కుక్కలతో సస్పెన్స్ గేమ్ నడిపిన మళయాళ దర్శకుడు – ఎకో మూవీ రివ్యూ

Spread the love

మీ దగ్గర ఐదు కోట్లు ఉంటే మళయాళ దర్శకుల చేతిలో పెట్టి చూడండి . ఓ మాంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీసి తిరిగి 50 కోట్లు మీ చేతిలో పెడతారు . (నేను చెప్పాను కదా అని పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ చేతిలో ఐదు కోట్లు పెట్టి రోజులు లెక్కపెట్టుకోకండి .. డబ్బులతో పాటు మన బుర్రను కూడా కాస్త వాడాలని మనవి )

ఎట్టెట్టా 5 కోట్లకు 50 కోట్లు ఎలా ఇస్తారబ్బా ? అనుకుంటున్నారా? పేకాట కాదు .. జూదం కాదు .. గ్యాంబ్లింగ్ అసలే కాదు.. కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీసి లాభాలు సంపాదించి పెడతారు .

వాళ్లకు క్రైమ్ సినిమా తియ్యాలంటే మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అవసరం లేదు . చిన్న వేలిముద్ర ఆచూకీ దొరికినా చాలు దానిచుట్టూ కథ అల్లుకుని సినిమా తీసి వదులుతారు .

మాములు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీల్లో ఫలానా వాడు ఫలానావాడ్ని ఫలానా కారణంతో మర్డర్ చేసాడు అని మొదలు పెడతారు . ఈ కేసును పరిశోధించటానికి డిటెక్టివ్ యుగంధర్ రంగంలోకి దిగుతాడు . అతడికి తోడుగా ఓ ముంబై హీరోయిన్ కూడా రంగంలోకి దిగడంతో నాలుగు పాటలు , ఆరు డాన్సులతో వారి ఇన్వెస్టిగేషన్ సాగుతుంది . ఈ మధ్యలో వెకిలి హాస్యంతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కేతిగాడి బ్యాచ్ రంగంలోకి దిగుతారు . దీంతో నవ్వలేక , ఏడవలేక విసుగెత్తిపోయిన ప్రేక్షకుడ్ని ట్విస్టుతో షాకిచ్చి చంపాలని ప్లాన్ చేసుకున్న దర్శకుడు ఓ బ్రహ్మాండమైన ట్విస్ట్ వదులుతాడు . హంతకుడి కోసం గాలిస్తున్న క్రమంలో విలన్ హీరోయిన్ని కిడ్నాప్ చేయడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ తో కథ పెద్ద హోల్ లో పడుతుంది .

ఇప్పుడు స్టోరీని మర్డర్ కేసుగా చూడాలా ? లేకపోతే కిడ్నాప్ కేసుగా చూడాలా ? అని మధనపడిన ప్రేక్షకుడు 300 పెట్టి పాప్ కార్న్ కొనుక్కుని నమిలినా ఆన్సర్ దొరకదు .

క్లైమాక్స్ కు వచ్చేసరికి హీరోయిన్ని రక్షించడం కోసం విలన్ని హీరో మర్డర్ చేయడంతో అసలు కేసు ఏంటో అర్ధం కాక పోలీసులు , న్యాయవాదులు , కోర్టులు , సినిమా చూస్తున్న ప్రేక్షకులు కష్టపడి జీవితంలో పోగేసుకున్న ఉన్న నాలుగు కేశాలు కూడా పీక్కుని అడ్జర్న్ అంటూ బయటపడతారు .

తీసే సినిమా కామెడీ అయితే అదే జానర్లో తియ్యాలి .. సస్పెన్స్ అయితే అదే జానర్లో తియ్యాలి. కామెడీకి నవ్వాలి.. సస్పెన్స్ కి బిగుసుకుపోవాలి . అంతేకానీ అటుదిటు కారాదు .

మళయాళ సినిమాలు చూడండి .. చాటలో ఉన్న దినుసులన్నీ కలిపి మిక్సీ లో వేసి రుబ్బి వదలరు
కథని బట్టి స్క్రీన్ ప్లే ఉంటుంది .

ఇప్పుడీ ఉపాధ్ఘాతం ఎందుకంటే ఐదు కోట్లు ఖర్చుపెట్టి తీసిన మళయాళ సినిమా ఇప్పటికే 50 కోట్ల వసూళ్లు దాటి దూసుకుపోతుంది . తాజాగా ఓటిటి ప్లాట్ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో కూడా రిలీజ్ అయి ట్రెండింగ్ లో ఉంది .

ఇందుకు ప్రథమ కారకుడు దర్శకుడు దింజిత్ అయ్యతానే.. గతంలో ఈయన దర్శకత్వంలోనే వచ్చిన కిష్కింధకాండ మూవీ ప్రేక్షకులని సస్పెన్స్ తో కట్టిపడేసింది . ఆయన దర్శకత్వంలోనే వచ్చిన మరో సస్పెన్స్ మూవీ ఎకో . కాకపోతే కిష్కింధకాండలో కోతులతో కథ నడిపిన దర్శకుడు ఎకోలో కుక్కలతో నడిపాడు .

ఇప్పుడు కథ ఏంటో చూద్దాం ?

అసలు దర్శకుడు కథ కోసం ఎన్నుకున్న లొకేషనే సినిమాకి సగబలం . ఎక్కడో కేరళ ,కర్ణాటక సరిహద్దుల్లోని ఓ మారుమూల ఎత్తైన కొండమీద నుంచి కథ మొదలౌతుంది . ఆ కొండమీద మలేషియా నుంచి వచ్చిన మిలాతియా (బియానా మోమిస్) ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది .

ఆమెను గ్రామానికి తీసుకెళ్లడానికి కొడుకులు ప్రయత్నించినా రాకపోవడంతో పియోస్ (సందీప్ ప్రదీప్ ) అనే కుర్రాడ్ని సహాయకుడిగా పెట్టి వెళ్ళిపోతారు . కానీ అప్పటికే ఆమెకు సాయంగా అక్కడ భయంకరమైన మలేషియన్ జాతి కుక్కలు కావలి కాస్తూ ఉంటాయి .

చూసారా.. కథ మొదట్లోనే ఆ ఒంటరి వృద్ధ మహిళ అడవిలో కొండమీద ఒంటరిగా ఎందుకుంటుంది ? పైగా ఆమెకు కుక్కల కాపలా ఏంటి ? అనే క్యూరియాసిటీ కలుగుతుంది . మరోపక్క ఈమె భర్త కురియాచన్ (సౌరభ్ సచ్ దేవ్ ) కోసం నావీ అధికారులు , పోలీసులు గాలిస్తుంటారు .

ఇతను పోలీసులకు దొరక్కుండా కుక్కలను కాపలాగా పెట్టుకుని అడవిలో రహస్యంగా ఉంటున్నాడని వాళ్ళ అనుమానం . అదే సమయంలో ఈ కురియాచన్ కోసం అడవిలోకి వెళ్లిన మోహన్ పోతన్ (వినీత్ ) హత్యకు గురవుతాడు . కురియాచన్ అడవిలోనే ఉండి కుక్కలను ఉసిగొల్పి ఈ హత్యను చేయించి ఉంటాడని అందరూ అనుకుంటారు .

అసలు ఇంతకీ మోహన్ పోతన్ ను ఎవరు హత్య చేసారు ? పోలీసులు కురియాచన్ కోసం ఎందుకు గాలిస్తుంటారు ? మిలాతియా ఒంటరిగా అడవిలో కొండమీద ఎందుకుంటుంది ?

అడవిలో కుక్కలను శాసిస్తున్న అసలు యజమాని ఎవరు ? లాంటి ప్రశ్నలకు జవాబులు మిగతా కథలో తెలుస్తాయి .

ఎలా ఉంది ?

ఇదే కథను స్టుడియోలోనో , సిటీలోనో తీసుంటే ఈ కిక్ వచ్చేది కాదు . వాహనాల రణగొణ ధ్వనులు లేవు , అరుపులు కేకలు లేవు . అప్పుడప్పుడు వినిపించే జంతువుల అరుపులు తప్ప అంతా నిశ్శబ్దం. ప్రేక్షకుడ్ని ఆ వాతావరణానికి కనెక్ట్ చేయడంలోనే దర్శకుడి పనితనం బయటపడుతుంది .

రొటీన్ కు భిన్నంగా చుట్టూ అడవి ,కొండపైన ఒంటరి వృద్ధ మహిళ , ఆమెకు కాపలాగా మలేషియన్ జాతి కుక్కలు .. లాంటి సెటప్పులు సహజంగా ప్రేక్షకుడికి కొంత థ్రిల్ ను కలిగిస్తాయి . ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఆ కుక్కలగురించే .

ఉత్తమ నటనకుగాను సినీ ఆర్టిస్టులకు అవార్డులు ఇచ్చే మాదిరి ఈ కుక్కలకు కూడా అవార్డులు ఇవ్వాలని రికమెండ్ చేయొచ్చు . ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో , ఎక్కడ్నుంచి తీసుకొచ్చారో కానీ కొన్ని సీన్స్ లో భయపెట్టాయి .

ఆదరించాలే కానీ మనిషికి కుక్కకి మించి నమ్మకస్తులు ఎవరూ ఉండరు అనే కాన్సెప్ట్ తో అడవిలో కొండమీద ఒంటరి మహిళ జీవితాన్ని చూపించారు . ఇలాంటి సినిమాల్లో ట్విస్టులు సహజం . పైగా క్రైమ్ రిలేటెడ్ సీన్స్ లో ఒకదానికొకటి లింకులు ఉంటాయి .

మొదట్నుంచీ జాగ్రత్తగా వాచ్ చేస్తే కానీ క్లైమాక్సులో సస్పెన్స్ చిక్కుముడి వీడదు . ఓటిటిలోనే కదా అని మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ చూస్తే మనకు ఆ థ్రిల్ రాదు . పైపెచ్చు కథ వాయువేగంతో పరుగులు పెట్టదు . స్లోగా గూడ్స్ బండి మాదిరి నెమ్మదిగా నడుస్తుంది .

అయితేనేమి కాస్త ఓపిగ్గా చూస్తే ఎన్నో ప్రకృతి రమణీయ దృశ్యాలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి . అలా మైమరచి చూస్తుండగానే సడెన్గా కుక్కలు మీదకు ఉరకడంతో ఒంటికి చెమటలు పడతాయి .

ఈ మిలాతియా కొండమీద ఒంటరిగా ఉండటం , ఆమెకు కాపలాగా మలేషియన్ జాతి కుక్కలు ఉండటం , అడవిలో మోహన్ హత్యకు గురికావడం , కురియాచన్ కోసం పోలీసుల గాలింపుతో ఒకటొకటిగా వస్తున్న సన్నివేశాలతో ప్రేక్షకుడ్ని ఊపిరి తీసుకోనివ్వదు .

చివరి అర్ధగంటలో క్లైమాక్స్ సన్నివేశాలు వచ్చేసరికి ఒకటొకటిగా ట్విస్టులు విడిపోయి అసలు విషయం ఏంటో తెలిసేసరికి సస్పెన్స్ వీడిపోతుంది . కాకపోతే ఆ కురియాచన్ పాత్రలో ఎక్కడో క్లారిటీ మిస్ అయినట్టు అనిపించింది . ఎందుకంటే కధకు అతడి పాత్ర కూడా ప్రధాన ముడి సరుకే . ఆ పాత్రను ఇంకొంచెం జాగ్రత్తగా ఎలివేట్ చేసుంటే బాగుండేది .

ఎవరెలా చేసారు ?

ప్రేమదేశం సినిమాలో అబ్బాస్ తో కలిసి ముస్తఫా , ముస్తఫా అని పాట పాడిన కుర్రాడు గుర్తున్నాడు కదా .

ఎస్ .. వినీత్
అతడొక్కడే ఇక్కడ మనకు తెలిసిన మొహం . మిగతావన్నీ మళయాళ ముఖాలే . అయితేనేమి ఎవరి పాత్రలో వారు జీవించేసి సినిమాకి 50 కోట్లు తీసుకొచ్చేసారు .

కథలో ప్రధాన పాత్రధారులు మిలాతియా గా బియానా మోమిస్ , కురియాచన్ తమ పాత్రలను రక్తి కట్టించారు .

స్టూడియోల్లో తీసే సినిమాలకు ఎటువంటి ఫోటోగ్రఫీ అయినా పర్లేదు . లైటింగ్ అటూఇటూ జరిపి అడ్జస్ట్ చేయొచ్చు . కానీ ప్రకృతిలో , అది కూడా దట్టమైన అడవుల నేపథ్యంలో తీసే సినిమాలకు నాచురాలిటీ చెడకుండా చూపించడం చాలా అవసరం . బాహుల్ రమేష్ తన కెమెరా పనితనంతో కేరళ అడవుల అందాన్ని మరింత అందంగా చూపించాడు .

ఇక అడవి , కుక్కలు లాంటి కీలక సన్నివేశాలకు బీజీఎమ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది . ఆ పరంగా ముజీబ్ మజీద్ చక్కటి నేపధ్య సంగీతం అందించాడు .

సినిమాలో సస్పెన్స్ చిక్కుముడి విడిపించడానికి దర్శకుడు ఏ మాత్రం తొందరపడలేదు . స్లోగా ఒకటొకటిగా రహస్యాలను ఛేదిస్తూ క్లైమాక్సులో మాత్రమే సస్పెన్స్ గుట్టును విప్పాడు .

ముగింపు : కట్టే కొట్టే తెచ్చే అనే టైపులో చకచకా సినిమా అయిపోవాలి అనుకునేవాళ్ళకి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు .. స్లోగా నడిచినా కథలో లీనమైపోయి ఓపిగ్గా చూసేవాళ్ళకి క్లైమాక్స్ తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూశామనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది .

నటీనటులు : సౌరభ్ సచ్ దేవ్ , బియానా మోమిస్ , వినీత్ తదితరులు
దర్శకత్వం : దింజిత్ అయ్యతన్
రేటింగ్ : 3 / 5
ఓటిటి : నెట్ ఫ్లిక్స్


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!