కవిత విషయంలో కేసీఆర్ మౌనం దేనికి సంకేతం?

Spread the love

కవిత విషయంలో కేసీఆర్ మౌనం దేనికి సంకేతం ?

ఇంట్లో పిల్లలు గొడవ పడుతుంటే కుటుంబ పెద్దగా తండ్రి కలగచేసుకుని బతిమాలో .. రాజీ చేసో .. మందలించో.. నాలుగు దెబ్బలేసో గొడవ సద్దుమణిగేలా చేస్తాడు

ఇది ప్రతి ఇంట్లోనూ జరిగేదే

అయితే అదే పిల్లలు పెరిగి పెద్దయి గొడవలు పడుతుంటే సద్దుబాటు చేయడం కుటుంబపెద్దకు అంత తేలికైన పని కాదు

ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి అదే

ఒక పక్కన బిడ్డ అలక .. మరోపక్క రక్త సంబంధీకులతో రిలేషన్

రెండూ చెరోవైపు నిలిచి బలపరీక్షకు సిద్ధం అయ్యాయి

కేసీఆర్ అటూ ఒరగలేక .. ఇటూ సర్దుబాటు చేయలేక అయోమయ స్థితిలో ఉండిపోయాడు

ఇదే కేసీఆర్ గతంలో వందల కుటుంబాల్లో గొడవలను పరిష్కరించాడు
కానీ ప్రస్తుతం సొంత కుటుంబ గొడవల్లో మాత్రం నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాడు

రాజకీయం అనేది విష పురుగులాంటిది
ఎప్పుడు ఎవర్ని ఎందుకు కుడుతుందో తెలీదు
దానితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడే అందుకు సిద్ధపడాలి

నిజానికి ఈ రాజకీయ కుటుంబ గొడవలు కేసీఆర్ కుటుంబంతో మొదలైనవి కావు .. కేసీఆర్ కుటుంబంతో మాత్రమే ఆగేవి కూడా కావు

మొన్న మొన్నటికి ఏపీలో అన్నాచెల్లెలయిన జగన్ , షర్మిలలు విడిపోయి సొంత కుంపట్లు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే

అలాగే తమిళనాడులో కరుణానిధి కుటుంబ గొడవలు , బీహార్ లో లల్లూ ప్రసాద్ యాదవ్ కుటుంబ గొడవలు , యూపీలో ములాయం సింగ్ యాదవ్ కుటుంబ గొడవల సరసన తాజాగా కేసీఆర్ కుటుంబ గొడవలు కూడా చేరాయి

అయితే కొన్ని కుటుంబాలు రాజీ పడి రాజకీయాల్లో కొనసాగుతుండగా , మరికొన్ని కుటుంబాలు రాజకీయంగా విడిపోయి బలాబలాలు తేల్చుకుంటున్నారు

ఇప్పుడు కవిత గొడవల గురించి చూద్దాం

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రము ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ , కవిత , హరీష్ రావు , సంతోష్ కుమార్ లు ఎవరి పదవుల్లో వారు కుదురుకోవడంతో రాఖీలు , మిఠాయిలతో పండంటి కాపురం సినిమాలో లా అన్యోన్య జీవితం నడిచింది

కేసీఆర్ పాలించిన పదేళ్లలో అంతర్గత తగాదాలు ఏమున్నా బయటపడకుండా అందరూ కలిసికట్టుగా ఉన్నట్టు కనిపించారు

ఎప్పుడైతే కేసీఆర్ పార్టీ పేరును మార్చి బిఆర్ఎస్ చేసారో అప్పుడే వాస్తు దెబ్బ కొట్టింది

నిజానికి తన కొడుకు కేటీఆర్ ను తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసి తాను దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనేది కేసీఆర్ ఆలోచన

ఆయన ఆలోచన పసిగట్టిన కుటుంబ సభ్యుల్లో అప్పటికే కొంత అసంతృప్తి బయలుదేరింది

అయితే గత ఎన్నికల్లో ఓటమి దరిమిలా కేసీఆర్ అస్త్ర సన్యాసం చేసి ఫార్మ్ హౌస్ కే పరిమితం కావడంతో పార్టీ పగ్గాలు పూర్తిస్థాయిలో కేటీఆర్ చేతుల్లోకి వచ్చాయి

ఈ నేపథ్యంలో కేటీఆర్ , హరీష్ రావు , సంతోష్ కుమార్ లు పార్టీలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం జైలు జీవితం గడిపి వచ్చిన కవితకు నచ్చలేదు

కేసీఆర్ సైలెంటుగా ఉంటే పార్టీలో తన స్థానమేంటో తెలిసి వచ్చింది

ఒకపక్క లిక్కర్ స్కామ్ లో ఈడీ కేసు , మరొపక్కన పార్టీలో దిగజారిపోతున్న తన స్థానం కవితను కలవరపెట్టాయి

ఆ కలవరపాటులోనే తండ్రికి లేఖ రాసింది
లేఖలో తండ్రి తీరును సైతం విమర్శించింది

ఈ పరిణామం సహజంగానే కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించింది

కేసీఆర్ ను ప్రశ్నించే సాహసం పార్టీలో ఎవరూ చేయరు
అలాంటిది ఆ పని మొట్టమొదట కూతురే చేయడంతో ఆయన కవితను తాత్కాలికంగా పక్కనబెట్టారు

ఎప్పుడైతే కేసీఆర్ కవితను పక్కనబెట్టాడో పార్టీ నాయకులూ కవితను బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టారు

అసలే ఫ్రస్టేషన్ లో ఉన్న కవిత ఈ పరిణామాలతో సహనం కోల్పోయి నేరుగా హరీష్ రావు , సంతోష్ కుమార్ లను టార్గెట్ చేస్తూ బాణాలు సంధించింది

అదీ హరీష్ రావు విదేశాల్లో ఉన్న సమయంలో ,

కవిత బాణాలు ముఖ్యంగా ఇద్దరికి ఇబ్బందిగా పరిణమిస్తాయి
వారు కేసీఆర్ , హరీష్ రావులు

నేరుగా కుటుంబ సభ్యుల పేర్లతో సహా గొడవలను బయటపెట్టింది కాబట్టి కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి

రెండోది కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడని తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కవిత బహిరంగంగా ఒప్పుకున్నట్టు అయ్యింది

కవిత ఆవేశంలో చేసిన వాఖ్యల వల్ల క్యాబినెట్ పెద్దగా తండ్రి కూడా కేసులో పూర్తిగా ఇరుక్కుంటాడని మర్చిపోయింది

రేప్పొద్దున సిబిఐ కేసు విచారణ జరిపేటప్పుడు హరీష్ రావు అవినీతిపై కవిత చేసిన వాఖ్యలను ఉదహరిస్తూ ఆమెను సాక్షిగా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది

అధికార పార్టీ ఎమెల్సీ గా కవిత స్టేట్మెంట్ కు విలువుంటుంది

ఈ పరిణామాలు హరీష్ రావు మెడకు ఉచ్చులా చుట్టుకుంటున్నాయి

ఇంత జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఎందుకుంటున్నారు ?

మంచి వ్యూహకర్తగా పేరున్న కేసీఆర్ సొంత పార్టీలో జరుగుతున్న కుటుంబ గొడవల పట్ల మౌనంగా ఉండటం పలు సందేహాలకు తావిస్తుంది

దాంతో అసలిదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని , కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో హరీష్ రావును ఇరికించి తను తప్పుకోవడానికి తెలివిగా వేస్తున్న ప్లానని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు

ఇకముందు హరీష్ రావు ఏం చేయబోతున్నారు ?

సరిగ్గా విదేశాల్లో ఉన్న సమయంలో గురి చూసి కవిత వదిలిన బాణం ఖచ్చితంగా హరీష్ రావును ఇరకాటంలో పెడుతుంది

కాళేశ్వరం కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్తున్న వేళ కవిత వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెరుగుతుంది

అయితే సహజంగా హరీష్ రావుకు సహనం ఎక్కువ
ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోడు

కానీ నిర్ణయం అంటూ తీసుకుంటే చాలా బలంగా ఉంటుంది

నిజానికి బిఆరెస్ పార్టీలోనూ , ప్రజల్లోనూ కేటీఆర్ కన్నా హరీష్ రావుకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది

ఒకవేళ హరీష్ రావు కనుక పార్టీనుంచి బయటికి వస్తే బిఆర్ఎస్ నిట్టనిలువునా చీలుతుంది

ప్రస్తుతం కేసీఆర్ , కేటీఆర్ , కవిత , హరీష్ రావు , సంతోష్ కుమారులు గాల్లో ఒకే తాటి మీద ప్రయాణం చేస్తున్నారు
ఏ ఒక్కరు అటూఇటూ ఊగినా అందరూ కిందపడతారు

అదీ సంగతి
పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!