మీరు గమనించారా ?
రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది . విమర్శల స్థానంలో బూతులు రంగప్రవేశం చేసాయి. విధానపరమైన నిర్ణయాలపై చర్చకు బదులు వ్యక్తిగత జీవితాలు టార్గెట్ అవుతున్నాయి. ఆరోగ్యకరమైన పోటీకి బదులు విద్వేషపూరిత రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి .
తాము గతంలో ప్రతిపక్షములో ఉన్నప్పుడు అధికార పక్షము అనుసరించిన కక్షపూరిత రాజకీయాలను వ్యతిరేకించిన అదే పార్టీలు తిరిగి అధికారంలోకి వస్తే అవే విధానాలను అనుసరిస్తున్నాయి . తాము అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల తీరు బాగుందని కితాబు ఇచ్చే నాయకులూ , ప్రతిపక్షములోకి రాగానే అదే పోలీసుల తీరును తప్పు పడుతున్నారు .
అధికార , ప్రతిపక్షాలు ఆడుకుంటున్న చదరంగంలో పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు . గతంలో ఐదేళ్లు ప్రజాసమస్యల మీద పోరాటాలు చేసిన అధికార , ప్రతిపక్షాల స్థానంలో నేడు ప్రతీకార రాజకీయాలు ప్రవేశించాయి .
గతంలో కార్యకర్త మీద కేసు పెడితే వార్త .. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టకపోతే వార్త. ఇదే సంప్రదాయం ముందు ముందు కొనసాగితే మన పాలకులు ఎన్ని కేసుల్లో జైలుకు వెళ్లారు ? ఎన్ని కేసుల్లో శిక్షలు అనుభవించారు ? లాంటివి వార్తల్లో హెడ్ లైన్స్ అవుతాయి .
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి . ఇందులో తప్పెవరిది ? ఒప్పెవరిది ? అంటే సమాధానం చెప్పడం కష్టం .. చెట్టు ముందా ? విత్తు ముందా ? అన్నట్టుంది . అయినా ఒకసారి రీలు వెనక్కి తిప్పి బూతు రాజకీయాలను విశ్లేషణ చేసుకుందాం .
ఏపీలో ఏం జరిగింది ?
ముందుగా ఏపీ సంగతి తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారిగా టిడిపి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు . ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షానికి పరిమితం అవ్వాల్సివచ్చింది .
ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి ,
నేటి డిజిటల్ యుగంలో ఎన్నికలను , రాజకీయాలను ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది . మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపు ఒక్కో రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుండటంతో అవి వండి వార్చే వార్తలకు విశ్వసనీయత పోయింది .
ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా రంగంలోకి వచ్చింది . సోషల్ మీడియా సమాచారం కూడా నూటికి నూరుపాళ్లు వాస్తవం కాకపోయినా ఏది నిజమో ? ఏది అబద్దమో ? వెంటనే తేలదు . ఈ లోపు శత్రువుకి జరగాల్సిన డామేజ్ జరిగిపోతుంది .. తిమ్మిని బమ్మిని చేయడం అన్నమాట .
వాడుకుంటే రాజకీయ నాయకులకు సోషల్ మీడియా బ్రహ్మాస్త్రం.. అందుకే దాదాపు ప్రతి రాజకీయ పార్టీ సొంత సోషల్ మీడియాలు ఏర్పాటు చేసుకున్నాయి .
ఆ సమయంలో వైఎస్ జగన్ భార్య భారతి మీద చాలా ట్రోలింగులు నడిచాయి .. ప్రతిపక్ష వైఎసార్సీపి మీద విధానపరమైన రాజకీయ పోరాటం చేయాల్సిన స్థానంలో వ్యక్తిగత ధూషణలు రంగప్రవేశం చేసాయి . దురదృష్టవశాత్తు ఈ ట్రోలింగులకు రాజకీయాలతో సంబంధం లేని మహిళలు టార్గెట్ అయ్యారు . అప్పుడే ఈ దుష్ట సంప్రదాయానికి అడ్డుకట్ట వేసి ఉంటే బాగుండేది .
రెండోసారి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు .. ఇప్పుడు వైసిపి సోషల్ మీడియా ట్రోలింగులకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి టార్గెట్ అయ్యింది . ఏతావాతా ఇరు పార్టీల సోషల్ మీడియా ట్రోలింగుల వల్ల రాజకీయాలతో సంబంధం లేని ఇరువురు ముఖ్యమంత్రుల భార్యలు ఇబ్బంది పడ్డారు .
ఇదికాకుండా నాయకులు వ్యక్తిగత ధూషణలతో కొత్త సంప్రదాయానికి నాంది పలికారు . ఈ ధూషణల పర్వం ఎక్కడిదాకా వెళ్లిందంటే క్యాబినెట్ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యక్తిగతంగా వాడు , వీడు అని బహిరంగంగా సంభోదించే స్థాయికి వెళ్ళింది .
అసెంబ్లీలో సైతం భువనేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు మాట్లాడటంతో ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు సైతం పసిపిల్లవాడిలా భోరున ఏడ్చారు .
ఈ రాజకీయాలు వ్యక్తిగత దూషణలతో ఆగిపోలేదు .. వ్యక్తిగత దాడుల వరకు వెళ్ళింది . గన్నవరంలోనూ , మంగళగిరిలోనూ టిడిపి కార్యాలయాలను ధ్వంసం చేసారు.. జోగి రమేష్ ఏకంగా కొన్ని కార్లలో అనుచరులను వేసుకుని చంద్రబాబు ఇంటిమీదికి వెళ్లారు . అచ్చంనాయుడు , కొల్లు రవీంద్ర , అయ్యన్నపాత్రుడు వంటి టిడిపి సీనియర్ నాయకుల మీద పోలీస్ కేసులు నమోదు అయ్యాయి . రఘురామకృష్ణం రాజు , పట్టాభి వంటి నాయకులైతే పోలీసులు తమమీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వాచిపోయిన కాళ్లనూ , చేతులనూ చూపించారు .
ఈ వ్యక్తిగత ధూషణలు , వ్యక్తిగత దాడులకు అదనంగా క్లైమాక్సులో చంద్రబాబును కూడా అరెస్ట్ చేసి షుమారు 53 రోజులు జైల్లో పెట్టారు .
సరే చట్టం ముందు అందరూ సమానమే .. చట్టం తన పని తాను చేస్తుంది అనే రెడీమేడ్ కొటేషన్లు మనదగ్గర ఎలానూ ఉన్నాయి . కాబట్టి ఈ కేసులూ , అరెస్టులు రాజకీయపరమైన ప్రతీకార చర్యలా? లేకపోతే నిజంగానే అవినీతి జరిగిందా ? అనేది న్యాయస్థానాల్లో తేలేదాకా మనం తొందరపడి విశ్లేషణ చేయలేము .
వైసిపి ప్రభుత్వం మాత్రం ఈ అరెస్టులపై స్పందిస్తూ పోలీస్ విధుల్లో తాము జోక్యం చేసుకోమని , చట్టం తనపని తాను చేస్తుందని చెప్పింది . అది చంద్రబాబుకు సంబంధించింది అయినా , జగన్ కు సంబంధించిన కేసు అయినా చట్టాలను గౌరవించే పౌరులుగా మనం న్యాయస్థానాల తీర్పును అంగీకరించాల్సిందే .
కానీ ఈ క్రమంలో తమల్ని వేధించిన రాజకీయ నాయకుల పేర్లనూ , అధికారుల పేర్లనూ రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని , తాము అధికారంలోకి వస్తే తప్పకుండా తగిన జవాబు ఇస్తామని అప్పట్లోనే లోకేష్ చెప్పారు .
ఇప్పుడు ఏపీలో తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు .. చెప్పినట్టుగానే లోకేష్ రెడ్ బుక్ బయటికి తీయడంతో ఒకరొకరుగా వైసీపీ నాయకుల మీద కేసులు బుక్ అయి అరెస్టులదాకా వెళ్ళింది . ఆ రోజు భువనేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషించిన వల్లభనేని వంశీ మీద కేసుపెట్టి అరెస్ట్ చేసారు .
ఈ కేసులో సెక్షన్లు ఎంత పకడ్బందీగా పెట్టారంటే వంశీకి బెయిల్ కూడా దొరక్క కొన్ని నెలలపాటు జైల్లోనే ఉండాల్సివచ్చింది .. ఆ ప్రభావం వల్లనో , ఇతర కారణాలో తెలీదు కానీ గతంలో టిడిపి మీద , చంద్రబాబు మీద దూకుడుగా వెళ్లిన వంశీ ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నారు . అలాగే కేవలం చీటికిమాటికి బాబుని దూషించడం కోసమే మీడియా ముందుకు వచ్చే కొడాలి నాని మౌన వ్రతం పాటిస్తున్నారు .
లోకేష్ రెడ్ బుక్ లో రాసుకున్న చాలామంది ఐపీఎస్ అధికారులు పోస్టింగులు లేక గాల్లో ఉన్నారు . ఇంకో ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు .
బాబు ఇంటిమీదికి వెళ్లిన జోగి రమేష్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి మొన్ననే బెయిల్ మీద బయటికి వచ్చారు .. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది కూడా అదే పరిస్థితి .
ఈ నేపథ్యంలో తాజాగా అంబటి రాంబాబు , జోగి రమేష్ ఇళ్లకు టిడిపి కార్యకర్తలు నిప్పు పెట్టారు .. తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ ప్రకటన చేయడంతో పాపప్రక్షాళన కార్యక్రమం అంటూ గుంటూరులో దేవాలయానికి బయలుదేరిన అంబటి రాంబాబుని దారిలో టిడిపి కార్యకర్తలు , పోలీసులు అటకాయించడంతో ఆయన సహనం కోల్పోయి బూతులు లంకించుకున్నారు . ఆ బూతులు చంద్రబాబును ఉద్దేశించే అన్నాడని భావించిన టిడిపి కార్యకర్తలు ఆగ్రహంతో అంబటి ఇంటిమీదికి వెళ్లి నిప్పు పెట్టారు .
ఆ తర్వాత పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం , ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగాయి . తాను చంద్రబాబును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదనీ , తనను తిట్టినవారిని మాత్రమే ఉద్దేశించి చేసానని , అయినా ఈ వయసులో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని అంబటి ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు .
ఇంకోపక్క ఇదే సమయంలో నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసాడని ఆగ్రహించిన టిడిపి కార్యకర్తలు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు . ఇదీ ఇప్పటివరకు జరిగిన , జరుగుతున్న పరిణామాలు .
ముగింపు :
పై ఆర్టికల్ చదివితే మనకు ఓ విషయం అర్ధమౌతుంది .. ఇకపై మన రాజకీయాల్లో ప్రతీకార రాజకీయాలు కూడా భాగమైపోతాయి .
ఇందులో దాపరికం ఏమీ లేదు.. ఎవరికి వారు రేపు తాము అధికారంలోకి వస్తే ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పేస్తున్నారు.. ఎవరికి వారు బుక్కుల్లో ప్రత్యర్థుల పేర్లు , అధికారుల పేర్లూ రాసేసుకుంటున్నారు.. అధికారంలోకి వస్తే రఫ్ఫా రఫ్ఫా అంటూ ఫ్లెక్సీలు వేస్తున్నారు .
ఇందుకు ఉదాహరణ తాజాగా ఇరువురి నాయకుల ప్రకటన ఉంది .
ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులతో , గుండాలతో కుమ్మక్కై మాపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు . రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే పనిచేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ? అని మీడియాతో మాట్లాడుతూ చెవిరెడ్డి అన్నారు .
మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో , మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం . మేము కూడా ఇదే పనిచేస్తే మీ పరిస్థితి ఏంటి ? అని జోగి రమేష్ అన్నారు .
ఇదే మాటలు గతంలో కొంతమంది టిడిపి నాయకులు కూడా అన్నారు
ఏ పార్టీవారు అయినా సరే ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు .. విధానపరమైన నిర్ణయాలపైన ఆరోగ్యకరమైన చర్చలు చేయకుండా వ్యక్తిగత ధూషణలకు పాల్పడటం ఏ పార్టీకైనా సరైన పద్దతి కాదు. పాలనలో పోటీపడకుండా ప్రతీకార రాజకీయాలు చేయడం ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు.. రాజకీయ వైరుధ్యం ఉన్న ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద , ఇళ్ల మీద వ్యక్తిగత భౌతిక దాడులు చేయడం ఏ పార్టీకైనా సరైన విధానం కాదు .
అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోవడం , వాడుకోవడం ,ప్రతిపక్షములో ఉన్నప్పుడు అదే పోలీసుల తీరును వ్యక్తిగతంగా విమర్శించడం సరైన పద్ధతి కాదు . దీనివల్ల ముందు ముందు పోలీసుల ఆత్మస్థయిర్యం దెబ్బతిని వారి విధుల మీద ప్రభావం చూపిస్తుంది .
అధికార ,ప్రతిపక్ష పార్టీలు తమ పార్టీ నాయకులకు పబ్లిక్ లో ఎలా మాట్లాడాలో కౌన్సిలింగ్ ఇవ్వాలి.
మర్యాదపూర్వకమైన భాషకు ప్రజల్లో ఎప్పటికీ గుర్తింపు , గౌరవం ఉంటుంది . అన్నిటికన్నా ముఖ్యమైనది పార్టీ అధినేతలు తమ క్యాడర్ చేసే తప్పులను సమర్ధించకుండా ముందే కఠిన చర్యలు తీసుకుంటే ప్రజల్లో విలువ పెరుగుతుంది .
ఇవేమీకాదు మేము ఇప్పటిలానే వ్యవహరిస్తాం అంటారా ? అన్నీ గమనిస్తున్న ఓటరు తన తీర్పును నిశ్శబ్దంగా ఎన్నికల్లో చెప్తాడు .
తాము ప్రతిపక్షములో ఉన్నప్పుడు అధికార పక్షము ఏ విధంగా అయితే కక్షపూరిత రాజకీయాలు చేసిందో, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మేమూ అదే విధంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తాం అనుకునేవారు ఓటరు ఈ అధికార మార్పిడిని ఎందుకు చేసాడో ఒక్కసారి ఆలోచించుకోండి .
నిజంగా మీరు ఓటరు మనసులోని ఆలోచనను పసిగడితే కక్షపూరిత రాజకీయాలను వెంటనే వదిలేసి పాలనలో అభివృద్ధిపై దృష్టి పెడతారు . మీరెప్పుడైతే అభివృద్ధి మీద దృష్టి పెట్టారో ఓటరు తిరిగి మిమ్మల్నే అధికారంలో కూర్చోబెట్టాలని దృష్టి పెడతాడు .
అధికారం దక్కించుకోవడానికి ఇంతకుమించిన సింపుల్ ఫార్ములా మరోటి లేదు!
