ప్రయత్నించినా రాకపోవడంతో పియోస్ (సందీప్ ప్రదీప్ ) అనే కుర్రాడ్ని సహాయకుడిగా పెట్టి వెళ్ళిపోతారు
కానీ అప్పటికే ఆమెకు సాయంగా అక్కడ భయంకరమైన మలేషియన్ జాతి కుక్కలు కావలి కాస్తూ ఉంటాయి
చూసారా.. కథ మొదట్లోనే ఆ ఒంటరి వృద్ధ మహిళ అడవిలో కొండమీద ఒంటరిగా ఎందుకుంటుంది ? పైగా ఆమెకు కుక్కల కాపలా ఏంటి ? అనే క్యూరియాసిటీ కలుగుతుంది
మరోపక్క ఈమె భర్త కురియాచన్ (సౌరభ్ సచ్ దేవ్ ) కోసం నావీ అధికారులు , పోలీసులు గాలిస్తుంటారు
ఇతను పోలీసులకు దొరక్కుండా కుక్కలను కాపలాగా పెట్టుకుని అడవిలో రహస్యంగా ఉంటున్నాడని వాళ్ళ అనుమానం
అదే సమయంలో ఈ కురియాచన్ కోసం అడవిలోకి వెళ్లిన మోహన్ పోతన్ (వినీత్ ) హత్యకు గురవుతాడు
కురియాచన్ అడవిలోనే ఉండి కుక్కలను ఉసిగొల్పి ఈ హత్యను చేయించి ఉంటాడని అందరూ అనుకుంటారు
అసలు ఇంతకీ మోహన్ పోతన్ ను ఎవరు హత్య చేసారు ?
పోలీసులు కురియాచన్ కోసం ఎందుకు గాలిస్తుంటారు ?
మిలాతియా ఒంటరిగా అడవిలో కొండమీద ఎందుకుంటుంది ?
అడవిలో కుక్కలను శాసిస్తున్న అసలు యజమాని ఎవరు ? లాంటి ప్రశ్నలకు జవాబులు మిగతా కథలో తెలుస్తాయి
ఎలా ఉంది ?
ఇదే కథను స్టుడియోలోనో , సిటీలోనో తీసుంటే ఈ కిక్ వచ్చేది కాదు
వాహనాల రణగొణ ధ్వనులు లేవు , అరుపులు కేకలు లేవు
అప్పుడప్పుడు వినిపించే జంతువుల అరుపులు తప్ప అంతా నిశ్శబ్దం
ప్రేక్షకుడ్ని ఆ వాతావరణానికి కనెక్ట్ చేయడంలోనే దర్శకుడి పనితనం బయటపడుతుంది
రొటీన్ కు భిన్నంగా చుట్టూ అడవి ,కొండపైన ఒంటరి వృద్ధ మహిళ , ఆమెకు కాపలాగా మలేషియన్ జాతి కుక్కలు .. లాంటి సెటప్పులు సహజంగా ప్రేక్షకుడికి కొంత థ్రిల్ ను కలిగిస్తాయి
ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఆ కుక్కలగురించే
ఉత్తమ నటనకుగాను సినీ ఆర్టిస్టులకు అవార్డులు ఇచ్చే మాదిరి ఈ కుక్కలకు కూడా అవార్డులు ఇవ్వాలని రికమెండ్ చేయొచ్చు
ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో , ఎక్కడ్నుంచి తీసుకొచ్చారో కానీ కొన్ని సీన్స్ లో భయపెట్టాయి
ఆదరించాలే కానీ మనిషికి కుక్కకి మించి నమ్మకస్తులు ఎవరూ ఉండరు అనే కాన్సెప్ట్ తో అడవిలో కొండమీద ఒంటరి మహిళ జీవితాన్ని చూపించారు
ఇలాంటి సినిమాల్లో ట్విస్టులు సహజం
పైగా క్రైమ్ రిలేటెడ్ సీన్స్ లో ఒకదానికొకటి లింకులు ఉంటాయి
మొదట్నుంచీ జాగ్రత్తగా వాచ్ చేస్తే కానీ క్లైమాక్సులో సస్పెన్స్ చిక్కుముడి వీడదు
ఓటిటిలోనే కదా అని మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ చూస్తే మనకు ఆ థ్రిల్ రాదు
పైపెచ్చు కథ వాయువేగంతో పరుగులు పెట్టదు
స్లోగా గూడ్స్ బండి మాదిరి నెమ్మదిగా నడుస్తుంది
అయితేనేమి కాస్త ఓపిగ్గా చూస్తే ఎన్నో ప్రకృతి రమణీయ దృశ్యాలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి
అలా మైమరచి చూస్తుండగానే సడెన్గా కుక్కలు మీదకు ఉరకడంతో ఒంటికి చెమటలు పడతాయి
ఈ మిలాతియా కొండమీద ఒంటరిగా ఉండటం , ఆమెకు కాపలాగా మలేషియన్ జాతి కుక్కలు ఉండటం , అడవిలో మోహన్ హత్యకు గురికావడం , కురియాచన్ కోసం పోలీసుల గాలింపుతో ఒకటొకటిగా వస్తున్న సన్నివేశాలతో ప్రేక్షకుడ్ని ఊపిరి తీసుకోనివ్వదు
చివరి అర్ధగంటలో క్లైమాక్స్ సన్నివేశాలు వచ్చేసరికి ఒకటొకటిగా ట్విస్టులు విడిపోయి అసలు విషయం ఏంటో తెలిసేసరికి సస్పెన్స్ వీడిపోతుంది
కాకపోతే ఆ కురియాచన్ పాత్రలో ఎక్కడో క్లారిటీ మిస్ అయినట్టు అనిపించింది
ఎందుకంటే కధకు అతడి పాత్ర కూడా ప్రధాన ముడి సరుకే
ఆ పాత్రను ఇంకొంచెం జాగ్రత్తగా ఎలివేట్ చేసుంటే బాగుండేది
ఎవరెలా చేసారు ?
ప్రేమదేశం సినిమాలో అబ్బాస్ తో కలిసి ముస్తఫా , ముస్తఫా అని పాట పాడిన కుర్రాడు గుర్తున్నాడు కదా
ఎస్ .. వినీత్
అతడొక్కడే ఇక్కడ మనకు తెలిసిన మొహం
మిగతావన్నీ మళయాళ ముఖాలే
అయితేనేమి ఎవరి పాత్రలో వారు జీవించేసి సినిమాకి 50 కోట్లు తీసుకొచ్చేసారు
కథలో ప్రధాన పాత్రధారులు మిలాతియా గా బియానా మోమిస్ , కురియాచన్ తమ పాత్రలను రక్తి కట్టించారు
స్టూడియోల్లో తీసే సినిమాలకు ఎటువంటి ఫోటోగ్రఫీ అయినా పర్లేదు
లైటింగ్ అటూఇటూ జరిపి అడ్జస్ట్ చేయొచ్చు
కానీ ప్రకృతిలో , అది కూడా దట్టమైన అడవుల నేపథ్యంలో తీసే సినిమాలకు నాచురాలిటీ చెడకుండా చూపించడం చాలా అవసరం
బాహుల్ రమేష్ తన కెమెరా పనితనంతో కేరళ అడవుల అందాన్ని మరింత అందంగా చూపించాడు
ఇక అడవి , కుక్కలు లాంటి కీలక సన్నివేశాలకు బీజీఎమ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది
ఆ పరంగా ముజీబ్ మజీద్ చక్కటి నేపధ్య సంగీతం అందించాడు
సినిమాలో సస్పెన్స్ చిక్కుముడి విడిపించడానికి దర్శకుడు ఏ మాత్రం తొందరపడలేదు
స్లోగా ఒకటొకటిగా రహస్యాలను ఛేదిస్తూ క్లైమాక్సులో మాత్రమే సస్పెన్స్ గుట్టును విప్పాడు
ముగింపు : కట్టే కొట్టే తెచ్చే అనే టైపులో చకచకా సినిమా అయిపోవాలి అనుకునేవాళ్ళకి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు .. స్లోగా నడిచినా కథలో లీనమైపోయి ఓపిగ్గా చూసేవాళ్ళకి క్లైమాక్స్ తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూశామనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది
నటీనటులు : సౌరభ్ సచ్ దేవ్ , బియానా మోమిస్ , వినీత్ తదితరులు
దర్శకత్వం : దింజిత్ అయ్యతన్
రేటింగ్ : 3 / 5
ఓటిటి : నెట్ ఫ్లిక్స్
