ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ లో భాగంగా ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధ హక్కులను కల్పిస్తూ లోక్ సభలో చర్చ జరుగుతున్న వేళ నిన్న వైసీపీ నాయకుడు జగన్ లేవనెత్తిన ప్లాన్ బి మావిగన్ ఆలోచన సోషల్ మీడియాని కుదిపేసింది
జగన్ మావిగన్ ఆలోచనకు అనుకూలంగా వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పెడితే, వ్యతిరేకంగా , హేళనగా టీడీపీ సోషల్ మీడియా పోస్టులు పెట్టింది
ఇరువర్గాలు ఎవరి వాదనను వారు సమర్థించుకున్నారు
సరే, పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ తమ తమ పార్టీలకో నాయకుడికో అనుకూలంగా స్టాండ్ తీసుకుంటారు కాబట్టి వారి వాదనల జోలికి పోవడం అనవసరం
కాసేపు రాజకీయ అభిమాన, విద్వేషాలను పక్కనబెట్టి జగన్ చెప్పిన మావిగన్ ఆలోచనపై విశ్లేషణ చేసుకుందాం
అసలు జగన్ ఏమన్నారు?
సోషల్ మీడియాలో జగన్ చెప్పిన మావిగన్ మాట ఒక్కటే బయటికి వచ్చింది . కానీ ఆయన ఆ ప్రపోజల్ చేయడం వెనుక చెప్పిన అసలు కారణం పూర్తిగా బయటకు రాలేదు.. లేకపోతే ప్రచారం కాలేదు
ఇంతకీ జగన్ ఏమన్నారంటే,
“ల్యాండ్ పూలింగ్ పేరిట వేలాది ఎకరాలు రైతులనుంచి సేకరించి కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేపట్టడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం..ఖర్చు కు తోడు అదనంగా అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.. మార్కెట్ రేటుతో పోలిస్తే రాజధాని నిర్మాణంలో చదరపు అడుగుకు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న పెద్ద మొత్తాలే అవినీతి ఆనవాళ్లను తెలియచేస్తుంది.
ఇంత మొత్తంలో అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టడం భవిష్యత్తులో ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది.. అంతేకాకుండా రాజధాని పనులను మార్కెట్ రేట్లతో సంబంధం లేకుండా ఎక్కువ రేటుకు సొంత పార్టీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం వల్ల అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది .
అందుకే మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు 70 కిలోమీటర్లు.. అలాగే విజయవాడ నుంచి గుంటూరు వరకు 40 కిలోమీటర్లు కలిపి మొత్తం 110 కిలోమీటర్ల నేషనల్ హైవే ఇరుపక్కలా కాపిటల్ కారిడార్ గ్రోత్ పేరిట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసుకుంటే ఖర్చు కలిసి రావడమే కాకుండా సమయం కూడా కలిసొస్తుంది.
అందుకే మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్ అనే అక్షరాలను తీసుకుని మావిగన్ పేరుతో కాపిటల్ కారిడార్ అభివృద్ధి చేయాలి.. జగన్ చెప్పాడు కాబట్టి నచ్చకపోతే మీకిష్టమైన పేరు పెట్టుకోండి.. కానీ మావిగన్ ఆలోచనపైన చర్చ చేయండి.
చట్టం చేయడం ద్వారా అమరావతి శాశ్వత రాజధాని అవుతుందని చంద్రబాబు ప్రజలను నమ్మిస్తున్నారు.. సభకు చట్టం చేసే అధికారం ఎలా ఉంటుందో చట్ట సవరణ చేసే అధికారం కూడా అలా ఉంటుందన్న విషయం చంద్రబాబు మర్చిపోతున్నారు.. మా ప్రభుత్వం వస్తే చట్ట సవరణ చేస్తామని ఆయనకు తెలుసు.. అయినా డ్రామాలు ఆడుతున్నాడు.”
ఇంచుమించుగా మావిగన్ గురించి జగన్ చెప్పిన విషయాలు ఇవే
అయితే ఇందులో మావిగన్ విషయం కాసేపు పక్కనబెడితే అమరావతి రాజధాని విషయంలో జగన్ చెప్పిన ఖర్చు సంగతి కానీ , అవినీతి విషయం కానీ కొట్టిపారేసేది కాదు
అమరావతి రాజధాని నిర్మాణానికి షుమారు రెండు లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా
పనులు మొదలుపెట్టేనాటికి ఉండే అంచనాలు పూర్తయ్యేసరికి కొండలా ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలుసు
అలా రెండు లక్షల కోట్ల అంచనాతో మొదలయ్యే అమరావతి నిర్మాణం పూర్తిచేసుకునేసరికి ఎన్ని లక్షల కోట్లు అవుతుందో ఎవరి ఊహకూ అందదు
ఒక చిన్న రోడ్డు వేయడానికే అనేక కోణాల్లో అలోచించి నిర్ణయం తీసుకుంటారు
అలాంటిది మొత్తం రాజధాని నిర్మాణం కొత్తగా చేపడుతున్నారంటే చాలా కోణాలను పరిగణలోకి తీసుకోవాలి
ఆ పరంగా కొంత చర్చ జరగడం మంచిదే
ప్రజాధనం విషయంలో పాలకుడు ప్రతి పైసాకి ప్రజలకు జవాబుదారుడిగా ఉండాలి
ప్రజల హక్కుల విషయంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ సరైన అంశాన్నే లేవనెత్తారు
అమరావతి రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగినా , లేకపోతే అవినీతి జరిగినట్టు తన దృష్టికి వచ్చినా జగన్ ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకురావాలి ..ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి..పోరాటం చేయాలి ..ఇందులో మరోమాటకు తావు లేదు
జగన్ ఇంతవరకు మాట్లాడి ఉంటే మంచి చర్చ జరగడానికి అవకాశం ఉండేది
కానీ ఆయన మావిగన్ అంశాన్ని తలకెత్తుకోవడంతో అసలు చర్చ పక్కకుపోయి మూడు నగరాల అంశం ముందుకు వచ్చింది
ఇప్పుడు జగన్ లేవనెత్తిన మావిగన్ అంశం లోటుపాట్లను చర్చిద్దాం
టీవీల్లో జగన్ ప్రెస్ మీట్ చూసిన వాళ్లకు కొన్ని సందేహాలు వస్తాయి
ఒక్కో ఊరు పేరులో మొదటి అక్షరాన్ని ఒత్తి పలుకుతూ మా వి గన్ అని జగన్ నవ్వుతూ చెప్పడం చూస్తుంటే లైటర్ వెయిన్ లో చెప్పినట్టు అనిపిస్తుంది
ఎందుకంటే ఆ సమయంలో ఆ ఆలోచన చెప్పడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని ఆయనకు కూడా తెలుసు
ఆకివీడు సంఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి జగన్ మావిగన్ అంశాన్ని ఎత్తుకున్నారని కొంతమంది అంటున్నారు
అయినా సరే అమరావతి శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన దరిమిలా సదరు బిల్లు లోక్ సభలో చర్చకు వచ్చి ఓటింగులో నెగ్గే వేళ జగన్ ప్రెస్ మీట్ పెట్టి ప్లాన్ బి అంటూ మావిగన్ ఆలోచన చెప్పడం వెనుక అసలు వ్యూహం ఏంటి?
లోక్ సభలో బిల్లు పాస్ అవుతున్న వేళ మావిగన్ ఆలోచన బయటపెట్టినా ఉపయోగం లేదని జగన్ కు తెలియదా?
అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే, పూర్తి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే జగన్ మావిగన్ ఆలోచన బయటకు తీశారా? లేకపోతే అప్పటికప్పుడు మనసులో వచ్చిన ఆలోచన బయటపెట్టారా ? లేకపోతే సలహాదారుల సలహా పాటించారా?
నిజానికి ఈ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే లేవనెత్తి ఉంటే చర్చకు ఆస్కారం ఉండేది ?
ఈ ప్రతిపాదనలోని లోటుపాట్లను ,సాధ్యాసాధ్యాలను మేధావులు పరిశీలించేవారు..చర్చించేవారు..సామాన్యులు ఆలోచించేవారు
కానీ ఇప్పుడు చర్చకు కూడా సమయం మించిపోయింది
తన హయంలో మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిన జగన్ ఇప్పుడు కొత్తగా మరో మూడు పట్టణాల పేర్లతో మావిగన్ ఆలోచన ఎందుకు తీసుకొచ్చినట్టు ?
తాజాగా మావిగన్ ఆలోచనతో మూడు రాజధానుల ఆలోచనకు స్వస్తి చెప్పినట్టేనా?
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పిన మాట నుంచి వెనక్కి వచ్చారా?
అమరావతి మీద వ్యక్తిగతంగా , రాజకీయంగా జగన్ స్టాండ్ ఏంటి?
పార్టీ పరంగా తీసుకున్న స్టాండ్ లను ఇలా తడవకొకసారి మార్చుకుంటూ పోవడం వల్ల కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతుందన్న విషయం జగన్ కు తెలియదా?
రాజధాని విషయంలో వైసీపీ విధానపరమైన ఆలోచన ఏంటి?
రాజధాని విషయంలో ఒకే మాట మీద ఉండకుండా ప్లాన్ ఎ, ప్లాన్ బి అంటూ రకరకాల ప్రకటనలు చేస్తూ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు?
లాంటి భేతాళ ప్రశ్నలు చాలా ఎదురవుతున్నాయి
అమరావతి ఖర్చు గురించి మాట్లాడిన జగన్ రుషికొండలో కోట్లు ఖర్చు పెట్టి రాచరికాన్ని తలదన్నే విలాసవంతమైన భవనాన్ని ఎలా కట్టించారు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు
తన హయంలో మావిగన్ ఆలోచన ఎందుకు చేయలేదు? తను అధికారంలో ఉన్నప్పుడే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కాపిటల్ కారిడార్ అభివృద్ధి పనులు మొదలుపెట్టి ఉండవచ్చు కదా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి
పోనీ మావిగన్ సంగతి అలా ఉంచితే మూడు రాజధానుల విషయంలో కూడా కార్యాచరణ పనులు ఏమీ చేయలేకపోయారని వారంటున్నారు
జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో శాశ్వత రాజధాని దిశగా అడుగులు వేయలేకపోయారని పలువురు విమర్శిస్తున్నారు
ఇదిలా ఉండగా మరోవైపు శాశ్వత రాజధాని విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా చంద్రబాబు తన పనులు తాను చేసుకుపోతున్నారు
భవిష్యత్తులో రాజధాని విషయంలో ప్రజల్లో కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం అమరావతికి చట్టబద్ధమైన హక్కులు కూడా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని లోక్ సభలో బిల్లు కూడా పాస్ చేయించుకున్నారు
ముగింపు
ఇకనైనా జగన్ రాజధాని విషయం మీద ఫోకస్ పెట్టే కన్నా ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద కానీ, విభజిత చట్టం వల్ల ఏపీకి దక్కాల్సిన వాటాల మీద కానీ ఫోకస్ పెట్టి పోరాటం చేస్తే ప్రజల దృష్టి ఆయన మీద మరలుతుంది.
అలా అని అమరావతి రాజధానిలో జరిగే అవినీతి విషయంలో మౌనంగా ఉండక్కర్లేదు.. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసాకి లెక్కగట్టి ప్రజల దృష్టికి తీసుకువచ్చి ప్రశ్నించవచ్చు
అమరావతి నిర్మాణంలో అవినీతి జరుగుతున్నట్టు ఆధారాలు ఉంటే పార్టీ తరపున న్యాయ పోరాటాలు చేయవచ్చు
అంతిమంగా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు.. పాలనలో అభివృద్ధికే పట్టం కడతారు.. అది ఏ పార్టీకి చెందిన నాయకుడైనా సరే
ఐదేళ్ల పాలనా కాలంలో శాశ్వత ప్రాతిపదిక మీద పనులు చేయకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో కాలయాపన చేసిన చంద్రబాబును ఇంటికి పంపి ప్రజలు జగన్ను సీఎం పీఠంలో కూర్చోబెట్టిన ఉదంతమే అందుకు ఉదాహరణ
ప్రస్తుత ఐదేళ్ల పాలనాకాలంలో బాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి శాశ్వత ప్రాతిపదికన రాజధాని పనులను కనీసం 90 శాతమైనా పూర్తి చేయగలిగితేనే ప్రజలు మరోసారి పట్టం కట్టే అవకాశం వస్తుంది
లేదూ ప్రజలను నమ్మించడానికి జిమ్మిక్కులు చేస్తే ఓటర్లు ప్రత్యామ్నాయం ఎలానూ చూసుకుంటారు
మరోవైపు సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం ద్వారా అధికారంలోకి చేరువ కావడం జగనుకు కూడా పెద్ద కష్టమైన పని కాదు
ఇప్పటికీ జగన్ కు నలభై శాతం ఓటింగ్ ఉందన్న విషయం మర్చిపోకూడదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ప్రజల్లో అంతటి మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు జగన్ అనటానికి ఆయన పర్యటనల్లో కనిపించే జనమే సాక్ష్యం
కాకపోతే జగన్ పక్కన సరైన కోటరీ లేదనిపిస్తుంది
సలహాదారుల రాజకీయ పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే అని ఆ పార్టీ గతనుభవాల వల్ల తెలుస్తుంది
ఈ విషయం జగన్ కూడా గుర్తించినట్టున్నాడు
అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్నారు
నిజానికి ఇది మంచి పరిణామమే
ఇకనైనా జగన్ తన పార్టీలో కోటరీని పక్కనబెట్టి నేరుగా కార్యకర్తలతో మమేకం అవుతే ఫలితాలు సానుకూలంగా ఉంటాయి
అంతిమంగా అధికారం దక్కడానికి కావల్సింది పాలనలో పారదర్శకత , నిజాయితీ,చిత్తశుద్ధి మాత్రమే
అది ఎవరివైపు ఉంటే అధికారం వారి వైపే ఉంటుంది !

చాలా మంచి విశ్లేషణ.
Thank you