క్రైం డ్రామా సినిమాలు తియ్యడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైలు .. కధలో భాగంగా మితిమీరిన వయొలెన్స్ జొప్పించి మాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో దర్శకుడు బోయపాటిది ఒక స్టైల్ కాగా , క్రైం స్టోరీలోనే బలమైన భావోద్వేగాలను .. ఫ్యామిలీ సెంటిమెంటుని కూడా జొప్పించి ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించడంలో శేఖర్ కమ్ములది మరో స్టైలు
కుబేర సినిమా ఆ కోవలోకే వస్తుంది
సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో క్రైమ్ .. వయొలెన్స్ తక్కువగా ఉండి ప్రేమ .. ఫ్యామిలీ సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి
హీరో హీరోయిన్ల మధ్య డ్యూయెట్లు లేకుండా పూర్తీ స్థాయి క్రైమ్ స్టోరీని ఫ్యామిలీ సెంటిమెంటుతో మిక్స్ చేసి కుబేర తీయడంలో శేఖర్ కమ్ముల విజయం సాధించారు
ఇక శేఖర్ కమ్ముల మరో విజయ రహస్యం ఏంటంటే ఈ సినిమాలో కథ కన్నా కధనాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో విజయం సాధించాడు
ఇక కథ విషయానికి వస్తే ఈ తరహా కధలు గతంలో కూడా వచ్చాయి .. బలమైన పారిశ్రామిక వేత్తలు .. రాజకీయ నాయకులూ ఒకవైపు .. హీరో మరియు ప్రజలు మరోవైపు పోరాటాలు చేయడం క్లైమాక్స్ లో పారిశ్రామిక వేత్తల వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చివేసి పేదలను హీరో కాపాడటం లాంటి సినిమాలు కొన్ని వచ్చాయి .. అలాంటి స్టోరీలనే శేఖర్ కమ్ముల .. పారిశ్రామిక వేత్తకు.. బిచ్చగాడికి మధ్య పోరాటంగా కొద్దిగా డిఫరెంట్ గా కుబేరను మలిచాడు
కుబేరలో కథ విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదగాలనుకుంటున్న పారిశ్రామికవేత్త నీరజ్ మిత్ర ( జిమ్ సర్బ్ ) సముద్ర గర్భంలో ఉన్న ఆయిల్ నిక్షేపాలను తన సొంతం చేసుకోవడానికి ప్లాన్ చేసి కేంద్ర రాజకీయ నాయకుడు సిద్దప్పతో లక్ష కోట్లకు డీల్ కుదుర్చుకుంటాడు
అయితే ఆ లక్ష కోట్లలో 50 వేల కోట్లు వైట్ లోనూ మిగిలిన 50 వేల కోట్లు బ్లాక్ లోనూ ఇవ్వాలని సిద్దప్ప షరతు పెడతాడు
ఈ పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి నీరజ్ మిత్ర జైల్లో ఉన్న మాజీ సిబిఐ ఆఫీసర్ దీపక్ ( నాగార్జున ) ను విడిపించి తీసుకొచ్చి బాధ్యతలు అప్పగిస్తారు
నలుగురు బిచ్చగాళ్ల పేరిట విదేశాల్లో ఫేక్ కంపెనీలు సృష్టించి తద్వారా సిద్ధప్ప మనుషులకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి పనయ్యాక బిచ్చగాళ్లను చంపేయాలని ప్లాన్ వేస్తారు
ఆ నలుగురు బిచ్చగాళ్ళలో ఒకడైన దేవా ( ధనుష్ ) అసలు విషయం తెలుసుకుని పారిపోవడంతో విలన్ గ్యాంగుల ఛేజింగ్ మొదలౌతుంది
సినిమాల ద్వితీయార్థం అంతా ఆల్మోస్ట్ ధనుష్ ఛేజింగ్ సన్నివేశాలే ఉంటాయి
ఫస్ట్ హాఫ్ లో విలన్లతో చేతులు కలిపి సెకండ్ హాఫ్ లో రియలైజ్ అయిన దీపక్ ( నాగార్జున ) దేవాకు ( ధనుష్ ) ఏ విధంగా సాయం చేస్తాడు ? ఆఖరికి దేవా విలన్ గ్యాంగుకు దొరుకుతాడా ? సమీరా ( రష్మిక మందన్న ) దేవా జీవితంలోకి ఎలా వస్తుంది ? క్లైమాక్స్ లో దేవా ఏం చేస్తాడు ? అన్నదే కధ
ఈ సినిమా కధలో చాలా భాగం బిచ్చగాళ్ల మీద సానుభూతితోనే నడుస్తుంది
ఇక కుబేర సినిమాకి ధనుష్ ప్రాణం పోసాడు .. బిచ్చగాడి పాత్రలో నటించాడు అనేకన్నా జీవించాడు అనటం కరెక్ట్ ఏమో
నడక .. హావా భావాలు బాడీ లాంగ్వేజ్ లోనూ ధనుష్ నిజమైన బిచ్చగాళ్లను మరిపించాడు
నాగార్జున డీ గ్లామర్ రోల్ వేసినప్పటికీ మాజీ సిబిఐ ఆఫీసర్ గానూ .. ఫ్యామిలీ సెంటిమెంటును పండించడంలోనూ సక్సెస్ అయ్యాడు
హీరోయిన్ రష్మిక పాత్ర విషయానికి వస్తే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తే గీత గోవిందంలో ఆమె నటన గుర్తుకొస్తుంది
అవే ఎక్స్ప్రెషన్స్ .. రష్మిక ఇలాగె కంటిన్యూ అయితే జనాల్లో మొనాటనీ రావడం ఖాయం
కాకపోతే ఈ సినిమాలో ఎక్స్పోజింగ్లు గట్రా లేకుండా పద్దతిగా నటించింది
టోటల్ గా కుబేర సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత గ్రిప్పింగ్ సెకండ్ హాఫ్ లో లేదనిపిస్తుంది .. సెకండ్ హాఫ్ మొత్తం ధనుష్ ఛేజింగ్ సన్నివేశాలతో సాగదీసినట్టు అనిపించింది
చివర్లో పోలీస్ అధికారి పాత్రలో సాయాజీ షిండే ఎంటర్ అయి స్టోరీ మలుపు తిరుగుతుంది అనుకునే టైములో అతడ్ని లేపేయడంతో కథ కొద్దిగా కన్ ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది
క్లైమాక్స్ లో నాగార్జునని విలన్లు చంపే సీను అనవసరం అనిపిస్తుంది .. నాగార్జున పాత్రకు అటువంటి ఎండింగ్ కాకుండా ధనుష్ కు సపోర్ట్ గా చివరివరకు నిలిపి ఉంటె బాగుండేది
పాటల విషయానికి వస్తే పోయి రా మామా పాట బావుంది .. ఈ పాటలో సంగీతం .. సాహిత్యం ..ధనుష్ డాన్స్ లు మూడూ బావున్నాయి
ఓవరాల్ గా సినిమా బోర్ గా అయితే మాత్రం ఉండదు
రేటింగ్ 3.5 / 5
పరేష్ తుర్లపాటి