Home » పండక్కి వచ్చిన పాతల్లుడు మన శంకర వరప్రసాద్ గారు హిట్టు కొట్టారు ! – మూవీ రివ్యూ

పండక్కి వచ్చిన పాతల్లుడు మన శంకర వరప్రసాద్ గారు హిట్టు కొట్టారు ! – మూవీ రివ్యూ

Spread the love

ఈ సినిమా గురించి చెప్పుకునేముందు సినిమా దర్శకుడి గురించి రెండు మాటలు చెప్పుకుందాం

అనిల్ రావిపూడి

థియేటర్కొచ్చిన ప్రేక్షకుడ్ని కాసేపు సరదాగా నవ్వించానికి కధే ఉండనవసరం లేదు
కధనంతో కూడా అలాంటి అద్భుతాలను సాధించవచ్చు అనే ఫార్ములాతో సినిమాలు తీసి హిట్ కొట్టిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి

అలాంటి ఈ కుర్రాడు సినిమాల్లో పడితే ఏం జరుగుతుందండి ?
సంక్రాతి పండుగని ముందే తీసుకొచ్చేస్తాడు

నిరుటేడు సంక్రాంతికి వస్తున్నాం అన్చెప్పి మరీ వెంకటేషుతో కలిసొచ్చి అల్లరల్లరి చేసి నవ్వించాడు గుర్తుంది కదా ?

ఆ అనిల్ రావిపూడే ఇదిగో మళ్ళీ పండక్కి గోదావరిజిల్లా అల్లుడు కొణిదెల శివశంకర వరప్రసాద్ గారితో .. అదేనండి .. మన శంకర వరప్రసాద్ గారితో.. ఇంకో అదేనండి .. మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి మన ఊళ్లకు వచ్చి సందడి చేస్తున్నారు

నిజానికి అనిల్ ఆరునెలల ముందునుంచే పండగ సందడి మొదలుపెట్టాడు

ఇదిగో ఈయనే మన శంకర వరప్రసాద్ గారు అన్చెప్పి చిరంజీవిని స్టూడియోకి పిలిపించి మనందరికీ పరిచయం చేసాడు

అంతేనా ప్రమోషన్లకు దూరంగా ఉండే ఆ తమిళ భామ నయనతారను హైద్రాబాదు తీసుకొచ్చి మనందరికీ హాయ్ చెప్పించాడు

ఇంతేనా ఈ మధ్యలో రోజుకో హంగామా , హడావుడి

బుల్లిరాజుతో చిట్ చాట్ లు
మ్యూజిక్ డైరెక్టర్లతో కలిసి మీసాల పిల్ల సాంగు , హుక్ స్టెప్పులు అంటూ రోజుకో బైట్ వదిలి చిరంజీవిలోని గ్రేస్ ను కొంచెం కొంచెం రుచి చూపిస్తూ అసలు పండగెప్పుడొస్తుంద్రా బాబూ అని మనందర్నీ ఎదురుచూసేలా చేసాడు

ఇది కదా సినిమాని ప్రమోట్ చేసుకునే తెలివైన విధానం

చిరు అభిమానులకు పండగని ముందే తీసుకొచ్చాడు

ఇప్పుడు కథ గురించి చెప్పుకుందాం

ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యా భర్తలు విడిపోయి విడాకులు తీసుకుని తిరిగి ఒకటవుతారు
ఇదే కథ

ఏంటి కథ చెప్పమంటే సింపుల్ గా ఏక వాక్యంతో ముగించేశాడేంటా అని ఆశ్చర్యంగా ఉందా ?

నిజానికి కథలో ప్రధాన సారాంశం ఇదే

కానీ అనిల్ రావిపూడిలాంటి దర్శకుడికి ఈ ఒక్క లైను చాలు
షడ్రుచులు వండి వార్చటానికి

ఈ సినిమాలో కథ కన్నా అతడి మార్క్ మ్యాజిక్కుకే ఎక్కువ మార్కులు పడతాయి

ఆ మ్యాజిక్కుతోనే ప్రేక్షకులు కథ సంగతి మర్చిపోయి సినిమాలో పాత్రలను తల్చుకుని హాయిగా నవ్వుకుని థియేటర్లనుంచి బయటికి వస్తారు

సరే మరీ ఒక్క లైనులో కాకుండా ఇప్పుడు కథ గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం

మన శంకర వరప్రసాద్ గారు ( చిరంజీవి ) NIA లో కీలక అధికారి
కేంద్రమంత్రి నితీష్ శర్మ (శరత్ సక్సేనా ) రక్షణ బాధ్యతలు చూస్తూ ఉంటాడు

ఈ శంకర వరప్రసాద్ కి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది

బడా వ్యాపారవేత్త అయిన జీవీఆర్ (సచిన్ ఖేడ్కర్ ) కూతురు శశిరేఖను ( నయనతార ) ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు

ఈ పెళ్లి శశిరేఖ తండ్రికి ఇష్టం ఉండదు

దాంతో ఇద్దరు పిల్లలు పుట్టినతర్వాత దంపతులు విడిపోయి విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి

కానీ శంకర వరప్రసాద్ మాత్రం భార్యా పిల్లలతో కలిసి ఉండాలని ఎదురుచూస్తూ ఉంటాడు

ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న కేంద్రమంత్రి శర్మ తన పలుకుబడితో శంకర వరప్రసాద్ ను అతడి పిల్లలు చదువుకునే స్కూలుకి పీఈటీ టీచర్ గా పంపిస్తాడు

అక్కడ వరప్రసాద్ పిల్లలకు ఏ విధంగా దగ్గరౌతాడు ?

అసలు శశిరేఖ , శంకర వరప్రసాదులు ఎందుకు విడిపోతారు ?

విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారా ?

మైనింగ్ బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడ్ కి ( వెంకటేష్ ) వీళ్లకు ఉన్న కనెక్షన్ ఏంటి ? అనేది మిగతా కధనంలో తెలుస్తాయి

ఎలా ఉందంటే ?

చూసారుగా కథ పరంగా ఇంతకుమించి చెప్పలేం
అయితే ఇదే కథను ఒక్కో దర్శకుడు ఒక్కోలా చూపిస్తాడు

బోయపాటి చేతిలో పడితే NIA ఆఫీసర్ కోణంలో కథను వాడేసుకుంటాడు . కేంద్రం , విదేశీ శక్తుల మధ్య జరిగే పోరాటంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫీసర్ మన శంకర వరప్రసాద్ గారు రంగంలోకి దిగి శత్రు మూకలను ఏ విధంగా రఫ్ఫాడించేస్తారో చూపిస్తాడు
వీలుంటే ఈ మధ్యలో ఓ పది సుమోలను గాల్లోకి లేపుతాడు

కానీ అనిల్ రావిపూడి స్టైల్ వేరు

చావును కూడా పెళ్లిలా చూపించటంలో దిట్ట
విషాదాన్ని కూడా నవ్వుతూ చెప్పడంలో ఆలిండియా ఛాంపియన్

చిరంజీవితో భోళా శంకర్ అంటూ శ్లోకాలు వల్లె వేస్తె ఫాన్స్ కు ఎక్కదు

చిరంజీవి వెజ్ , నాన్ వెజ్ లతో సహా ఏ వంటలో అయినా ఇమిడిపోయే చక్కటి పదార్థం

ఆ పదార్దాన్ని సరిగా వాడుకునే వంటవాడు ఉంటే విస్తట్లో పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించినట్టే

ఈ చిరంజీవిని అనిల్ రావిపూడి కరెక్టుగా వాడుకున్నాడు
ఫాన్స్ ఆయన్ని ఏ రకంగా చూడాలనుకుంటున్నారో ఆరకంగా చూపించాడు

మళ్ళీ గ్యాంగ్ లీడర్ కాలంనాటి చిరంజీవిని అభిమానుల కళ్ళముందుకు తీసుకువచ్చాడు

ఇప్పటికీ అదే గ్రేస్
ఆ వింటేజ్ లుక్ లో అయితే ఈలలు వేయించుకున్నాడు

చిరంజీవి అంటే ఓన్లీ మాస్ రఫ్ఫాడించేస్తాడు అనుకునేవాళ్ళకి ఆయనలో ఓ మాంచి కామెడీ టైమింగ్ చేయగల మహత్తర నటుడ్ని చూడాలనుకుంటే చంటబ్బాయ్ సినిమా చాలు

చంటబ్బాయ్ సినిమాలో చిరంజీవి కామెడీకి ఎంతటివాడైనా పగలబడి నవ్వాల్సిందే

ఆ కామెడీ టైమింగ్ ను ఇన్నేళ్లకు జాగ్రత్తగా వాడుకుని థియేటర్లలో నవ్వులు పూయించాడు అనిల్ రావిపూడి

శంకర వరప్రసాదు , శశిరేఖలు కలుసుకోవడం ఎంత కామెడీగా చూపించాడో విడిపోవడం కూడా అంతే కామెడీగా చూపించాడు

కేంద్రమంత్రి దగ్గర కీలక అధికారిగా పనిచేసే శంకర వరప్రసాద్ తన బృందం తో కలిసి చేసే సన్నివేశాలలో థియేటర్లో నవ్వులు కురిసాయి

కేంద్రమంత్రి , సెక్యూరిటీ లాంటి హడావుడి చూసి సీరియస్ సినిమానేమో అని అనుమానపడినంతలోనే శశిరేఖ , పిల్లలతో సన్నివేశాలు పడగానే ఫ్యామిలీ మ్యాన్ అవతారంతో సరదాగా సాగిపోతుంది

అలాఅని సాగదీతలు అస్సలు లేవు అనుకోకండి
శంకర వరప్రసాద్ గారి వృత్తి జీవితంలో కొన్ని సాగదీత సన్నివేశాలు కూడా ఉన్నాయి

ఎంత కామెడీ అయినా చిన్నపిల్లలతో కలిసి చేసేటప్పుడు కొంచెం శృతిమించినట్టు అనిపిస్తుంది

ఇదిలాఉండగా వెంకటేష్ రాకతో సినిమాకి మరింత జోష్ వచ్చింది
ఇక అక్కడ్నుంచి పాటలు , స్టెప్పులు , అల్లరి , నవ్వులతో సినిమా చకచకా సాగిపోతుంది

కథ , లాజిక్కులు లాంటి విషయాల జోలికి పోకుండా థియేటర్లలో ఉన్నకాసేపు ఎన్నిసార్లు నవ్వుకున్నాం అని లెక్కేసుకుంటే డిజప్పాయింట్మెంట్ రాదు

కథతో పెద్దగా పనిలేకుండా సరదా కధనంతో నడిచిపోయే ఇలాంటి సినిమాలకి రివ్యూ రాయడం కూడా కష్టం

లాంచీలో గోదావరి పాపికొండలు చుట్టొచ్చినవాడ్ని ఎలా ఉందని అడిగితే బాగుందని సింపుల్ గా ఒక్క లైనులో చెప్పగలడు కానీ ప్రకృతి అందాల గురించి అంతకన్నా ఎక్కువ చెప్పలేడు

ఆ అందాలను ఎవడికి వాడు ఆస్వాదించాలి , అనుభవైక్యం చెందాలి
అట్లనే మన శంకర వరప్రసాద్ గారు కూడా

థియేటర్లో సినిమా చూసి నవ్వుకొని ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే

ఎవరెలా చేసారు ?

అదే చిరంజీవి

150 వ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన అదే చిరంజీవి ఇందులో కూడా ఉన్నాడు

కానీ ఆ తర్వాత వచ్చిన ఆరు సినిమాల్లో ఖైదీ 150 , వాల్తేరు వీరయ్య సినిమాలు మినహా మిగిలినవి అభిమానులను , ఆ మాటకొస్తే చిరంజీవిని కూడా సంతృప్తి పరచలేదు

భోళా శంకర్ దెబ్బకు ఢీలాపడిన చిరంజీవి శంకర వరప్రసాదుతో ఫామ్ లోకి వచ్చేసారు

వింటేజ్ లుక్ లో స్టైలిష్ గా కనిపించాడు
పాటల్లో , ఫైటింగుల్లో అదే గ్రేస్ చూపించాడు

టైటిల్ తన పేరుమీద పెట్టినందుకైనా చిరంజీవి సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకుని నడిపించాడు

ఇక వెంకటేష్ నటన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు
లేట్ గా వచ్చినా లేటెస్టుగా వస్తా అన్నట్టు సినిమా చివర్లో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ సినిమాకి మరింత అట్రాక్షన్ తీసుకొచ్చాడు

చిరంజీవి పక్కన ఇప్పుడొస్తున్న ఆ ముంబై అమ్మాయిలను పెట్టకుండా నయనతారను సెలెక్ట్ చేయడం సరైన ఎంపిక

నటన పరంగా నయనతార ఎప్పుడో తనని తాను ప్రూవ్ చేసుకుంది
ఇందులో కూడా బాగానే చేసింది

చిరంజీవి టీమ్ లో నటించిన జ్వాల ( కేథరిన్ ) , నారాయణ ( హర్షవర్ధన్ ) , ముస్తఫా ( అభినవ్ గోమఠం ) తమవంతు హాస్యాన్ని పండించడంలో యధాశక్తి కృషి చేసారు

సాంకేతికత :

సాంకేతిక విభాగంలో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కు అందరికన్నా ముందు మార్కులు పడతాయి
పాటలకు తగ్గ నేపధ్య సంగీతం అందించాడు

సినిమాటోగ్రఫీ కూడా బావుంది
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి

ముగింపు : పండక్కి అలా సరదాగా అత్తారింటికి వెళ్లినట్టు థియేటర్లకు వెళ్లి అనిల్ రావిపూడి పెట్టిన విందు భోజనం ఆరగించి తిన్నది తిరగటానికి కాసేపు నవ్వుకుని బయటకి వద్దామనుకునేవాళ్ళకి ఏ ఇబ్బందీ ఉండదు ( అభిమానులకు చిరంజీవి , వెంకటేష్ కాంబోని మించిన విందు భోజనం ఏముంటుంది ) అలా కాదూ.. కూరలో కారం ఏదీ ? పప్పులో ఉప్పేదీ ? కథలో లాజిక్కేదీ ? అని వెతుక్కునేవాళ్ళకి మాత్రం సినిమా అరగదు

నటీనటులు : చిరంజీవి , వెంకటేష్ , నయనతార , కేథరిన్ తదితరులు
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
నిర్మాత : సాహు గారపాటి , సుష్మిత కొణిదెల
దర్శకత్వం : అనిల్ రావిపూడి
విడుదల : 12-01-2026
రేటింగ్ : 3.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!