Home » కలంకావల్ లో సీరియల్ కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తుంటాడు ?- మూవీ రివ్యూ

కలంకావల్ లో సీరియల్ కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తుంటాడు ?- మూవీ రివ్యూ

Spread the love

కొంతమంది హీరోలు కెరీర్ మొదలునుంచి ఎదుగుతున్న క్రమంలో ఒక ఇమేజ్ చట్రంలో కూరుకుపోతారు

ఫలానా హీరో కామెడీ పాత్రలే చేయగలడు
యాక్షన్ థ్రిల్లర్ పాత్రలే చేయగలడు
డాన్సులు చేయగలడు
ఫైటింగులు చేయగలడు
ఇలా వారికి తెలియకుండానే ఒక ఇమేజ్ చట్రంలో కొనసాగుతూ ఉంటారు

కానీ కొంతమంది మాత్రమే అలాంటి ఇమేజ్ చట్రం జోలికి పోకుండా ఎటువంటి పాత్రలో అయినా ఒదిగిపోగలరు
అటువంటివారిలో మమ్ముట్టి ఒకరు

ఈ మళయాళ నటుడ్ని మన చిన్నప్పటినుంచి చూస్తూనే ఉన్నాం

ఒక సినిమాలో ఫక్తు ఫ్యామిలీ మ్యాన్ మాదిరి కనిపిస్తాడు
ఇంకో సినిమాలో నెగిటివ్ షేడ్ లో కనిపిస్తాడు

ఒక సినిమాలో కామెడీ టైమింగ్ తో నవ్విస్తే , ఇంకో సినిమాలో యాక్షన్ థ్రిల్లర్ తో మెప్పిస్తాడు

ఒకటా రెండా ఇప్పటికి నాలుగు వందలకుపైన సినిమాల్లో నటించాడు

ప్రతి సినిమాలో తనకిచ్చిన పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని నటిస్తాడు

కేవలం హీరో ఇమేజ్ కే పరిమితం అవకుండా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు

అంతెందుకు తనకిచ్చిన గే పాత్రను కూడా ఒప్పుకుని చేసాడు
ఇంకో హీరో అయితే ఈ వయసులో అటువంటి పాత్ర చేయడానికి సాహసించడేమో?

కానీ మమ్ముట్టి అటువంటి సంకోచాలను పక్కనబెట్టి పాత్ర ఏదైనా సరే ఛాలెంజింగ్ గా తీసుకుని పరకాయ ప్రవేశం చేస్తానని చెప్పి నటించి చూపాడు

ఇప్పుడు అదే మమ్ముట్టి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి మళయాళ సీమలో కలెక్షన్ల సునామీ సృష్టించాడు

కలంకావల్ కేరళలో విడుదలై 80 కోట్లకు పైగా వసూలు చేసి పరుగులు పెడుతుంది

తాజాగా మూడురోజుల క్రితం నుంచి ఓటిటి ప్లాట్ఫార్మ్ సోని లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది

ఇంతకీ కధేంటి ?

కేరళ , తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో ఒంటరి మహిళలు కనిపించకుండా పోతుంటారు
ఎంత గాలించినా మాయమైన మహిళల ఆచూకీ దొరకదు

ఎవరైనా డబ్బుల కోసం కిడ్నాప్ చేసారా ? అంటే అదీ కాదు
మరి ఉన్నపళంగా గ్రామాల్లో కొంతమంది మహిళలు ఎందుకు కనిపించకుండా పోతున్నారు ?
కనీసం వారి శవాలు కూడా దొరక్కపోవడంతో పోలీసులు తలపట్టుకుంటారు

ఈ క్రమంలో ఈ మిస్టరీని ఛేదించటానికి ఇన్స్పెక్టర్ జయకృష్ణన్ ( వినాయకన్) ను నియమిస్తారు

కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని ఇన్స్పెక్టర్ జయకృష్ణన్ గుడ్లగూబ అనే పేరుతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు

అతని ఇన్వెస్టిగేషన్ డీసెంట్ ఫ్యామిలీ మ్యాన్ స్టాన్లీ దాస్ (మమ్ముట్టి ) పేరు బయటకు వస్తుంది

కానీ స్టాన్లీ దాస్ పేరు అయితే బయటికి వస్తుంది కానీ అతడే ఈ మహిళల అదృశ్యం వెనుక ఉన్న అసలు సూత్రధారి అనటానికి తగిన ఆధారాలు ఏమీ దొరకవు

ఎందుకంటే స్టాన్లీ దాస్ నడవడిక మీద ఎవరికీ అనుమానం రాదు
పైకి చాలా మంచివాడిలా కనిపిస్తాడు

అయినా సరే మిస్టరీని ఎలాగైనా ఛేదించాలని ఇన్స్పెక్టర్ జయకృష్ణన్ ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయడంతో ఒకటొకటిగా షాకింగ్ విషయాలు బయటపడుతూ ఉంటాయి

ఈ క్రమంలో స్టాన్లీ దాస్ ఒంటరి మహిళలను లక్ష్యం చేసుకుని లోబరుచుకుని అదే రోజు వారిని హత్యలు చేస్తున్నాడనే భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటాడు

అయితే స్టాన్లీ దాసే ఈ హత్యలు చేస్తున్నాడని నిరూపించటానికి ఇన్స్పెక్టర్ జయకృష్ణన్ ఎలాంటి ఆధారాలు సేకరిస్తాడు ?

అసలు ఈ స్టాన్లీ దాస్ ఎవరు ?

అతడు సైకో కిల్లర్ గా ఎందుకు మారతాడు ? అనేవి మిగతా కధనంలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

అసలే సైకో కిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
పైగా నెగిటివ్ షేడ్ లో మమ్ముట్టి నటన కలిపి సినిమాపై అంచనాలు పెంచాయి

ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమా భారీ విజయాన్ని అందుకుంది

నిజానికి ఇలాంటి సైకో కిల్లర్ నేపధ్యం ఉన్న సినిమా ఇదే మొదటిది కాదు
గతంలో చాలా సినిమాలు వచ్చాయి

అంతెందుకు ఎప్పుడో వచ్చిన కమల్ హాసన్ ఎర్ర గులాబీ మూవీది కూడా ఇలాంటి కధే
ఇందులో అతడు కూడా సీరియల్ కిల్లర్ అన్నమాట

హీరో కమల్ హాసన్ ఒంటరి మహిళలను మోసం చేసి లోబరుచుకుని హత్య చేసి సమాధుల మీద ఎర్ర గులాబీ పెడుతుంటాడు

ఆఖరికి హీరోయిన్ శ్రీదేవి కమల్ హాసన్ నిజ స్వరూపం తెలుసుకుని బయటపడుతుంది
అప్పట్లోనే ఈ సినిమా బాగా ఆడింది

ఇలాంటి సినిమాల్లో దేనిదారి దానిదే
ఎవడెంత టెంపో మెయింటైన్ చేస్తే వాడే కింగ్

ఇలాంటి కధలకు స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్ ఉన్న ఉంటే అంత కిక్కిస్తుంది
సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అపరాధ పరిశోధనలు కొనసాగుతూ ఉండాలి

మధ్య మధ్యలో ఊహించని ట్విస్టులు ఉండాలి
మిస్టరీలో చిక్కుముడులు వీడుతున్నట్టే ఉండాలి

చివరిదాకా అదే టెంపోలో సినిమా నడిపించాలి
అప్పుడు కదా సినిమా పేలేది

ఇటువంటి స్క్రీన్ ప్లే లో మళయాళ దర్శకులు ఆరితేరిపోయారు

కధనంలో ఎక్కడా సస్పెన్స్ తగ్గనీయకుండా గ్రిప్పింగ్ గా తీయడం అనేది వాళ్ళు బాగా వంటపట్టించుకునేశారు

దర్శకుడు చివరిదాకా మమ్ముట్టి పాత్రను దాచిపెట్టకుండా సినిమా ప్రారంభంలోనే అతడు ఓ మహిళను హత్య చేసే సన్నివేశంతో మొదలుపెట్టాడు

ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ పార్టే కధకు ప్రాణం పోసింది

వరుస హత్యలు జరుగుతున్నాయి
హంతకుడు ఎవరో తెలుసు ?
కానీ అతడే హత్యలు చేస్తున్నాడని ప్రూవ్ చేయడం ఎలా ?
ఇలా పాత డిటెక్టివ్ కధల్లో అపరాధ పరిశోధన మాదిరి ఇన్వెస్టిగేషన్ సాగుతుంది

కధనంలో హంతకుడు కనిపిస్తుంటాడు
పోలీసులు కనిపిస్తుంటారు
కానీ చివరివరకు మిస్టరీ తేలదు

ఆ మధ్య నిజ జీవితంలో ఒక సైకో కిల్లర్ ను అరెస్ట్ చేసిన ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ ” మాములు నేరగాళ్లతో పోలిస్తే సైకో కిల్లర్లలో తెలివితేటలు ఎక్కువుంటాయని చెప్పారు . చట్టానికి దొరక్కుండా హత్యలు చేస్తూ డిపార్టుమెంటుని ముప్పతిప్పలు పెట్టడంలో ఈ సైకో కిల్లర్లే ముందు ఉంటారని” ఆయన చెప్పారు

ఆయన చెప్పింది నిజమే

ఈ సినిమా కూడా కేరళలో నిజ జీవితంలో జరిగిన ఓ సైకో కిల్లర్ సీరియల్ మర్డర్స్ కేసు ఆధారంగా తీసిందే

అయితే దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మరింత సస్పెన్స్ థ్రిల్లర్ గా మలిచాడు
ఈ సినిమాకి సరైన దర్శకత్వమే ప్లస్ అవుతుంది

క్లుప్తంగా చెప్పాలంటే చట్టానికి దొరక్కుండా తెలివిగా స్టాన్లీ దాస్ చేసే వరుస హత్యలు ఒకవైపు , ఎలాగైనా తగిన ఆధారాలు సంపాదించి హంతకుడ్ని చట్టానికి పట్టించటానికి పోలీసులు చేసే పరిశోధనలు మరొకవైపు , మొదటినుంచి చివరివరకు కధనాన్ని అత్యంత గ్రిప్పింగ్ గా నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు

ఎవరెవరు ఎలా చేసారు ?

ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో మమ్ముట్టి ని తీసుకోవాలన్న దర్శకుడి నిర్ణయం సరైనదే

ఇంకో హీరో ఈ స్థాయిలో చేసేవారో లేదో తెలియదు కానీ మమ్ముట్టి పాత్రకు పూర్తి న్యాయం చేసాడు

సైకో కిల్లర్ అంటే ముఖం మీద గాటు , క్రూరమైన చూపులు , హావభావాలు కాదు

పైకి సాధారణ ఫ్యామిలీ మ్యాన్ మాదిరి నవ్వుతూ , మంచిగా ఉంటూ అంతర్ముఖంలో అత్యంత దుర్మార్గాన్ని ప్రదర్శించడమే అసలు సిసలైన సైకో లక్షణాలు

అటువంటి హావభావాలు పలికించడంలో మమ్ముట్టి నూరు శాతం సక్సెస్ అయ్యాడు

వెండి తెర మీద సైకో కిల్లర్ హత్యలు చూస్తుంటే వామ్మో స్టాన్లీ దాస్ ఇలాంటివాడా ? అనిపిస్తుంది

ఆ పాత్ర మీద కోపం వస్తుంది , అసహ్యం వేస్తుంది , భయం వేస్తుంది , ఆశ్చర్యం వేస్తుంది

అంతే సినిమాలో మనకు స్టాన్లీ దాస్ మాత్రమే కనిపిస్తాడు
మమ్ముట్టి అస్సలు కనిపించడు

ఇక రెండో క్యారక్టర్ గురించి చెప్పుకోవాలంటే వినాయకన్ గురించి చెప్పుకోవాలి

జైలర్లో వర్మ పాత్ర పోషించిన వినాయకన్ ఇందులో ఇన్స్పెక్టర్ జయకృష్ణన్ పేరుతో ప్రదర్శించిన నటన మాములు స్థాయిలో లేదు

ఈయన నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మనిషా ? అని అనిపిస్తుంది

ఇన్వెస్టిగేషన్లో భాగంగా సిట్యుయేషన్ కు తగ్గట్టుగా హావభావాలు ప్రదర్శించి ఆకట్టుకున్నాడు

సినిమా విజయానికి ఈ ఇద్దరే మెయిన్ పిల్లర్స్
వీళ్ళని జాగ్రత్తగా వాడుకుని దర్శకుడు జితిన్ కే జోష్ చక్కటి ఔట్పుట్ రాబట్టుకున్నాడు

సాంకేతికత :

ఇలాంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ , బీజీఎమ్ ప్రముఖ పాత్రలు పోషిస్తాయి
ఆ రెండిటిలో మంచి మార్కులే పడతాయి
ముజీబ్ మజీద్ అందించిన బీజీఎమ్ బాగుంది

విశ్లేషణ :

ముందే చెప్పినట్టు ఇదే జానర్లో గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ దేని దారి దానిదే . సస్పెన్స్ థ్రిల్లర్ కథనాలను ప్రెజెంట్ చేసేటప్పుడు ఎవరెంత గ్రిప్పింగ్ గా తీయగలరు అనేదానిమీద సినిమా విజయం ఆధారపడి ఉంటుంది . సైకో కిల్లర్ కథ కాబట్టి ఈ జానర్లో సినిమాలు చూడటానికి ఇష్టపడేవారు నిక్షేపంగా చూడొచ్చు . పైగా సాధారణంగా ఇటువంటి జానర్లో చూపించే మోతాదుని మించిన అశ్లీల సన్నివేశాలు లేకపోవడంతో ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సోని లివ్ లో చూడొచ్చు

నటీనటులు : మమ్ముట్టి , వినాయకన్ తదితరులు
దర్శకత్వం : జితిన్ కే జోష్
విడుదల : 16 -01-2026 ( సోని లివ్ )
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!